నాన్నా నువ్వు ఎప్పటికీ నా గుండెలోనే వుంటావు

                                                                                   -    దుర్గ

   

నాన్న అంటే అమ్మకు బ్రహ్మకు మధ్యన నిచ్చెన.  పిల్లల జీవితాల్లో తల్లి పాత్ర ఎంత ముఖ్యమైందో తండ్రి పాత్ర కూడా అంతే ముఖ్యమైంది.''

 

 నాన్న పుట్టింది, పెరిగింది రాయచూర్లో.  నాన్న పేరు శ్రీనివాసా చారి, ఆయన తండ్రి గారి పేరు గోవిందా చార్యులు, వెంకటమ్మ తల్లి పేరు.  మా తాతగారు సంస్కృత పండితులు, ఆయుర్వేద వైద్యులు.   ఆయనకు గద్వాల్ రాజావారు ఆయన వైద్యానికి, ఆయన రచనలను మెచ్చి  ఎన్నో సన్మానాలు చేసారు  ఏనుగు పై వూరంతా వూరేగించారట.  ఆయన 'శ్రీవత్స రామాయణాన్ని,' రచించారు. 

నాన్నకు ఫుట్బాల్, హాకీ ఆడడం అంటే చాలా ఇష్టం అని, వీటితో పాటు యోగాసనాలు అంటే అందులో చాలా క్లిష్టమైన ఆసనాలు కూడా అతి సులువుగా చేసేవారట.  మాకు ఒకోసారి చేసి చూపించేవారు, మేము ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచేవారం.  కుస్తీ కూడా అంటే ఆయనకు చాలా ఇష్టంగా వుండేదట.  పొద్దునే లేచి యోగాసనాలు చేయడం, కుస్తి పోటిల్లో కూడా పాల్గోనేవారట అప్పుడప్పుడు. 

నాన్నతో పాటు ముగ్గురు అన్నదమ్ములు, ఆరుగురు అక్కా చెల్లెళ్ళూ మొత్తం సంతానం. నాన్న చాలా భాద్యతాయుతమైన కొడుకు పాత్రని నిర్వహించారు. తాతగారికి అన్ని పనుల్లొ చేదోడు వాదోడుగా వుండేవారు.  అప్పట్లో మెట్రిక్యులేషన్ పాసయ్యారు, కొన్నాళ్ళు టీచర్ గా, తాతగారి వైద్యంలో సహయం చేయడంలాంటి పనులెన్నో చేసారు.

 

మా నాన్న అప్పట్లో వాళ్ళింట్లో గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పవచ్చు.  ఆరుగురి అక్కచెళ్ళల్లో ఒక చెల్లెలు పెళ్ళయ్యిన కొన్ని రోజులకే భర్తని పోగొట్టుకొని ఇంటికి చేరింది.  అది చూసి మా తాతగారు, నానమ్మ బాధకు అంతులేకుండా పోయింది.  15, 16 ఏళ్ళు కూడా లేని చెల్లెల్ని చూసి మా నాన్న గుండె  తరుక్కుపోయింది.  నాన్న ఎవరేమన్నా పట్టించుకోకూడదని నిర్ణయించుకొని ఆమెకి పునర్వివాహం జరిపించారు.  తాతగారు షాక్ అయ్యారు, నాన్న అంటే విపరీతమైన ప్రేమాభిమానలుండేవి.  ఆచారవ్యవహారాలను, కట్టుబాట్లని దిక్కరించారని చాలా కోపం వచ్చి తల్లి తండ్రి ఇద్దరు మా నాన్నని చాలా రోజులు బహిష్కరించారన్నమాట.  అలా ఆ రోజుల్లో పునర్వివాహం అంటేనే వెలి వేసేవారు కాని మా నాన్న ధైర్యం చేసి ఎటువంటి కష్ట నష్టలొచ్చినా ఎదుర్కోవడానికి సిద్దం అయ్యి చెల్లెలికి పునర్వివాహం జరిపించేసారు. షష్టిపూర్తి సందర్భంగా దాసరథి మామయ్య చెల్లెలికి, బావగారికి బట్టలు పెడుతున్న చిత్రం.

 

కొన్ని సంవత్సరాల తరవాత నాన్నకి 5వ చెల్లి భర్త ఇంట్లో హింస పెడుతున్నారని తిరిగి వచ్చేసింది.  తాతగారు, నానమ్మ మళ్ళీ కాపురానికి పంపించడానికి నానా అవస్థలు పడ్డారు కాని ఆమే వెళ్ళనంటే వెళ్ళనని చెప్పింది.  కొన్నాళ్ళయ్యాక స్నేహితురాళ్ళతో లైబ్రరికి వెళ్ళి వస్తు వుండగా ఒకతనితో పరిచయం జరిగింది అది ప్రేమగా మారింది, వారిద్దరు పెళ్ళి చేసుకుందామనుకున్నారు కాని తల్లి తండ్రి ససేమిరా వీల్లేదన్నారు.  అప్పుడు మా నాన్న రంగంలోకి దూకి అతని గురించి అన్ని వివరాలు సంపాదించి తను వాళ్ళకి అండగా నిలబడి పెళ్ళి చేయడమే కాదుఆయన కట్టు బట్టలతో వచ్చేస్తే నాన్న తన దగ్గర వుంచుకుని ఆయన చదువు పూర్తి అయ్యి, మంచి వుద్యోగం వచ్చేవరకు వారి భాద్యత తీసుకున్నారు.  మనవలు, మనవరాళ్ళు పుట్టగానే అన్ని మర్చిపోయి కలిసి పోయారు మా నానమ్మ, తాతగారు.  ఆ రోజుల్లో ఇలాంటి పనులు చేయాలంటే చాలా ధైర్యం వుండాలి.  మా నాన్న హీరో లాగా వుండడమే కాదు నిజంగా హీరోలు చేసే పనులు చేస్తూ నిజజీవితమంలో హీరో అయ్యారు!  

 

మా నాన్న బ్యాంక్లో  క్లర్క్ గా చేరి బ్యాంక్ పరిక్షలు రాస్తూ, కష్టపడి పని చేస్తూ ప్రమోషన్లు వచ్చి అకౌంటంట్ గా అయ్యారు. హైద్రాబాద్ కి వచ్చి లోన్ తీసుకొని అప్పట్లో హౌసింగ్ బోర్డ్ ఇళ్ళు కడుతుంటే హైద్రబాద్ లో, చందులాల్ బారాదరి లో ఇల్లు కొన్నారు.  మా నాన్నకి పెళ్ళయ్యే సమయానికి 30 ఏళ్ళున్నయేమో.   నాన్న దాశరథిగారి పెద్ద చెల్లెలు అంటే మా అమ్మ శకుంతలని పెళ్ళి చేసుకున్నారు, మా నాన్న చెల్లెలు లక్ష్మి ని దాశరథి మామయ్య చేసుకున్నారు.  మా నాన్న యుక్తవయసులో చాలా హ్యాండ్సం గా వుండేవారు, నేనయితే గ్రెగరీ పెక్ అంటాను. అలా నాన్న దాశరథి మామయ్య బావామరుదులయ్యారు.  మా అన్నయ్య పుట్టిన పన్నెండేళ్ళ తరవాత మా అక్కయ్య పుట్టింది, అప్పుడే ఇల్లు కొన్నారు, ఇంటి గృహప్రవేశం, బారసాల కలిపి చేసారు.  ఆ ఇల్లు మా నాన్న ఏ క్షణంలో కొన్నారో కాని ఆ ఇల్లు ఎంతో మందికి ఆశ్రయం ఇచ్చింది.  మా నాన్న తన మేనళ్ళుళ్ళను తన దగ్గర వుంచుకుని చదివించి, వారికి వుధ్యోగాలు వచ్చాక, పెళ్ళిళ్ళు చేసారు.  వారినందరిని సొంత కొడుకుల్లాగే చూసుకున్నారు. 

నాన్నకి పిల్లలంటే పిచ్చి ప్రేమ.  నాకు లీలగా గుర్తుంది, అమ్మ తమ్ముడిని పసిపిల్లాడిని తన దగ్గర పడుకోబెట్టుకుంటే తను నన్ను, మా అక్కయ్యను ఇంకో రూంలో చూసుకునేవారు రాత్రిపూట.  మాకు ఆకలేసి లేస్తే అక్కడ స్టవ్వు, గిన్నె నీళ్ళు పెట్టుకుని వేడి నీళ్ళు కాచి పాలు కలిపి సీసాలో పోసి పట్టేవారు ఫ్రెష్ గా.  ముగ్గురం 3 ఏళ్ళల్లో పుట్టాము.  మేము కొంచం పెద్దయిన తరవాత మాకు ఫ్రేష్ పాలు కావాలని గేదెలను కొని పెరట్లో వుంచి వాటి ఆలనా పాలనా చూసుకునేవారు.  మా అక్కయ్యకి చిన్నప్పుడు కొంచం ఉబ్బసంలాగా వచ్చేదిట, మేక పాలు తాగితే మంచిదని ఒక మేకను కొనుకొచ్చి దాని పాలు పితికి తనకి తాగించేవారు. 

 '97 లో మొట్టమొదటిసారి ఇండియాకి వెళ్ళినప్పుడు నాన్నతో నేను.

 

 నాన్నకి తోట పని అంటే చాలా ఇష్టమైన పని.  ఆ ఇంట్లో కి వెళ్ళిన కొత్తలో స్వయంగా పెద్ద పెద్ద గుంతలు తవ్వి కొబ్బరి చెట్లు, జామచెట్లు, దానిమ్మ చెట్లు, నిమ్మ చెట్లు, అంజూర్ పళ్ళ చెట్లు, డాబాపైనా పందిరి కట్టి  ఇంటి నాలుగు వైపుల నుండి ద్రాక్ష తీగలు పైకి వేసి పందిరిపైకి పాకించారు.  ఇంట్లో ఏ పళ్ళు కాసినా, పూలు పూసినా హైదరాబాద్ లో వున్న అత్తయ్యల, పెదనాన్న ఇంటికి, మా చిన్నాన్న ఇంటికి, ఆయన కజిన్స్ ఇళ్ళకి బ్యాంక్ తరవాత వెళ్ళి ఇచ్చివచ్చేవారు.  తన పిల్లలెలాగ అన్ని ఫ్రేష్ గా తినాలి, తాగాలి అనుకునేవాడో  అలాగే మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు అందరూ అలాగే తినాలని అనుకునేవాడు మా నాన్న.  మామిడి పండు చాలా తియ్యగా వుంటుందని చెభితే ఎక్కడినుండో తెప్పిచ్చి నాటారు, అలాంటి మామిడి పండు మేము మళ్ళీ ఎక్కడా తినలేదు.  నాన్న ఎవరికన్నా సాయం చేస్తె మళ్ళీ వాళ్ళు మనకి తిరిగి సాయం చేస్తారా లేదా అని ఎప్పుడూ ఆలోచించలేదు నిస్వార్ధ జీవీ మా నాన్న మా నాన్న మాకు నేర్పించకుండానే నేర్పించినది కొంచం ఖాళీ ప్రదేశం వున్నా కూరల మొక్కలు పెట్టుకోవడం, పూల చెట్లు పెట్టుకోవడం నేర్పించాడు, నాకు మొక్కలు పెట్టడం వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అంటే చాలా ఇష్టం.  ఎవరైనా సాయం కావలని వస్తే వీలయితే తప్పకుండా చెయ్యాలని కూడా ఆయన కూర్చోపెట్టుకుని చెప్పకుండా నేర్పించిన జీవిత విలువలు

 

నాన్నకి 1970 లో తెనాలికి ట్రాన్స్ఫర్ అయ్యింది.  5 ఏళ్ళు అక్కడ వున్నాము.  అక్కడ కేవలం మా కుటుంబమే వుండేది కాబట్టి నాన్న మాతో ఎక్కువ సమయం గడిపేవారు కథలు  చెప్పడం, మాతో పరుగులు పెట్టి ఆడేవాడు, అమ్మ, నాన్న చాలా సంతోషంగా వుండేవాళ్ళు అక్కడ వున్నప్పుడు. అంటే హైదరాబాద్ లో వున్నప్పుడు భాద్యతలు ఎక్కువగా  వుండేవి. తెనాలిలో రిలాక్స్ గా అనిపించేవారు.  విజయవాడ దగ్గర వుండేది కాబట్టి ఒకోసారి ఆదివారం తెల్లవారుఝామున  లేచి స్నానాలు అవి చేసుకుని వెళ్ళి అక్కడ దుర్గా దేవి గుడికి వెళ్ళి, క్రిష్ణా నది చూసి వచ్చేవారం. 

తెనాలిలో వుండాలని అక్కడ సెటిల్ కావాలని కూడా అనుకునేవారు కాని అమ్మకి గర్భకోశం తీసేసే ఆపరేషన్ హైదరాబాద్ లో చేసారు.  కాని ఆపరేషన్ తరవాత చాలా కాంప్లికేషన్లు వచ్చి తెనాలికి రావడం వీలుకాలేదు ట్రీట్మెంట్ కొసం హైద్రాబాద్ లో ఎన్నాళ్ళు వుండాల్సి వస్తుందో తెలియదు అందుకని నాన్న హైదరబాద్ కి  ట్రాన్స్ఫర్  చేయించుకున్నారు.  హైదరబాద్కి  వచ్చేసాము!

 

హైదరబాద్ కి వచ్చాక నాన్న మళ్ళీ బందువులతో, వారికేమైన సమస్యలొస్తే వాటిని పరిష్కరించడంలో తలమునకలయ్యేలా మునిగిపోయారు.  అలాగని మమ్మల్ని పట్టించుకోలేదని కాదు, మమ్మల్ని వూర్లోకి సర్కస్ వచ్చినప్పుడల్లా తీసుకెళ్ళడం , ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ కి తీసుకెళ్ళేవారు, మాకిష్టమైన సినిమాలన్నిటికి తీసుకెళ్ళేవారు, పండగలు, పుట్టినరోజులు అన్ని సరదాగా జరిపేవారు  బందువుల్లో ఎవ్వరికి ఏ రకమైన సమస్య వచ్చినా నాన్న దగ్గరకే వచ్చేవారు.  నాన్న తను చేయగలిగే సాయమయితే లేదు అనకుండా తప్పకుండా చేసేవాడు.  నాన్నని అందరూ 'ఆపద్బాంధవుడనేవారు.మా నాన్న మా కజిన్స్ లో కొంతమంది ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటే వెళ్ళి వారి గురించి తెలుసుకుని, తనే దగ్గర వుండి జరిపించేవారు ఎందుకంటే మధ్యలో ఆ అమ్మాయిలను వదిలేసి వెళ్ళిపోతే వెనక తానున్నని వారికి తెలియడానికి. 

 


 అమెరికాకి వచ్చినప్పుడు దసరా పండగ రోజు బంగారు నాన్నతో నేను.

 

నాన్న కి కష్టపడి పని చేయటమే తెలుసు.  నాన్న బీదవాళ్ళెవరైనా లోన్ కావాలని వస్తే, లోన్ దొరకాలంటే వారిదగ్గర వున్న ఆస్తిపాస్తులు చూపించాలి అలా చూపించలేనివారికి తనే స్యూరిటీ ఇచ్చి లోన్ సాంక్షన్ అయ్యేలా చూసేవారు.  నాన్నకి వారు కష్టపడి పని చేస్తారని నమ్మకం వుంటే వెనకాడేవారు కాదు.  స్నేహితులకి, కొంతమంది దగ్గిర బందువులకి ఆర్దికంగా సాయం చేసారు వారు అప్పు తీర్చలేమని అంటే ఆ డబ్బు గురించి మర్చిపొమ్మనేవాడు. నాన్న కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఎవరికైనా ఏ కష్టం వచ్చినా వారిని  అర్ధం చేసుకుని సాయం చేయడానికి ప్రయత్నం చేసేవాడు. కొంతమంది నాన్న మంచితన్నాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేసినవారు కూడా వున్నారు.

 

 

నాన్న డిప్యుటేషన్ పై చిన్న చిన్న వూళ్ళకి మేనేజర్ పొజిషన్ లో వెళ్ళేవాడు.  ఈయన వెళ్ళేవరకు అక్కడి బ్రాంచ్ ఆఫిస్ పరిస్థితి అధ్వాన్నంగా వుండేది, కాని నాన్న కష్టపడి పని చేసి ఒక కొలిక్కి తెచ్చేవారు.  నాన్న పనికి సంతోషించి ఆ వూరి వారు నాన్నకి వాళ్ళ తోటలల్లో పండిన కూరలు, పళ్ళు లాంటివి ఇచ్చేవారు, నాన్న వద్దనే వారు కాని వారు నాన్నకి ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఎంతో గౌరవంగా,  ప్రేమగా ఇస్తున్నామని చెప్పేవారు నాన్నకి నిజాయితిగా పని చేయడమే తెలుసు, దీని గురించి కూడా అందరూ ఆయనని ఆట పట్టించేవారు.  ఇన్నేళ్ళూగా బ్యాంక్లో పని చేస్తూ ఏం సంపాదించారు అందరూ రెండు మూడు ఇళ్ళూ కాని స్థలాలు కాని, ప్లాట్లు, బోలెడంత బంగారం, బ్యాంక్ బ్యాలన్స్ సంపాదిస్తారుమీరేమి సంపాదించారు అని!  నాన్న నవ్వేసి వూరుకునేవాడు లేకపోతే అన్యాయంగా  వచ్చే డబ్బు నాకు అక్కరలేదు అని ధైర్యంగా చెప్పేవారు.  నాకు చాలా సంతోషం వేసేది. కొంతమంది డైరెక్ట్ గా మీరున్న పొజిషన్ లో నేనుంటే ఇప్పటికీ రెండు చేతులా సంపాదించేవారమని అంటుండే వారు. తనకోసం కాకపోయినా పిల్లల కోసం చేయ్యాలనేవారు. నాకు వాళ్ళ మాటలు వింటుంటే నాకు భయం వేసేది. వారి మాటల ప్రభావంతో నాన్న ఎక్కడ తన విలువలు, ఆదర్శాలు గంగలో కలిపేస్తారేమోనని కాని నాన్న అంత బలహీనుడు కాదు. తాను నమ్మిన సిద్ధంతాలను ఎవరో ఏదో అన్నారని వదిలిపెట్టేయడానికి.

 

నాన్న ఏది సంపాదించినా, ఖర్చులు పెట్టినా అది తన స్వార్జితం, ఆయనకు ఎటువంటి ఆస్తిపాస్తులు రాలేదు.  ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు పడి పైకొచ్చారు, తనకున్న దాంట్లొనే అందరితో షేర్ చేసుకున్నారు, ఇప్పట్లా అప్పుడు జీతాలింత ఎక్కువగా వచ్చేవి కాదు.  ఆయన రిటైర్  అయ్యింతరవాత సెంట్రల్ బ్యాంక్ కాబట్టి పెన్షన్ వుండేది కాదు అప్పుడు ఒకటేసారి డబ్బులు ఇచ్చెసేవారు, ఇంటి లోన్ కట్టేసారు, వచ్చిన డబ్బు బ్యాంక్ లో పెట్టుకున్నారు ఎవ్వరి దగ్గర అప్పులు చెయ్యలేదు, అందరి పెళ్ళిళ్ళు అయ్యాక అంత పెద్ద ఇంట్లో వుండడం, పెద్దవాళ్ళవుతుంటే మేంటేయిన్ చేయడం కష్టం అవుతుందని ఇల్లు అమ్మేసి మారేడ్ పల్లి లో చిన్న అపార్ట్మెంట్ తీసుకుని వున్నారు, అమ్మ నాన్న.   ఎవ్వరిని చేతులు జాపి డబ్బులు అడగలేదు.

 
'07 లో మేము ఇండియా కి వెళ్ళినప్పుడు నాన్న, మా అమ్మతో కలిపి ముగ్గురు
అక్క చెళ్ళెళ్ళు, మధ్యలో నేను, మా అక్క కూతురు, సుకృత, స్పూర్తి, చైతన్య.

 

(సశేషం)

 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech