సుజనరంజని /  కబుర్లు   /  వురుకులు-పరుగులు

 వురుకులు - పరుగులు

                                                  శ్యామలాదేవి దశిక

 

 ఇదిగో మీతో ముఖ్య విషయం ఒకటి  మాట్లాడాలి, కాసేపు అవన్నీ ఆపుతారా ?

ఏమిటీ నా మాట వినటానికి మీ పనులేవి ఆపనక్కరలేదా ? విషయం ఏమిటో  చెప్పమంటారా?

మీ ప్రతిభకు జోహార్లండి !  సోఫాలో కూర్చుని  లంచ్ తింటూ......... కంప్యూటర్ లో  సినిమా పాటలు వింటూ.........  ఆన్ లైన్ లో  బిల్లులు పే చేస్తూ........ ఎదురుగుండా  టీవీ లో గేమ్  చూస్తూ......... ఇక  నేను చెప్పేది వింటారా ? ! 

ఏమిటీ నాతో మాట్లాడ్డానికి ఇవేవి అడ్డం రావంటారా ?

మీకు అడ్డు రాక పోయినా నాకు  అడ్డు వస్తాయి. నాకు తెలీక అడుగుతా, ఒకేసారి ఇన్ని పనులు చెయ్యటం అంత అవసరమా?    

ఏమిటో  ప్రపంచమంతా ఇలాగే వుంది. చిన్నా పెద్దా అన్న  తేడా లేకుండా అందరూ అష్టావధానాలు-శతావధానాలు  చేసేస్తున్నారు !

ఆ రోజుల్లో మీరు అమెరికా నుంచి నాకు  వుత్తరాలు రాస్తుండే వారు.  ఇక్కడ  టైముకు చాలా విలువ ఇస్తారని, అమెరికాలో అందరూ  ఏదో ఒక పని చేస్తూ వుంటారని మీరు  రాస్తే ఏమిటో అనుకున్నాను ! ఈ దేశం వచ్చాక తెలిసింది ఇక్కడ అందరూ ఏదో ఒక “ పని “ కాదు “ పనులు “  చేస్తూ వుంటారని.

 నలభై ఏళ్ల  కిందట  న్యూయార్క్  ఎయిర్ పోర్ట్ లో  అడుగు పెట్టిన నేను,  కారు ఎక్కగానే  స్టైల్ గా నాతో మాట్లాడుతూ, ఒక చేత్తో అలవోకగా డ్రైవ్  చేస్తున్న మిమ్మల్ని- మీ టాలెంట్ ని  చూసి  మురిసిపోయాను !

ఆ తర్వాత నేను కొత్తగా వుద్యోగంలో చేరినప్పుడు మా బాస్,  ఫోన్ లో మాట్లాడుతూ......... యాడింగ్ మిషిన్ లో  నెంబర్లు టక టకా నొక్కుతూ.......... కాగితాల మీద సంతకాలు పెడుతూ........... మద్య మధ్యలో కాఫీ సిప్ చేస్తూ.............  కళ్ళతోనే మాకు హలో చెప్పే మిసెస్. ఏబ్రమ్స్  ఎబిలిటీ  చూసి ఆశ్చర్యపోతుండే దాన్ని !

నాతో పని చేసే సుజాన్..... సింగిల్ మామ్ అయుండి........ ఇద్దరు చిన్న పిల్లలతో.......  ఫుల్ టైం వుద్యోగం చేస్తూ........ పార్ట్ టైము స్కూలుకు  వెళ్తుండేది !

పిల్లలు చిన్న వాళ్ళుగా వున్నప్పుడు, ప్లేట్లో ఫుడ్ పెట్టి టేబుల్ దగ్గర కూర్చోపెడితే టీవీ లో కార్టూన్లు చూస్తూ, టాయిస్ తో ఆడుకుంటూ కిందా మీద పోసుకుంటూ తిన్నామని అనిపించేవారు!

ఆ తర్వాత స్కూళ్ళ కెళ్ళటం మొదలు పెట్టాక ఇద్దరూ పుస్తకాలు కార్పెట్  మీద  పరిచి,....... టీవీ లొ  షోలు- సినిమాలు చూస్తూ........... ఫోన్లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ.......... హోం వర్క్ లు చేసేవాళ్ళు.

ఇక  ఇప్పటి తరం వాళ్ళు సరేసరి !  వాళ్ళ  లైఫ్ స్టైల్ చూస్తుంటే, నాలాంటి వాళ్లకు కళ్ళుతిరుగుతాయి. ఇరవై నాలుగు గంటలు  వురుకులే వురుకులు, పరుగులే  పరుగులూ ...........

వీళ్లకు ” అవ్వా కావాలి –బువ్వా కావాలి “ అన్నట్టు   ఏది తక్కువ కాకూడదు !   పెద్ద పెద్ద చదువులు చదవాలి............ఇద్దరూ  ఉద్యోగాలు చెయ్యాలి........ కెరియర్ లో పైకి వెళ్ళాలి ....మళ్ళీ లక్షణ మైన  ఫ్యామిలి లైఫ్  కావాలి...... సోషల్ లైఫ్ సరేసరి..... పిల్లల ఏక్టివిటీస్....... పెద్దవాళ్ళ ఏక్టివిటీస్............బిసినెస్ ట్రిప్పులు....వెకేషన్ ట్రిప్పులు ........

వుమెన్స్ లిబ్...... ఇండిపెండెన్స్  .........ఐకెన్ డు ఎనీ థింగ్ హీ కెన్ డూ......  లాంటివి బాగా వంట పట్టించుకున్న  ఈ కాలం  అమ్మాయిలకి పరిగెత్తటమే తప్ప నిలబడటం అనేది  తెలీదు.

అందరికీ  లైఫ్ లొ  ఏమైనా మిస్ అయిపోతామేమో అన్న ఆదుర్దా,  అన్నీ పొందాలన్న తపన......   

ప్రాక్టీస్ తో  తీరిక లేదనే  నా కొడుకు, పసి పిల్లవాడిని పొట్టకు ఆనించుకుని....... చెవులకు హెడ్ ఫోన్స్ తగిలించుకుని....... జాగింగ్........ అంటూ బయలు దేరుతాడు. ఇదేం పనిరా  అంటే “ టైం మానేజ్ మెంట్  మామ్, నా ఎక్సర్సైజ్...... మెడిటేషన్..... స్పెండిగ్ టైం విత్ మై సన్........  త్రీ ఇన్ వన్ “ అంటూ సమర్ధించుకుంటాడు !

అసలు ఈ మధ్య కాలంలో స్థిమితంగా జీవితాన్ని గడిపేవాళ్ళ మాట అటుంచి, స్థిమితం గా ఒక్క  పని చేసే వాళ్ళను చూద్దాం అన్నా  కనిపించటం లేదు.

రోజు  వాక్ లో  నాకు ఎదురయ్యే వాళ్ళలో, ఒక్కళ్ళు  కూడా ఆ  నడక మీద మనసుపెట్టరు. సెల్ ఫోను లో మాట్లాడుతూ...అరుస్తూ ..... పోట్లాడుతూ..... నడిచేవాళ్ళు  కొంతమంది. అయితే, ఓ చేత్తో  కుక్కల్ని, ఓ చేత్తో స్త్రోలర్ని బాలెన్స్ చేస్తూ సెల్ ఫోన్  లో సీరియస్సుగా మాట్లాడుతూ నడిచే నారి మణులు మరి కొంతమంది !  

ఆ మధ్య పెళ్ళికని  శాండియాగో  వెళ్ళినప్పుడు  నన్ను   పికప్  చేసుకోడానికి నా మేనల్లుడు వచ్చాడు. చిన్నప్పటి నుంచీ వాడు వుట్టి హడావిడి మనిషి ! నన్ను చూసి చూడటంతోనే  లొడ లొడా  మాట్లాడుతూ.......... నిముష నిముషానికి మోగే సెల్ ఫోను  ఆన్సర్ చేస్తూ........ వెనక సీట్లో ఉన్న  పిల్లల మీద అరుస్తూ..........మధ్య మధ్యలో

శాండ్ విచ్ తింటూ........   జీ.పీ.ఎస్  వేరే రోడ్డు తీసుకోమని చెప్తున్నా హడావిడిలో  వినిపించుకోక దోవ తప్పి......  నానా అవస్థ పడి ఎలాగో  పెళ్ళి జరిగే చోటుకు చేరుకున్నాం .  వాన్ లో వున్నంత సేపు డ్రైవ్ చేస్తోంది వాడే అయినా నాకు గాబరాతో  చెమటలు పట్టేసాయి.!  

“బాడీ ప్రజంట్ మైండ్ ఆప్సేంట్ “  అన్నట్టు, కొంత మంది పని చేస్తున్నట్టు కనబడతారు, కానీ వాళ్ళ మనసు ఎక్కడో వుంటుంది.  పిల్లల్ని షాపింగ్ కార్ట్ లో కూలేసి, వాళ్ళు అరిచి గోల పెడుతున్నా, చేతికందిన వన్నీ లాగి విసిరి కొడుతున్నా పట్టించుకోకుండా, స్టోర్ లో వున్న  కూరలన్నీ   ప్లాస్టిక్ బ్యాగుల్లో కుక్కుతూ, అదే పనిగా సెల్ ఫోన్లో  సొల్లుకబుర్లు ఆడే మనుషుల్ని చూసినప్పుడల్లా నాకు చిరాకు పుడుతుంది .  

ఏమిటీ ఈ స్పీడ్ యుగం లో నా లాగా నత్త నడక నడిస్తే లాభం లేదంటారా?

మీ మాట నిజమే . కానీ నేను పుట్టి  పెరిగిన వాతావరణం “ ఆల్ వేస్ వన్ థింగ్ ఎట్ ఎ టైం “ అంటూ నొక్కి  వక్కాణించింది. అదే నా నరనరాల్లో జీర్ణించుకు పోయింది , అందుకే అరడజను పనులు ఒకేసారి చెయ్యటం నాకు చేతకాదు !

మేము  చిన్నప్పుడు కంచం ముందు కూర్చుని కబుర్లు మొదలెడితే  వెంటనే  తాతయ్య “ అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. ఆహారాన్ని మౌనంగా-శ్రద్ధగా తీసుకున్నప్పుడే  అది వంటికి పడుతుంది “ అని  కోప్పడేవారు.

స్కూల్లో రోజు  పాఠం.... ఎక్కాలు...... పద్యాలూ...... అప్ప చెప్పేటప్పుడు మేము ఏమాత్రం అటు ఇటు చూస్తూ చెప్పినా మా మాస్టారు బెత్తంతో రెడీ గా వుండేవారు వాయించటానికి !   దిక్కులు చూస్తూ పాఠాలు అప్పచేపితే  నేర్చుకున్న చదువు  బుర్రలో కి వెళ్ళకుండా,  అదీ ఏ దిక్కుకో   పారిపోతుంది అనే వారు ! నీ  దృష్టి - మనసు ఎప్పుడూ  చేస్తున్న పని మీదే  వుండాలి గుర్తుంచుకో అంటూ బెత్తం ఆడించేవారు.   

ప్రతి పనికి ఓ పద్ధతి ఓ  టైము వుంటుందని మా నాన్నగారు ఎప్పుడూ అంటుండేవారు.

మా అన్నయ్య ఏం ఎస్  ఫైనల్ ఇయర్ లో వుండగా మంచి సంభందం వస్తే  అమ్మ  చేసేద్దాం అంది.

అన్నయ్య పెళ్ళి అయితే మాకు బోలెడు గిఫ్ట్స్ వస్తాయని, తెలిసీ తెలియని వయసులో వున్న అక్క- నేను  అమ్మకు  వంతపాడం !

నాన్నగారు ససేమిరా వీల్లేదన్నారు.  అమ్మ అంత మంచి పిల్లను ఒదులుకోవటం ఇష్ట్టం లేక, చదువుకు పెళ్ళికి లంకె ఏమిటీ దేని దారి దానిదే  అని వాదించింది. దానికి నాన్నగారు “ ముందు పని వెనక, వెనక పని ముందు

చెయ్యకూడదు. చదువు పూర్తి అవబోతున్న సమయంలో  పెళ్ళి చేసి వాడి దృష్టి  మళ్ళించ కూడదు. మనిషి ఒక లక్ష్యంతో ముందు కెళ్ళాలంటే  క్రమశిక్షణ - నియమం వుండాలి. చదువు అయి వుద్యోగం రాగానే పెళ్ళి చేసుకుంటే అప్పుడు వాడు హాయిగా ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు పెళ్ళి చేస్తే వాడిని అనవసరంగా తిక మక పెట్టిన వాళ్ళం అవుతాం “ అంటూ ఓ పెద్ద క్లాస్ తీసుకున్నారు.   డానికి తగ్గట్టు మా అన్నయ్య కూడా “ నో “ అన్నాడులెండి !

కానీ అవతలి వాళ్ళు కూడా మా అన్నయ్య లాంటి మంచి అబ్బాయిని ఒదులుకోవటం ఇష్టం లేక అలాగే  ఆగుతాం, ఈలోగా మా అమ్మాయి కూడా చదువు కంటిన్యు చేస్తుంది అని చెప్పారు. అన్నట్టుగానే ఏం ఎస్సీ గోల్డ్ మెడలిస్ట్ అయిన అన్నయ్యకు వెంటనే మంచి వుద్యోగం రావడం..... మా వదినతో పెళ్ళిఅవడం..........కధ సుఖాంతం అయిందనుకోండి !

ఇక్కడ పిల్లలు బొడ్డూడ కుండానే బాయ్ ఫ్రెండ్లు......గర్ల్ ఫ్రెండ్లు..........డేటింగ్ లు...... లివింగ్ టుగెదర్ లు........అంటారని తెలిసి  మొదట్లో ఆశ్చర్య  పోయాను. మనిషి  ఎదగడానికి అమెరికాలో  అవకాశాలతో పాటు అవరోధాలు కూడా సరి  సమానంగా  వున్నాయని ఇక్కడ జీవితం మొదలు పెట్టాక తెలిసింది.      

స్కూల్లో చదువుతూనే , పార్ట్ టైం వుద్యోగాలు చేస్తూ........ డేటింగులు చేస్తూ.......... రెక్కలు రాకుండానే ఆకాశ వీధుల్లోకి ఎగిరి పోవాలని అనుకునే ఈ పిల్లల్ని చూసినప్పుడల్లా, నాకు మా నాన్నగారే గుర్తుకొస్తారు.  ఆయన మాటల్లోని అర్ధం- నిజం ఏమిటో ఈ దేశం వచ్చాక, పిల్లల తల్లి నయిన తర్వాత స్పష్ట్టంగా తెలిసొచ్చింది.

ఒకే సారి పది పనులు చేస్తూ ఏదో పొడిచేస్తున్నాం సాధిస్తున్నాం అని అనుకుంటాం. కానీ  అన్నీ చెయ్యాలి అన్న ఆదుర్దాలో, హడావిడిలో ఏదీ సరిగ్గా చెయ్యలేం ఏదీ పూర్తిగా అనుభవించలేమని తెలుసుకో లేకపోతున్నాం  .

ఇప్పుడు చూడండి  మీరు ఇన్ని పనులు ఒకే సారి చేస్తూ మీ బుర్రను ఎంత విసిగిస్తున్నారో ? మీరు  రాంగ్ బటన్ నొక్కి కంప్యూటర్ ని తిడితే ఏం లాభం ?

మా మాస్టారు అన్నట్టు  మనస్సుని వూరికే  అటు ఇటు పరుగులు పెట్టిస్తే,  మన జీవితం గజిబిజి గా చిందర వందరగా అయిపోతుంది.

 “ అసలే కోతి దానికి తోడు కల్లు తాగిందని “ మనిషికి మొదటి నుంచీ  ఆశ ఎక్కువ, దానికి  టెక్నాలజీ తోడయిన తర్వాత ఇక మిగిలింది వురుకులు-పరుగులే !!


ఓ సంవత్సరం పాటు నా ఈ “ అమెరికా ఇల్లాలి ముచ్చట్లు “ శీర్షికను ప్రచురించిన సుజనరంజని సంపాదక వర్గానికి, తమ అభిప్రాయాలను-అభిమానాన్ని వెలిబుచ్చిన పాఠకులందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ

శ్యామలాదేవి దశిక                   

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech