సుజనరంజని / సారస్వతం / గగనతలం

 

గగనతలము-25   

వ్యయభావము
లగ్నం నుండి చిట్ట చివరది మరియు పన్నెండవది అయిన వ్యయభావము నుండి ముఖ్యముగ వ్యయమును గూర్చి తెలుసుకుంటాము. ఇది అన్ని భావములలోను అత్యంత ముఖ్యమైనది మరియు గంభీరమైనది. ఇది మిగిలిన అన్ని భావములను శాసిస్తుంది. ఈ మాసము మనము ఈ భావము ఆధారముగ మనుషులు మరియు వారిలోని భిన్న వర్గములను గూర్చి నిశితంగా పరిశీలించే ప్రయత్నము చేద్దాము.

మనము సాధారణంగా మన బంధువులు లేక మితృలలో ధూమపానము లేక మద్యపానము లేక పొగాకు నమిలే అలవాటు ఉన్నవారిని కలిసినపుడు అనాలోచితంగా వారికి ఉపదేశము ఇవ్వడము ప్రారంభిస్తాము. అది హానికరమని మనకే కాదు వారికి కూడ తెలుసు. కానీ వారు మన మాటకు విలువ ఇవ్వనట్లు నటించి తప్పుకుంటారు. కొన్ని సార్లు వారు ఏ అలవాటు లేనివాడు ముందే పోయిన కొన్ని సందర్భములను గుర్తుచేసి తప్పుకుంటారు. ఈ రకమైన చాలా సందర్భములు మనకు తారసపడతాయి. ఇదే విధముగ దానధర్మములకు వ్యయమును చేసే వారు కొంతమందైతే, విలాసములకు కొంతమంది ఖర్చులు చేస్తారు. డబ్బుకు అలవాటుపడో లేక వ్యసనములకు అలవాటుపడో దొంగతనములు ప్రారంభించిన వారు కూడ మన పరిచయములోకి చాలా సార్లు వస్తుంటారు. ఇది తప్పు ఇది ఒప్పు అన్న వివేక జ్ఞానము ఉండి కూడ వారు ఈ మాయ నుండి బయటపడలేకపోతారు. చాలా సందర్భములలో వారికి ఉపన్యాసములు ఇచ్చే వారు వారి ధోరణిని మార్చుకుని వారికి దూరముగా ఉండటము ప్రారంభిస్తారు. ఇలా ఎన్నెన్నో సందర్భములను గుర్తు చేసుకుంటూ మనము ముందుకు సాగుదాం.

గ్రహబలం
గ్రహబలం ముందు మన మనోబలం చాలా సార్లు ఆయుధాన్ని విడిచేస్తుంది. అదే కోవకు చెందినదే మనిషి వ్యసనం బారిన పడటము. వ్యసనాలకు బానిసలు అయినవారు చాలా సార్లు అది మానినట్లు శపధము చేస్తారు. కానీ కొంతకాలము నిగ్రహించుకున్ననూ ఆ తరువాత మరల దానిని ప్రారంభిస్తారు. ఇది వారిపై గ్రహములు చూపే ప్రభావమే కానీ మరి ఏదియో కాదు. ఖర్చులు పెరిగి అప్పులు చేసే వ్యక్తి ఎప్పటికయినా వాటన్నిటినీ తీర్చి మరల అప్పు తీసుకోకూడదనుకుంటాడు. కానీ గ్రహ ప్రభావితములయిన పరిస్థితులు వారికి ఎన్నడూ ఆ సంతృప్తిని మిగల్చవు. గ్రహములకు మనము ఆధీనము కానీ అవి మనకు అధీనము కాదు.
 

యోగములు
1. వ్యయాధిపతి వ్యయస్థానములో ఉండి అతనిని శుభగ్రహములు చూచుచున్న లేక శుభగ్రహములు అతనితో కలిసి యున్న జాతకుడు శుభవ్యయమును చేయువాడగును.
2.   చందృడు వ్యయాధిపతి అయ్యి 9, 11, 5 స్థానములయందు లేక ఉచ్చస్థానమునందు, లేక స్వవర్గులయందు ఉన్నచో జాతకుడు దివ్యభోగములు, తల్పములు, మాల్యాది భూషణములు, గొప్ప సంపద కలిగిన వాడును అగును.
3.  వ్యయస్థానాధిపతి శతృస్థానమునందు, నీచస్థానమునందు, నీచాంశమునందు, లేక 6, 8 స్థానములందు ఉన్నచో స్త్రీ సుఖమును లేనివాడుగ చేయును. అంతియే గాక అధికవ్యయమును చేయువాడుగను, భోగములను అనుభవింపలేనివాడుగను చేయును.
4.  ఏ ఫలములనైతే మనము జాతకునికి చెప్పుచున్నామో అవే ఫలములను జాతకుని చక్రములో నాన్న అమ్మ సోదర భార్యాస్థానముల నుండి వారి వారి సందర్భములో తెలుసుకొనగలరు.
5.  సప్తమభావమునుండి లగ్నభావమువరకు ఉన్న గ్రహములు జాతకునికి ప్రత్యక్షముగను, లగ్నము నుండి సప్తమము వరకు ఉన్న గ్రహములు పరోక్షముగను ఫలములను ఇచ్చును.
6.  వ్యయస్థానమునందు రాహువుండి అతడు కుజరవులతో కలిసియుండిన జాతకుడు నరకమునకు వెళ్ళును. 
7.  వ్యయస్థానమునందు శుభగ్రహముండి వ్యయాధిపతి ఉచ్చరాశియందుండి శుభగ్రహములతో కూడియున్న లేక శుభగ్రహములు చూచుచున్న జాతకుడు ముక్తిని పొందును.
8.  వ్యయాధిపతి పాపగ్రహముతో కలిసియుండి వ్యయమునందున్న లేక పాపగ్రహదృష్టి కలిగియున్న జాతకుడు దేశాంతరములు తిరుగువాడు అగును.
9.  వ్యయమునందు శన్యాది గ్రహములుండి కుజునితో కలిసియున్న పాపకృత్యములు చేయుటద్వారా ధనమును సంపాదించువాడగును.
10.  లగ్నాధిపతి వ్యయమునందు వ్యయాధిపతి లగ్నమునందు ఉండి శుకృనితో కలిసి యున్న ధార్మిక కార్యములందు ధనమును ఖర్చుపెట్టువాడగును.
చెప్పబడినవి కొన్ని యోగములు మాత్రమే. వీనిలో మనము ప్రారంభములో చెప్పుకున్నట్లు వ్యసనములకు సంబంధించిన ఏ అంశమునూ చర్చించుకోలేదు. కానీ మనము శుభగ్రహములు అశుభగ్రహములు, చండాల గ్రహములు, నిమ్నస్థాయికి చెందిన గ్రహములు, రాజసము కలిగిన గ్రహములు ఇలా గ్రహముల అనేక ప్రబేధములను గూర్చి ముందే తెలుసుకుని యున్నాము. పాఠకులు గ్రహముల స్వభావములను ఆధారముగ చేసుకుని మరియు వానికి వ్యయభావముతో గల సంబంధమును చూచి వాని బలాబలములను బట్టి జాతకుడు ఎటువంటి వ్యసనములకు లోనయ్యే అవకాశమున్నదో గ్రహించు ప్రయత్నము చేయగలరు.
ఇదే విధమయిన ప్రయత్నము ప్రతీ భావము విషయములోనూ చేయవలెను. ఆ విధముగ చేయుటద్వారా పాఠకులు అనుభవపూర్వకమైన స్థిరచింతనకు చేరుకోగలరు.

సశేషము..................          

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech