కథా విహారం

 

కథకు కొత్త నెత్తురెక్కించిన కాళీపట్నం రామారావు (కా.రా.) మాష్టారు

                                   - విహారి

    
కథకు కొత్త నెత్తురెక్కించిన కాళీపట్నం రామారావు (కా.రా.) మాష్టారు

కా.రా. మాష్టారంటే ‘యజ్ఞం’! ‘యజ్ఞం’ అంటే కా.రా!
ఇది నుడి, నానుడి అయింది కథాలొకంలో. అలాగే, ఇవ్వాళ కా.రా. అంటే కథానిలయం. కథానిలయం అంటే కా.రా.

కథలు వ్రాయడం వేరు. కథలపై మాట్లాడటం వేరు. అన్నారు. చా.సో.గారు ఒకసారి నేను విజయనగరంలో ప్రసంగించిన సభకి అధ్యక్షత వహిస్తూ అలాగే కథానిలయం గురించి వినడం వేరు. దాని గురించి వ్రాయడం వేరు. చూడటం వేరు అనిపిస్తోంది. కా.రా. కలల పంట కథానిలయం. ఒక అసాధారణమైన కార్యసాఫల్యం అది. దాని వెనుక సహకార హస్తాలెన్ని ఉన్నా కా.రా. గారి శ్రమ అనితర సాధ్యం. కా.రా. గారి కార్యకర్తృవ్యం శ్లాఘనీయం.

కథల విషయానికొస్తే కథ వ్రాయడం తపస్సే కాదు. యజ్ఞం కూడా అని లోకానికి చాటారు. కా.రా.గారు భూమ్మీద రుణం చేయడం. ఆ భూమిని అమ్మి ఋణం తీర్చడం అనేది అసాధారణమైన అంశంగా కనిపిస్తుంది.

షావుకారు గోపన్న కథ వింటూంటే అతని వాదన ఎంతో సమంజస మైనదనిపిస్తుంది. అయితే, అప్పల్రాయుడి కథనం - అదొక వ్యథ. అదొక ఆర్తి! అతని వంటి బడుగు రైతుల దుస్థితికి కారణ‘భూ’తాలైన శక్తుల మూలాలు, షావుకార్ల నిర్వహణలో దళారీల దోపిడి, ఆర్ధిక వ్యవస్థ విన్యాసాలు, ఇవి కొమ్ముకాస్తున్న వర్గాలు - అన్నీ తేటతెల్లమవుతాయి. ముగింపు - హృదయ విదారకమైన విషాద సంఘటన. సీతారాముడి ధర్మాగ్రహం కరుణ భీభత్సాల జల.

వర్తమాన, సామాజిక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక వైరుధ్యాల సామాహార రూపానికి ఒక కథా దర్పణం - యజ్ఞం. అందువల్లనే యజ్ఞం కథలు రాసేవారికీ, చదివిన వారిని మాత్రమే కాక, కాకమ్మ కథలు చెప్పేవారిని కూడా ఒక కుదుపు కుదిపింది. కలత పరిచింది. కథా సాహిత్యార్ణవాన్ని కల్లోల పరిచింది.

యజ్ఞం కథ గురించి వ్యాఖ్యానాలు, విమర్శలు, విశ్లేషణలు, వివరణలు, పరిశోధనలు, పరిశీలనలు - కొల్లలుగా వచ్చినాయి. గ్రంథ రూపమూ దాల్చినవి.

నిజానికి, మాష్టారి కథల్లో ఏ కథకాకథ ఒక గొప్ప కథ. అయితే, రెండు కథల్ని గురించి ప్రత్యేకంగా చెప్తాను.

‘నోరూమ్’ అని కా.రా. గారి మరో అద్భుతమైన కథ ఉంది. ఇందులో దేవుడు లాడ్జింగ్ లో పనిచేస్తాడు. పెళ్ళాం అప్పాయమ్మ ఒక రాత్రల్లా ఇడవకుండా పక్కమీద నీతో పడుకోవాలనుందిరా అని మనసుపడింది. తమ ఇరుకు బతుకులో ఎప్పుడో ఒకప్పుడు లేశమంత ఆ సుఖం, అవకాశం దొరక్కపోయాతా అనుకునేవాడు, దేవుడు కొంతకాలం. ఇంతలో, తన మనసు తీరకుండానే, జబ్బుతో హరీమంది - అప్పాయమ్మ - అన్ని కోర్కెలకూ అతీతంగా!

రెండో జంట ఉంది. నూకరాజు - ముత్యాలమ్మ. మూడు నెలల క్రితం కార్యమైంది. శుభ్రమైన లాడ్జింగ్ లో మూల గదైనా ఫరవాలేదు. అమ్మడుతో ఒక్క రాత్రి సుఖంగా గడపాలి. ఇదీ నూకరాజు ముచ్చట. చివరికి కడు ప్రయాసతో వెళ్ళారు. లాడ్జింగ్ గుమాస్తా - వీళ్ళ వాలకాన్ని అదోలా చూసి - ‘నోరూమ్’ అనేశాడు. ఆ అన్నవాడికి పక్కగా అటుగా ఆ దేవుడున్నాడు. నిరాశాతో తిరిగి తిరిగి పెళ్ళాంతో అర్ధరాత్రి సినిమామొగ సెంటర్లోకి వచ్చేడు నూకరాజు. దేవుడు తారసపడ్డాడు. పాపం నీకు రూమ్ దొరకలేదా అనబోయి ‘నీకాబొట్టే ఏమవుద్ది’ అన్నాడు దేవుడు అలవాటుగా.

దేవుడి దవడ పగలగొట్టేడు నుకరాజు. కోపంతో ఊగిపోయాడు. వాడిమీద కలబడ్డాడు. రెచ్చిపోయాడు. ఆడది లాడ్జింగ్ కొస్తే లంజయిపోద్దిరా? అని ఉద్రేకంతో కొట్టిన చోట కొట్టకుండా కొట్టేశాడు. రెండు సన్న జీవాలు కొట్టుకుంటుంటే - చూసేవారికి ఉచిత వినోదమే. కథలో ఒకవైపు గుంపు మనస్తత్వం, సమూహపు చూపు (పర్ సెప్షన్) అది ఎప్పుడూ వ్యక్తి చూపుకి పొరలూ, తెరలూ కల్పిస్తుంది. ‘ఐ ఆఫ్ ద బిహోల్డర్’ అంటారు. ఇక్కడ దేవుడి ప్రశ్నకీ, చూపుకీ అదే కారణం. సామాజిక వ్యవస్థలోని ఒక మచ్చ అది. ఇంకొక వైపు చిన్న చిన్న కోరికల్ని కూడా తోర్చుకోలేకపోతున్న నిస్సహాయ స్థితి నుంచీ ఎగదన్ను కొచ్చిన కసి, కోపం. నూకరాజు ప్రవర్తనకి ఇదే కారణం.

దేవుడు - నూకరాజు ఒకే నాణానికి రెండు వైపులు. వీరిద్దరూ ఒకే సమస్య తీవ్రతనీ, దారిద్రాన్నీ, బాధనీ అనుభవించిన వారే. అయినా క్రమేపీ - సామాజిక వ్యవస్థ కట్టిపడేసిన పరస్పర విరుద్ధమైన రెండు భిన్న స్థితుల్లోకి, భావజాలంలోకీ, మైండ్ సెట్ లోకి దిగబడిపోయారు. వీరిద్దరి మధ్య ఘర్షణ - సహజమైన సన్నివేశంగా కథకెక్కింది. మేథోపరిణతమైన ఆలోచన. సామాజికావగాహన, జీవన తాత్వికత పునాది - ఇవన్నీ కథాత్మలో భాసించాయి.

కా.రా.గారి కథల్లో సంఘటనల వివరణ చాలా విశదంగా ఉంటుంది. కథలోని పాత్రల స్వభావం, రూపురేఖలతో పాటు, ఆయా ప్రాత్రల్ని ఆడిస్తున్న ఆధార చక్రం కూడా చదువరికి ప్రస్ఫుటంగా దర్శింప చేయాలంటే ఆ వివరణలు అవసరమవుతాయి. శిల్ప మరజ్ఞులైన కా.రా. వంటి ఉత్తమ రచయితల కథా నిర్వహణ సామర్ధ్యం ఇది.

‘హింస’ కథ ఉంది. వస్తువు దృష్ట్యా, శిల్పం దృష్ట్నా, శైలి దృష్ట్యా కూడా యజ్ఞం కంటే గొప్ప కథానిక ఇది. ఉత్తమ మానవతా విలువల్ని ఆవిష్కరిస్తూ విశ్వజనీనమైన మానవ సంబంధాల ‘బాండ్’ ని సామాజికంగా ఆ బంధాన్ని విఛ్ఛిన్నం చేస్తున్న దుష్టశక్తుల మూలాన్ని - గంభీరంగా పారదర్శకం చేసిన రచన.

అక్క అత్తారింట్లో మోసపోయి, కాలుజారి, పట్నం మట్టితొక్కి, కంపెనీలో తేలి - చెడి - పుట్టింటికొచ్చింది. చెల్లెలు సంగి. అమె పరంగా సాగింది కథ. అక్క పైడమ్మని ఇంట్లో ఉంచుకొనే ధైర్యం లేదు తల్లికి. పెద్దమ్మకీ లేదు. ఊరి పెద్దయ్యలకీ లేదు. ఊరు ఊరంతకీ లేదు. పైడమ్మ వెళ్ళిపోయింది. సంగి శలక చేరుకుంది. కలవరంగా, కలకలంగా మేకలు అరుస్తున్నాయి. చాలు వెంబడి పరుగెత్తుకెళ్ళి చూస్తే - నక్కలు చీరేసిన మేకపిల్ల. భయం నిండిన కళ్ళతో ముందుకు సాగని కాళ్ళతో వగరుస్తూ తల్లిమేక.

సంగి కన్నులు జీవురించాయి. తాటిమట్ట తీసుకుని కనిపించని నక్కల్ని కసితో తిడుతూ, కనిపిస్తున్న తుప్పల్ని కొడుతూ సాగిపోతోంది. ‘నక్కలు తనకు చిక్కుతాయా’ చిక్కితే తానేం చేయగలదు’ ఇలాంట్రి ప్రశ్నలు ఆమెకు తట్టలేదు. తట్టవు కూడా. ఆమె ఆవేశం మనకు అర్ధం కావాలంటే ఆమె స్థానంలో మనముండాలి. అంతేకాదు. ఆమె గుండె మనకుండాలి. అంటూ కథ ముగుస్తుంది.

దైహికమైన హింస, మానసికమైన హింస - రెంటి మిశ్రమం కథాంతంలో ప్రతీకాత్మకంగా చిత్రించబడి, చదువరిని ఆలోచనల్లోకి నెట్తాయి.

ఒక సంక్లిష్ట స్థితి మధ్యలో సంఘర్షణాత్మకమైన సన్నివేశాల్ని ‘హ్యూమన్ డ్రామా’ గా పొగడడం - చాలా నేర్పుతో కూడిన రసవిద్య. ఈ విద్యలో ఆరితేరిన కలం - కా.రా.గారిది. ‘కాడు’ ‘సంస్కార’ ‘అంతులేని కథ’‘ చివరకు మిగిలేది’ వంటి కొన్ని ఉత్తమ చిత్రాల్లోని స్క్రీన్ ప్లే లో ఈ నేర్పుని చూస్తాం. యజ్ఞంలో అప్పల్రాయుడు గోపన్న సీతారాముడు, ‘నోరూమ్’ లో దేవుడు - నూకరాజు, ‘హింస’లో తల్లి జగ్గమ్మ వంటి పాత్రలు పరిశీలించిన కొద్దీ విశ్లేషించిన కొద్దీ అవి మనిషి స్వరూప స్వభావాల వైచిత్రిని, వైరుధ్యాన్నీ వివిధ కోణాల్లో ఆవిష్కరిస్తాయి. బుద్ధి జీవుల మేథని గిరికీలు తిప్పుతాయి.

వచన రచయితలకు ఉన్నత పురస్కారాలు అరుదుగానీ లభించవని బాధపడేవారు బుచ్చిబాబుగారు. విశ్వకథా వీధిలో జయకేతనాన్ని ప్రతిష్టించగలిగిన రచనలు చేసిన కారాగారు, తెలుగు కథకు సామాజిక నిబద్ధతనద్దిన కా.రా.గారు - జ్ఞానపీఠానికి అర్హులు కారా - అని తత్సంబంధీకుల్ని ప్రశ్నించటం తెలుగు కథకుల కర్తవ్యం. ఈ శుభాకాంక్షకు అనుకూలఫలం లభిస్తుందనే నా విశ్వాసం!

నాడూ, నేడూ, రేపూ కూడా - ‘తెలుగు కథ ఒక జాతి కథ’ ఆ దీపదారుల్లో అగ్రగణ్యులు - డాక్టర్ కా.రా. గారు!
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech