సుజనరంజని /  శీర్షికలు   / పద్యం హృద్యం

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

"సమస్యాపూరణం:
ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com) ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు డిసెంబర్ 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

ఈ మాసం సమస్యలు ( గండికోట విశ్వనాధం గారు ఇచ్చినవి)
తే.గీ. దాత విలపించె వేరొక దారి లేక
కం.*దొరలే దొంగలుగ మారి దోచిరి ధనముల్

క్రితమాసం సమస్యలు
ఆ.వె.|| ఎన్ని కలలు వచ్చు ఎన్నికలొస్తేను
కం.|| కులముల ఉపయోగాలివి

మొదటి పూరణ - - వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం
ఆ.వె.|| ఎన్ని కలలు వచ్చు ఎన్నిక లొస్తేను,
సీటుకొరకు ప్రజల ఓటు కొరకు
పగలురాత్రి యనక వచ్చుచుండు కలలు
నాయకులకు మరి వినాయకులకు

కం.|| ఇల క్రమశిక్షణతో వి
ద్యలు నేర్చుట గురుజనముల యాజ్ఞకు లోనై
మేలగుట సేవించుట గురు
కులముల ఉపయోగములివి కూర్ప సుగుణముల్||

రెండవ పూరణ - నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ
ఆ.వె.|| ఎన్ని కలలు వచ్చు యెన్నిక లొస్తేను
పదవి కొఱకు వారి ప్రాకు లాట
యెంద రొచ్చె నేమి యందని విందులె
కన్న కలలు తుదకు కల్ల లేను .

కం.|| పలలము దినుటకు యెగబడి
కలకలమును రేపి జనులు కాకులు గ్రద్దల్ !
కులముల ఉపయోగాలివి
విలువలు లేనట్టి విభులు వేలకు వేలౌ !

మూడవ పూరణ- - యం.వి.సి. రావు, బెంగళూరు
ఆ.వె.|| మంత్రిపదవులొచ్చు మాకంటు కొందరు
కొలువులొచ్చునంచు కొత్త యువత
ఎన్ని కలలు వచ్చు ఎన్నికలొస్తేను
కలలు కల్లలగుట కానరైరి

కం.|| కులముల వుపయోగాలివి
చెలిమిని విడగొట్టి వరుస చేటులు తేగా
నలసిన బడుగుల బ్రతుకుల
ఫలితంబులు డందుకొనిరి పలువురు నేతల్


నాల్గవ పూరణ - గండికోట విశ్వనాధం, హైదరాబాద్ ,
ఆ.వె.||మందు, చిందు, విందు,పొందుల దందాలు
వంక దండములతొ వందనాలు
ఓటు కొరకు నోటు, పూటుగా త్రాగుడు
అడ్డ రోడ్డు కాడ రోడ్డు షోలు
బేర సారములతొ బెగ్గింగు, రిగ్గింగు
కోటి ఆశల పెను తీట దీర
ఎన్ని కలలు వచ్చు ఎన్నిక లొస్తేను,
మాయ దారి కధలు మదిని మెదల.

కం.|| కులముల ఉపయోగాలివి :
చెలిమిని చెడ గొట్టుటకును, చిరు కొలువులకున్
పాలకుల ఓటు బేంకుకు,
పలు సంకుల ఘర్షణలకు, బహు సాకులకున్.


ఐదవ పూరణ- జగన్నాథ రావ్ కె. ఎల్., బెంగళూరు
కం|| బాలల ఆధునికత కను
కూలముగా గిరిజన 'గురుకులముల ' ఉపయో
గాలివి, మేలగు వసతియు
బోలెడు చదువులకు తోడు భుక్తియు దొరకున్

కవిత:
ఎన్ని కలలు వచ్చు ఎన్నికలొస్తేను?
పట్టవలసిన పిచ్చియే పట్టినట్టు,
ఈ పార్టీలో ఉంటూ ఆ పార్టీ జెండా ఊపినట్టు,
ఎన్నికల కుంభ మేళాలో ప్రజాస్వామ్యం దారి తప్పిపోయినట్టు,
ఓటరు యొక్క పెరట్లో కల్ప వృక్షాన్ని పాతేసి, దానికి కామ ధేనువుని కట్టేసి,
అక్షయ పాత్రని చేతిలో పెట్టేసినట్టు,
కరి మింగిన వెలగ పండు గుర్తుకొచ్చినట్టు,
రెపరెపలాడే నినాదాలు చీకట్లో చిరిగిపోయినట్టు,
అభ్యర్థి నోరు తెరిస్తే గడ్డి కరవడం కోసమే అనుకున్నట్టు,
ఎన్నికల తరువాత వాత పెట్టినట్టు,
ఎన్నికల దెబ్బకి బొబ్బలతో పెడబొబ్బలెట్టినట్టు,
నోటుకు వోటు జాతికి చేటు అయినట్టు,
పట్టుకు పొయేవాళ్ళు పట్టుకుపోతుంటే, కొట్టుకు పొయేవాళ్ళు కొట్టుకుపోతున్నట్టు,
పదవి వచ్చేదాకా ఎదవ పన్లేవీ చేయలేక, తీరా పదవి వచ్చేక చేసిన ఎదవ పన్లకి పదవి ఊడిపోయినట్టు,
కలలకి తప్ప అన్నిటికీ రెక్కలూడిపోయినట్టు,
ఓటు వేసినవాడి ఫోటోకి దండ వేసి దండం పెట్టుకున్నట్టు,
ఎన్ని కలలు వచ్చు ఎన్నికలొస్తేను.


ఆరవ పూరణ- - రావు తల్లాప్రగడ, శాన్ హోసే, కాలీఫోర్నియా
కం|| మలమది కానీ పిడకది
చలువన తన దూడకిచ్చు చనుబాలను దొం
గలమగు మనకే నిడు గో
కులముల వుపయోగములివి! గోమాతనమః!

ఆ.వె.|| ఉందివుంది మంచి వుంది ముందుందిరా-
నీతి పెరిగి మంచి జాతి నిలుచు!
ఎన్ని కలలు వచ్చు ఎన్నికలొస్తేను -
మంచి వాని కిట్టి మంచి కలలె!


ఏడవ పూరణ - జ్ఞాన ప్రసూన మురుకుట్ల
కవిత:
ఆ నేత కోటిస్తే నిత్యావసర ధరలు
నేలపై నవ్వుతూ నిలిచి ఉన్దేనట
ఈ నేత నెగ్గితే ఉచిత విద్యుత్తూ, కోతలే లేవంట
మరియొకరి నెన్నుకో ఇంటికో బర్రెంట మనిషికో ఇల్లంట

కవిత: ఆకాసహర్మ్యాల కేల్లలే లేవంట
సామాన్యుని హక్కుల పరిరక్షనేచట ఇట ?
కల్లలే అని తెలిసి కలగనుట మానమే !
ఎన్ని కలలోచ్చేను ఎన్నికలోస్తేను

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech