సుజనరంజని / కథా భారతి  / తొలకరి

తొలకరి

                                   రచన :   గన్నవరపు నరసింహమూర్తి

  ఆ రోజు నేను చిమిడిపల్లి రైల్వేస్టేషన్ లో స్టేషన్ మాస్టర్ గా జాయినయ్యాను. నాకు ఈ స్టేషన్ కి పోస్టింగ్ రాగానే అది మలేరియా ప్రాంతమనీ, అక్కడ భోజన సదుపాయాలుండవనీ అందరూ భయపెట్టారు.

వాళ్ళందరి మాటలు భయం కలిగించినా నాకు అక్కడికి వెళ్ళి జాయనవక తప్పని పరిస్థితి. ఎందుకంటే డిగ్రీ పూర్తైన ఐదేళ్ళకి ఎన్నో పరీక్షలు వ్రాస్తే వచ్చిన ఉద్యోగం అది.

ఈ స్టేషన్ అరకు ఘాట్ సెక్షన్ లో ఉంది. ఇక్కడకు రావాలంటే పదహారు టన్నెల్స్ దాటాలి. ఈ స్టేషన్ ఒక కొండ వాలులో ఉంటుంది. ఎదురుగా ఆకాశాన్ని తాకుతూ పెద్ద పెద్ద కొండలు, రెండు వైపులా టన్నెల్స్, నాలుగో వైపు పెద్ద లోయా.. ఆ లోయలోనే మా క్వార్టర్స్ .. అక్కడికి చేరుకోవాలంటే స్టేషన్ నుంచి వంద మెట్లు దిగాలి.

ఆ రోజు డ్యూటీ అయిపోగానే పోర్టర్ రమణని తీసుకుని నాకు ఎలాట్ చేసిన క్వార్టర్ కి బయలుదేరాను. మెట్లు దిగుతుంటే భయం వేయసాగింది.

ఏం రమణా! ఇక్కడ ఎన్నాళ్ళనుంచీ పనిచేస్తున్నావ్? భోజనం ఏమైనా దొరుకుతుందా? అనడిగాను క్వార్టర్ లోకి ప్రవేశిస్తూ..
నేను ఇక్కడికొచ్చి రెండేళ్ళైంది సార్. ఇది పనిష్మెంట్ స్టేషన్. అయినా ఈ స్టేషన్ లో భోజనానికీ, టిఫిన్ కీ ఏ ఇబ్బందీ ఉండదు మాస్టారూ. పుల్లమ్మనీ ఒక పేదావిడకి ముందుగానే చెబితే టిఫీన్, భోజనం అన్నీ రుచిగా చేసిపెడుతుంది. మీరు ఈ రోజు వస్తారనీ నేను ఆమెకు ముందే చెప్పాను. కాబట్టి రాత్రికి నాతో పాటే వచ్చేయండి. అన్నాడు తిరిగివెళ్ళిపోతూ..

* * *
ఇక్కడ జాయినై నెల కావస్తోంది.! ఈ చిమిడిపల్లి వాతావరణానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాను. రోజూ ఉదయాన్నే వాకింగ్ కి వెళ్ళి పుల్లమ్మ హోటల్ లో టీ, టిఫిన్ పూర్తి చేసి ఇంటికొచ్చి స్నానపానాదులు పూర్తిచేసుకుని పడుకోవడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి పుల్లమ్మ హోటల్ కి వెళ్ళడం..సాయంత్రం నాలుగు గంటలకు ఫస్ట్ నైట్ డ్యూటీకి వెళ్ళడం ఇదీ నా నిత్యకృత్యాలు. ఒకవారం మొదటి రాత్రి డ్యూటీ అయితే ఇంకోవారం సెకండ్ నైట్ ఉంటుంది. ఇక రాత్రి డ్యూటీలో నేను స్టేషన్ వదిలి వెళ్ళడం కుదరదు కాబట్టి పుల్లమ్మే స్వయంగా భోజనాన్ని కేరియర్ లో పెట్టి తెచ్చి అప్యాయంగా వడ్డించేది.

అలా ఈ కొద్ది రోజుల్లోనే పుల్లమ్మ నాకు చాలా బాగా ఆప్తురాలైపోయింది. నిజంగానే పుల్లమ్మది అమృతహస్తం. నిర్మల హృదయం! ఆమె ఏం చేసినా అమృతంలాగే ఉంటాయి.పుల్లమ్మ భర్త పది సంవత్సరాల క్రితం చనిపోయినట్లు అపుడామె కూతురు రాధని తీసుకుని ఇక్కడికి వచ్చి హోటల్ పెట్టినట్టు ఆమే చెప్పింది. ఇప్పుడు రాధ పక్క స్టేషన్ బొర్రాలో ఇంటర్ చదువుతోంది.

రాను రాను పుల్లమ్మ నాతో తన కష్టసుఖాలు చెప్పుకుని నా సలహాలు అడుగుతుండేది. అప్పుడప్పుడు ఆమెకి అవసరం పడితే కొద్దిగా డబ్బు సహాయం కూడా చేస్తుండేవాడిని. తాను ఎంత బిజీగా ఉన్నా సరే పుల్లమ్మ కూతురు రాధకి ఏ పనీ చెప్పేది కాదు. ఎప్పుడూ బాగా చదువుకోమనీ పోరు పెడుతుండేది.

నేను చదువులేక ఇలా అయిపోయానయ్యా! అందుకే బాబూ దాన్ని చదువుకోమంటున్నాను, అయినా అది నా మాట వినదు.
మీరు చెబితే వింటుంది బాబూ అంటూ నాతో ఎప్పుడూ అంటుండేది పుల్లమ్మ. నేను అప్పుడప్పుడు రాధతో కాలేజీ విషయాలు, పరీక్షల గురించి చర్చించేవాడిని.

ఒక రోజు నేను పాసింజర్ లో అరకు వెళుతున్నప్పుడు పుల్లమ్మ కూతురు రాధ ట్రెయిన్ లో ఎవరో కుర్రవాడితో చనువుగా మాట్లాడుతూ కనిపించింది. నాకెందుకో ఆ సమయంలో ఆమె అతనితో కనిపించడం నచ్చలేదు. అయినా ఆ విషయాన్ని పుల్లమ్మతో చెప్పలేదు.

రోజులు త్వరగా గడిచిపోతున్నాయి. అప్పుడే నేను ఈ స్టేషన్ కు వచ్చి సంవత్సరం కావస్తోంది. ఆ రోజు మధ్యాహ్నం భోజనానికి పుల్లమ్మ హోటల్ కు వెళ్ళేసరికి పిడుగులాంటి వార్త తెలిసింది. పుల్లమ్మ కూతురు రాధ ఇల్లు వదలి ఎవడితోనో లేచిపోయిందన్నది ఆ వార్త. నన్ను చూసి పుల్లమ్మ ఒకటే ఏడుపు. ఆమెని ఓదార్చడం నా వల్ల కాలేదు. రెండు రోజులు నుంచీ భోజనం లేనందువల్ల కాబోలు మనిషి బాగా నీరసించిపోయింది.

నేను దానికి ఏ అన్యాయం చేశాను బాబూ! దానికి ఏమిటి కావాలంటే అది ఇచ్చాను. దాని చదువుకోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను. అది బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చెయ్యాలనీ ఎందరో దేవుళ్ళకు మొక్కుకున్నాను. అటువంటి నన్ను ఇలా మోసం చేస్తుందనుకోలేదు అంటూ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది.

పుల్లమ్మా! నువ్వేం గాబరా పడకు. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే ఏం చెయ్యాలో తెలుస్తుంది. నేను అన్ని విషయాలు కనుక్కుంటా... ముందు నువ్వు కాస్త ఎంగిలి పడు. అంటూ బలవంతంగా ఆమె చేత భోజనం తినిపించాను. కానీ మేమందరం ఎన్ని చెప్పినా ఆ తరువాత పుల్లమ్మ మనిషి కాలేదు. ఏదో తప్పక మా అందరికీ వండి పెట్టేదే కానీ ఆమె మనసు మాత్రం కూతురి కోసం కలవరిస్తుండేది.

వారం రోజుల తర్వాత నేను అరకు వెళ్ళీ రాధ గురించి వాకబు చేస్తే చాలా విషయాలు తెలిసాయి. ఆమె తనతో పాటు చదువుతున్న సింహాచలం అనే కుర్రాణ్ణి ప్రేమించిందనీ, వాడే దాన్ని లేవదీసుకుపోయాడని చెప్పారు.

నెల రోజుల తర్వాతనుకుంటాను రాధ నా పేర ఉత్తరం వ్రాసింది. తాను సింహాచలాన్ని ప్రేమించాననీ అతనిదీ, తనదీ ఒకే కులం కాదనీ, ఆ విషయం తెలిస్తే అమ్మ తమ పెళ్ళికి ఒప్పుకోదనీ, అందుకే అతనితో వెళ్ళిపోయినట్లు ప్రస్తుతం తామిద్దరం హైదరాబాద్ లో ఉన్నట్లు కొన్నాళ్ళ తర్వాత అమ్మకి కోపం తగ్గితే వస్తాననీ, అంతవరకూ అమ్మని బాధపడవద్దనీ, ఈ విషయంలో తాను పెద్ద తప్పు చేశాననీ బాధపడుతూ ఉత్తరం రాసింది. కూతురు బ్రతికి ఉందన్న విషయం పుల్లమ్మకి తెలిస్తే సంతోషిస్తుందనీ భోజనానికి వెళ్ళినపుడు రాధ వ్రాసిన ఉత్తరం గురించి చెప్పి ఆమె హైదరాబాద్ లో క్షేమంగా ఉన్నట్లు త్వరలోనే వస్తుందనీ చెప్పాను.

ఆ విషయం వినగానే పుల్లమ్మ కంటనీరు తిరగడాన్ని గమనించాను. కూతురు చేసిన పనికి ఆమె చాలా క్రుంగిపోయినట్లుంది.
అందుకే ఆమె చాలా సేపటి వరకు మాట్లాడలేకపోయింది. కాసేపటి తర్వాత ‘పోన్లే బాబూ’ మంచి మాట సెప్పారు. కనీసం అదెక్కడో బతికే ఉంది. ఈ మాట చాలు బాబూ మరికొన్నాళ్ళు బతికేస్తాను అంది కళ్ళుతుడుచుకుంటూ..

ఆ రోజు నుంచీ పుల్లమ్మ మళ్ళీ మామూలు మనిషయ్యింది. నిజానికి ఈ నెల రోజులు మేము సరియైన భోజనం లేక నానా ఇబ్బందులు పడ్డాము. మళ్ళీ రెండు నెలల తరవాత రాథ నుంచి మరో ఉత్తరం వచ్చింది. అందులో తామిద్దరం ఒక కాంట్రాక్టర్ దగ్గర పనికి కుదిరామని త్వరలో వస్తామనీ వ్రాసింది.

* * *
కాలం గడిచిపోతోంది. రాధ వెళ్ళిపోయి అప్పుడే సంవత్సరం కావస్తోంది. ఈలోగా ఆమెనుంచి మరో రెండు ఉత్తరాలు వచ్చాయి. ఉత్తరం వచ్చినప్పుడల్లా పుల్లమ్మ ఎంతో ఆత్రంగా అన్ని వివరాలూ అడిగేది; కానీ ఆమె ఎడ్రస్ రాయలేదని చెబితే నిరాశతో మౌనం దాల్చేది.

ఒకరోజు నేను స్టేషన్లో ఉండగా పోస్ట్ మాన్ ఒక ఉత్తరాన్ని తెచ్చాడు. అది రాధ వ్రాసిన ఉత్తరం.

మాస్టారు గారికి,

రాధ నమస్కరించి వ్రాయునది. ఈ ఉత్తరాన్ని నేను ఎంతో బాధతో వ్రాస్తున్నాను. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వయసు వేడిలో సింహాచలాన్ని ప్రేమించాను. వాడి మాయ మాటలు నమ్మి పెళ్ళికి ముందే తప్పు పనిచేశాను. దాని ఫలితంగా గర్భవతినయ్యాను. ఆ విషయం తెలిస్తే అమ్మ చనిపోతుందని భయపడి ఏం చెయ్యాలో తోచక వాడితో హైదరాబాద్ వెళ్ళిపోయాను. మొదట్లో వాడు బాగానే ఉన్నాడు. ఆ తరువాత నా మీద మోజు తీరడంతో త్రాగుడికి అలవాటుపడి నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. నిజానికి వాడికి లేని వ్యసనాలు లేవు. వాడివల్ల నాకూ కూడా సుఖరోగాలు అంటుకున్నాయి. ఈ మధ్యనే వాడు నాకు చెప్పకుండా ఇంకో అమ్మాయిని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు తొమ్మిది నెలలు నిండిపోయాయి. ఏ క్షణంలోనైనా ప్రసవం అయ్యే పరిస్థితి ఒకవైపు, ఇంకోపక్క నన్ను కబళించడానికి సిద్ధంగా మహమ్మారి లాంటి సుఖవ్యాధి. .. వీటికి తోడు నా దగ్గర చిల్లిగవ్వలేదు. పోనీ ఇంటికి వచ్చే ద్దామన్నా వచ్చే పరిస్థితిలో లేను. నిన్ననే నాకు తెలిసిన వాళ్ళు హాస్పటల్ లో జాయిన్ చేశారు.

ఈ పరిస్థితుల్లో నేను ఎక్కువ రోజులు బతికేటట్లు లేను. నాకెందుకో ఇప్పుడు మా అమ్మని చూడాలనిపిస్తోంది. కానీ నన్ను ఈ పరిస్థితుల్లో చూస్తే అమ్మ తట్టుకోలేదు. చచ్చిపోతుంది. నేను అటువంటి మహాతల్లి కడుపున చెడబుట్టాను. నేను పుట్టినప్పట్నుంచీ అమ్మకి అన్నీ కష్టాలే. నాకెందుకో మిమ్మల్ని మొదటిసారి చూసినప్పట్నుంచీ అన్నయ్య లా కనిపించారు.

అందుకే ఒక చెల్లిగా అర్ధిస్తున్నాను. ఈ ఉత్తరం అందిన వెంటనే మీరొకసారి ఇక్కడకి రావలెను. నా చిరునామా ఇందులో వ్రాస్తున్నాను. ఈ విషయాలను అమ్మకి చెప్పవద్దు. మీకోసం ఎదురుచూస్తూ...

‘రాధ’

ఆ ఉత్తరం చదివిన తర్వాత నాకు కళ్ళ వెంట నీరు తెలియకుండానే అశృధారలు ధారాపాతంగా కారడం మొదలుపెట్టాయి. ఆ మర్నాడే పుల్లమ్మకి చెప్పకుండా రాధని కలవడానికి హైదరాబాద్ బయలుదేరాను.

* * *

నేను వెళ్ళేసరికి హాస్పటల్ బెడ్ మీద అచేతనంగా పడి ఉంది రాధ. అంతకు మునుపు రాత్రే ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చిందనీ ఆమె పరిస్థితి ఏం బాగాలేదనీ, సుఖవ్యాధి ఆమెకు బాగా ముదిరిపోయిందనీ, ఆమె కొద్ది గంటలే బ్రతుకుతుందనీ డ్యూటీలో ఉన్న డాక్టర్ చెప్పిన మాటలు నన్ను నిశ్చేష్టుడిని చేశాయి.

నేను వచ్చినట్లు నర్స్ చెప్పగానే ఆమె కళ్ళు తెరిచింది. ఆమె మొఖంలో ఏదో చెప్పలేని ఆనందాన్ని గమనించాను. ఆ క్షణంలో ఆమెని అటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే నాకు దుఃఖం పొంగుకొచ్చింది.

ఎంతో ఆరోగ్యంగా, అందంగా ఉండే ఆమె ఇప్పుడు బక్కచిక్కి పోయింది. ఆమె ముఖంలో జీవం లేదు. నన్ను చూసి లేచి కూర్చోవాలని విశ్వప్రయత్నం చేసి ఓడిపోయింది.

నేను ఆమెను వారించి ప్రక్కనే కూర్చున్నాను. ఈ విషయాలేవీ తెలియని పసివాడు భోరున ఏడవడం మొదలు పెట్టాడు. ఆమె అనారోగ్యం వాడికి సోకుతుందని కాబోలు డాక్టర్లు వాడిని ఆమెకి దూరంగా ఉయ్యాల్లో ఉంచారు.

కొద్ది క్షణాల తర్వాత రాధలేని ఓపిక తెచ్చుకుని చెప్పడం మొదలుపెట్టింది. అన్నా! నా జీవితం చాలామంది కన్నెపిల్లలకు గుణపాఠం కావాలి! అమ్మ నన్ను ప్రాణానికి ప్రాణంలా పెంచింది. నేను ఏది కోరితే అది ఇచ్చింది. నేను జీవితంలో పైకి రావాలనే ఎన్నో కలలు కంది. కానీ వాటన్నింటినీ నేను కల్లలు చేశాను. కానీ చనిపోయే ముందు నాదో చిన్న కోరిక. ఏమీ అనుకోవద్దు. ఎలాగైనా నా పిల్లాణ్ణి మా అమ్మదగ్గరకు చేర్చండి. నేను చనిపోయిన తర్వాత వాడు అనాథ కాకూడదు. అదీగాక నేను చనిపోయినా వాణ్ణైనా చూసుకుని మా అమ్మ మరికొన్నేళ్ళు బ్రతుకుతుంది. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఉత్తరం వ్రాసాను.

ఇక ఆఖరుగా ఎవ్వరూ పుట్టుకతో చెడ్డవాళ్ళు కాదు. పరిస్థితులు, వయసు ప్రభావం..ఇలా వీటివల్లే మనుషులు దారి తప్పుతారు. తమ గొయ్యిని తామే తవ్వుకుంటారు. అందుకు నా జీవితమే ఒక ఉదాహరణ. దురదృష్టమేమిటంటే నేను చేసిన తప్పుని తెలుసుకుని మారే అవకాశం ఇవ్వకుండా ఈ మహమ్మారి వ్యాధి నన్ను కబిళించేసింది.

ఆ దేవుడనే వాడు నిజంగా ఇప్పుడు కనిపిస్తే నన్ను మరి కొన్నాళ్ళు బ్రతికించమనీ మా అమ్మ దగ్గర కాలం గడిపేటట్లు చెయ్యమని వేడుకుంటాను. మళ్ళీ జన్మంటూ ఉంటే ఆ మహాతల్లి కడుపునే పుట్టేటట్లు చెయ్యమనీ కోరుకుంటాను.

ఇంకో ముఖ్య విషయం నేను చనిపోయాననే విషయాన్ని కొన్నాళ్ళ దాకా మా అమ్మకు చెప్పకండి. అది తట్టుకోలేదు. మరి..నేను.ఉంటాను...’ అప్పటికే ఆమె తల వాలిపోయింది.

* * *

ఆ తరువాత సంఘటనలన్నీ త్వరత్వరగా చోటు చేసుకున్నాయి. మర్నాడే రాథకి నేను అంత్యక్రియలు చేసి ఆపసి కందుని తీసుకుని ఒక అనాధాశ్రమానికి వెళ్ళి అందులో వాణ్ణి చేర్చాను. కానీ సంవత్సరం తర్వాత వస్తాననీ, ఆ అనాధాశ్రమ నిర్వహకులకు చెప్పి అప్పుడు ఆ బిడ్డను తనకు తిరిగి ఇవ్వాలనీ చెప్పి చిమిడిపల్లి వచ్చేసాను. పుల్లమ్మకి ఈ విషయాలేమీ చెప్పకుండా నేనే ఈ సంవత్సరం పాటు రాధ వ్రాసినట్లు ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవాడిని. పుల్లమ్మ మాత్రం రాధ రాకకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేది.

సంవత్సరం తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళి అనాధాశ్రమ నిర్వాహకుల్ని కలిశాను. ఈలోగా బాబు బాగా ఒళ్ళు చేసి బొద్దుగా తయారయ్యాడు. అప్పుడే చిన్న చిన్న మాటలు పలుకుతూ, బుడిబుడి అడుగులు వేస్తున్నాడు. ఆ పిల్లవాడి లో రాధ పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రెండురోజులకి పిల్లవాణ్ణి తీసుకుని చిమిడిపల్లి వచ్చేసాను. వస్తూనే పుల్లమ్మ దగ్గరకి వెళ్ళి పిల్లవాణ్ణి ఆమె చేతికిచ్చి వీడు నీ మనవడు. నీ రాధకొడుకనీ చెప్పడంతో.. పుల్లమ్మకి నోట మాటరాలేదు. ఆ తరువాత జరిగిన కథంతా ఆమెకి చెప్పాను. ఆ విషయాలు విన్న పుల్లమ్మ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఆ తర్వాత ముద్దుగా బొద్దుగా ఉన్న మనవణ్ణి చూసి ముద్దులు పెట్టి మురిసిపోయింది. వాణ్ణి ముద్దాడుతున్నప్పుడు పుల్లమ్మ కళ్ళల్లోని వెలుగుని చూసి నాకెందుకో చెప్పలేనంత ఆనందం కలిగింది. చనిపోయి ఏ లోకంలోనో ఉన్న రాధ ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందనిపించింది నాకు. ఏది ఏమైనా పిల్లవాణ్ణి పుల్లమ్మ దగ్గరకి చేర్చి రాధకి ఒక అన్నయ్యగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా తృప్తి కలిగింది.

రోజులు గడుస్తున్నాయి. పుల్లమ్మ ముఖంలో మళ్ళీ మునుపటి కళ. ఇప్పుడామెకి మనవడితోనే లోకం. . వాణ్ణి వదిలి ఆమె క్షణం ఉండదు. ఇప్పుడు పుల్లమ్మ ఆరోగ్యం కుదుటపడింది. మళ్ళీ హోటల్ని పూర్వం లాగే నడుపుతోంది. ఇప్పుడు ఆమెకున్న కోరిక ఒక్కటే. మనవణ్ణి పెద్దచెయ్యడం.. కూతుర్ని దూరం చేసినా ఆమె కొడుకుని తన దగ్గరకు చేర్చడం ఆ దేవుడు దయ అని రోజూ పూజలు చేస్తుంటుంది పుల్లమ్మ.

గ్రీష్మం పోయి మళ్ళీ ఆ లోయలోకి తొలకరి ప్రవేశించింది. .. ఇప్పుడు ఆ లోయ పచ్చగా కళకళలాడుతోంది....
పుల్లమ్మ జీవితంలా...
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech