మారేకాలంలో మారిని ఓ కథ    

                                                                          - తమిరిశ జానకి

    

ఇంక నిద్రపో బాబూ పొద్దుపోయింది.
ఊహూ కథ చెప్తేగానీ నిద్రపోను..ముద్దు ముద్దుగా గారాలు పోయాడు రవిబాబు.

బుజ్జిబాబు గారికీ రోజేం కథ కావాలి? నవ్వింది నిర్మల
ఆ మరి మరేమో..నాకు నాగమల్లి పువ్వు కథ కావాలి.
అస్తమానం ఆ కథే అడుగుతుంటావు. నీకంత ఇష్టమా ఆ కథ.
ఊ.. బోల్డంత ఇష్టం.
నిర్మల చూపులు రవిబాబు ముఖం మేదే ఉన్నాయి మనసెక్కడో..

* * *

ఇంకనేవెళ్తాను హరీ. పొద్దుపోయింది. హరి చేతుల్లో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుంటూ అంది గిరిజ.
ఊహూ! పాట పాడితేగానీ వెళ్ళనివ్వను.
అబ్బాయిగారికీ రోజేం పాట కావాలి?
ఆ..మరి ..మరేమో.. మల్లెమొగ్గ పాట కావాలి.
మల్లెమొగ్గ పాటా?
ఊ మాట్లాడని మల్లెమొగ్గ మాదిరిగా నడచిరా.. ఆ పాట కావాలి.
ఓ..ఎక్కువగా ఆ పాటే పాడమని అడుగుతుంటారు మీరు. అంత ఇష్టమా పాటంటే మీకు?
ఊ..చాలా చాలా ఇష్టం.

* * *

నిర్మలా!
ఏం కావాలి అక్కయ్యగారూ?
తల నొప్పిగా ఉంది. కాస్త అమృతాంజనం రాస్తావా? తరచుగా అనారోగ్యంతో మంచం పడుతూనే ఉంది సులోచన. మనోవ్యాధికి మందెక్కడుంది?
ఆలోచనలతో ఆరోగ్యం బాగా పాడుచేసుకుంటున్నారు మీరు..రవిబాబు కోసమైనా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అక్కయ్యగారూ. మందు రాస్తూ మనస్ఫూర్తిగా ఉన్నమాట చెప్పింది నిర్మల.

ఏం చెయ్యమంటావు నిర్మలా! మనశ్శాంతిలేని బతుకైపోయింది. ఆ రాక్షసి కళ్ళు మా వారిమేదే పడాలా? ఇంకెవరూ దొరకనట్టు, పెళ్ళయి, భార్య బతికున్నవారినే వల్లోవేసుకోవాలా! ఇంకో ఆడదాని ఉసురు తగుల్తుందన్న భయమే లేకపోయింది. ఎప్పుడూ నిర్మల దగ్గిర చదివే దండకమే చదవడం మొదలు పెట్టింది సులోచన.

నేనంటే ఎంత ప్రాణంగా ఉండేవారో..అటువంటి మనిషిని వల్లో వేసుకుందంటే అదెంత టక్కులాడో! మాయలమారో! అసలు నేను కూడా ఆయనతో వెళ్ళిపోయి, ఆ ఊళ్ళ్ కాపురం పెట్టి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండకపోను. ఆ ఊళ్ళో ఉండబోయేది ఒక్క ఆర్నెల్లేగా.. ఆర్నెల్లకోసమేగా ఆ ఊరు బదిలీ చేశారు. మళ్ళీ ఈ ఊరే వేస్తామని చెప్పారు. అటువంటప్పడు సంసారం ఇక్కడ ఎత్తి పెట్టి, అందరం పొలో మంటూ అంత దూరం ఊరు పోవడం ఎందుకు? అక్కడ ఇళ్ళ అద్దెలు కూడా చాలా ఎక్కువ. నువ్వూ పిల్లాడు మీనాన్నతో ఇక్కడే ఉండిపోండి. నేనొక్కడినే వెళ్తానా ఊరు. ఆర్నెల్లు ఎంతలో గడుస్తాయి? అన్నారాయన. నాకూ ఆయన చెప్పింది సబబు గానే అనిపించింది. అసలే నాన్న ఆరోగ్యం ఏమంత బాగాలేదు. పెద్ద వయసు, అంత దూరపు ఊరు పడిపోయామంటే ఆ గాలి మార్పు, నీటి మార్పుకి ఏం ముంచుకొస్తుందో ఏమో! ఆర్నెల్లు ఇట్టే గడిచిపోతాయి. ఆ మాత్రం దానికి మకాం మార్చడమెందుకు అనుకున్నాను. అసలే అక్కడ ఇళ్ళ అద్దెలు ఎక్కువంటున్నారు. ఆయనొక్కరూ వెళితే ఒక్క గది తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ సొంత ఊళ్ళొ పడి ఉండక అంత దూరం ఆర్నెల్లకోసమని మకాం మార్చడమెందుకులే అని,ఆయ్న చెప్పినట్టే ఇక్కడే ఉండిపోయాం. ఇలా అవుతుందని కల్లో కూడా అనుక్లేదు.ఆ పిశాచం ఆయన్ని పట్టుకుంది. నా ఉసురు తగలకపోతుందా దానికి?

* * *
గిరిజా! పిల్చాడు హరి.
ఏం కావాలండీ!
తల నొప్పిగా ఉంది. కాస్త అమృతాంజనం రాస్తావా?
ఈ మధ్య ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనబడుతున్నారు మీరు. మందురాస్తూ మనసులో మాట పైకి అంది.
అబ్బే నాకేం ఆలోచనలున్నాయి.
మరి ..మరి..నేనొకటి అడుగుతాను. ఏమీ అనుకోరుకదా..
అడుగు.
ఇన్నాళ్ళకి ఇప్పటికైనా కనీసం గుళ్ళో పెళ్ళికైనా ఒప్పుకున్నారు మీరు. బానే ఉంది. దానికైనా పెద్దల ఆశీర్వాదం ఉండాలి కదా?
మీ బామ్మ ఉందిగా?
నా వైపు నా అన్నవాళ్ళు ఉన్నది మా బామ్మ ఒక్కతే.
ఆవిడ ఆశీర్వాదం తప్పక ఉంటుంది మనకి. కానీ మీ తరపున..
చెప్పానుగా గిరిజా! నాకెవ్వరూ లేరు. ఒంటరివాడిని, నిన్ను పెళ్ళి చేసుకోవాలంటే నేనెవ్వరి అనుమతీ తీసుకోవలసిన అవసరం లేదు కూడా. నిన్ను చూసిన మొదటి రోజునే, నువ్వు కావాలనిపించింది నాకు. నీ కళ్ళల్లో ఏదో ఆకర్షణ. నన్ను నీ వాడిని కమ్మంది అంతే.. ఆ రోజు నుంచి ఎంత పిచ్చివాడిలా నీ చుట్టూ తిరుగుతున్నానో నీకు తెలియనిదా? అసలు పెళ్ళి చేసుకోకుండా. మనిద్దరం కలసి ఒకచోట ఉండకూడదా? నువ్వు నాకు నచ్చావు. నేను నీకు నచ్చాను అది చాలదూ.

ఏమో! ఈ సంఘం ఒప్పుకోదు.
సరే. అందుకే నీ తృప్తికోసం గుళ్ళో పెళ్ళి చేసుకుందామంటున్నాను ఆడంబరం నాకు గిట్టదు.
ఎంత విచిత్రంగా అయింది మన పరిచయం. జీవితాంతం నన్ను మీ నీడన ఉండనిస్తారుగా? గిరిజ కళ్ళల్లో బెదురు.

పిచ్చిదానా! ఏనాడో మనిద్దరం ఒకటి అయ్యాం. నువ్వు కావాలంటూ నేనే కదా నీ వెంటబడి నీ మనసు గెల్చుకున్నాను. అటువంటప్పుడు నువ్వు లేకుండా నేనుండగలనా?
అందంగా నవ్వాడు హరి.

* * *

ఆ రోజు. మీ ఇంట్లో ఒక గది అద్దెకిస్తారని తెల్సింది అంటూ నువ్వొచ్చిన రోజు నాకు బాగా గుర్తుంది నిర్మలా. అదే మొట్టమొదటిసారి నిన్నుచూడటమైనా, నీ మీద నాకు ఆ క్షణం లోనే మంచి అభిప్రాయం ఏర్పడిపోయింది. నీ మొహంలో అమాయకత్వం చూశాన్నేను. నీ మాట తీరులో వినయం కనబడింది నాకు.
నా అని చెప్పుకోడానికి ఉన్న ఒకే ఒక మనిషి ఈ మధ్యనే దూరమైంది. ఒంటరిదాన్ని. ఈ ఊళ్ళో ఉన్న ఒకే ఒక స్నేహితురాలి ద్వారా ఇక్కడ పెట్టిన ప్రైవేట్ నర్సరీ స్కూల్లో టీచర్ ఉద్యోగం దొరికింది అంటూ తలవంచుకుని మెల్లిగా చెప్పావు నువ్వు.
నీ మీద మంచి అభిప్రాయమే కాక, జాలి కూడా కలిగింది నాకు.

అసలే మీకు తలనొప్పీ, జ్వరం, ఇప్పుడవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఆలోచిస్తూ బుర్రకింకా పనిచెప్పకండి.
అదేది వినిపించుకోనట్టే తన ధోరణిలో తను చెప్పుకుపోతోంది సులోచన.

అలా మా ఇంట్లో అడుగుపెట్టిన నువ్వు. నాకు మా బాబుకీ కూడా ఆప్తురాలివైపోయావు. నా దగ్గరకంటే కూడా నీ దగ్గరే అల్లరి చెయ్యకుండా బుద్ధిగా ఉంటాడు వాడు. నీ మాటలూ, కబుర్లూ వాడికి ప్రాణం. నువ్వింట్లో ఉన్నంతసేపూ నిన్ను పట్టుకుని వొదలడు.
అనారోగ్యంతో, దిగుల్తో నిత్యం నేను మంచాన పడి ఉంటుంటే నువ్వే కదా వాడిని నాకంటే ఎక్కువ చూసుకుంటున్నావు. వాడి మొహంలో వాళ్ళ నాన్న పోలికలు చాలా ఉన్నాయి నిర్మలా. ఇరుగు పొరుగు కూడా అంతా అదే అంటారు కృష్ణగారి పోలికే అని. సులోచన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

మీ ఆరోగ్యం బాగుండాలంట్ ఇలా ప్రతి నిముషం దిగుల్తో, ఆలోచనల్తో బాధపడుతూ ఉండకూడదు. చెప్పడం తేలికే అనుకోండి..బాధ అనుభవించే వాళ్ళకి..నిర్మల గొంతు పూడిపోయింది. మ్నాట పుర్తి చెయ్యలేక పోయింది. చటుక్కున తల దించుకుంది.

మా ఇంట్లో మనిషిలా కలిసిపోయావు నువ్వు. మా బాబుకీ, నాకు నువ్వు చేస్తున్న సేవలు చూస్తుంటే మనిద్దరికీ ఏ జన్మలో బంధమో అనిపిస్తుంది.
అటు ఉద్యోగం ఇటు ఇంట్లో ఉన్నప్పుడు మాకు సహాయం చెయ్యడం..నాకు తోబుట్టువులు లేని లోటు నీవల్ల తీరింది నిర్మలా. నీది గొప్ప మనసు, నీ అంత మంచివాళ్ళు ఎక్కాడా ఉండరేమో!

అనవసరంగా పొగిడేస్తున్నారు నన్ను. అతి మామూలు మనిషిని నేను. నా అన్నవాళ్ళు లేనిదాన్ని. నా ఒంటరితనం నన్ను బాధపెట్టకుండా, మిమ్మల్ని నా వాళ్ళుగా భావించుకుంటూ తృప్తిపడుతున్నాను.
ఈ మాత్రం తృప్తి మీ వల్లనే కదా నాకు దక్కింది.

నా కథ తెలిసి నా మీద నీకు జాలీ. నువ్వు ఒంటరిదానివని నీ మీద నాకు జాలీ. సరిపోయింది కదూ మనిద్దరికీ. నీరసంగా నవ్వింది సులోచన.

వెళ్ళిన కొత్తలో ఆయన దగ్గర్నించి వెంటవెంటనే ఉత్తరాలొచ్చేవి నిర్మలా. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఉత్తరాలూ, మనియార్డర్లూ రావడం తగ్గిపోయింది.
నాకు కంగారు పుట్టింది. ఆ రోజుల్లోనే రంగారావు మావయ్య వచ్చాడోసారి. వొస్తూనే, అమ్మాయ్, సులోచనా! మీ ఆయన గురించి ఈ మధ్యనే ఒకళ్ళ ద్వారా వినకూడనిది విన్నాను. నువ్వు కాస్త జాగ్రత్త పడాలి. అన్నాదు. కృష్ణని ఓ వగలమారి వల్లో వేసుకుందిట.
దాని పిరి గిరిజట. అంటూ చావుకబురు చల్లగా చెప్పి మావయ్య దోవన మావయ్య వెళ్ళిపోయాడు. నాకు కాళ్ళూ, చేతులూ ఆడలేదు. ఆ తర్వాత నుంచీ ఆయన దగ్గర్నుంచీ ఉత్తరాలూ, మనియార్డర్లూ పూర్తిగా ఆగిపోయాయి. నేను ఏడవని రోజులేదనుకో. నన్నని ఆ ఊరు పంపించి విషయం తెలుసుకు రమ్మందామంటే మంచం దిగి ఇంట్ళోనే రెండడుగులు వెయ్యాలేని పరిస్థితి.
ఇంక అంతదూరం ప్రయాణం ఏం చెయ్యగలడు? నేను వెళ్దామంటె పుట్టినప్పటినుంచీ ఈ ఊళ్ళోనే తప్ప ఏ ఊరూ వెళ్ళి ఎరగనిదాన్ని..ఆ కొత్త ఊరు. అంత దూరం ప్రయాణం చెయ్యగల ధైర్యం, అక్కడాయన ఆచూకీ పట్టుకోగల చొరవ నాకు లేవు. ఇంకెవరున్నారునాకు దిక్కు?
మళ్ళీ ఆ రంగారావు మావయ్యే ఎప్పూడైనా ఈ ఊరొస్తే ఆయన్ని బతిమాలుకోవాలనుకున్నాను. ఏవో పన్ల మీద తరచుగా ఆయనీ ఊరొస్తూనే ఉంటారు. వచ్చినప్పుడు
దిగేది మా ఇంట్లోనే. మళ్ళీ నాలుగైదు నెలలగ్గానీ రాలేదు మామయ్య. అప్పుడాయన కాళ్ళా వేళ్ళా పడ్డాను..అప్పు చేసి రాను, పోనూ టిక్కెట్టుకి సరిపడా ఆయన చేతుల్లో పోశాను.ఎలాగైనా సరే ఆయన్ని కలుసుకుని,ఇక్కడికి తీసుకురమ్మని పంపించాను. మామయ్య ఆ ఊరెళ్ళాడే గానీ మొహం వేలఆడేసుకునివొచ్చాడు తిరిగి.

మీకింకా జ్వరం ఎక్కువైపోతోంది. అలా మాట్లాడుతూ ఉంటే.. పడుకోండి అక్కయ్యగారూ..నచ్చచెప్పాలని చూసింది నిర్మల.
మరేం పర్వాలేదు. నోరు విప్పి చెప్పుకునేందుకు నువ్వు తప్ప మరెవరున్నారు నాకు? రోజూ నీతో నా మనసులో బాధ చెప్పుకుంటే అదో తృప్తి.. కొంత బాథ దించుకున్నట్టుగా ఉంటుంది నాకు.

నిర్మల కళ్ళలో నీలి నీడలు కదలాడాయి.

మావయ్య తిరిగొచ్చి ఏం చెప్పాడో తెలుసా నిర్మలా? మీ ఆయన ఊళ్ళోలేడమ్మాయ్. ఆ ఉద్యోగానికే తిలోదకాలిచ్చేశాడు. ఆ గిరిజ ఎవత్తోగానీ మీ ఆయన్ని బుట్టాళో వెసుకోవడమే కాదు.
తెల్సిన వళ్ళ కంటబడకూడదని కాబోలు, ఆ ఊర్నించే లేవదీసుకు పోయినట్టుంది. ఇదంతా దాని పనే అయి ఉంటుంది. లేకపోతే ఉద్యోగం వదిలి అయిపూ, జాడా లేకుండా పోవాల్సిన అవసరం మీ ఆయనకెందుకొస్తుంది?
అన్నాడు నెత్తీ నోరు బాదుకున్నాను. గిరిజ ఎవత్తోగానీ దాన్ని తిట్టని రోజు లేదు నాకు. ఆ రాక్షసి కనబడితే పీక నులిమెయ్యాలని ఉంది. ఆయనెక్కాడున్నారో, ఎలా ఉన్నారో?

* * *

ఎక్కడికెళ్ళిపోయారండీ? నన్నొదిలిపెట్టి ఎందుకెళ్ళిపోయారు? నన్ను ప్రేమించానంటూ మీ అంతట మీరే నా జీవితంలో ప్రవేశించి...నాలో ఆశలు కల్పించారు. మిమ్మల్నే పూర్తిగా నమ్ముకున్నానె.. మనస్పూర్తిగా నన్ను మీకర్పించుకున్నానే. ఇన్నాళ్ళూ ఉన్నాట్తె
ఉండి హఠాత్తుగా నన్నొదలి పెట్టి ఈ ఊర్నించే వెళ్ళిపోయార్? ఇంత మోసమా? నేనేం పాపం చేశానని నాకీ శిక్ష. మన కాపురం మూడు రోజుల ముచ్చటేనా?
గిరిజ దుఃఖానికంతులేదు. అనుభవించినన్నాళ్ళు అనుభవించి మోజు తీరగానే ఫలాయనమంత్రం పఠించాడు హరి.

* * *
ఆ రోజు ఏదో పనిమీద ఆ ఉరొచ్చి, ఎప్పటిలాగే. అమ్మాయ్! సులోచనా ఎలా ఉన్నావ్? అంటూ ఇంట్లో అడుగు పెట్టాడు రంగారావు.
నిర్మల ఆ ఇంట్లో అద్దెకి వచ్చినప్పటి నుంచీ ఆయన కళ్ళు ఆమె మీద పడ్డాయి. ఆ మధ్య వచ్చినప్పుడొసారి చనువుగా వెకిలిగా ప్రవర్తించబోతే కరుకుగా సమాధానం
చెప్పి చీదరించుకుంది నిర్మల. ఆ కోపం..ఆ అవమానం ఆయన మనసులో అలానే ఉండిపోయింది.

దీకి కెంత గర్వం! ఏం చూసుకుని ఆ పొగరు.. అని కుతకుతలాడిపోతూనే ఉన్నాడు.

ఏడీ రవిబాబు? ఇప్పుడెలా ఉంది వాడి ఆరోగ్యం? ఈ మధ్య పెద్ద జబ్బుచేసి తగ్గిందట కదా వాడికి? ఈ ఊర్నించి వొచ్చిన వాళ్ళెవరో చెప్తే తెల్సింది. వాలు కుర్చీలో వెనక్కి చేరబడుతూ అడిగాడు రంగారావు యోగక్షేమాలు.

బాబు నిర్మల దగ్గిర ఆడుకుంటున్నాడు మావయ్యా. ఈ రోజు సెలవు కదా స్కూల్ కి. నిర్మల ఇంట్లో ఉందంటే పిన్నీ, పిన్నీ అంటూ ఒక్క క్షణం కూడా వొదిలిపెట్టాడు వాడు, నిజం చెప్పాలంటే నిర్మల దయవల్లే నాబిడ్డ నాకు దక్కాడు మావయ్యా. కంటికి రెప్పలా వాడిని చూసుకుంది. ఇటు నేను పడకేశాను. అటు వాడి అనారొగ్యమ్..సొంత వాళ్ళు కూడాచ్ెయ్యరు. అంతలా మమ్మల్ని చూసుకుంది. సులోచన అలా నిర్మలని పొగడడం ఏ మాత్రం నచ్చలేదు రంగారావుకి.

అప్పుడే వచ్చాడు రవిబాబు. అమ్మా అంటూ..
రా.రా..తాతయ్యొచ్చాడు..రా..కబుర్లు చెప్పు..అరే .. గొలుసేదిరా? గబుక్కున కొడుకుని దగ్గరికి తీసుకుని మళ్ళీ చూసింది సులోచన.
ఇందాక ఏడ్చి, గొడవ్బ చేసి నా మెళ్ళో గొలు’ఉ నీకు వేస్తే గానీ ఊరుకోలేదు కదరా, ఎలాగో అలా మరిపించి తర్వాత తీసుకో వచ్చులే అనుకున్నాను. తియ్యడం మర్చిపోయాను ఏదీ గొలుసు? మెళ్ళోలేదే..కంగారు హెచ్చింది సులోచన గొంతులో అయోమయంగా చూశాడు రవిబాబు.

ఏవో, అంటూ చేతులు తిప్పాడు బిక్క మొహం పెట్టి
అయ్యో! ఎక్కడ పడిపోయిందో ఏమిటో... ఎక్కడని వెతకనూ నేను? ఎక్కడెక్కడ ఆడావో!

తను ఇంట్లోంకి వొస్తుండగా గేటుదగ్గర మట్టిలో మెరుస్తూ కనిపించిన గొలుసు తీసి గప్ చిప్ గా జేబులో వేసుకున్న రంగారావు, ఒకసారి జేబు తడుముకుని తృప్తిపడ్డాడు.

నువ్వు మరీనూ! చిన్నపిల్లవాడు ఎక్కడికి పోయి ఆడతాడూ? వాడు వెళ్ళింది ఆ వాటాలోకే కదా? అక్కడే ఆగదిలోనే పడిపోయి ఉంటుంది. వెళ్ళి చూస్తే సరి. ‘హడావుడిగా ఇంట్లో వెతుకుతున్న సులొచన తెల్లబోయి చూసింది.
అదేమిటి మామయ్యా! నిర్మల గదిలో పడి ఉంటే ఈ పాటికి తీసుకొచ్చి ఇచ్చెయ్యదూ తను?

నల్లని వన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలనుకుంటావు. అందర్నీ నమ్ముతావు. ఏరోజు ఎవరి బుద్ధి ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు? ఇల్లంతా వెతికినట్టే ఆ గదిలో కూడా వెతికితే తప్పేముంది? అంటూనే నిర్మల వాటాలోకి ముందు తనే దారి తీశాడు రంగారావు.

రవిబాబు మెళ్ళో గొలుసులు ఇక్కడేవన్నా పడిపోయిందా? దీర్ఘం తీస్తూ ఆయనా గదిలో అడుగుపెడుతుంటే అప్రయత్నంగా తనూ ఆయన వెనుకనే నడిచింది సులోచన.
వాడు నా దగ్గర కొచ్చినప్పుడు మెళ్ళో గొలుసేదీ లేదే...తన చేతిలో వున్న చిన్న కిటికీలో మూలగా పెట్టేసి, తను అడ్డుగా నిలబడింది దానికి.

అయితే వాడు నీ దగ్గరికి రాకముందే, అంతకుమునుపే అదెక్కడో జారిపోయిందన్నమాట. మెళ్ళో వెయ్యమని ఒక్కటే పేచీ పెడుతుంటే, కొంచెమ్ సేపయ్యాక తీసేద్దామనుకుని వేశాను. తర్వాత దాని సంగతి మర్చిపోయాను. నిట్టూర్చింది సులోచన. కిటికీలో నిలబెట్టిన అట్టపెట్టె మీదే ఉన్నాయి రంగారావు చూపులు.

తాము ఆ గదిలోకొచ్చేసరికి, అందులో ఉన్నదేదో చూస్తోంది తమని చూడగానే కాస్త కంగారు పడ్డట్టే కనిపించింది. ఆ పెట్టెలో ఏవుందో? రంగారావులో ఆతృత మరి ఆగలేనంది.

కిటికీలో వెతుకుతున్నట్టు చూస్తూ, పెట్టె మీద చెయ్యి వేశాడు.
అది తియ్యకండి..త్వరతరగా అంది నిర్మల.
ఏం తీస్తే? వెకిలిగా నవ్వుతూ, అదోలా చూశాడు.
దయచేసి తియ్యకండి.
సులోచన భృకుటిముడి పడింది. ఏవుంది అందులొ? మావయ్య అన్నమాట నిజమేనేమో? గొలు’ఇ అందులో పెట్టిందేమో? ఆ పెట్టి దాచుకునే లోపలే తాము రావడం తో కంగారు పడుతూ కిటికీలో పెట్టింది..లేకపోతే ఆ బెదురు చూపులెందుకూ? ఆ పెట్టి తియ్యద్దని అనడమెందుకు? నిర్మలంత మంచి వాళ్ళు అరుదుగా ఉంటారని నమ్ముతున్న తన నమ్మకం అర్ధం లేని దేనా? మరి అలోచించలేకపోయింద్ ఏదో ఆవేశం వొచ్చినట్టుగా ఒకడుగ్ ముందడుగ్ వేసి, కిటికిలో అట్టపెట్టి అందుకుంది తను. ఇలా ఇచ్చెయ్యండి అన్నట్టు గబుక్క్ు
చెయ్యి చాపింది నిర్మల. ఆ భావం కళ్ళల్లో చుపిస్తూ..
సులోచన అనుమానం బలపడింది.
నిర్మల గుండెల్లో రాయిపడింది.
సులోచన ఎడమచేయి అట్టపెట్టి మూతతీసింది.
నిర్మల కుడిచేయి అదురుతున్న గుండెల్ని అదిమిపెట్టింది.
అట్టపెట్టెలో ఉన్న ఒకే ఒక చిన్న ఫోటో బయటికి తీసింది సులోచన.
నిర్మల కళ్ళల్లో నీరుబికి వచ్చింది.
సులోచన కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పయ్యాయి.
నిర్మల కళ్ళు నేలనంటుకుపోయాయి.
వెర్రిదానిలా చేతిలో ఉన్న ఫోటో వంక చూస్తుండి పోయింది సులోచన.
ఆ ఫోటో తన భర్త కృష్ణది.
ఫోటో మిద ఒక మూలగా రాసి ఉంది ‘ నా ప్రియమైన గిరిజా నిర్మలకి..ప్రేమతో హరికృష్ణ’ అర్ధమైంది సులోచనకి. తను రోజూ తిట్టుకునే ఆ గిరిజే ఈ నిర్మల...గిరిజా నిర్మల. తన భర్తని వల్లో వేసుకోలేదు. వంచింపబడింది.

 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 

 

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech