సుజనరంజని / సారస్వతం / పుస్తక పరిచయం

 

పుస్తక పరిచయం:  గుండె గుడిలో దేవతా రూపం 

 సబ్బని ఆత్మీయతా గ్రంధం "అవ్వ"

రచన :- శైలజా మిత్ర

 

పిడికిలి బిగించిన పసితనం, పట్టు నిలవలేని పెద్దరికం రెండు జీవితానికి అపురూప దృశ్యాలే.  ఎన్నో ఆవేదనలున్నా క్షణంలో తుడిచిపరేసే దశగా పసితనం, సరిదిద్దే దిశగా పెద్దరికం వృద్దాప్యం. కాలం ఎంతగా నాగరికతను జరీ అంచులా కట్టుకు తిరుగుతున్నా ఆ జరీ ఎప్పటికైనా రాలిపోవడం తప్పదు. తాత్కాలికమయిన జరీ నగిషీని శరీరానికి అంటిపెట్టుకుని, శాశ్వతమయిన ఆత్మను మరచిపోతున్న ఈ రోజుల్లో తన అవ్వకు అక్షరాల గుడిని కట్టించిన ఈ సుకవి సబ్బని లక్ష్మినారాయణ గారు ధన్యులు.
  
మంచు చెట్లతో కబుర్లు చెబుతుంది.వెన్నెల గాలితో మాట్లాడుతుంది. నిద్రిస్తున్నా గుండె మాత్రం పచ్చని జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తుంది. అలాగే అనుభంధం ఆకాశమంత ఎత్తుకు ఎదిగితే అక్షరాల్ని తాకుతుంది. ఎంత ప్రేమతో ఈ వాఖ్యాలు రాసారో చూద్దాం "అవ్వంటే అద్భుత కావ్యం/ అపురూప జ్ఞాపకం నాకు/ " అని మొదలు పెడతారు. తెలుగు భాష ఒక్కటే అయినా  ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది రాయలసీమ లో 'అవ్వ' అని అమ్మమ్మని లేదా నాన్నమ్మని అంటారు. కాని అదే తెలంగాణలో అమ్మ(కన్న తల్లి) ని 'అవ్వ' అంటారు.అలా ఆలోచిస్తే ఈ నాగవ్వ ఈ కవిని కన్న తల్లి. మరోచోట అవ్వ కష్టపడి పెంచిన తీరును వర్ణిస్తూ అద్భుతమయిన వాక్యాలు అంటారు "నిన్ను చూస్తే బతుకడానికి, అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి / వలస వెళ్ళిపోయే పక్షిలా బతుకడానికి వెళ్ళావనిపిస్తుంది  "అంటారు వీరి అవ్వ నిత్యం శ్రమ జీవి అని తెలుపుకోవడం ఈ వాక్యాల్లో ఉద్దేశ్యం. 

ప్రతి మనిషికి ఎదుటి మనిషిపై ప్రేమ అవసరం. ప్రేమ ఆంటే నేడున్న నీచమయిన సమాజంలో ఒకటే అర్థం కనిపిస్తోంది. అసలు ప్రేమ అనే పదం కన్న ప్రేమ నుండి మొదలయింది. అలా మొదలైన ప్రేమ కవి సబ్బని గారికి మొదటి స్థానంలోనే నిలిచిపోవడం హృద్యమయిన దృశ్యం.అంతులేని భావ సౌందర్యం. ఆత్మీయులు శారీరకంగా మనల్ని విడిచి దూరమయిపోయిన సందర్భంలో కలిగే బాధ మనసుని కదిలిస్తుంటే  ఆ యా సంబంధిత బంధాలు జీవత్సవాలుగా మారుతారు. కవి అయితే తన బాధను అక్షరాలుగా మార్చుతాడు. " నా ఉనికి అస్తిత్వం నువ్వే కదా తల్లీ!/ నీ ప్రేమ, నీ పేరు, నీ కీర్తి ఎంత గొప్పది!" అంటారు. నవమాసాలు మోసి కని, పెంచి, కావలసినవన్నీ సమకుర్చితే, వృద్దాప్యంలో ఆదుకోవాల్సిన సమయం రాగానే కన్నావు కాబట్టి పెట్టేవు. నువ్వే కాదు లోకంలో ఏ తల్లి అయినా పెట్టేదే! ఇందులో నువ్వు కొత్తగా సాధించినది ఏమున్నదని నిలదీసి ప్రశ్నించే కొడుకులున్న ఈ రోజుల్లో,  సబ్బని గారి లాంటి బిడ్డను కని ఆ తల్లి ఏ లోకాన ఉన్నా మురిసిపోతుందనే చెప్పాలి. కొడుకును కన్న తల్లితండ్రులకు పున్నామ నరకం నుండి తప్పించుకుంటారు అనేది నానుడి.  కాని కవిని కన్న తల్లి తండ్రులకు నరకమే లేదని చెప్పాలి. గుండెలో తడి ఉన్నంతకాలం బంధాలు నిలబడుతునే ఉంటాయి. ఆ తడి ఒక్క కవికే ఉంటుంది . ఈ భావాలు చూడండి "అవ్వా! ఈ పిలుపు ఎంత మధురమయిన జ్ఞాపకం/గొంతులో ప్రతిధ్వనిస్తుంది/ నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానని /నువ్వు లేని రోజును నేనెలా ఉహిస్తానని / నువ్వు అలా అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా /ఉన్నపళంగా ఆరోగ్యంగా ఉంటూనే/ అన్నం తింటూ తింటూ/ అన్నం ముద్డ గొంతుకు అద్దం పడితేనో/ స్వరం తప్పి గిల గిలా కొట్టుకుంటూ / కాసిన్ని నీళ్ళు తాగి నన్ను రా రమ్మని చేతులతో సైగ చేస్తూ / నేను చూస్తుండగానే , నా చేతుల మీదుగా లేకుండా పోతే / మరణం ఇంత తేలికగా వస్తుందా!" అనే అక్షరాలను చదువుతుంటే కళ్ళ ముందే కన్నతల్లి కన్నుమూయడం తో ఈ కవి గుండె ఎంత విలవిల లాడిందో అనిపించక మానదు. చదివిన ప్రతి ఒక్కరికి కళ్ళు చమర్చక మానదు.

కాలం సృష్టికి తల్లి లాంటిది. సృష్టి ప్రపంచానికి తల్లి లాంటిది. ప్రపంచం సమాజానికి తల్లి లాంటిది. సమాజం సమస్యలకు తల్లి లాంటిది. ఇలా తల్లి అనే పదం మన గుండెల్లో, మన జీవితంలో తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంది. ఉంటుంది కూడా! కాని ఇవన్నీ ఒక ఎత్తు. కన్న తల్లి ఒక ఎత్తు. జన్మ అనేది ఒక వరం. అలాంటి వరాన్ని అందించిన కన్నతల్లి నేడు వృద్దాశ్రమం లోనో, అనాధ శరణాలయం లోనో ఉండటం దౌర్భాగ్యం కాక మరేమిటి? ఆత్మీయతకు పట్టిన అనాచారం తప్ప మరేమిటి? అనిపించక మానదు!
 ఒక్కోసారి ఇలాంటివి విని విని, చూసి చూసి గుండె ఎడారిగా మారిన సందర్భాలలో నేను ఉన్నాననే ఒక్క అమృత బిందువు కనిపిస్తే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లుంటుంది. ఆ అమృత బిందువే ఈ కవి సబ్బని లక్ష్మినారాయణ. "అవ్వా! / నీ మాట ముత్యాల మూట/ నీ మాట గణ గణ గంటల సవ్వడి/ నీ మాట పదూర్ల పెట్టు./ నీ మాట కొండంత ఆత్మవిశ్వాసం/ నీ మాట తెలంగాణ జానపద పేటిక/" అంటూ ఈ కవి తన జీవితామంతా అమ్మనే తలుచుకుంటుంటే మనసు ప్రతి కన్నతల్లి హృదయం స్పందిoచక  మానదు. ఆశీర్వదించక మానదు.

మనిషి బతికి ఉంటే నేలపైనే ఉంటాడు. అదే చనిపోతే గుండెలో చేరిపోతాడు. అలాగే సబ్బని గారి "అవ్వ" ఎక్కడికి పోలేదు. కన్నబిడ్డ గుండెల్లో దేవతలా కొలువై ఉంది. ఆమెకు మరణం లేదు.  కన్నతల్లిని అక్షరాలతో గుడి కట్టి గొంతెండి పోయిన సమాజానికి ఆత్మీయత, అనురాగం పదాలకు మరోమారు అర్థాలు తెలియజేసిన సబ్బని లక్ష్మినారాయణ గారి జన్మ సార్థకమయింది అనడంలో సందేహం లేదు.


మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech