సుజనరంజని /  పాఠకుల సమర్పణ   /  మా నాన్నకు జేజేలు

 

 

నిర్వహణ : దుర్గ డింగరి

 


ప్రియమైన సుజనరంజని పాఠకుల్లారా!

'అమ్మకు, బ్రహ్మకు నిచ్చెన నాన్న అంటారు. నాన్నలు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో, ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారు. చిన్నప్పటి నుండి నాన్న వీపు పై ఎక్కి ఆడుకున్న రోజుల నుండి మీరు చిన్నారి పాపలను ఎత్తుకునే వరకు ఎన్నెన్నో ఙ్ఞాపకాల దొంతరలు. అవన్నీ మా అందరితో పంచుకోవడానికి సుజనరంజని ' మా నాన్నకు జేజేలు,' శీర్షిక ద్వారా మీకు మంచి అవకాశమిస్తుంది. నెం.వన్ తెలుగు వెబ్ మాస పత్రికలో మీ నాన్నగారి గురించి ప్రచురిస్తే ఎంత మంది చదువుతారో, స్ఫూర్తిని పొందుతారో ఆలోచించండి.
ఇంకా ఆలస్యమెందుకు? కలం, కాగితం తీసుకుని రాసి కానీ లేదా లాప్ టాప్, కంప్యూటర్లు వున్న వారు టక టకా టైపు చేసి కానీ సుజనరంజనికి పంపించండి


నాన్నే ఆదర్శం

రచన : కొమ్మూరి రవి కిరణ్

మా నాన్నగారు కొమ్మూరి వేణుగోపాల రావు గారు, తల్లి అహల్యాదేవి. ఒక రచయితగా మా నాన్నగారు అందరికీ సుపరిచితులే. ఆయన గురించి ప్ర్తత్యేకంగా చెప్పక్కర్లేదు. మా నాన్నగారితో మాకున్న అనుబంధం చెప్పాలంటే, మేము పుట్టక ముందు నాన్నగారి జీవితంలో జరిగిన విషయాలు కొన్ని చెప్పాలి. (అవి ఆయన చెప్పినవే).

మా నాన్నగారు 1935 సెప్టెంబర్ 4వ తేదీన జన్మించారు. చాలామంది కళాకారుల్లాగానే అనేక వ్యతిరేకతల మధ్య నుంచి ఎదిగిన రచయిత మా నాన్నగారు. భయం వల్లో, అపోహల వల్లో సాహిత్యాల మీద అభిమానంతో చదువు ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారని భ్రమలవల్లో మా తాతగారికి మా నాన్నగారు రచనలు చెయ్యడం అస్సలు ఇష్టం ఉండేది కాదు.

రాస్తూ కనబడితే చాలు తిట్టేసావరట మా తాతగారు. కాని వ్రాయాలన్న తృష్ణ ఆయన్ని నిలవనిచ్చేది కాదు. సెలవప్పుడు ఖాళీగా ఉన్న స్కూల్లోనో, పార్కుల గోడలు దూకి చాటుగా కథలు వ్రాసి పత్రికలకు పంపించేవారట.

కొన్నాళ్ళకి పత్రికల్లో ఆయన పేరు రావడం, అది చూసినవాళ్ళు ఎవరో మా తాతగారికి చెప్పడం ఫలితంగా ఆయన్ని దండించడం జరిగేది. అయినా ఆయన రచనలు చెయ్యడం ఎక్కడా ఆపలేదు. అలా అని మా తాతగారి కోరికా ఆపలేదు. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ లో చేరారు. మా నాన్నగారిలో ఓ రచయితే కాదు ఇంకో కళాకారుడు కూడా ఉన్నాడు. ఆయన బుల్ బుల్ బాగా వాయించేవారు. కాకినాడలో చదువుతుండగానే మా నాన్నగారికి వివాహం అయ్యింది. డాక్టరుగా ప్రాక్టీస్ పెట్టిన తర్వాత తీరిగ్గా మమ్మల్ని కందామనుకున్నారు. కాని చదువు పూర్తయ్యేలోపే మేం ముగ్గురం పిల్లలం పుట్టేశాం. మా పెద్దన్నయ్య రాజా, చిన్నన్నయ్య శివ, నేను మూడోవాణ్ణి నా పేరు రవి కిరణ్.

ఇక మా నాన్నగారితో మాకున్న అనుబంధానికి వస్తే, మా అమ్మగారి చెల్లెళ్ళు మా నాన్నగారిని ?బావా? అని పిలుస్తుంటె, మాకు కూడా అదే అలవాటయ్యి మేం కూడా మా నాన్నగారిని ?బావా? అని పిలిచేవాళ్ళం. చివరికి ఆ పిలుపు మా స్నేహితులకి కూడా అదే అలవాటు.

చాలా సున్నితమైన మనస్తత్వం మా నాన్నగారిది. చదువులోగాని, వృత్తులోగాని, చివరికి మా పెళ్ళిళ్ళ విషయంలో కూడా మాకు పూర్తి స్వేఛ్ఛను ఇచ్చారు. మమ్మల్ని, మా భావాల్ని ఎంతగా ప్రేమించేవారంటే ఆయనిచ్చిన స్వేఛ్ఛను కాస్తయినా దుర్వినియోగ పర్చుకోవలన్న దురుద్దేశం కూడా కలిగేదు కాదు మాకు. అంతగా ప్రేమించేవారు. మా నాన్నగారి కోసం వచ్చే వాళ్ళతో, మాకోసం వచ్చే స్నేహితులతో ఇల్లంతా నిండుగా, సందడిగా ఉండేది. వచ్చిన అంత మందికి వండి స్వయంగా వడ్డించేది మా అమ్మ.


మా ముగ్గురిలో నేను చదువులో వెనుకగా ఉండేవాణ్ణి. ఆ కాంప్లెక్స్ నాలో బాగా ఉండేదనుకుంటా..నేను కూడా నాన్నగారిలా రచయిత అవ్వాలంటే బహుశా ఆయనలా చెయ్యాలేమోనని పిచ్చి నమ్మకంతో ఎవరూ లేకుండా పార్కులోకి వెళ్ళి రాశాను నా మొదటి కథ. అప్పుడు ఇంటర్ మీడియట్ చదువుతున్నాను.

ఆ తర్వాత విషయం మా నాన్నగారికి తెలిసి నవ్వుకుని ధైర్యం చెప్పి ఇంట్లోనే రాసుకోమనేవారు. అలా ఆయనిచ్చిన స్ఫూర్తితోనే మొదటి కథ వ్రాసి పంపించాను. ఆ కథ అచ్చయినప్పుడు నా పేరు చూసి నాకన్నా ఆయన కళ్ళలోనే ఆనందం ఎక్కువ కనబడింది. ఆ రోజే గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఆ ఆనందాన్ని ఎప్పుడూ చూడాలని కాని, నేనే నాకున్న వ్యాపార లావాదేవీలతో ఎదిగే ప్రయత్నంలో ఎక్కువగా వ్రాయలేక పోయాను.

తర్వాతర్వాత పాఠకులు టి.వి.కి అలవాటు పడ్డారు. ఆ ప్రభావం బాగా ఎక్కువై నవలలు, కథలు మీద చూపింది. చదవడం తగ్గించేశారు. అలాంటి రోజుల్లో కూడా నాన్నగారి కలం ఆగిపోలేదు. నాతోకూడా ?ఎందుకురా టైం వేస్టు చేస్తావు ఏదో ఒకటి వ్రాయి? అనే వాళ్ళు. నేను టైం సరిపోవట్లేదు అనే సరికి నన్ను సున్నితంగా మందలించేవారు. ఈ ప్రపంచంలో రెండే ఒకసారి పోతే తిరిగి రావు. ఒకటి ప్రాణం, రెండవది కాలం. ఒకటి మన చేతుల్లో లేదు, రెండోది మన చేతుల్లో ఉన్నా నిర్లక్ష్యం చేస్తున్నామంటే మనకి ప్రాణం లేనట్టే అనేవారు.

ఈ వాక్యాలని చాలా తేలికగా తీసుకున్నాను అప్పుడు. ఇప్పుడు ఆయన చెప్పినవి ఆచరణలో పెడుతున్నా చూసి ఆనందించడానికి ఆయన లేరు. అది ఎప్పటికీ తీరని లోటే.

అన్నయ్యలు అమెరికా వెళ్ళిన తర్వాత నాన్నగారితో సాన్నిహిత్యం మరింత పెరిగింది. వారితో మాట్లాడుతుంటే తెలియని ఉత్తేజం, ధైర్యం కలుగుతాయి. ఎటువంటి సమస్యలో ఉన్నా అవలీలగా పరిష్కారం చెప్పేవారు. అన్ని కోణాల నుంచి జీవితాన్ని విశ్లేషించేవారు.

పిల్లలమైన మాకే కాదు. చాలామందికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, డాక్టరుగా బిజీగా ఉన్నా, రచయితగా వెలుగుతున్న, ఆర్ధిక విషయాల్లో పెద్దగా ఆసక్తి చూపించేవారు కారు. ఆయన జీవితంలో శిఖరాలను తాకారు. నేలమీదకి ఒంగారు. అయినా ఆయన ముఖంలో అదే చిరునవ్వు, అదే ఆపేక్ష.

సెల్ ఫోన్ వచ్చిన మొదట్లో రిలయెన్స్ కంపెని వారి సెల్ టు సెల్ ఫ్రీ అని తెలిసి ఇద్దరం చెరొకటి తీసుకున్నాం. ప్రొద్దున లేవగానే దాదాపు రెండు మూడు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. ఆ లోపు మూడు సార్లు కాఫీలయ్యేవి. తర్వాత ఆయన హాస్పటల్ కి, నేను ఆఫీసుకి వెళ్ళిన వెంటనే ఆయనతో ఫోన్ లో అరగంట. మళ్ళీ మధ్యాహ్నం కాసేపు. మళ్ళీ రాత్రికి. మా అమ్మ నా భార్య ?రోజు అంతసేపు మాటలేముంటాయ్? అని దెబ్బలాడేవారు.

బాగా పెద్దవారైపోయారు. క్రమంగా ప్రాక్టీ స్ తగ్గించి ఆధ్యాత్మికం వైపు మొగ్గు చూపారు.

?రేకి? యోగా శక్తి మీద పుస్తకం వ్రాసారు. అదే ఆయన వ్రాసిన చివరి పుస్తకం. క్లాసులు కూడా చెప్పేవారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నాన్నగారి దగ్గర రేకీ నేర్చుకునేవారు. ఎందరికో కౌన్సిలింగ్ ఇచ్చేవారు. వారి సమస్యలను తీర్చేవారు. బయటికి చాలా మితభాషిలా, సౌమ్యుడిగా కనబడతారు కానీ, ఆయనలో హాస్య ధోరణి చాలా ఎక్కువే.

ఆయన జీవితంలో ఇంకా తీరని కోరికలు చాలానే ఉండచ్చు. కానీ, చివరికి చాలా మంది కోరుకునేది వారికి దక్కింది. అది సునాయాస మరణం. ఒక ఆధ్యాత్మిక గురువు ఎలా తనువు చాలిస్తాడో, ఆయన విషయంలో అదే జరిగింది. 2004 అక్టోబర్ 31న అయన వెళ్ళిపోయారు.

మా అన్నదమ్ములకి ఆయన ఒక తండ్రిగా పోయినందుకు కాదు, ఒక గొప్ప నేస్తాన్ని పోగొట్టుకున్నామన్న వ్యధ ఇంకా తొలగి పోలేదు.

ఆ బాధల్లో ఉండగానే తెలిసిన మిత్రుడు వచ్చి ?కిరణ్ గారు, ప్రతి మనిషికి చావు తప్పదు. బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళకి మిగిలిన ఆశయాలుంటాయి చూడండి, అవి నెరవేరిస్తే వాళ్ళెక్కడ ఉన్నా మన మధ్యే ఉన్నట్టుంటుంది. అని చెప్పాడు.

ఆ మాటలు నా మీద బాగా పనిచేశాయి,. మర్చిపోయిన రచనా వ్యాసంగాన్ని మళ్ళీ మొదలు పెట్టాను. ముందులా కాకుండా విరివిగా కథలు, నవలలు వ్రాస్తున్నాను. అని పాఠకాదరణ పొందుతున్నాయి. మనసులో కొంత ఊరట. ఆ రకంగా ఆయన ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా ఆయనతో అనుబంధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

ఆయన్ని స్నేహం కోరితే మరింత దగ్గరగా వస్తారు. లేకపోతే, అందంగా క్షమిస్తారు. అంతే గాని వాగ్వివాదాలు ఎవరితో పెట్టుకోరు. అదే మాకు ఆయన ఇచ్చిన పెద్ద ఆస్తి.

చివరగా ఒక మాట. మాలాంటి కొడుకులు చాలా మంది ఉంటారు. కాని,మా నాన్నగారి లాంటి వారు బహు అరుదుగా ఉంటారు.

అందుకే మా నాన్న(బావ)గారికి జేజేలు.

     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ? 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech