సుజనరంజని / సారస్వతం / భట్టారక సంప్రదాయం - 2

 

భట్టారక సంప్రదాయం - 2

                                                              రచన : ముత్తేవి రవీంద్రనాథ్, తెనాలి.

 

క్రీ.శ. 8వ శతాబ్దికి చెందిన పూర్వ మీమాంసా పండితుడు, ఆది శంకరాచార్యునితో తలపడిన మండన మిశ్రుని గురువు, ఆంధ్రుడూనైన కుమారిల భట్టు జైమిని ‘మీమాంస సూత్రాల’కు భాష్యకారునిగా ప్రసిద్ధి పొందాడు.

ప్రత్యక్ష, ఆనుమాన, ఉపమాన, శబ్ద పరిచ్ఛేదాలతో జ్ఞాన సముపార్జనా మార్గాలైన ప్రమాణాలను (valid sources of knowledge) అందరికీ అర్ధమయ్యే సులభ శైలిలో వివరిస్తూ ‘తర్క సంగ్రహ’ పేరిట గౌతముని న్యాయ సూత్రాలను వ్యాఖ్యానించిన తర్క శాస్త్ర పండితుడు వారణాసి అన్నంభట్టు తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. ‘ఇంద్రియార్ధ సన్నికర్ష జన్యం జ్ఞానం ప్రత్యక్షం’ ‘అనుమితి కరణ మనుమానం’, ‘పరామర్శజన్యం జ్ఞాన మనుమితిః’, ‘యత్ర యత్ర ధూమస్తత్రతత్రాగ్నిరితి సాహచర్య నియమో వ్యాపిః’ అంటూ చిన్నప్పుడు వల్లెవేసిన తర్క శాస్త్ర నియమాలు గుర్తుండేంత వరకు అన్నంభట్టు నెలా మరచిపోగలం? ఈ మహానుభావుడు ఏ కాలం నాటి వాడో గానీ తెనాలికి చెందిన ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు కీ.శే. ములుగు విశ్వేశ్వర శాస్త్రి గారు 1933లో ఈ చిన్న అమూల్య గ్రంథాన్ని పరిష్కరించి ప్రచురించారు. ఇతడు ‘తర్క సంగ్రహ దీపికా’ అనే మరొక తర్క శాస్త్ర గ్రంథాన్ని కూడా రాసినట్టు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు పేర్కొన్నారు. (Indian philosophy Vol.II note under Page 31). History of Indian logic అన్న గ్రంధాన్ని ఉటంకిస్తూ అన్నం భట్టు అనే ఈ ఆంధ్ర బ్రాహ్మణుడు క్రీ.శ. పదిహేడవ శతాబ్ది వాడని ఊహించారు రాధాకృష్ణన్ గారు.

కొండవీటిని పాలించిన పెద కోమటి వేమారెడ్డి (క్రీ.శ.1398-1415) ఆస్థానంలోని వామన భట్ట బాణుడు ‘వేమ భూపాల చరితము’ను సంస్కృతంలో గద్యంలో రాశాడు. ఇతడు మాధవ విద్యారణ్యుడుగా ప్రసిద్ధుడైన మాధవాచార్యుని శిష్యుడు. ‘పార్వతీ పరిణయం’ అనే ఐదు అంకాల సంస్కృత నాటకం, ‘రఘునాథ చరితం’, ‘నలాభ్యుదయం’, ‘హంస సందేశం’ అనే సంస్కృత కావ్యాలే కాక ‘బృహత్ కథా మంజరి’అనే గద్య రచన చేసి, ‘శబ్ద చంద్రికా’, ‘శబ్ద రత్నాకరీ’ అనే సంస్కృత నిఘంటువులు కూడా సంకలనం చేశాడు.

‘హయ లక్షణ విలాసము’ అనే అశ్వ గ్రంధాన్ని రాసిన మనుమంచి భట్టు ప్రసిద్ధుడే.
‘స్తుతి కుసుమాంజలి’ పేరిట శివుడిని స్తుతిస్తూ ముప్పై ఎనిమిది అధ్యాయాల సంస్కృత కావ్యాన్ని రాసిన జగద్ధర భట్టు క్రీ.శ.పద్నాల్గవ శతాబ్దికి చెందినవాడు.

కేరళకు చెందిన శ్రీ వైష్ణవ కవి మేల్ పుత్తూరు నారాయణ భట్టు ‘నారాయణీయం’ పేరిట శ్రీకృష్ణుడిని స్తోత్రం చేస్తూ 1036 స్తోత్రాలు రాసి ప్రసిద్ధికెక్కాడు. క్రీ.శ. పదహారు - పదిహేడు శతాబ్దాల కాలానికి చెందిన ఈ సంస్కృత కవి ఇంకా సంస్కృతంలో ‘రాజసూయం’, ‘దూత కావ్యం’, ‘పాంచాలీ స్వయంవరం’, ‘సుభద్రాహరణం’ వగైరా పలు కావ్యాలు రాశాడు.‘నారాయణీయం’ లో కృష్ణుడు గోపికలతో సాగించిన రాసలీలలను వర్ణించే ఘట్టాలు స్తోత్ర సాహిత్యంలో కెల్లా అద్భుత సృష్టిగా విమర్శకుల ప్రశంసలు పొందాయి.

కన్నడ వ్యాకరణాన్ని అయిదు వందల తొంభై రెండు సంస్కృత సూత్రాలతో, వృత్తి, వ్యాఖ్యా సహితంగా రాసిన పదిహేడవ శతాబ్దికి చెందిన కన్నడ జైన పండితుడు, వైయాకరణి భట్ట అకళంక దేవుడు అత్యంత ప్రసిద్ధుడు. కర్ణాటక లోని శ్రావణ బెళగొళకు చెందిన పంచబాణ భట్టు మరో ప్రసిద్ధ కవి.

కుమారిల భట్టు అనంతరం ఆయన పేరిట పూర్వ మీమాంసా మతాన్ని భాట్ట మతమనసాగారు. భాట్టం ఇంటిపేరు కలవారు మన రాష్ట్రంలోనూ ఉన్నారు. ఆయన శిష్యులలో మీమాంసా బాల ప్రకాశ రాసిన శంకర భట్టు, ‘సిద్ధాంత చంద్రికా’ ను రాసిన రామకృష్ణ భట్టు ప్రసిద్ధులు. మిగిలిన ప్రసిద్ధులలో భారతీయ సౌందర్య మీమాంస (Indian Aesthetics) లో దిట్ట అయిన భట్ట నాయకుడు పేర్కొనదగినవాడు.

వంగ దేశానికి చెందిన కల్లూక భట్టు అనే సువిఖ్యాత పండితుడు ‘మన్వ్రర్ధ ముక్తావళీ’ పేరిట మనుస్మృతికి సాధికారమైన వ్యాఖ్యానం రాశాడు. క్రీ.శ. పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ పండితుడు ‘శ్రాధ్దసాగర్’, ‘వివాద సాగర్’, ‘అశౌచ సాగర్’, ‘స్మృతి సాగర్’ వగైరా ఇతర రచనలూ చేశాడు.

క్రీ.శ. 476లో జన్మించిన సుప్రసిద్ధ భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్టు ‘ఆర్య సంహిత’ అనే గ్రంధం రచించి యావత్ ప్రపంచానికీ మార్గదర్శకుడు అవడమే కాక భారతీయులందరికీ గర్వకారణమయ్యాడు.

పదమూడవ శతాబ్దికి చెందిన కేదారభట్టు అనే వైయాకరణి సంస్కృత ఛందస్సుపై ‘వృత్త రత్నాకరం’ అనే గ్రంధం వ్రాసాడు. ఛందస్సుపై ఇదొక సాధికార గ్రంధంగా భావించబడి, అనంతరం ఈ గ్రంధం పైన వ్యాఖ్యాతలు ఇరవైకి పైగా వ్యాఖ్యాన గ్రంధాలు రాశారు.

పదిహేడవ శతాబ్దికి చెందిన భట్టోజీ దీక్షితులు అనే మరో వ్యాకరణ పండితుడు పాణిని రాసిన ‘అష్టాధ్యాయి’ కి ‘సిద్ధాంత కౌముది’ పేరిట రాసిన వ్యాఖ్యాన గ్రంధం సుప్రసిద్ధం.

క్రీ.శ. ఏడవ శతాబ్ది ప్రథమార్ధం లో జీవించిన భట్టనారాయణుడు రాసిన ‘వేణీసంహారం’ అనే సంస్కృత నాటకం సుప్రసిద్ధం.

మహాభారతాన్ని తెలుగులో ద్విపద కావ్యంగా రాసిన కవిత్రయంలోని వాడైన తిరుమల భట్టు కూడా ఈ సందర్భంగా పేర్కొనదగినవాడు. ఇతడి స్వగ్రామం నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా బట్టేపాడు. ఇది కూడా భట్ల పెనుమర్రు, భట్టు పల్లెల వలెనే ‘బట్టు’ నుంచి ఏర్పడినదే - ‘తాడి’ నుంచి ‘తాడేపల్లి’, ‘తుమ్మ’ నుంచి తుమ్మేపల్లి గ్రామ నామాలు ఏర్పడినట్లు.

సాళువ పెద తిమ్మరాయలు కాలం నాటి తిట్టుకవి మేధావిభట్టు, రెడ్డి రాజుల కాలంనాటి బడబానల భట్టారకుడు అనే మరో తిట్టుకవి ప్రముఖ భట్టారకులలో పేర్కొనదగినవాడు.

‘మహాభారత ధర్మములు’ అనే ప్రామాణిక గ్రంధాన్ని రాసిన పన్నాల సుబ్రహ్మణ్య భట్టు తెలుగు పండితుడే.

‘జాతక రత్న’ మిడతంభొట్లు కథ మన జానపద సాహిత్యంలో ప్రసిద్ధమే.

శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలో తెనాలి రామకృష్ణ కవితో తలపడి ఓడిన పిఠాపురానికి చెందిన ప్రసిద్ధ బూతు కవి పేరం భొట్టు గురించి ప్రచారంలో ఉన్న కథలు మరి ఏ మేరకు సత్యాలో?

మన తెలుగులో ‘నానాటికీ తీసికట్టు నాగంభొట్టు’ అన్న సామెత అందరికీ తెలిసినదే. ఈ నాగంభొట్టు ‘బాలనాగమ్మ కథ’ లోని ఒక పాత్ర. ఇతడొక బ్రాహ్మణ పండితుడు. అయితే వ్యసనాలకు బానిసై, ఇంగితం మరచి మేలు చేసిన వారికే కీడు తలపెడతాడు. బాల వర్ధి రాజు మాయల మరాఠీ చెరలో ఉన్న తన తలిదండ్రులను విడిపించడానికి బయలుదేరిన సందర్భంలో ఆ పసి బాలుడికి తోడుగా ఈ పండితుణ్ణిచ్చి పంపిస్తారు బాలుడి పెద్దమ్మలు. ‘లోకజ్ఞానం లేని ఆ పసిబాలుడికి ఉచితానుచిత వివేకాన్ని బోధించగల సమర్ధుడు నాగం భొట్టు’ అని వారు భావించారు. అయితే నిద్రిస్తున్న బాలుడి బంగారు నగలు ఒలుచుకుని, తలపై రాతితో మోది, చనిపోయాడనుకుని అతడని ఓ పాడు బావిలోకి నెట్టి నగలతో ఉడాయిస్తాడు నాగంభొట్టు. తరువాత ఎవరో యాత్రికులు బాలుడిని రక్షిస్తారు. జూదం, వ్యభిచారంలో తాను కాజేసిన బంగారమంతా కోల్పోయి బికారిగా మారి కుష్టు వ్యాధి సోకిన నాగం భొట్టును చూసి జాలిపడి బాలవర్ధిరాజు అతడికి వైద్యం చేయించి సకల సేవలు చేసి అతడిని కాపాడతాడు. ఎప్పటికప్పుడు దిగజారిపోతున్న స్థితిగతులను గురించి చెబుతూ ‘మా పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్టు’ అన్న చందంగా ఉంది అనడం పరిపాటి అయింది. అభివృద్ధి చెందడానికి ఇతరులు ఇచ్చే ఆసరాను వినియోగించుకోలేని అయోగ్యులకు ఈ సామెత చక్కగా వర్తిస్తుంది.

భట్టారకుల మీద భక్తి ప్రపత్తులు:
వేదవ్యాసుని తండ్రి, స్మృతికర్త అయిన పరాశరుడిని ‘భట్ట పరాశరుడు’ అని గౌరవ సూచకంగా పిలిచేవారట. ప్రయాగ నేటి అలహాబాద్ ని ‘భట్ట ప్రయాగ’ అని గౌరవ పురస్సారంగా పిలుస్తారు . ఇలా నామవాచకాలకు గౌరవం ఆపాదించడానికి ‘భట్ట’ శబ్దాన్ని వాడడాన్ని బట్టి ఈ శబ్దం గౌరవ సూచకంగా స్థిరపడిందని గ్రహించగలం.

‘భట్ట’ శబ్దం రాజులకూ, యువరాజులకూ గౌరవ సూచకంగా వాడే బిరుద నామమే కాక, పండితులైన బ్రాహ్మణులకు పేరుకు ముందు కానీ వెనుక కానీ వాడబడే బిరుదనామమని ప్రామాణిక నిఘంటువులు పేర్కొన్నాయి.
ఉదా: భట్ట గోపాలస్య పౌత్రః (మాలతీ మాథవం-1); `కుమారిల భట్ట’ మొ...

‘విద్వాంస కవయో భట్ట’ అని ‘అభినయ దర్పణం’ నిర్వచిస్తున్నది.
గొప్ప పండితుడినీ, దార్శనికుడినీ ‘భట్ట’ శబ్దంతో వ్యవహరిస్తారు.
‘భట్టార’ శబ్దం కూడా‘గౌరవనీయ’, ‘పూజనీయ’ అనే అర్ధంలోనే వాడతారు.
‘భాట్టారః’ అంటే ప్రభువు అనే అర్ధం ఉంది. పండితులైన బ్రాహ్మణులను అందరూ పూజనీయులుగా భావించడమే కాదు; ప్రభువులు సైతం వారిని సమాదరించేవారు.

‘భట్టారక’ శబ్దం కూడా ‘పూజనీయ’ అనే అర్ధంలోనే వాడబడింది. ‘భట్టారకుడు’ అంటే నాట్య పరిభాషలో రాజు అని అర్ధం. ‘భట్టారకుడు’ అంటే ‘ముని’,. ‘సూర్యుడు’ అనే అర్ధాలు ఉన్నాయి. అందుకే ఆదివారాన్ని ‘భాట్టారక వాసరం’లేక భాట్టారక వారం అని కూడా అంటారు. భట్టారకుడు అనేది గొప్ప పండితుడికి ఇవ్వబడే బిరుదు కూడా. ఉదాః నన్నయ భట్టారకుడు.

బాలనాగమ్మ కథలో గండికోట యుద్ధానికి అన్నలతో సహా ససైన్యంగా తరలి వెళుతూ కార్యవర్ధి రాజు తలారి రాముడు అనే కోట గుమ్మం కాపలాదారు (ప్రధాన దౌవారికుడు) తో ఇలా అంటాడు. కత్తీ, కర్రా పట్టగలిగిన వాళ్ళందరం యుద్ధానికి తరలి వెళుతున్నాం. కోటలో అంతఃపుర స్త్రీలు తప్ప మగపురుగు కూడా లేదు. కాపలా కట్టుదిట్టం చెయ్యి. పోతుటీగ కూడా లోనికి చొరబడడానికి వీల్లేదు. భట్టు, బాపడు, జోగి, జంగం - ఎవరు భిక్షకు వచ్చినాసరే కోట గుమ్మం వద్దే వారికి ఒక మాడ (అంటే నాటి బంగారు నాణెం). దీనినే అర వరహా అనీ వ్యవహరించేవారు) ఒక పాత (పాత పంచె లేక పాత చీర), కుంచం (తూములో నాల్గవ వంతు గల కొలమానం) ధాన్యం కోట గవిని వద్దనే ఇచ్చి పంపెయ్యి’. దీన్ని బట్టి మనం ఒకటి అర్ధం చేసుకోవచ్చు. గండికోట యుద్ధం జరిగే కాలానికి (క్రీ.శ.1652 నాటికి) ప్ర్తజల దృష్టిలో, ప్రభువుల దృష్టిలో భట్టులు సాధారణ బ్రాహ్మణుల కంటే ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ మిగిలిన బ్రాహ్మణుల వలెనే భట్టులలో కూడా జరుగుబాటు లేని కొందరు ‘ఉపాదానం’ అంటూ భిక్షకు వెళ్ళేవారన్నమాట. ప్రభువుల వైభవశ్రీలు అంతరించే కొద్దీ భట్టారకులకు పోషణ సన్న్గిల్లి వారి ఆర్ధిక స్థితిగతులు తారుమారు కావడం సహజం.

‘భట్టారికా’ అంటే దేవత అనే అర్ధంతో బాటు దొరసాని (a noble lady) అనే అర్ధమూ ఉంది. ‘భట్టిని’ అంటే నాట్య పరిభాషలో ‘రాజు భార్య’, ‘బ్రాహ్మణుడి భార్య’ అనే అర్ధాలున్నాయి.

మనకు బట్టుపల్లె, భట్టుపల్లె, దేవరాయ భట్లపాలెం, భట్ల పెనుమర్రు, భొట్ల గూడూరు, రాంభొట్ల వారి పాలెం, భట్నవిల్లి, భట్టరహళ్ళి (కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో) వగైరా పలు గ్రామాలున్నాయి. ఇవన్నీ కేవలం బ్రాహ్మణ భట్టారకుల అగ్రహారాలు మాత్రమే కాదు. ఉదాహరణకు దేవరాయ భట్ల పాలెం ‘వసుచరిత్ర’ కావ్యం రాసిన భట్టుమూర్తి (రామ రాజ భూషణుడు) పూర్వీకులు, ‘ప్రబంధాంకం’ వంశీకులైన భట్రాజు కులస్థులకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రెండవ దేవరాయలు (పాలనా కాలం క్రీ.శ.1422-46) అగ్రహారంగా ఇచ్చిన గ్రామం. ఈ గ్రామం తెనాలి రామకృష్ణ కవి స్వగ్రామమైన గార్లపాడుకు కూత వేటులో ఉన్న గ్రామం. ఈ గ్రామం తెనాలి రామకృష్ణ కవి స్వగ్రామమైన గార్లపాడుకు కూతవేటులో ఉన్న గ్రామం. ఈ రెండూ తెనాలికి సమీప గ్రామాలే. ఇక భట్రాజుల సంగతికి వద్దాం.

భట్టు రాజులంటే:

బ్రాహ్మణ భట్టారకులు, భట్టులు ఒకప్పుడు పండిత కవులు, రాజులు వారికి పాదపూజలు చేసిన, వారు కూర్చున్న పల్లకీలను కూడా మోసిన ఉదాహరణలున్నాయి. రాజులు, వారి కుటుంబ సభ్యులు భట్టారకుల నుంచి ఆశీర్వచనాలు పొందేవారు. రాజ కుటుంబీకులు వారి వారి వంశాల పుట్టు పూర్వోత్తరాలను భట్టారకుల చేత కథాగానాలుగా చెప్పించుకుని వినేవారు. రాజులు వీరిచే తమ పూర్వుల ఘనతను ఆకాశాని కెత్తుతూ పుక్కిటి కథలను పురాణాలుగా రాయించేవారు.
భట్టారకులు వారి పాండిత్య ప్రతిభకు పొగడ్తలు (eulogy) జోడించి రాజ వంశావళుల (pedigrees) కాల్పనిక చరిత్రలను సృష్టించేవారు. ఒకనాటి మహా పండితుల వద్ద పాండిత్యం క్రమంగా ‘ఘృత కోశాతకి’ (నేతి బీర)లోని ఘృతం(నెయ్యి) చందంగా తయారయింది. వారు వంది మాగధుల స్థాయికి దిగజార సాగారు. వంది అంటే స్తుతి చేసి జీవించేవాడు. బట్టు వాడు, మాగధుడు,అంటే వంశ వీర్యాదులను పొగడడం ద్వారా జీవించేవాడు అని అర్ధాలు. వారు చేసే పొగడ్తలకు అంతులేకుండా పోయింది. ‘మాయాబజార్’ చలన చిత్రంలో ఔచిత్యం మరచి సుయోధన సార్వభౌమిని ఎదుటే వారి వియ్యాల వారి ఘనతను పొగడే శాస్త్రి, శర్మ అనే భట్టారకులను మందలిస్తూ శకుని ‘మీరు ఉద్దండపందితులే కాని, మీకు ఉండాల్సిన బుద్దిమాత్రం లేదయ్యా అంటాడు. క్రమంగా రాజులకు కావ్యాలు, ప్రబంధాలను శ్రవ్యంగా, సంగీతాత్మకంగా మలచి శ్రావ్యంగా గానం చేయడంలో రాజుల ప్రోత్సాహంతో క్రమంగా భట్టరాజులనే వారు ప్రావీణ్యం సంపాదించారు. క్రమంగా వీరు బ్రాహ్మణ భట్టారకుల స్థానాల్ని ఆక్రమించి రాజుల ప్రేమ, గౌరవాలకు పాత్రులు కాసాగారు. బ్రాహ్మణుడైన తెనాలి రామకృష్ణ కవి, భట్టుమూర్తి ఒకరినొకరు ద్వేషించుకుంటూ రాయలవారి ఆదరణ కోసం ఆ దశలోనే తీవ్రంగా పోటీ పడి ఉంటారు. ‘భట్ట రాజ’ శబ్దం యొక్క రూపాంతరమే ‘భట్టరాయ్’. నేపాల్ మాజీ ప్రధానమంత్రి కృష్ణప్రసాద్ భట్టరాయ్ ప్రసిద్ధులే. ఇంకా ఉత్తర భారత దేశంలో ‘భట్టరాయ్’ వంశీకులు అక్కడక్కడా కనిపిస్తారు. వీరు బ్రాహ్మణ భట్టారకులో, భట్రాజు కులస్థులో తెలీదు. భట్టరాజు కులం వారు వ్యుత్పత్తి ‘బ్రహ్మ వైవర్త పురాణం’ లో ఇలా ఇవ్వబడింది.

క్షత్రియా ద్విప్రకన్యాయాం భట్టో జాతో నువాచకః
వైశ్యాయాం శూద్ర వీర్యేణ వుమానేకో బభూవ హ
స భట్టో వావదూకశ్చ సర్వేషాం స్తుతి పాఠకః

క్షత్రియుడికి బ్రాహ్మణ కన్య ద్వారా జన్మించిన భట్టు జన్మ వృత్తాంతాలు చెబుతూ జీవిస్తాడు.
శూద్రునికి వైశ్య స్త్రీ యందు జన్మించిన భట్టు అనర్గళమైన వచస్సుతో అందరికీ స్తుతి వచనాలు చెబుతూ జీవిస్తాడు.

వామన్ శివరామ్ ఆప్తే గారి The Practical Sanskrit - English Dictionary లో Bhatta is a kind of mixed caste, whose occupation is that of bards or panegyrists అని ఇవ్వబడింది.

నేడు వెనుకబడిన తరగతుల్లో చేరిన భట్రాజు కులస్థులలోని ప్రథమ శాఖ, తెలగాణులు అనే రెండు శాఖలు బహుశా ఇలా ఏర్పడినవే అయి ఉండవచ్చు. ప్రథమ శాఖ వారి ఇండ్ల పేర్లు ప్రబంధాంకం, తంగెళ్ళ, ఇనపకుతిక, చల్లగాలి, మొగసాటి, వర్ణకవి, తాతపూడి, చిరంజీవి, బాలగోపాల, మారెళ్ళ వగైరాలు. విద్వత్తు కలిగి పండితులుగా పసిద్ధి పొందిన భట్టుమూర్తి వగైరాలు ప్రథమ శాఖీయులే. వీరిలో పలువురు నేటికీ ఉపాధ్యాయులుగానూ, భాగవతార్ లు గానూ స్వీయ పాండిత్య ప్రతిభతో జీవనోపాధి పొందుతున్నారు. నాకైతే నేటి వరకు తెలగాణులనే మరొక శాఖకు చెందిన భట్రాజులు తటస్థించలేదు గానీ, ‘తెనాలి రామకృష్ణ కవి - శాస్త్రీయ పరిశీలన’ గ్రంధం రాసే సందర్భంలో భట్టుమూర్తి, రామకృష్ణ కవుల చరిత్రపై పరిశోధన నిమిత్తం నేను పలువురు ప్రథమ శాఖీయులను కలవడం జరిగింది. వారిలో ప్రబంధాకం, వెంకటరాజు అనే 1983లో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు (గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ళ కాపురస్తులు) కూడా ఒకరు. వీరి ఇంటిపేరు కూడా ‘వసుచరిత్ర’ కావ్యకర్త భట్టుమూర్తి ఇంటిపేరైన ప్రబంధాంకం కావడం విశేషం. ఆయన ప్రంబంధాంకం వారు ఒకప్పుడు తెనాలి సమీపంలోని వలివేరు, మోదుకూరులలోనూ, ప్రస్తుతం కృష్ణాజిల్లా నూజివీడు సమీపంలోని నరసింగుపాలెం వగైరా గ్రామాల లోనూ ఉన్నట్లు తెలిపారు. వీరితో జరిగిన సంభాషణలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు తమ ‘ఆంధ్ర కవుల చరిత్ర’ లో ప్రస్తావించిన రామకృష్ణ కవి స్వగ్రామమైన గార్లపాడుకు సమీపంలోని బట్టుపల్లె అనే దేవరాయ భట్టపాలెమే భట్టుమూర్తి స్వగ్రామమనే నిర్ధారణకు రాగలిగాను.

ఇదీ క్లుప్తంగా భట్టారకుల అలనాటి వైభవం, నేటి స్థితిగతుల అధ్యయనం.
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech