సుజనరంజని /  శీర్షికలు   /  ఎందరో మహానుభావులు

 

ఎందరో మహానుభావులు - సంగీత సరస్వతిని రాచకీచకులకమ్మని

మద్దిరాల వేంకటరాయకవి

                                                           - తనికెళ్ళ భరణి

 


అర్ధరాత్రి!
ఎక్కడో నక్కలు ఊళలేస్తున్నాయ్...
హోరుగాలికి ... తలుపులు దడదడకొట్టుకొంటున్నాయ్
దీపం ఎప్పుడో ఆరిపోయింది..
మనస్సు ఆనందంగా లేకపోతే...ప్రకృతిలో చెడే గోచరిస్తుందేమో
చంద్రుడు గూడా కారుమబ్బుల చాటుకి మాయమైపోయాడు
దీర్ఘాలోచనలో పడిపోయాడు వేంకటరాయకవి!
ఇదేంటి ఇలా అయిపోయింది బతుకూ?
కళ్ళముందు గతంలో జరిగిన సంఘటనలన్నీ
ముక్కలు ముక్కలై కనబడ్డం ప్రారంభించాయ్!!

పిఠాపురం..
కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం
తనకి అక్షరాభ్యాసం
గురువుగారు శ్రీ కంచిభట్ల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు
ఓం..నమః...శివాయః
అదే మంత్రం
కుక్కుటేశ్వరుడే దేవుడు!
లక్ష్మీనారాయణ గారే గురువుగారు.
గురూగారి ఆశీర్వచనం వల్ల..సరస్వతీ ప్రసన్నం జరగడం
అద్భుతమైన ధార...అలవోకగా..తను పాటలు..పద్యాలు రాసెయ్యడం...
గురూగారూ కావ్యాలేవీ నరులకి అంకితం ఇవ్వరాదని, అగ్నిసాక్షిగా ప్రమాణం చేయించుకోవడం.
వాగ్గేయకారుడిగా తనకి గుర్తింపు
పిఠాపురం ఆస్థాన కవిగా నియామకం
ఆస్థాన కవంటే..ఆ భోగం..
దేవేంద్ర భోగం. కదూ..!
తెల్లారగట్ట వైతాళికుల మేల్కొలుపులు..
పన్నీటి జలకాలు.. పట్టుబట్టలు.అత్తరు సువాసన్లు
పల్లకీలెక్కడాలు.ఏనుగులెక్కడాలు
రాజప్రాసాదానికెళ్తే పూర్ణకుంభ స్వాగతాలు..బరబరులు..(స్త్రోత్ర పాఠాలు చేసేవారు)
తన సంగీతం...రాజావారి బహుమానాలు
ప్రేక్షకుల హర్షధ్వానాలు
ఆహా బతుకంటే ఇది కదూ!
నేనంటే ఇంత అనుగ్రహంటయ్యా కుక్కుటేశ్వరా!!
సరిగ్గా ఈ సమయంలోనే .. పెళ్ళీ
కుందనపు బొమ్మలాంటి పిల్ల
బుగ్గన చుక్కతో..ఓరకంటచూసీ..
తమలపాకుల చిలకలందించడం.. తను చటుక్కున వేలుకొరకడం
ఆ సిగ్గు.. ఆ బిడియం..ఆ విడియం...
ఓహ్ ... స్వర్గంలో మాత్రం ఇంతకన్నా ఏముంటుంది.
కొన్నాళ్ళు రంజుగానే సాగింది కాపురం.
అయితే...ఎల్లకాలం ఒకేలాగుంటుందీ?
కాల పురుషుడు ఉండనిస్తాడా?
తను తన ఇష్టదైవం అయిన రాజరాజేశ్వరీ దేవి - కుక్కుటేశ్వర స్వాములు వారి మీద ‘ఏకాంత సేవావిలాసమనే’ కావ్యం వ్రాసాడు.
ఆస్థానంలో కొన్ని పాడి వినిపించాడు.
అంతా తెగమెచ్చుకున్నారు.
ముచ్చట పడిపోయిన పిఠాపురం రాజావారు రత్నాల కంకణం తీసిస్తూ..
భేష్.. వేంకట రాయకవీ! నీ ఏకాంత సేవావిలాసం...నాకు అంకితం...అనేసీ...సభ చాలించేశారు.
రత్నాల కంకణం...మండ్రగబ్బలా తోచింది..
పాలు తాగితే విషం అనిపిస్తోంది..
కళ్ళు మూసుకుంటే..ఉగ్రంగా చూస్తున్న గురూగారు.
దుఃఖిస్తున్న..సరస్వతి..
నరాంకితం చేస్తావురా.. గురూగారి గంభీర కంఠస్వరం
ఆ పడుపుకూడు భుజిస్తావా అంటున్నట్టు - వాణి
బుర్ర తిరిగిపోతోంది.
ఎందరెందరో గుర్తుకొస్తున్నారు..పోతన..ధూర్జటి..త్యాగయ్య
రాజుల్ మత్తులు వారిసేవ నరక ప్రాయంబు..
కాళహస్తీశ్వరా శతకం గుర్తొస్తోంది..
నిధి చాలా సుఖమా?
తట్టుకోలేక..ఆలయానికెళ్ళి భోరుమని ఏడ్చాడు.
మంద్రంగా ఓంకారం వినిపిస్తోంది.
లీలగా నమకం...చమకం వినిపిస్తున్నాయ్
ప్రశాంతంగా శివలింగం! నిర్వికార స్థితిలో
లక్ష ప్రశ్నలేశాడు...మనస్సులో..
ఒక్కటే సమాధానం లభించింది.
అదీ మౌన వ్యాఖ్యానం మాత్రమే
మర్నాడు..డోలూ సన్నాయితో...రాజభటులు కానుకలు పల్లకీలతో వచ్చారు...కావ్యం పట్టుకుని రమ్మన్నారు.
నేను రాజులకి అంకితం ఇవ్వను..

* * *
తోకతొక్కిన తాచులా లేచాడు. పిఠాపురం రాజు!
ఎంత పొగరూ!
నా మోచేతి కింద గంజినీళ్ళు తాగే వెధవ
ఈడ్చుకురండి!!
రాజాజ్ఞ అయ్యింది..

* * *
ఏ సభా మండపంలో..తాంబూలం ఆస్వాదిస్తూ అరకన్నులు మోడ్చి..జేజేలు అందుకున్నాడో!
అక్కడే ఇనప సంకెళ్ళలో.దిక్కుమాలిన వాడిలాగ...
ఇతని యావదాస్తిని లాక్కొనీ..రాజ్యం నించీ గెంటెయ్యండీ..
తరతరాలుగా వస్తున్న రాజాజ్ఞ.
అంతే
మంత్రం వేసినట్టు ఐశ్వర్యం మాయమైపోయింది.
ఐశ్వర్యాన్ని ఆసరా చేసుకుని ఉండే.. దాసదాసీ జనం మాయమైపోయారు.
బంధుత్వాలు...ఫటాలున తెగిపోయయి.
బంగళానుంచి కవి కుంటుంబం బజార్న పడింది.
సర్వాభరణ భూషితయైన లక్ష్మీదేవి..మందహాసం చేసుకుంటూ వేగంగా వెళ్ళిపోయిన ఉత్తర క్షణం...పెద్దమ్మ వెకిలిగా నవ్వుకుంటూ వొచ్చింది. పేలు నొక్కుకుంటూ..
దుర్భర దారిద్ర్యం.. తిండి తిప్పలు లేవు! ఒంటి మీద మంచి గుడ్డలేదు. అకస్మాత్తుగా భార్యకి రోగం.
ఇది ఇలా ఉండగానే తండ్రిగారి ఆబ్దీకం
తద్దినం అంటే మాటలా
నాలుగు కూరలు,,, నాలుగు పచ్చళ్ళు.
నెయ్యి, గారెలు... అరిసెలు..పాయసం
బ్రాహ్మలకి దక్షిణలు..నా శార్దం
తన దగ్గర తరతరాలుగా వొస్తున్న ‘స్పటిక జపమాల తప్ప’ మరోటిలేదు. ఎలా పెట్టడం.
తండ్రికి తద్దినం కూడా పెట్టని దరిద్రుడు అని లోకం దుమ్మెత్తి పోస్తుంది.
లోకం సంగతి దేవుడెరుగు..
కన్న తండ్రి.. వేపకొమ్మ మీద నుంచి కావుకావుమని అరుస్తున్నాడే
అయిందేదో అయిందని..తావళం తాకట్టు పెట్టేశాడు.
తద్దినమూ పెట్టేశాడు శ్రద్ధగా
ఇంక తన దగ్గర ఏమీ మిగల్లేదు.
పదవే అడవుల్లోకి పోయి ఏ ఆకులో, అలములో తిందాం
అవీ దొరకవు.. కలసి చద్దాం.
బైలుదేరారు భార్యాభర్తలు.. నడుస్తున్నారు..నడుస్తున్నారు..
ఎండ... దారంతా గులకరాళ్ళు..ముళ్ళూ..
వనవాసం..ఇంత కష్టమా...?
ఒక దశకొచ్చేసరికి నడవలేక కళ్ళు తిరిగి పడిపోయాడు వెంకటరాయకవి.
స్పృహ పోయింది.
చీకట్లు..చీకట్లు...అంతలో చీకట్లను చీల్చుకుంటూ.
ఓ పెద్ద వెలుగు.. కళ్ళు వెలుగుకి అలవాటయ్యాక..
అందులో కుక్కుటేశ్వర స్వామి..మంద్రంగా తంబూర నాదం..
ఏవయ్యా కవీ.. విచారంగా ఉన్నావేం..
ప్రాణప్రదంగా దాచుకున్న తావళం కుదువ పెట్టాను స్వామి.
అదెక్కడికి పోతుంది గానీ ఏదీ ఆకు ముడుపులు పంపెర... అనే దరువు మరోమారు పాడు...అర్ధించాడు దేవుడు.

ఆకు ముడుపులు పంపెరా ఇవి అందుకొమ్మిట చూడు నా
రాకకే యెదురౌచునున్నది..రాజసంబున బ్రోవరా..
శ్రీకరంబగు నింటికిన్ దయసేయరా తడవాయెరా!
ప్రాకటంబుగ కుక్కుటేశ్వరా.. భామ నిను పిలిచిందిరా..!

అంటూ గట్టిగా పాడేస్తున్నాడు. భార్య ఉలిక్కిపడి లేచింది.
ఎవ్వరూ లేరు..ఏంటీ వెర్రి..అంది.
అంతా కలా అనుకున్నాడో లేదో..

భేరీకాహళ వాద్యాలతో కోలాహలంగా ఓ గుంపు కదలివొస్తోంది..తీరా చూస్తే... తావళం తాకట్టు పెట్టుకున్న కంచెర్ల కృష్ణయ్య...
కవిగారి కాళ్ళమీద పడిపోయాడు.
అయ్యా నన్ను క్షమించండి. ఇది కుక్కుటేశ్వర స్వామి వారి ఆజ్ఞ..అనుజ్ఞ.
అంటూ కవిగార్ని భార్యా సమేతంగా నూతన గృహ ప్రవేశం చేయించి, తావళంతో పాటు, బంగారునగలు, పట్టు వస్త్రాలు ఇచ్చి, దణ్ణాలెట్టాడు.
కవిగారి దారిద్ర్యం వొదిలిపోయింది.

కానీ, రాజావారు చేసుకున్న పాపం ఎక్కడికి పోతుందీ!
రాజావారికి జబ్బు చేసింది! వొళ్ళంతా బొబ్బలు..బీభత్సంగా రసికారుతూ.. శరీరమంతా దుర్వాసన!
కావాల్సిన వాళ్ళు కూడా ముక్కుకి చెయ్యడ్డం పెట్టుకుని తప్పక సేవ చేస్తున్నారు.
ఒక మహావిద్వాంసుణ్ణి క్షోభ పెట్టినందుకే తనకీ శిక్ష పడిందని రాజా వారు పశ్చాత్తాపపడి కవిగారి శరణు వేడారు.
అంతా కుక్కుటేశ్వర స్వామి దయ అన్నాడు కవి! రాజావారికి జబ్బు నయమైపోయింది.
కవిగారికి ఎంచేతనో మళ్ళీ ఐశ్వర్యం మీద మోజు కలుగలేదు.
వొచ్చిందంతా దానం చేసి ఐహిక సుఖాలకి లొంగకుండా... కుక్కుటేశ్వర స్వామిని సేవిస్తూ పరమానందంగా కాలం గడిపాడు.
అన్నట్టు మద్దిరాల వేంకటరాయకవి శ్రీ త్యాగరాజస్వామి సమకాలీకులు.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech