"సమస్యాపూరణం:
ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు ఈ-మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారాకాని (rao@infoyogi.com) ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు డిసెంబర్ 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. ఈ రెండికీగానీ, లేక ఏ వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు


ఈ మాసం సమస్యలు:
కం.|| ఆకలి ఆనందమయమె
ఆ.వె.|| సురను త్రాగ బట్టి సురులు వారు

క్రితమాసం సమస్యలు

ఆ.వె.|| రాయభారమన్న రాయి బరువు
కం.|| కందకు పద్యముకు దురద

ఈ సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.
మొదటి పూరణ - - గండికోట విశ్వనాధం, హైదరాబాద్ ,
ఆ.వె.|| వైరి వర్గములను మురిపించి మరిపించు
రీతి పొగడి తెగడి, నీతి గరపి,
ఎదరి బలము తెలిపి, బెదరజేయ నెరపు
రాయభారమన్న రాయి బరువు.


కం.|| కందకు పద్యముకు దురద
అందురు కొందరు, నిజమది , ఆ దురద రస
స్పందన మొందిన జిలకున్
పొందు నపార సరస సుఖ పులకింత తతుల్


రెండవ పూరణ - సుమలత మాజేటి, బెంగళూరు
ఆ.వె.|| బడుగు పిల్ల వాని బడికి పంపగనేమొ
రాయ, భారమన్న, రాయి బరువు
మోయ పనికి కుదిరె, మోడుబాయె బతుకు!
రాత ఇటుల నున్న "రాయె" [దేవుడు] దిక్కు

కం.|| అందము గను కందలొ మక
రందములు కలవు తెలుగున రసికత నొప్పన్
కంద కు పద్యము కుదురద ?
ఈదంట సమస్య తెచ్చె ఈపరి రుచులన్!

మూడవ పూరణ - యం.వి.సి.రావు, బెంగుళూరు
కం.|| చందసు తెలియని కుకవిని
కందమ్మునువ్రాయు మనిన కలవర పడుచున్
కంద కు పద్యము కుదురద
ని, దంబమున పల్కె నకట, నిట్టూర్పులతో!

ఆ.వె.|| రాయ, భారమన్న, రాయి బరువు నెత్తి
అయ్యవారు బాలు నపహసింప
విద్య నేర్పు వాడె వింత పశువు గాగ
శ్వాస విడిచె నకట ఛాత్రుడంత


నాల్గవ పూరణ - నేదునూరి రాజేశ్వరి U.S.A.
కం.|| కందకు పద్యము కుదరదు
మందముగా దుంప కూర బహు రుచి యన్నన్ !
విందుకు కావలె కందము.
బంధువు బచ్చలిని కలిపి జోడించి తినన్ !

ఐదవ పూరణ- వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం
ఆ.వె.|| ఒంటి చేతి మీద వుంచి రాతిని ఎత్తి
రాయభారమన్న! రాయి బరువు
గాన క్రింద వుంచి కవితను రాసెద
బాల కృష్ణ కవిత చాల తీపి


కం.|| కందకు వుండవలె దురద
కందకు లేనట్టి దురద కత్తికి ఏలా?
నందన వనిని వలదుమా
కందకు పద్యముకు దురద కలలో నైనన్


ఆరవ పూరణ- జగన్నాథ రావ్ కె. ఎల్., బెంగళూరు
ఆ.వె.|| రాయబారమన్న మోయలేని బరువు
రాయ భారమన్న రాయి బరువు
తులసి దళము చాలు తులను భారము మొగ్గె
ధర్మ సూక్ష్మమదియె ధర్మ రాజ!

కం|| కందకు లేదు దురదయని
పందెములను వేసుకొనిరి పద్య రచనలో
అందకు బచ్చలి ఆకూ!
కందకు పద్యము కుదుర దగా పడనేలా?


కం|| కందము అందము చిందుట
కెందుకు కందకము కందిరీగలు కుట్టన్
కందును, కందా! బచ్చలి
కందకు పద్యము కుదుర దయాంబుధి సోమా!

(బచ్చలికందకు = బచ్చలికి + అందకు)


ఏడవ పూరణ - - వాణీజయరాం గూడపాటి, హనుమాన్జంక్షన్
కం.|| కందకు దురద నైజము
పద్యమునకు దురద యేమి? కడు చిత్రముగా
కంద పద్యము రాయవలెనని కవి(పి) కండూతేమో!
కందకు పద్యముకు దురదై పూరణగ నిలిచే!

ఆ.వె.|| రాయబారమన్న రాయంచ నడకయా ?
రాయుల మెప్పింప నంత సులువా ?
రాయబారమన్న తృణప్రాయము కాదు
రాయబారమన్న రాయి బరువు

వివరణ:
రాయుల=రాజుల
రాయిబరువు=పెద్ద బాధ్యత , గురుతరమైన

ఎనిమిదవ పూరణ- టి.వెంకటప్పయ్య
ఆ.వె.|| మదిన దోచు నాకు మధుర భావనలెన్నొ,
కధలు రాసి నట్టు కలలు వచ్చు,
రాయ నాకు మళ్ళి రాదేమి కర్మమొ!
రాయ భారమన్న రాయి బరువు.

రాయభారమన్న = రాయుటకు కష్టము.
రాయి బరువు = రాయంత బరువు
తొమ్మిదవ పూరణ- శ్రీమతి రాజా తల్లాప్రగడ సిడ్ని, ఆస్ట్రేలియా

కవిత.|| రాయభారమన్న తలపునకొచ్చు
శ్రీ కృష్ణ, నారదుల రాయభారాలు
అందుకే  ...
రాయభారికి ఉండాలి
కావలిసినంత సహనం సమయస్ఫూర్తి
అంతేకాదు
ఇరుపక్షాల వాదోప వాదాలు
అంతులేని ఆరోపణలు,
అపోహలు - అసహనాలు
అర్ధం చేసుకోగల సహౄదయం

ఓర్పూ నేర్పూ వుంటేనే
విషయావలోకనం
వివాద వారణం జరిగేది
అంతేకాని
కట్టని ఇంటికి పెట్టని గోడలు
కాకూడదు రాయభారం
అట్లైన
తప్పవు తంటాలు శిలో భారాలు
ఆపై
రాయభారికి అయ్యేను
రాయభారం
మోయలేని రాయిభారం

పదవ పూరణ- రావు తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియా
కం.|| కందమె పద్యము దుంపయు!
మందగు కావ్యరస పాకమందున! తానే!
కందకు పద్యము కుదురదు
నెందులకన సమ ధృవముల కెపుడును అంతే !

ఆ.వె.|| లేనిపోనిగొడవ పోనియమనుచుండి,
నోరుమూసు కొనుచు నొల్ల కుండు!
పీతిమీద రాయి పిచ్చివానిదె కాద!
రాయభారమన్న రాయి బరువు!

పాఠకుల నుంచీ మరికొన్ని మంచి పద్యాలు
ఆలు మగలు
(ఆటవెలదిలో ఒకరోజు)
రచన: కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి


(ఉదయం 7 గంటలు)
ఆమె: లేవరేమి? చాల లేటయ్యె యీనాడు
అతడు: అబ్బ! ఎందుకట్లు అరతువీవు?
ఆమె: బాగుబాగు అరుప? బారెడు పొద్దెక్కె
అతడు: బద్ధకంబు తీరవలదె నాకు?
ఆమె: పదికి ముందె మీరు పక్కెక్కినారుగా
అతడు: అబ్బ! లేచుచుంటి అరవకింక
ఆమె: పళ్ళుతోముకొనుగ బాత్రూముకెళ్ళుడు
అతడు: బెడ్డుకాఫి తెమ్ము వేగముగను
ఆమె: పాచిముఖముతోన? పాచికపారదు
అతడు: చాలు చాలు నీతొ చావు వచ్చె
ఆమె: మంచి చెప్ప చావు మాటేల యిప్పుడు
అతడు: నాదె తప్పు యింక నన్ను వదలు


(ఉదయం 7-15)
ఆమె: వచ్చినార! ఇదిగొ బ్రహ్మాండమౌ కాఫి
అతడు: అబ్బ నోరు కాలె! ఆర్చి యిమ్ము
ఆమె: ఆర్చుకొనుడు, మీకు అదికూడ రాదేమి!
అతడు: రాక కాదు ఏదొ లవ్వు అనుకొ

(ఉదయం 8-00)
ఆమె: వంటలోకి నేడు వండునదేమిటో?
అతడు: వేళకింత వండు! తాళలేను
ఆమె: లేటుచేసినాన! ఏటికట్లందురు?
అతడు: సరెలె! ఏదొ వండు సర్దుకొందు
ఆమె: కూరలింటలేవు! కొనితెండు వేగాన
అతడు: ఊరగాయ చాలు కూర బదులు
ఆమె: సాకులేల! ఇదిగొ సంచి మనీపర్సు
అతడు: సర్లె పోయివత్తు చంపబోకు

(ఊదయం 9-00)
ఆమె: సంచిలోన సరకు సగమైన లేదేమి?
అతడు: ధరలుమండుచుండె, సరుకులివియె


ఉదయం 9-50)
ఆమె: వంట అయినదింక వడ్డించెదనురండి
అతడు: కూర రుచిగ ఏల కుదరలేదు?
ఆమె: బెండ ముదురు కనుక వండినా యిట్లాయె
అతడు: ఏమి  అన్న తప్పులెంతువుగద
ఆమె: తిండి  సరిగ మీరు తినలేదు పాపము 
అతడు: వేళమించుచుండె వెళ్ళుచుంటి
ఆమె: మధ్యవేళ టిఫిను మరువక చేయండి
అతడు: మాడవలదు నీవు కూడ తినుము
ఆమె: ఇంటికొచ్చునపుడు యీసరుకులు తెండు 
అతడు: ఈవినింగు కొనెద,  నీవురమ్ము
ఆమె: సరుకు కొందమన్న సరదాగవత్తును
అతడు: వంటచేయవలదు, యింటరాత్రి

సాయంత్రం 6-30)
ఆమె: ఫైవు స్టారు హొటల! వద్దండి దండుగ
అతడు: ఖర్చుగూర్చి నీవు కవల పడకు
ఆమె: ఆర్డరిచ్చినారు, అన్ని తినగలమా?
అతడు: ముందు రుచినిచూడు తొందరేల
ఆమె: అబ్బొ కడుపునిండె ఆయాసమొచ్చెను
అతడు: ఐసు క్రీము తినుము హాయిగాను

(సాయంత్రం 8-00)
ఆమె: చల్లగాలి ఎంత చక్కగావీచెనో
అతడు: బీచిరోడ్డుగనుక వీచెగాలి
ఆమె: ఎంత ప్రేమ మీకు ఇవ్విధి నాపైన
అతడు: కలను కూడ నిన్నె కలవరింతు
 
(రాత్రి 10 -00)
ఆమె: నిదురపోయినార?నేను వచ్చితి లెండు
అతడు: ఆగలేను నిద్ర నాపలేను
ఆమె: మంచిచెడ్డలసలు మాట్లాడరా యేమి?
అతడు: (గుర్రు గుర్రు గుర్రు గుర్రు గుర్రు !!!) 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech