సుజనరంజని / సారస్వతం / గోవిదం భజ మూఢమతే

గోవిందం భజ మూఢమతే - 6

 


భజగోవింద శ్లోకాల అర్ధాలు:

యోగ రతేవా భోగరతేవా
సంగర తోవా సంగ విహీనః
యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి వందత్యేవ

యోగాన్ని అనుష్టించవచ్చు. భోగాలను అనుభవించవచ్చు. జనుల మధ్య నివశింపవచ్చు. లేదా ఏకాంతంగా ఉండనూ వచ్చు. ఇన్ని చేసినా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ బ్రహ్మలో లీనం అయి ఉంటుందో వారే ఆనందమయులు.

ఆనందమే తానైన ఆత్మ జ్ఞానికి సర్వం శివమయం. ఆత్మవిష్ణుని దృష్టి ఎల్లవేళలా పరమాత్మపైన ఉంటుంది. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమని నిర్వహించినవాడు అంతా అద్వైత ఆనందమే. అప్పుడే బహిరంతరాలలో పవిత్రత ఏర్పడుతుంది. పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. పవిత్రమైన మనస్సే పరమేశ్వరునికి ఆలయమై, జీవదేవ భ్రాంతి నశించి జన్మరాహిత్యం పొందవచ్చు.

భగవద్గీతా కించిదధీతా
గంగాజల లవకణికాపీతా
సకృదపిమేన మురారి సమర్చా
క్రియతే తస్యయ మేనన చర్చా

భగవద్గీతను కొంచెమైనా చదివినవారు, గంగాజలాన్ని ఒక చుక్కైనా త్రాగినవారు, భగవంతుడైన మురారిని ఒక్కసారైనా ఎవరు పూజిస్తారో, వారికి యమునితో వివాదమే ఉండదు.

భగవద్గీత పరమ పవిత్రమైనది. సాక్షాత్ పరమాత్మ వాక్కు. మోక్షగామి అయిన మనిషి ఏం చెయ్యాలి? ఎలా ఉండాలి? తరించే మార్గమేది? వివరంగా చెప్పబడింది. మానవాళి మనుగడపై మహితాత్ముడైన పురుషోత్తమునికున్న ఆదరణ భగవద్గీత తెలుపుతోంది. గీతాపారాయణం మనిషిలో అజ్ఞానం దూరం చేసి స్థితప్రజ్ఞుని చేస్తుంది. లోకపావని గంగ, ధాత్రిని పవిత్రం చేస్తుంది. గంగ ఒడ్డునే వేదం పుట్టిందంటారు. నిత్యం వేద మంత్రోచ్ఛారణ జరుగుతుంటుంది. ఎందరో మహాత్ములు తపస్సు చేసి తరించారు. అటువంటి నిర్మలజలం ఒక్క చుక్క మన నోట పడినా చాలు జన్మ ధన్యం. నిత్యం మురాంతకుడైన మురళీధరుని పూజించాలి. మోక్ష ప్రదాత అయిన పరమాత్మని స్తుతించడం మనిషి ధర్మం. స్తుతులకు లొంగని వారుంటారా?

అందులో కరుణాళుడైన పరమాత్మ! అయితే పూజలు కానీ, స్తుతులు కానీ అనన్య చింతనతో చేయాలి. అప్పుడే జీవాత్మ అవ్యయుడై, అద్వైత భావన ప్రబలమై మృత్యుభయం వీడి తరిస్తుంది.

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయా పారే పాహి మురారే

పుడుతూ, మరణిస్తూ, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పుడుతూ, పుడుతూ దుస్తరమైన ఈ సంసారాన్ని దాటటం సాధ్యం కాకున్నది. మురారీ దయతో నన్ను రక్షించు.

పుట్టుక, మరణం, మరణం - పుట్టుక అంతర్గర్భితమై ఉన్నాయి. మనిషి వస్త్రాలను మార్చినట్లు, జీవాత్మ శరీరాలను మారుస్తుంది. అంటే జీవాత్మ ఒక శరీరం నుండి ఇంకొక శరీరాన్ని ఆశ్రయించడం వల్ల జీవితం అనంతమైన యాత్ర అవుతోంది. మరణం కేవలం దీర్ఘనిద్ర మాత్రమే. కర్మవాసనలు జన్మజన్మలకు వెంటాడుతూ ఉంటాయి. జనన మరణ చక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది.

మనిషి జన్మ పాపపుణ్యాల మిశ్రమం. ఎన్ని జన్మలెత్తినా పరంధాముని దివ్యధామం చేరలేని జన్మవ్యర్ధం. వివేకం, విచక్షణలతో చిగురించిన వైరాగ్యాన్ని పెంచి, ఓ తండ్రీ! బ్రతుకు భారాన్ని మోయలేని నిస్సహాయుడిని. ఇంకా ఇంకా జన్మలెత్తి పరితపించే ఓపిక లేదు. పరంధామా! కరుణతో ఈ జన్మకి ముగింపు పలికి, నన్ను నీదరికి చేర్చుకో స్వామీ..! అని ఆర్తితో తపనతో ప్రతిక్షణం నివేదన చేస్తే తప్పక స్పందిస్తాడు పరమాత్మ.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech