పాపం పసివాడు

    

జనాన్ని జగన్ ఓదార్చడమేమో గాని - జనమే ఇప్పుడు జగన్ బాబును ఓదార్చాలి. పాపం ఆ మొద్దబ్బాయికి పెద్ద కష్టమే వచ్చింది. ఇన్నాళ్లూ కష్టపడి నడిపిన కథ క్లయిమాక్సులో అడ్డం తిరిగింది.


‘తాతపోతే బొంత నాది’ అన్నట్టు ‘నాన్నపోతే గద్దె నాది’ అని జగనన్న పట్టుబట్టి కూచున్నాడు. అతడి దృష్టిలో అది చాలా న్యాయమైన చిరుకోరిక. తండ్రి ఉన్నన్నాళ్లూ కొన్ని రాచకార్యాలు పక్కనుండి రాజ్యాంగేతర శక్తిలా అతడే శ్రమ అనుకోకుండా, ఎవరూ అడక్కుండానే చక్కపెట్టాడు. కనుక తండ్రి గతించాక తండ్రి ఆస్తిలాగే తండ్రి అధికారమూ వారసత్వపు హక్కుగా వంశోద్ధారకుడైన తనకుగాక వేరొకరికి ఎలా సంక్రమిస్తుందని అతడి పాయింటు. దైవదత్తమైన అధికారాన్ని తనకు న్యాయంగా కట్టబెట్టలేదని సోనియమ్మమీద, కాంగ్రెసు హైకమాండు మీద అతడికి తగని మండిపాటు. తన హక్కుకు అడ్డొచ్చి తాను కూచోవలసిన కుర్చీలో కూచున్నాడని రోశయ్య మీద అతగాడికి మహా అక్కసు.

దాంతో పవర్లో ఉన్నన్నాళ్లూ పెద్దాయనకు కాళ్లకింద మంటపెట్టి, నానా విధాల వేధించి కంటికి కునుకు లేకుండా చేశాడు. గణాధిపతి పోస్టుకోసం కుమారస్వామి ముల్లోకాల్లోని పుణ్యనదులన్నిటికీ పరుగునవెళ్లి మునక వేసినట్టు - ముఖ్యమంత్రి పోస్టుకోసం పులివెందుల పొట్టెగాడు జిల్లాలన్నీ వరసబెట్టి తిరగసాగాడు. ‘నాన్నారు... పథకాలు... గుండె చప్పుడు... ఏడుపు’ అనే తనకు తెలిసిన ఒకే ఒక థీమును టీవీ సీరియల్‌లా అరగదీసి పల్లెపల్లెలో ‘ఓదార్పు యాత్ర’ను ఎడతెగకుండా సాగిస్తున్నాడు. ఇప్పటికి కష్టపడి ఏడు జిల్లాలు కళ్లు, కాళ్లు నొప్పెట్టేలా చుట్టబెట్టినా ఉలుకూ పలుకూలేదని టెన్ జన్‌పథ్ మీద అలిగి ఏకంగా మూలపుటమ్మమీదే చేతకాని విదేశీ వనితంటూ తుపాకీ ఎక్కుపెట్టాడు. తన పేపర్లో, చానెల్లో తిట్లదండకాల తాటాకు చప్పుళ్లకు పెద్దమ్మ దిమ్మతిరిగి దారికొస్తుందని అబ్బాయిగారు ఎదురుచూస్తుంటే మొదటికే మోసం వచ్చింది. పైవాళ్లు మెరపులా కదిలి, వృద్ధ వైశ్యుడిని అర్జంటుగా మార్చి కుర్ర రెడ్డిని గద్దెనెక్కించడంతో యువ తిరుగుబాటుదారు కాళ్లకింద నేల కదిలింది.
పురాణకథలో వినాయకుడిలాగే పట్టవలసిన వారిని పట్టి, పెట్టవలసిన దండం పెట్టి కిరణ్‌కుమార్‌రెడ్డి కష్టపడకుండా పవరు జాక్‌పాట్ కొట్టేస్తే... పట్టకూడని వారిని పట్టి, తిట్టకూడని వారిని తిట్టి జగన్‌మోహన్‌రెడ్డి కుప్పిగంతులు వేసి కుడితిలో పడ్డాడు. అబ్బాయ చదువుకున్నవాడే. తెలివితేటలు కొంచెం మోతాదు మించి ఉన్నవాడే. కాని ఒక్కటే చిక్కు. తనకు తెలియదు. తెలియదన్న సంగతీ తెలియదు. ఈ ‘సీతయ్య’ ఎవరు చెప్పినా వినడు.

వేరేవాళ్లని అడక్కపోతే మానె, కనీసం తన తండ్రి తరహాను కాస్త గమనించినా అసలు కిటుకు అర్థమయ్యేది. రాష్ట్ర కాంగ్రెసులో రాజశేఖరరెడ్డి అంతటి అసమ్మతి నాయకుడు ఆయనకు ముందులేడు. తరవాతా ఉండబోడు. ఎవరు ముఖ్యమంత్రి అయినా కుర్చీ ఎక్కిన నాటి నుంచి దిగిపోయేదాకా వై.ఎస్. నిద్రపోనిచ్చేవాడు కాదు. ఎంత వీర తిరుగుబాటుదారు అయినా అధిష్ఠానం ఆయనను ఏమీ చేసేది కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మీద ఎంత ఎగిరిపడినా ఢిల్లీలో అధిష్ఠానంవద్ద వై.ఎస్. ఒదిగి ఉండేవాడు. జీవితకాలపు నిరీక్షణ ఫలించి, తాను ముఖ్యమంత్రి అయ్యాకా.. పార్టీలో, ప్రజల్లో తిరుగులేని బలం ఉండి కూడా అంతా పైవాళ్లదయ అంటూ ముప్పూటలా నమస్కారబాణాలు వేసేవాడు. తన సొంత పథకాలకు కూడా ఇందిర పేరో, రాజీవ్ పేరో పెట్టి పాలక వంశానికి భక్తిప్రపత్తులు చాటుకునేవాడు. అదేమీ బానిస మనస్తత్వం కాదు. కాంగ్రెసులో హైకమాండే సుప్రీం; దానిని ఎదిరిస్తే ఎంతటివాడికీ పుట్టగతులుండవు అని రాజశేఖరరెడ్డికి తెలుసు. అందుకే అధిష్ఠానం దేనికైనా తన మీదే ఆధారపడక తప్పనంతగా రాష్ట్రంలో పట్టును బిగిస్తూనే తాను అధిష్ఠానపు అనుంగు భృత్యుడినన్నట్టు ఆయన బిల్డప్ ఇచ్చేవాడు.
ఈపాటి లౌక్యమే కనక జగనబ్బాయికి అబ్బి ఉంటే చరిత్రగతి మరోలా ఉండేది. తండ్రి పార్థివకాయం ఇంటికి చేరకుండానే పవరుకోసం పాకులాడి, తైనాతీలను తైతక్కలాడించి రోతపుట్టించే మోత మోగించకుండా... అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి, వారు తెచ్చిపెట్టిన అపద్ధర్మ ముఖ్యమంత్రికి సహకరించి, తనకు ఇవ్వజూపిన కేంద్ర కొలువేదో ఒప్పేసుకుని, తన టైముకోసం ఓపికగా ఎదురుచూసి ఉంటే పైవాళ్లకు మరీ ఇంత కంటు అయ్యేవాడు కాదు. అతడి తండ్రి జీవితంలో ఎన్నడూ కెవిపి గీచినగీటు దాటలేదు. అతడే తన ఆత్మ అని స్వయంగా వైఎస్సే ఎన్నోసార్లు చెప్పుకున్నాడు. తండ్రి నమ్మకం మీద తానూ కాస్త నమ్మకం ఉంచి, కుర్రచేష్టలు మాని, గుర్రాన్ని కట్టేసి, కె.వి.పి. సలహాను పాటించి ఉంటే ఆరునెలల కిందటే ఢిల్లీ దీవెనతో జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడేమో!

వై.ఎస్. శరీరమే పోయినా చాలా మంది ఊహించినట్టు ఆయన ‘ఆత్మ’ అడ్రసు లేకుండా పోలేదు. అసలైన అధిష్ఠానానికి అణగిమణగి ఉండటంవల్ల ముఖ్యమంత్రి మారినా కె.వి.పి. పెత్తనానికి ఢోకాలేకపోయింది. మొన్న మళ్లీ ముఖ్యమంత్రిని మార్చినప్పుడూ చక్రం తిప్పింది రామచంద్రరావే. ఆ బతకనేర్చిన తనాన్ని ‘మామ’ను చూసైనా నేర్చుకోకపోవడంవల్లే జూనియర్ వై.ఎస్. రాజకీయ వైకుంఠపాళిలో ఇప్పుడు పెద్దపాము నోట పడ్డాడు.
అందునా వచ్చినవాడు సామాన్యుడు కాడు - సాటి రెడ్డి. పైగా రాయలసీమవాడు. దానికి మించి - తన గుత్తసొత్తు అని జగన్ అనుకుంటున్న వై.ఎస్. వర్గానికి లోపలి మనిషి. జగన్‌కు ఉన్న ఒకే ఒక ట్రంప్‌కార్డు వై.ఎస్. అయితే ఆ వై.ఎస్.కు కొత్తాయనా ఇష్టుడే. బాగా దగ్గరివాడే. కాకపోతే కిందటి అసెంబ్లీ ఎన్నికల తరవాత అతడిని మంత్రి కానివ్వకుండా జగనే అడ్డుపడ్డాడు. పైగా అతడి బద్ధ విరోధిని తెచ్చి కేబినెటులో ఇరికించాడు. ఆ సంగతి దెబ్బతిన్నవాడు మరచిపోలేదు. కాలం మారి ఇప్పుడు తనకు సమయం వచ్చింది కనుక తనకు జగన్ చేసిన ‘మేలు’కు ‘బదులు’ తీర్చుకోకమానడు. బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు ఇప్పటికే పాత వై.ఎస్. వర్గీయులు జగమొండి జగన్ను ఒగ్గేసి పదవులకోసం పొలోమంటూ కొత్త దర్బారు వైపు పరుగుతీస్తున్నారు. అనుయాయులతో వై.ఎస్.కున్న మానవ సంబంధాలు ఆయన కుమారుడికి ఏ కోశానా లేవు. చివరికి అతడి పక్షాన ఎవరు మిగులుతారన్నది అనుమానమే. ‘కోడి పాయె లచ్చమ్మది’ అన్నట్టు ‘గ్రూపు పాయె జగ్గన్నది’ అని జాలిపడవలసిన పరిస్థితి! మిడిసిపాటుతో కొంపముంచుకున్న కుర్రవాడికి ఇక ఓదార్పే కావలసింది!
 

 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech