సుజనరంజని / సారస్వతం / అన్నమయ్య కీర్తనలు

 

ఉదయాద్రి తెలుపాయె

ఉదయాద్రి తెలుపాయె ఉడురాజు కొలువిడె
అదనెఱిగి రాడాయెనమ్మ నా విభుడు

చన్నులపై ముత్యాల సరులెల్ల చల్లనాయె
కన్నులకు కప్పొదవె కాంతా నా కిపుదు
కన్నె కలువల జాతి కనుమోడ్చినది మీద
వెన్నెల వేసంగిమొగ్గ వికసించె గదవె

పువ్వుల లోపలి కురులు బుగులు కొన్గా నెఱసె
దువ్వుల తుమ్మెద గములు తరమి డాయగను
రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగరాదు
అవ్వల నెవ్వతె పసలకు అలరున్న వాడో

పన్నీట జలకమార్చి పచ్చకప్రము మెత్తి
చెన్నుగ కొప్పున విరుల చెలువందురిమి
ఎన్నగల తిరువేంకటేశుడిదె నను గూడె
కన్నులు మనసును తనియ కరుణించె

 

ఈ పదంలోని నాయిక వరహొత్కంఠిత! వినీలాకాశంలో చంద్రుని కొలువుతో తూరుపుకొండ తెల్లనయ్యిందట! విభునితో సంగమించవలసిన చక్కటి సమయం! ఈ అదను తెలుసుకుని నా విభుడు రావట్లేదు చెలీ! అని సఖితో చెప్పి వాపోతుంది ఈ పాటలోని నాయిక.

చల్లని వెన్నెల వేళలో విభుని కోసం ఎదురుచూస్తున్న నాయిక చన్నులపై ఉన్న ముత్యాలపేరు చల్లగా మారినదట! ఆకాశంలో వెన్నెల వేసంగి మొగ్గ అయిన చంద్రుడు ఉదయించాడు! కాబట్టి భూమి మీద ఉన్న ఆ కన్నె కలువల జాతి పారవశ్యంతో కనుమోడ్చినదట!

నాయిక కురులలోని విరులు వికసించగా తుమ్మెద గుంపులు వాటిపై మూగాయట. విరహంతో ఉన్న నాయికకు చిలుకల పలుకులు మరింత వేదనను కలిగిస్తున్నాయి. కాని ఆమె ప్రాణవిభుడు ఎవతెతో కలిసి వినోదిస్తున్నాడో! నాయిక పన్నీటి స్నానం చేసి, పచ్చ కప్పురాన్ని మెత్తుకుని అందమైన కొప్పులో పువ్వులను సొగసుగా అలంకరించుకుని ఉన్న సమయంలో నాయకుడు, అదీ ఎన్నగల (ప్రత్యేకత కలిగిన ఒకే ఒక్కడు) తిరువేంకటేశుడు వచ్చి కూడాడట! తన కరుణామృతంతో నాయిక కనులను, మనసును తన్మయింపచేశాడు! అప్పుడు నాయిక యోగత్వసిద్ధి ని సంతరించుకున్నది.

ఉదయాద్రి = తూరుపు కొండ;
ఉడురాజు = చంద్రుడు
సరులు = హారములు
బుగులు = బయటపడు , వ్యాపించు
గములు = గుంపులు
పసలకు = చాతుర్యమునకు;
మెత్తి = పూయు (వ్రాసుకొను , అద్దుకొను)
చెన్నుగ = అందముగ
నెరసి = దువ్వుల = నిమురు (వెంటపడు)


ఉన్నతోన్నతుడు

ఉన్నతోన్నతుడు ఉడయవరు
ఎన్నననంతుడే ఈ ఉడయవరు

సర్వలోకముల శాస్త్ర రహస్యములు
ఉర్వి పొడమె నీ ఉడయవరు
పూర్వపు వేదాంత పుణ్య శాస్త్రములు
నిర్వహించెనన్నిటా ఉడయవరు

వెక్కసపు శ్రీ విష్ణుభక్తియే
వొక్కరూపమే ఉడయవరు
చక్కనైన సుజ్ఞానమునకు ఇరవై
వుక్కు మీఱె నిదె ఉడయవరు

కదిసె మోక్ష సాకారము తానై
ఉదుటున నిలిచె నీ ఉడయవరు
ఇదిగో శ్రీ వేంకటేశ్వరు ఈడై
పొదలుచునున్నాడు భువిని ఉడయవరు

విశిష్టాద్వైత సిద్ధాంతకర్త భగవద్రామానుజుల వారు! తిరుమల ఆలయంలో్ వైఖాసన ఆగమం ప్రకారం ఆచారవ్యవహారాలు కట్టడి చేసి విధి విధానాలు రూపొందించిన యోగీశ్వరుడు! ఓం నమో నారాయణాయ అను అష్టాక్షరీ మంత్ర రాజాన్ని లోకానికి అందించిన ఉన్నతోన్నతుడు ఈ యతిరాజు!

ఈ పాటలో అన్నమాచార్యుల వారు రామానుజుల వారి విశేషగుణాలను కీర్తిస్తున్నారు! రామానుజ యతులు అనంతమైన వ్యాప్తి కలవాడని పల్లవిలో తెలియజేసిన అన్నమయ్య ఆ మహనీయుడు సర్వ శాస్త్రాల రహస్యాలను, వేదాంతము యొక్క సారాన్ని, మోక్షమార్గాన్ని, సుజ్ఞానాన్ని అందించి శ్రీ వేంకటేశ్వరుని సేవలో స్వామి సాన్నిధ్యంలో శాశ్వతుడై వెలుగొందుచున్నాడని చరణాల్లో తెలియజేస్తున్నాడు!!

ఉడయవు = ఇహ పరాలకు అధిపతి;
ఎన్న = ఎంచి చూడగా
ఉర్వి = భూమి;
పొడమె = వ్యాపించె;
సాకారము = రూపము;
ఉదుటున = వెనువెంటనే / సాహసమున;
పొదలు = పెరుగు / వర్ధిల్లు.

 
పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech