పురాతత్వ శాస్త్రజ్ఞుడు, చరిత్రకారుడు - డాక్టర్ వెలూరి వెంకట కృష్ణశాస్త్రి

    

ఇతిహాసం! - మనుషుల, సంఘ, ప్రాంత, దేశ చరిత్రను ప్రతిబింబిస్తుంది. అంతేకాదు మన పూర్వికుల సంస్కృతి, సాంప్రదాయాలు, జీవిక, జీవిత విదానం, స్థితి గతులను అద్దం పడుతుంది. ఆంధ్రదేశాన్ని విష్ణుకుండినులు దాదాపు వెయ్యేళ్ళు ఏలారని తన పరిశోధనలతో చెప్పారు బి ఎన్ శాస్త్రి గారు. వెలూరి వెంకట కృష్ణశాస్త్రి గారు శాతవాహన వంశజుల తరువాత ఏలిన విష్ణుకుండినుల రాజధాని కీశరిగుట్ట అని తాను నిర్వహించిన పురాతత్వ తవ్వకాలతో నిరూపించారు. వందల వేల నాటి నిక్షిప్తమైన చరిత్రను తన తవ్వకాల ద్వారా వెలికి తీసి వెలుగులోకి తెచ్చారు. శేకరించిన వందల వస్తువులను చిత్రవస్తు ప్రదర్శన శాలలకు చేర్చారు. ఆంధ్ర దేశ చరిత్ర ను రమారమి మూడు దశాబ్దాలు " తవ్వుకుంటూ " వెళ్ళి చరిత్ర పుటలకు అనేక సరికొత్త అధ్యాయాలు చేర్చారు. తెలుగు నాట ఇలాటి అసమాన వ్యక్తులు వ్యక్తిత్వాలు అరుదే!.

కృష్ణశాస్త్రి గారి కృషి ప్రతిఫలముగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్, వరంగల్, నల్గొండలో పానుగల్లు సోమేశ్వర దేవాలయం వద్ద, కర్నూల్ జిల్లాలో ప్రదర్శన శాలలు నెలకొల్ప బడ్డాయి. ఇవేకాక నాగార్జున కొండ, చందవరం, కనుపర్తి ప్రాంతాలలో చిత్ర వస్తు ప్రదర్శనశాలల స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఇతిహాసంలో వాశికెక్కిన శ్రీ పర్వతం - నేటి నాగార్జున కొండ వద్ధ ప్రాచీన బౌద్ధ నివేశాలని వెలికితీసి వెలుగులోకి తెచ్చారు.

కృష్ణశాస్త్రి గారి పేరు ఆంధ్ర పురావస్తు శాఖతో పెనవేసుకుపోయింది. దాదాపు ముప్పై ఏళ్ళకు పైగా ప్రగాఢ అనుభంధం వీరిది. వీరి " ప్రొటొ హిస్టారికల్ కల్చర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ", పుస్తకాన్ని బ్రిటన్ రాణి ఎలిజబెత్ ఆవిష్కరించారు. ఇలాటి గౌరవం దక్కడం అరుదే. వారి తదేక భావన, శ్రద్ధ, నిరంతర పరిశ్రమ, అవిరళ కృషి ఆంధ్ర పురాతత్వ శాఖకు దిశామార్గం అయ్యాయి.. కృష్ణ శాస్త్రి గారి రచన " భారతీయ సంస్కృతి పురాతత్వ పరిశోధనలు " పురాతత్వనోపనిషద్ " గా పెద్దల మన్ననలు అందుకుంది.

శాస్త్రి గారు తవ్వకాలలో వెలికి తీసిన తోట్లకొండ, బావికొండ, పావురాలకొండ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. పూర్వకాలంలో అమరావతి క్షేత్రంలో విశ్వవిద్యాలయం, ఆరామం ఉండేవి. చైనా, గాంధార (నేటి అఫ్గనిస్తాన్ లోని కంధహార్ ప్రాంతం), శ్రీలంక నుండి విద్యార్ధులు వచ్చి ఇక్కడ చదుకున్నారు. ఇలాటి వాస్తవాలను కూడా వెలుగులోకి తెచ్చారు కృష్ణశాస్త్రి గారు.

డాక్టర్ వెలూరి వెంకట కృష్ణ శాస్త్రి గారు ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని చిరివాడలో అక్టోబర్ 24, 1934 లో వెలూరి పార్థసారధి, అనసూయ దంపతులకి జన్మించారు. గుడివాడ కాలేజి చదువు పూర్తి అయిన తరువాత, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ పట్టా (ఎం.ఏ) చేపట్టి, తరువాత కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి పీ హెచ్ డి పట్టా సాధించారు.

పురాతత్వ శాస్త్రజ్ఞుడిగా:
1959 లో భారతీయ పురావస్తు శాఖలో స్కాలర్ ట్రైనీ గా నాగార్జునకొండలో పనిచేశారు. 1961 - 1968 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్త్ర పురావస్తు, సంగ్రహాలయంలో టెక్నికల్ అస్సిస్టంట్ గా పనిచేశారు. క్రమీపీ పదోన్నతులు అందుకుని పురావస్తు శాఖ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గా వ్యవహరించారు. 1981-92 కాలంలో ఈ శాఖ సంచాలకుడిగా పనిచేశారు. కొంత కాలం స్టేట్ ఆర్కైవ్స్, ఓరియెంటల్ మానుస్క్రిప్ట్స్ లైబ్రరీ సంచాలకుడిగా ఉన్నారు.

అధతో బ్రహ్మ జిగ్నాస - అన్న నానుడిని సత్యం చేశారు వెలూరి కృష్ణశాస్త్రి గారు.

కృష్ణ శాస్త్రి గారి రచనలు:
కృష్ణ శాస్త్రి గారు రచించిన పుస్తకం " ప్రొటొ హిస్టారికల్ కల్చర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ", బ్రిటన్ రాణి ఎలిజబెత్ 19-11-1983 న ఆవిష్కరించారు.
ప్రాచీన నాణెములు- మూసీ చరిత్ర పరిశోధన తెలుగు, బి ఎన్ శాస్త్రి స్మారక అంకం
- న్యు శాతవాహన స్కల్ ప్చర్స్ ఫ్రం ఆంధ్రా అమరావతి
- ఇండియన్ ఆర్కియాలజిస్ట్స్ - వెలూరి వెంకట కృష్ణశాస్త్రి, శారదా శ్రీనివాసన్, రమేశ్ ప్రసాద్ మహాపాత్ర, శికరిపుర రంగనాధ రావు, జి ఆర్ శర్మ
- కృష్ణ శాస్త్రి గారి రచన " భారతీయ సంస్కృతి పురాతత్వ పరిశోధనలు " " పురాతత్వనోపనిషద్ " గా పెద్దల మన్ననలు అందుకుంది.
- సలెక్ట్ మాన్యుమెంట్స్ ఆఫ్ హైదరాబాద్ - ఏ గైడ్ బుక్
- రోమన్ గోల్డ్ కాయిన్స్ రీసెంట్ డిస్కవరీస్
- విజయనగర మహాసామ్రాజ్యము
- త్రీ గ్రాంట్స్ ఆఫ్ పృథ్వి శ్రీమూల రాజా ఫ్రం కొండవీడు
- ఫామిన్స్ ఇన్ ఇండియా త్రూ ఏజెస్
- హిస్టరీ ఆఫ్ బుద్ధీజం ఇన్ ఆంధ్ర ప్రదేశ్
- స్టాటస్ ఆఫ్ వుమెన్ ఇన్ వేదిక్ టైంస్
- ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్
ఇవే కాక వందకు పైగా పరిశోధనా పత్రాలు ప్రకటించారు.

కృష్ణశాస్త్రి గారు కనిపెట్టిన స్థలాలు, కీలక తవ్వకాలో పాల్గొన్న కొన్ని ముఖ్య ప్రదేశాలు:

- గుంటూరు జిల్లాలోని కేశనిపల్లిలో బౌద్ధ స్తూప (మొనోగ్రాఫ్)
- విశాఖపట్నం వద్ధ ఉన్న తోట్లకొండ ప్రాంతంలో చేసిన తవ్వకాలనుండి - 12 బ్రహ్మ లిపిలో ఉన్న శాసనాలు, టెర్రకోట పలకలు, శాతవాహన, యవ్వన కాలం నాటి నాణెములు కనుగొన్నారు. సుధీర తీరంలో ఉన్న రోమన్ లతో సముద్ర వ్యాపారాలు ఉన్నట్టుగా ఆధారాలు లభించాయి. రెండవ దశాబ్ధ ప్రాంతంలో అనేక మంది బౌద్ధ మత ప్రచారానికి విదేశాలకు వెళ్ళిన ఆధారాలు కనుగొన్నారు.
- సోమశిల, ఎర్రదిన్నె, సిద్ధేశ్వరం, బుజంగేశ్వరం, క్యాటూర్ గ్రామాలలో ప్రచీన దేవాలయాల పునరుద్ధరణకు కారకులయ్యారు.
- ప్రకాశం జిల్లాలోని చందవరంలో, గుంటూరు జిల్లాలోని కేశానపల్లి, కరీమ్నగర్ జిల్లాలోని ధూళికట్ట, కోటిలింగాలలో అతిముఖ్య మైన బౌద్ధ స్థలాలను కనుగొన్నారు.
- దాదాపు పాతివందల ఏళ్ళ పురాంతన యెలేశ్వరం సైట్ ని కనుగొన్నారు.
- కేశనపల్లిలో రెండవ శతాబ్ధం నాటి బౌద్ధ స్తూపాలను తవ్వకాలలో వెలికి తీశారు. అలాగే పెద్ధనకూరులో శాతవాహన కాలం (రెండ శతాబ్ధం) నాటి కట్టడాలను, వస్తువులను కనుగొన్నారు. అలానే ధూళికట్టలో నిర్వహించిన తవ్వకాలలో శాతవాహన కాలం (రెండవ బి సీ) నాటి కోటలను, బౌద్ధ స్థూపాలను వెలికి తీశారు.
- మోటుపల్లి (విశాఖపట్నం దగ్గర) లో కాకతీయ, చోళ కాలం నాటి ఓడ రేవు పరిశోధనలలో బయటపడ్డాయి.
- కదంబపూర్, పాలకొండ లో ప్రాచీన స్థలాను పరిశోధన, తవ్వకాల ద్వారా బయటికి తీశారు.
- కేశరగుట్టలో విష్ణుకుండిన కాలం నాటి అనేక కట్టడాలు, నాణెములు, అలంకార వస్తువులు లభించాయి. ఈ ప్రాంతం విష్ణుకుండినుల రాజధానిగా దృవీకరించారు.
- కోటిలింగాలలో మౌర్య - శాతవాహన కాలం బౌద్ధ స్తూపాలను కనుగొన్నారు.
- పెద్దమరూర్, చినమరూర్, అగిరిపల్లి, బావికొండ, తోట్లకొండ, నెలకొండపల్లి లో ఆరవ శతాబ్ధం (6 బీ సీ) నాటి ప్రాచీన స్థలాలు కనుక్కున్నారు.
- హులికళ్ లో అత్యంత పురాతన (1200 బి సీ నాటి) విషయాలు తవ్వకాలలో బయటపడ్డాయి.

కృష్ణశాస్త్రి ఆవిష్కరణాలు:

స్టోన్ ఏజ్ కాలం నాటి స్థలాలను - గుంటూరు జిల్లా లోని నాగార్జునకొండ, మెహబూబ్ నగర్ లోని అమరాబాద్, చంద్రవాగు. ఇవే కాక రామగుండం, గోదావరిఖని లో అత్యంత ప్రాచీన స్థలాల్లో తవ్వకాలు చేశారు. ఇంకా కెరిమేరి, యల్లేశ్వరం (నల్గొండ జిల్లా) కూడా ఉన్నాయి.

- నడిమిపల్లి, పోచెర, చిట్టైల్ పల్లి, గౌరిగుండం (ఇక్కడ మైక్రోలితిక్ పనిముట్లని కనుగొన్నారు), కరీం నగర్ జిల్లాలోని - తొగారై, కదంబపూర్, బుడిగపల్లి, కోలకొండ, దేవరుప్పల, పాలకొండ్ ప్రాంతాలలో అత్యంత ప్రచీన స్థలాలని కనుగొన్నారు.

- మెసోలితిక్ కాలం నాటి, ధూళికట్ట, వలిగొండ (నల్గొండ జిల్లా), కలకొండ (వరంగల్ జిల్లా), చిన్న తొర్రురు, బొమ్మెర, రామునిపట్ల, తిమ్మన్నపల్లి, చిల్పూర్, సిరిశపల్లి, మందపల్లి, పాలమకుల, పుల్లూర్, వర్గస్ (మెదక్ జిల్లా), ఇదితనూర్, దుర్గం, బొల్లారం లోని " సైట్లు " ఉన్నాయి.

శ్రీశైలం ఆనకట్ట తో ముంపుకు గురైన ప్రాంతం నుండి తీసి పద్నాల్గు మందిరాలని సోమశిల గ్రామంలో పునర్నిర్మించారు. ఇవి కృష్ణశాస్త్రి గారి కృషి, శ్రధ్దాశక్తులకు నిదర్శనాలు.
బైరాలగుట్ట - నెలకొండ వద్ద ఉన్న ఈ సైట్ గొప్ప సాంస్కృతిక సంపదకు నిదర్శనం. కొన్ని వెలికి తీసినా, అన్నీ తీయడానికి సమయం, దబ్బూ లేవని పురాతత్వ మ్యుజియం సంవత్సరిక రిపోర్ట్ పేర్కొంది.

నెలకొండలో 30 మీటర్ల X 20 మీటర్ల మహాస్థూపం లభించింది. టెర్రకోట నంది, " కొండలైట్ " రాళ్ళలో చెక్కిన్న విగ్రహాలు లభించాయి.

దిబ్బపాలెం లో కాలభైరవ మందిరం (జయన్న గుడి) బయటపడింది. వీరశైవులు ఈ ప్రాంతంలో నివసించారు అని నిర్ధారించారు. అంతే కాదు ఈ భక్త గణంలో - వీరభద్రులు, వీరముస్టిలు ఇలా విభిన్న (తెగలు) ఉన్నాయని సూచించారు. స్త్రీ, పురుష భక్తులు - ఇద్దరికీ సమాన హక్కులు కలిగి ఉండేవట. శిలాశాసనాలలో ఇలాటి విషయాలు బయట పడటం అరుదే. ఇదివరికు కేవలం - మల్లికార్జున పండితరాధ్య " శివతత్వసారం ", శోమనాధుని " బశవపురాణం " సాహిత్య గ్రంధాలలో వీరశైవుల గురించి వివరణలు ఉన్నాయి.

అప్పికొండ సోమేశ్వర ఆలయం వద్ధ లభించిన శిలాశాసనం ద్వారా - పశ్చిమ చాళుక్య రాజు - సోమేశ్వర (మూడు) - 1131 ఏ డి లో కళింగ రాజ్యాన్ని జయించి ఆ ప్రాంతాన్ని ఏలాడని ఆధారాలు లభించాయి. సోమేశ్వర మహారాజు మాచయ్యని సేనాధిపతిగా నియమించాడని తెలిసింది. ఇలా ఎన్ని విషయాలైనా చెప్పుకుపోవచ్చు. తవ్వకాలలో వెయ్యేళ్ళ చరిత్ర బయటపడింది. తెలిసిన చరిత్రకు, ఇలా వెలికితీసిన చరిత్ర విషయాలను అనుసంధానం చేసి - సమగ్ర చరిత్రను రాయవచ్చు.

రాజమండ్రి లో చిత్రాంగి రాజమందిరం పిట్ట గోడలు కట్టడానికి తవ్వుతూండగా గుడి మండప స్తంభాలు బయటపడ్డాయట. పురాతత్వ తవ్వకాల ద్వారా ఇది వీరభద్రారెడ్డి (త్రైలోక్య) కట్టించాడని తెలిసింది.

ఖమ్మం జిల్లా గార్ల మండల రామాపురంలో శ్రీమతి వెంగలి లక్ష్మి స్థలంలో - 88 ప్రాచీన బంగారు నాణెములు దొరికాయట. అవి విజయనగర సామ్రజ్య కాలం నాటివి. వీటిలో నాలుగు రకాల నాణెలు ఉన్నాయి - అవి - గండబేరుండ (26), బాలకృష్ణ (32), లక్ష్మినారాయణ (18), వెంకటేశ్వర స్వామి ముద్రలు కలిగి ఉన్నాయట.

మరో నిక్షిప్త విషయం చెప్పక తప్పదు - శ్రీ కృష్ణదేవరాయ శాసన కాలం నాటి బాలకృష్ణ నాణాలు రెండు రకాల (వరిఎతిఎస్) - ముద్రలలో ఉన్నాయట - ఒకటి మోకాళ్ళ మీద కూర్చున్న కృష్ణుడు - మరొకటి, పాకే కృష్ణుడి చేతిలో వెన్న ఉందట. నగరి లిపిలో " శ్రీ ప్ర - త ప కృష్ణరాయ " అని ఉందట.

ఇలా తెలుసుకుంటూ వెడితే - అడడుగునా కొత్త విషయాలే, సరికొత్త చరిత్ర బయట పడుతూ ఉంది. మరెన్నో కొత్త విషయాలు బయటి వస్తున్నాయి. మనకు తెలిసిన చరిత్రకు వీటిని జత పరిస్తే, ఇంకా గొప్ప చరిత్ర వ్రాయవచ్చు. కృష్ణశాస్త్రి గారు పనిచేస్తూనే ఉన్నారు - చరిత్ర జోడిస్తూనే ఉన్నారు.

కృష్ణ శాస్త్రి గారు, ప్రముఖ పాత్రికేయుడు జి కృష్ణ మంచి మిత్రులు. పురావస్తు శాఖ సంచాలకుడు ఎన్ రమేశన్ గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కృష్ణశాస్త్రి గారిని కలుస్తూ ఉండేవారు. కృష్ణశాస్త్రి " పని చేయలేకండా ఉండలేడు" అని చెప్పారు కృష్ణ జి.

డాక్టర్ పి చెన్నా రెడ్డి గారు - వెంకట కృష్ణ శాస్త్రి గారి మీద ఓ పుస్తకం వెలువడించారు. అది - "కృష్ణాభినందన - ఆర్క్యలాజికల్, హిస్టారికల్ అండ్ కల్చరల్ స్టడీస్ ". ఇది చాలా ప్రశంశనీయ విషయం. ఎందుకంటే ఎదుటి వారిలో ఉన్న విద్వత్తుకి, చేసిన కృషికి, సాధించిన విజయాలను గుర్తించి ప్రచురించారు. ఇలా వారి తెలుగు " ధనం " పరిచయం చేశారు!. ధన్యోశ్మి కృష్ణా ధన్యోశ్మి!!.


 
   
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్

ప్రదేశం 

సందేశం

 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech