సుజనరంజని / కథా భారతి  / కథా విహారం .


కథా విహారం 
 మహిళా హృదయ స్పందనలే డి.కామేశ్వరి కథలు

                       
రచన : విహారి

 

తెలుగు సాహితీ లోకానికి బాగా పరిచయమైన రచయిత్రి డి.కామేశ్వరిగారు. 8 కథా సంపుటాలు, 20 నవలలు, సుమారు 300 కథలు ప్రచురణ జరిగినాయి. ‘కొత్త మలుపు’ ఆమె ప్రసిద్ధ నవల. దాన్ని ‘న్యాయం కావాలి’ సినిమా తీశారు. ఇతి వృత్తానికి నాలుగు అవార్డులొచ్చాయి. ‘కోరికలే గుర్రాలైతే’ నవల కూడా తెరకెక్కింది. కామేశ్వరి గారు అందుకున్న బహుమతులు, అవార్డులు, సత్కారాలు, సన్మానాలు చాలా ఉన్నాయి. గృహలక్ష్మి స్వ్రర్ణ కంకణం, మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు, అభినందన మాదిరెడ్డి అవార్ఢు, తెలుగు వి.వి. అవార్డు వంటివి కొన్ని ప్రత్యేక పురస్కారాలుగా చెప్పుకోవచ్చు.

కథా రచయిత్రిగా కామేశ్వరిగారి ప్రత్యేకత - ఆమె ఎన్నుకున్న ఇతివృత్తాలలో ద్యోతకమవుతూ ఉంటుంది. ఆ ఇతివృత్తాలన్నీ నేలవిడిచి సాముచేయని సామాజికాంశాలు. ఎక్కువ భాగం మానవసంబంధాలు, అందునా స్త్రీ పురుష సంబంధాల కేంద్రం నుంచి అనేకానేక వైరుధ్యాల వలయాలుగా, అద్భుతమైన వస్తు స్పృహతో ఆవిష్కృతమౌతాయి. ఆమె కథల్లో ప్రధాన పాత్రలన్నీ మధ్య తరగతికి చెందినవే. అందునా స్త్రీలు, జ్ఞాన సమాజం ప్రపంచపటం మీదికొచ్చి మహిళా చైతన్యం మూడుపువ్వులుగా ఆరు కాయలుగా అభివృధ్ది చెందుతున్న సమకాలీన సమాజంలో - ఆ తరగతికి చెందిన మహిళల జీవన శైలిలో అడుగడుగునా - వైచిత్రి, వైరుధ్యం, వర్తమానం, గతం మీద వైముఖ్యం, విలువల నిర్వచనాల్లో ఆవేశ ఉద్వేగాల పాత్ర - ఇలా శతకోటి సంక్లిష్టతలు తెరమీదికొచ్చాయి. సమాజ జీవనాన్ని పరిశీలించే ఉత్తమ రచయితలకీ, అధ్యయనశీలం కల సాహితీ వేత్తలకీ - ఇక కథలో ప్రధాన ద్రవ్యానికి లోటేముంది. ఆలోచనా పరిణితి, అనుభవ వైశాల్యం, రచనాదక్షతా కలిగిన కామేశ్వరి గారికి అందువల్లనే భావంబర వీధిలో విరిసిన ప్రతి విద్యుల్లతా ఒక కథా సౌదామినిగా కాగితం మీద మెరిసింది.

కామేశ్వరి గారి కొన్ని కథా సౌదామినుల్ని ఉదహరిస్తాను. ఆమెకు 40 ఏళ్ల క్రితమే ఎన్నో ప్రశంసల్ని అందించిన ‘వానచినుకులు’ వుంది. మనస్తత్వ చిత్రణ ప్రధానంగా సాగిన రచన. అందీ అందని ప్రేమ చుట్టూ తిరిగిన కథ. అయితే ‘ప్రేమ’ పదం కనబడదు. రావ్ గారు రత్నమాల మనసుని చదవటంలోనే సమయాన్ని హరించేసుకుంటారు. చివరికి రత్నమాల తాను కోరుకున్న బావను పెళ్ళాడటానికి వెళ్ళిపోతుంది. ఇది తెలిసి ‘బయామ్ ఏ బ్లడీ ఫూల్’ అనుకుంటారు రావ్ గారు. ఈ జ్ఞాపకాలన్నీ వాన్ చినుకుల్లాంటి వనేది సందేశం! వ్యాపారం వైద్యంలో నీతి, జాతీ ఎలా మృగ్యమైపోతాయో ‘కన్నీతికి విలువెంత?’ కథలో చిత్రించారు. విఛ్చిన్నమైపోతున్న మానవతా విలువలు - దానికి కారణమైన ఆర్దిక సంబంధాలు, స్వార్ధం, ఇవన్నీ - వికృతంగా తాండవించడం ఈ కథలో చూస్తాం. ‘విముక్తి’ కథలో మతం, ఆచార వ్యవహారాలు మనసుల్లో ఎలాంటి మూర్ఖత్వాన్ని, మూఢత్వాన్నీ పాదుకొల్పుతాయో, వాటి నుంచి విముక్తి పొందటానికి ఎలాంటి జ్ఞానోదయం అవసరమో చిత్రితమైనాయి.

ఈ తరం అమ్మాయిలు పెళ్ళి విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలూ, ఆశిస్తున్న తల్లిదండ్రుల సహకారం గురించి కామేశ్వరి గారు గొప్ప కథ ‘ఈడపిల్ల’ ఉంది. ఉద్యోగినుల అవస్థలూ, అందునా వివాహితుల బాధలూ, జీవిత భాగస్వామి నుంచి వారుగా ఆశించే సహాయం. మహిళ ఈ నాటి పురుషాధిక్య సమాజంలో నెగ్గుకు రావాలంటే - ‘ఎదురీత’ లో జానకిలా తెగువ, మొండి ధైర్యం, తెగింపు ఉండాలనే సందేశం - ఇవన్నీ కామేశ్వరి గారి కథల్లో కనిపిస్తాయి. ఆయా కథల్లో పాత్రలన్నీ మనతో చక్కగా మనసువిప్పి మాట్లాఅతాయి. తమని తాము ఆత్మ పరిశీలన చేసుకుని, ఆ ఆత్మావిష్కారాన్ని మనముందు పెడతాయి. కథాశిల్పం దృష్ట్యా ఇదొక గొప్ప గుణం. వస్తు ప్రేరకమైన సంఘటన నుంచి ఇలా పాత్ర అంతర్యం బహిర్గతం చేయటం ఉత్తమ కథా సంవిధానం. వర్తమాన సమాజంలో ప్రోగ్రసివ్ అనుకునే ఒక ‘నియోరిచ్’ క్లాస్ బయలుదేరింది. వీరి జీవనతత్వం, ప్రాతిపదిక రిస్కీ జీవనశైలిని, మనుగడ పద్ధతుల్ని అవలంబిస్తున్నారు. పర్యవసానం? కొందరి విషయంలో అపాయకరం కావచ్చు. ఈ హెచ్చరికనిచ్చారీ కథలో. అందుకనే జీవన చిత్ర దీపికలు ఈమె కథలు అన్నారు పోరంకివారు.

ఆమె కథల్లో పురుషాహంకారం మహిళల జీవితాన్ని ఎలా శాసిస్తున్నదో, ఎలా ఛిద్రం చేస్తున్నదో, ఎన్ని అవాంఛనీయ పరిస్థితుల్ని కల్పిస్తున్నదో చెప్పారు. ఎంతో శక్తివంతంగా స్త్రీ స్వయంకృతాపరాధాన్ని సూడో ఈగో ప్రాబ్లమ్స్ ని, ఆధిపత్య ధోరణినీ కూడా కొన్ని కథల్లో చిత్రించారు. ఇది రచయిత్రి సమన్వయ దృక్పథమనో, పరిణత మనస్కత అనో ‘సర్టిఫికెట్’ ఇవ్వడం కంటే సమాజగతమైన సమస్యల పట్ల ఆమెకు క్షణమైన అవగాహన ఉందని, సమాజాంతర్గతమైన మనుష్యుల స్వరూప స్వభావాల పట్ల గాఢమైన, గవేషణ తో కూడిన పరిశోధనల పట్ల అవగాహన ఉందని అర్ధం చేసుకోవాలి. ఏ చిక్కుముడైనా తెగేదాకా లాగడానికి ఎలాంటి తెలివి అక్కర్లేదు. చిక్కువిప్పి చక్కదిద్దడానికి కావాలి తెలివి అని తెలియజేస్తుంది ఆమె కథలో.

తెలుగు కథానికని కథానికగా, క్లుప్తత పాటిస్తూ, శిల్ప సమన్వయంగా, శైలి సౌకుమార్యంతో రాసే రచయిత్రి కామేశ్వరి గారు. ఆమె ‘చోతంత్రం’ అనే ఒక గొప్ప అద్భుతమైన కథ రాశారు. ముత్యాలు ఆమె ఇంట్లో పనిమనిషి. ఆమెని రాధ ‘ఎడ్యుకేట్’ చేస్తుంది. నిన్ను చావబాదే హక్కు నీ మొగుడికెవరిచ్చారు. నీవు ధైర్యంగా తిరగబడి అహంకారం అణచాలి. ఇలా.. ముత్యాలు ఆ రాత్రి భర్త మీద తిరుగుబాటు ప్రకతించింది. ఫలితం భర్త ఇంకా పేట్రేగి పోయాడు. వళ్ళు కుళ్ళబొడిచి ఏ కీలుకాకీలు తీసి, తీట వదిలించాడు. తెల్లారింది. ముత్యాలు పనికి రాలేదు. రాధకీ వొళ్ళు మండింది. ‘దొంగముండ ఎప్పుడూ ఏదో వంకతో పని ఎగ్గొడ్తుంది. అందుకే ఆ మొగుడు చితగ్గొడతాడు. దాని దొంగ వేషాలకి అట్టా కావల్సిందే దానికి’ అని తిట్టుకుంటూ గిన్నెలు తోముకోసాగింది. ఇదీ ‘చోతంత్రం’ కథ.

కథా లక్షణాల గొప్పతనం సంగతి అలా ఉంచినా, సామాజికమైన సమస్యకి గల భిన్న పార్వ్శాల్ని ఎంతో సున్నితంగా స్పృశించడం జరిగింది. అభ్యుదయ కామన, వేళ్ళూనుకుపోయిన అవాంఛనీయ స్థితిగతులు, బడుగు జీవుల స్త్రీలపై మరింత పురుషాధిక్య ధోరణీ, తరతరాల కుటుంబ జీవన ప్రభావాలు - ఇవన్నీ గుచ్చపొదలాంటి సంక్లిష్ట సమస్యలు, భావదృష్టి మిళితమైన భౌతిక వాస్తవికత కథంతా పరుచుకుంది. అగస్త్యుడు ఒకెత్తు, ఆయన కమండలం ఒకెత్తు అన్నట్టు కామేశ్వరి గారి శతాధిక కథలు ఒకెత్తు. చోతంత్రం ఒక్కటీ ఒకెత్తు.

ఆమె కథలకి అట్టడుగున పునాదిగా రచయిత్రి జీవన తాత్త్వికతా సూత్రంగా నిజానికి ఆదర్శమానవతా వాదం నిలిచింది. ఇది పూసల్లో దారం లాంటిది. ఆ పునాదిపైన స్ట్రక్చర్ గా నరనారీ కళ్యాణ కామన నిర్మితమైంది. ఆమె కథల్ని చూడటం - వాకాటి వారన్నట్టు అర్ధమున్న ఆల్బం ని ఆనందించడమే!!

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech