దీపం కింద నీడ

                                                                                                                   – గంటి భానుమతి

    


ఏమ్మా! ఇష్టమేనా! అన్న డాక్టరు మొహంలోకి చూడలేక తల దించుకున్నాను. ఇష్టమేనా! ఈ పదం ఒకప్పుడు నేను ఎన్నోసార్లు ఉపయోగించేదాన్ని. కానీ, ఈ క్షణాన ఈ డాక్టరమ్మ వాడే వరకు నాకు గుర్తు లేదు. దాన్ని మర్చిపోయాను. ఎప్పుడో..ఎమో..

నాకు అప్పుడు పెళ్ళి వద్దు. నేను డిగ్రీ పూర్తి చేశాక పెళ్ళి చేసుకుంటాను. అని అంటే, నాలుగు తిట్టి చదువు మానిపించిన రోజున!

నాకు ఈ దుకాణాలు, బిజినెస్సులు చేసేవాడొద్దు. ఏదైనా ఆఫీసులో పనిచేసేవాడిని చేసుకుంటాను. అని అంటే నోర్ముయ్ నీ ఇష్టం ఏమిటీ? వాళ్ళు అడిగి మరీ చేసుకుంటామని అంటూంటే, మధ్య నీ ఇష్టం ఎవరిక్కావాలి. అన్న నాన్న తన స్నేహితుడి కొడుక్కిచ్చి పెళ్ళి కుదిర్చిన రోజున..! కావచ్చు.

మీరే పొద్దున్నే షాపుకెళ్ళిపోతారు. నాకు పత్రికలు చదివే అలవాటుంది. కొనుక్కుంటాను. అంటే పుస్తకాలు ఏవీ లేదు. అవి శుధ్ద దండగ..ఇంట్లో అమ్మ దగ్గర రామాయణం, భారతం అవి ఉన్నాయి. అవి చదువుకో..అని, నా చదివే ఇష్టాన్ని కాగితంలా నలిపేసిన రోజునా..! ఏమో కావచ్చు.

అటువంటిది ఈ రోజున డాక్టరమ్మ, ‘ఇష్టమేనా’ అని అడుగుతూంటే కొత్తగా అనిపించింది నాకు.

నా పెళ్ళయ్యాక, పరిస్థితులని, వాతావరణాన్ని ఎదుర్కొనే ఆలోచనలని చంపేసుకున్నాను. తల ఒంచడం ఒక్కటే నాకు తెలిసింది. అలాంటప్పుడు ఇష్టమేనా అని అడిగితే ఇష్టం లేదని ఎలా చెప్పాలో తెలియడం లేదు.

సరిగ్గా రెండు రోజుల క్రితం మధ్యాహ్నం భోజనానికి వస్తూంటే, , మామగారు ఉన్న మోటారు సైకిల్ ని, వెనక్కి తిప్పుకుంటున్న ఓ లారీ గుద్దేసింది. ఇద్దర్నీ దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు.

డబ్బు కావాలి. మామగారు చావుకి ఓ అంగుళం దూరంలో..ఓ ఆసుపత్రిలో ఉంటే, నాలుగు చోట్ల ఎముకలు విరిగిన నా భర్త మరో ఆసుపత్రిలో ఉంటె, ఏం చేశ్తాను? నా ఇష్టాన్ని చెప్పలేను. పైగా పక్కన అత్తగారున్నారు. మీ ఇష్టం అనాలని ఆవిడ ముందే చెప్పారు. నా ఇష్టాఇష్టాలు కూడా ఆవిడే నిర్ణయిస్తారు.

అత్తింట నా స్వాతంత్ర్యం అలాంటిది. వాళ్ళ మీద ఆధారపడ్డాను కాబట్టి. అని ఒక్కోసారి అనిపిస్తుంది.

ఇంటరు చదువుతున్న రోజుల్లో అనుకునేదాన్ని. స్వతంత్ర్యం ఒకరిచ్చేదా ఏమిటి, అది సహజంగానే వచ్చేస్తుంది. నాతోపాటే నన్నంటి ఉంటుందని. కానీ, కాదు..నేను స్వతంత్రురాలిని కాదు. నా ఇష్టం అంటూ ఏమీ లేదు.

నా ఇష్టం, నా స్వత్రంత్ర్యం, నా ఆత్మ గౌరవం., నా అంతరాత్మ ఒక్కటీ కూడా నా దగ్గర లేవు. అన్నిపోయాయి. నేను పోగొట్టుకున్నాను. వీటితో పాటు వెన్నెముక, వ్యక్తిత్వ నడిచి వెళ్ళాయి. పరిస్థితులు అర్ధం అయినా కాకపోయినా, వాళ్ళేం చెప్తే దానికి తల ఊపే మరబొమ్మలా మిగిలాను.

ఈ రోజున డాక్టరమ్మ అడుగుతోంది ‘ఇష్టమేనా’ అని. ఒక్కసారిగా, చైతన్యం వచ్చినట్టనిపించింది. నా హక్కునీ, స్వేచ్చనీ, ఉపయోగించుకుందామనిపించింది. నాకిష్టం లేదు. డబ్బు కోసం నేనీపని చేయను..అందామనిపించించి.

చూడమ్మా! మీ మావగారు ఇవాళో రేపో అన్నట్లుగా ఉన్నారు. మాక్కూడా తెలుసు ఆయన పోతారనీ, కానీ అలా చూస్తూ ఊరుకోం కదా! ఆయన్ని బ్రతికించడానికి మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి డబ్బు అవుతుంది. ఎలాగూ పోయే మనిషి ఖరీదైన మీరడగవచ్చు. కానీ, వీలైనంతగా వైద్యం చేస్తూ బతికించడానికి ప్రయత్నం చెయ్యాలి అది మా ఎథిక్స్.

మీ భర్త గారికి, రెండు చోట్ల ఆపరేషన్ చెయ్యాలి. రాడ్ కూడా పెట్టాల్సి వస్తుందని డాక్టర్ మాతో అన్నారు. డబ్బు కావాలి కదా!

అందుకే చెప్తున్నాను ఒప్పుకోమని. ముందుం కొంచెం ు.నెల నెలా మీ వాళ్ళకి డబ్బు అందే ఏర్పాటు చేయిస్తాను. మిగిలినది, ి అయ్యాక .. ఏమంటావ్? ఇష్తమేనా?

మళీ అదే పదం ‘ఇష్టం..’ ఆలోచనలో పడ్డాను. సరే..అను..ఒక్కసారిగా లక్ష డబ్బు ఇస్తూంటే..ఇష్టమే అని చెప్పెయ్య్. అత్తగారు మళ్ళీ ఇష్టాన్ని గుర్తుచేశారు. మళ్ళీ నా ఇష్టాన్ని నేల రాసేశారు.

నన్ను ఆలోచించుకోనివ్వకుండా ఆవిడ తొందరగా, ఒప్పుకోమని అనడానికి కారణాలున్నాయి. అన్నింటికన్నా పెద్ద కారణం ఆకలి. నాలుగు పొట్టలు ఇంట్లో,.ఇద్దరికి మందులు ఆసుపత్రిలో..అన్నీ డబ్బుతో కూడుకున్నవే...

యాక్సిడెంటయ్యి ఆస్పత్రిలో ఉన్న వాళ్ళ రక్త మాంసాలు చవకగా, గుప్పెడు మెతుకులు ఖరీదుగా అనిపిస్తోంది.

ఖాళీ కడుపులకి నీతి ఉండచ్చా! మొదటిసారిగా ఆకలిని, దరిద్రాన్నీ చాలా దగ్గరగా చూసాం. ఈ ఎముకల పక్కనున్న జీవితం ఇంత భయంకరమైనదా?

ఏమ్మా! సరేనా! ఇష్టమేనా! నేను ఇంకా ఏమీ అనలేదు.
అలాగేనండీ..అమ్మాయి మీరెప్పుడంటే అప్పుడే వస్తుంది. మళ్ళీ నా ఇష్టం అడుక్కిపోయింది.
నాకు అన్ని రకాల పరీక్షలు చేశారు. వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. ఆ మర్నాడే మామగారు పోయారు.
అమ్మాయ్ డబ్బు లేదని ఏదీ మానేయకూడదు. డబ్బు ఇవాళ వొస్తుంది రేపు పోతుంది. ఇవాళ లేకపోయినా రేపు డబ్బుండవచ్చు. అప్పుడు ఈ సమయం రాదుకదా! కర్మలన్నీ సవ్యంగా, శాస్త్ర ప్రకారంగా జరగాల్సిందే. లేకపోతే ఆయన ఆత్మ ఘోషిస్తుంది. రేపు నేను పైకెళ్తే ఆయనకేం సమాధానం చెప్తాను. అని అత్తగారు ఏడుస్తూనే, ముక్కు చీదుకుంటూనే, అందరితో మాట్లాడుతూనే అన్ని జరిపించారు. నాతోని...కాదు..నేను తెచ్చిన డబ్బుతో.

ఓ మనిషి పోయాక ఈ కర్మకాండలకి ఇంత ఖర్చా? చాలా చూసేసారు, ముసలాయనకి ఏ లోటూ రానీలేదు.సక్రమంగా జరిపించారు. అని బంధువులంతా అత్తగారి దగ్గర అంటూంటే..

మరేనమ్మా! డబ్బు లేదని మానేస్తామా! తప్పదుకదా! పాపం..ఏ మాటకామాటే చెప్పుకోవాలి. . కోడలు డబ్బు సర్దింది.
ఇంక అంతా నన్ను పొగడడం మొదలెట్టారు.
నా డబ్బు నేనెందుకివ్వాలి? అనే ఈ రోజుల్ల్లో మంచి గుణవంతురాలైన కోడలు దొరికింది.
మామగారి స్వర్గ లోకానికి పంపింది అన్ని దానాలు చేయించింది..

నా మనసు ములిగింది దానికి నోరుంటే అనేసేదే. నాకీ ఆచారాలు,, ఈ శాస్త్రాల మీద నమ్మకం లేదు. నా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది. ఇమోషనల్ గా బ్లాక్ మేయిల్ చేశారు. పన్లు కానిచ్చేసారు. అదెవరికీ వినపడలేదు. అసమర్ధుడి జీవయాత్రలా సాగింది బ్రతుకు.

మరో వారం రోజులకి, నేను వెళ్ళే రైలు వచ్చింది. పిల్లలిద్దర్ని దగ్గరకు తీసుకున్నాను. నాకు జ్వరం వచ్చింది. నేను ఆసుపత్రికి వెళ్ళాలి. చాలా రోజులయ్యాక వస్తాను. అల్లరి చేయకుండా నానమ్మ దగ్గర ఉండండి. నేను వచ్చాక, మీ ఇద్దర్నీ స్కూల్లో వేస్తాను. నానమ్మ మాట వినండి. అని అంటూంటే దుఃఖం ఆగలేదు. అత్తగారు ధర్యం చెప్పి పంపారు.

డాక్టర్ల సలహాతో దూరంగా ఓ ఖరీదైన ఆస్పత్రిలో అనుక్షణం డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ఓ జపాను దంపతుల వంశాకురాన్ని మోయడానికి సిద్ధపడ్డాను.

నేనున్న సమాజంలోంచి, నేనెరిగిన పరిసరాల్లోంచి నాకు తెలీని చోటకి వచ్చాను.
ఈ భూమ్యాకాశాల కింద ఉన్న నా ఉనికికి దూరంగా ప్రతీక్షణం నా అవసరం ఉన్న పిల్లలకి దూరంగా ఈ చోటకి వచ్చాను.

మంచి భోజనం, పళ్ళు, పాలు, బలానికి మందులు, ఇన్ జెక్షన్లు..ఏది తింటున్నా, పాపం - పిల్లలకి పెట్టకుండా నేను తింటున్నాను. ఎప్పుడైనా ఇలాంటి భోజనం తినగలరా అనిపించేది.

ఎప్పుడింటి కెళ్తానా, ఎప్పుడు వాళ్ళని చూస్తానా అని ఎదురు చూస్తూ వచ్చాను. ఆఖరికి, ఆరోజు రానే వచ్చింది. డెలివరీ అయ్యింది. బాబు పుట్టాడు. జపాను దంపతులు తీసుకుని, నాకు డబ్బు ఇచ్చి వెళ్ళిపోయారు.

నేను మామూలు మనిషినయ్యాక, సంపూర్ణంగా ఆరోగ్యవంతురాలినయ్యాక మరో మూడు నెలల తర్వాత ఇంటికెళ్ళాను. ఇన్నాళ్ళూ రాజకీయ జైలులాంటి జీవితం గడిపాక, ఏవిటో పోయిన స్వాతంత్ర్యం వొచ్చినట్టనిపించింది.

నేను ఈ ఇంటికోసం, పిల్లల కోసం తపించిపోయినట్టుగా వాళ్ళు కూడా, నాకోసం ఎదురు చూస్తున్నారనుకున్నాను. పిల్లలు దగ్గరికి రాలేదు. నన్ను నేనే ఓదార్చుకున్నాను. చాలా రోజులయ్యింది కదా అని, ఓ నాలుగు రోజులు పోతే వాళ్ళే వస్తారు అని. అయినా వాళ్ళతో ఆడాను, పాడాను. చిన్న పిల్లలా సంబరపడిపోయాను. ఆపరేషన్లు అయ్యి, వాకర్ సాయంతో నడుస్తున్న భర్తతో, అత్తగారితో, పిల్లలతో గలగలా, ఆపకుండా, ఆగకుండా కబుర్లు చెప్పేస్తున్నాను.

ప్రతి గదిలో, ప్రతిగోడలోని ప్రతీ అంగుళం స్పర్శిస్తూ ఇల్లంతా తిరిగాను. స్వాతంత్ర్యం అంటే ఇది. స్వేచ్చ అంటె ఇది అనుకుని, దాని విలువ ఇప్పుడు తెలిసిందని మురిసిపోయాను. అయితే రోజులు గడిచే కొద్దీ నా స్వతంత్ర్యానికి అర్ధం మారిపోయింది. ఒంటరితనం. తెలీకుండానే ఒంటరిగా ఉండిపోతున్నాను. ఇంట్లో వాళ్ళు నాతో ఎలా మాట్లాడినా నాకు అందులొ వెలితి కనిపిస్తోంది.

ఈ కుటుంబానికి ఇంత చేసినందుకు, ఒక్కమాట, ఆప్యాయతతో కూడిన మాటే లేదా! ఆ ఎందుకు చెయ్యదు, చెయ్యకేం చేస్తుంది. ఎవరి కోసం చేస్తుంది అని అనుకున్నారా? అది నా బాధ్యత అని అనుకున్నారా?

ఏదైతేనేం ఇంట్లో అత్తగారు పిల్లల మాట ఎలా ఉన్నా భర్తకి, నాకు మధ్య తెలీకుండానే దూరం పెరుగుతోంది.
ఏదో జరిగింది. కానీ ఏం జరిగిందో, ఏం జరిగి ఉంటుందో ఊహకి కూడా అందడం లేదు. నాలో నేనే మదన పడిపోతున్నాను. మీరంతా మారిపోయారు. ఏం జరిగింది? ఎందుకు అని నాకు ఇంట్లోవాళ్ళని అడగాలనిపించింది.అలా అడిగి నన్ను నేను చులకన చేసుకోవడం ఇష్టం లేక అడగలేక, వాస్తవాన్ని ఎదుర్కోలేక, తట్టుకోలేక, ఒంటరితనంతో అర్ధం లేని స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాను.

నా భర్తలో ఆత్మనూన్యతా భావం ఎక్కువైపోయింది. తన ఆపరేషన్లకి, నేను తెచ్చిన డబ్బు వాడటం అయిందని తెలిసినా, అప్పుడు ఒప్పుకున్న మనిషికి, ఇప్పుడు వెయ్యి గజాల లోతుల్లోకి నిలువునా దిగబడిపోయినట్టు తన మగతనానికి అవమానం జరిగిపోయినట్టుగా, తల ఎత్తలేని స్థితిలో ఉన్నట్టుగా అయిపోయాడు.

స్త్రీ డబ్బు సంపాదించి తేకపోతే భర్త అధికారి. స్త్రీ డబ్బు సంపాదించి తెచ్చినా కూడా భర్తే అధికారి. ఇన్నాళ్ళూ తను సంపాదించాడు. ఈ రోజున నేను డబ్బు ఇచ్చాను. తేడా ఏమిటి? నేను స్త్రీననా? నన్ను తనతో సమానంగా గుర్తించని ఈ మనిషిని నేను అర్ధం చేసుకోలేను ఇద్దరం ఈ ఇంటికి సమానం కాదా? భార్య భర్తలంటె బాస్ సబార్డినేట్ లాంటి బంధమే ఉంటుందా!

ఆలోచిస్తున్న కొద్దీ మా మధ్య సంబంధాలు ఏదశలో ఉన్నాయి! పునాది ఉందా! కూలిపోతుందా! అన్న సందేహం వచ్చింది.
అర్ధం లేని అహంకారం ఎక్కువై పోయింది. నన్ను మాటలతో దెప్పడం, మానసికంగా హింసించడం ఎక్కువైపోయింది. నోరు మూసుకుంటే ఉత్తమం అని ముందుగా అనుకున్నా రాన్రానునాలో చైతన్యం కలగడం మొదలైంది. నా జీవితం ఎలా నడవాలో ఎలా నడిపించుకోవాలో నిర్ణయించుకోవడం మొదలు పెట్టాను. సమాధానాలు ఇవ్వడం ఆయనకి నచ్చలేదు. నా మీద అధికారం పోయిందన్న అనుమానం ఎక్కువై ఏం చేయలేక ఏం చేయడానికీ చేతకాక, నన్ను పిల్లల్ని మానసికంగా హింసించి విపరీతమైన డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. మళీ కర్మకాండలు డబ్బు ఖర్చు.

పరిస్థితి మొదటికొచ్చింది. సంసారం పుర్తిగా రోడ్డున పడకుండా ఉండాలంటే, నేనే ఉద్యోగం చేయాలి. పక్కనున్న స్కూల్లో చేరాను. చిన్న పిల్లలకి సాయంత్రం ట్యూషన్లు మొదలెట్టాను. అయన అవన్ని ఏమూలకి? నలుగురం రెండు పూటలా తినడం మర్చిపోతున్నట్టుగా అనిపించింది.

మళ్ళా అత్తగారిని అడిగాను ఇద్దరం కలిసి, మొదటిసారి కలుసుకున్న డాక్టరమ్మ దగ్గరకెళ్ళాం. వారం రోజులు గడిచాక ఓ ఎన్నారై దంపతులు వంశాంకురాన్ని మోయడానికి సిద్ధపడ్డాను. ఇప్పుడిప్పుడె పిల్లలు నా దగ్గరకు వస్తున్నారు. కొంచెం చేరిక అయ్యారు. అప్పుడె వదిలివెళ్ళాల్సి వస్తోంది.

ఈసారి వచ్చే డబ్బుని బ్యాంక్ లో వేస్తే ఆ వడ్డీతో పిల్లల నెల జీతాలు, పాఠ్యపుస్తకాలు, బట్టలు అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళ జీవితాల్ని ఓ మార్గంలో పెట్టాలంటే ఇంతకన్న వేరే దేం చేయలేను. నేను ఏదో ఉద్యోగం చేస్తే వేణ్ణీళ్ళకి తోడుగా ఉంటుందని ఆశపడ్డాను.

ఏం సాధించాను! అధ్భుతం కోసం ఎదురు చూళ్ళెదు కానీ, ఆ మనిషి ఉన్నట్టుండి పాతాళానికి ఎగువగా వెళ్ళిపోయాడు. నన్ను నా పరివారం నుంచి వేరు చేశాడు. ఈ దూరం చేసిన పరిస్థితులు నేను తెచ్చి పెట్టుకున్నది కాదు కదా! మరి ఎందుకు నన్ను దూరం ఉంచార్?

భరోసా లేని భవిష్యత్తు, భయపెడ్తున్న అప్పులు తరుముతున్న ఆకలి దప్పులు, ఆర్ధిక సమస్యలు పద్మవ్యూహంలా చుట్టేస్తే అంతకుమించిన మరో మార్గం కనబడలేదు. అందుకే ఇష్టం లెకున్నా యిష్టమే అన్నాను.

ఈ రోజున ఈ క్షణాన ఎలా ఉన్నాను? నడుస్తున్న నీడలా ఉన్నాను. నా కోసం నేను జీవించడం లేదు కదా మరి.
నా భూత, వర్తమాన భవిష్యత్తు అన్నీకూడా పిల్లలకే ఇచ్చాను. వాళ్ళకి పెద్దయ్యాక నేను చేసింది అర్ధం అవుతుందా! తెలిస్తే నా మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందో? అసలు ఈ సంగతి పిల్లలకి తెలిపాలా! తెలీకుండా జాగ్రత్త పడాలా! దుఃఖాన్నిచ్చిన భర్తలాగానే వీళ్ళు కూడా దిగులు పరిస్తే .. చరమ దశలో విరక్తులతో, అసంతృప్తితో జీవితం నిండిపోతుందా?

ఒక్కటి మాత్రం నిజం. మానసికంగా నేను సాధించింది శూన్యం. ఏది ఏమయినా కానీ, ఈ రోజునే నేను చూస్తున్నది ఈ అరేబియా సముద్రంలో కదిలిపోతున్న అలలమీద చెదిరిపోతున్న పిల్లల రూపాల్ని అని చూడ్డానికే కానీ, వాటి స్పర్శ కానీ, స్పందన కానీ నేను అనుభవించలేకపోతున్నాను.

ముందు ముందు వాళ్ళతో పంచుకునే క్షణాల్లో వ్యాపార విలువలు చేరితే, నేను ఓడిపోయినట్టే.

సెంటిమెంట్లకీ, మానవతా విలువలకీ, అనుబంధాలకీ కట్టుబడి ఉంటే, నా శ్రమ నాకు అనుకూలించినట్లే. నేను దీనికే ప్రయత్నిస్తాను.

నా భావోన్నత్వం చేత, నా స్వభావం చేత, వాళ్ళకి ప్రేమని యిచ్చి పుచ్చుకుంటాను. అది నేను చేయగలను. ఆ నమ్మకం నామీద ఉంది. ఈ రోజున అత్తగారిని అమ్మ అన్నా రేపు నన్ను అనిపించుకునే రీతిలో ఉంటాను. అమ్మ అని వాళ్లతో అనిపించుకుంటాను. దానికోసం మళ్ళా కష్టపడతాను. ఆ కష్టం ఈ సముద్ర తీరాన ఇసుకలో పెట్టుకున్న సంతకం కాకూడదని ఓ జిబ్రాల్టర్ రాక్ లా ఉండాలని అనుకుంటున్నాను.
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech