జాతర

 

                                                    - శైలజా మిత్ర

    
 

అవును ప్రశాంత్ చచ్చిపోయాడు. కాదు..కాదు .. నేనే చంపాను...ఒకప్పుడు లోకాన్ని నిరంతరం తన రాక్షసత్వంతో నమిలి నమిలి, మానసికంగా హింసించిన నరకాసురుణ్ణి చంపిన అమ్మవారులాగా, నన్ను నానా రకాలుగా హింసించి,నన్ను జీవఛ్ఛవంలా చేసిన, నిరంతరం చేస్తున్న ప్రశాంత్ ను నేను నిర్దాక్షిణ్యంగా చంపేసాను. సమాజం కోసం ఎన్నిమాతలు అన్నా పట్టించుకోకుండా, పిల్లల జీవితాలు ఏమవుతాయో అనే భయంతో ఎదురు చెప్పకుండా వున్న నేను ఇంటికంటె, పిల్లల జీవితాల కంటే నాకు జైలు లేదా ఉరి అయినా సంతోషమేనని నేనే చంపేసాను. ఆశ్చర్యం.. నాకింకా చంపాలని ఉంది. మళ్ళీ లేస్తాడెమోనని భయంగా మళ్ళీ మళ్ళీ చంపాలని ఉంది. అయినా నా చుట్టూ ఎవరెవరో మాట్లాడుకుంటున్నారు. చచ్చిపోయాడని, అయ్యో! ఎంతపని చేసింది అని..అసలు ఇది ఆడదేనా? తన పసుపు కుంకాలను తనకు తానే నేల రాసుకుంది..కనీసం బిడ్డలనైనా గుర్తుంచుకుందాని.. ఆడజాతికే చెదరని మచ్చని..ఎన్నెన్నో మాటలు ఇంకా పనిచేస్తున్న నా చెవులకు వినబడుతూనే ఉన్నాయి. అయినా నాకయితే ప్రశాంత్ చనిపోయాడనే మాట గొంతులో అమృతం పోసినట్టుగా ఉంది. ఎవరేమంటున్నా నేను అనుకున్నది సాధించాను అనే ధైర్యం నాలో పెరిగిపోతోంది.

ఎంతపని చేసావే..పిచ్చిదానా? నీలా అందరూ అనుకుంటే లోకంలోఎవరు బతికి ఉంటారమ్మా.. నువ్వు నాతో నిత్యం చెబుతున్నప్పుడల్లా నేను ఓపిక పట్టమని, చెప్తూనే ఉన్నాకదే. ఇప్పుడు చూడు నీ పిల్లలు ఎక్కడుంటారే? నేను నాన్నా ఎంతకాలమని బతుకుతాము?ఇలా నువ్వు అర్ధాంతరంగా జైలుకు వెళ్ళిపోతే నేనెలా బతాకాలే? కుటుంబానికి అప్రతిష్ట తెచ్చావు కదే! అంటూ అమ్మ దేవమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా నాకు బాధకలగటం లేదు.

ఏయ్, సుమా! ఏంటే ఈ పని? మొగుణ్ణి చంపడం గొప్పనుకుంటున్నావా? ఇపుడు నీ పిల్లల గతేంటి? నీకేమయినా పిచ్చి పట్టిందా? వాడు మొగాడే కొడతాడు, తిడతాడు కొన్నాళ్ళాగితే వాడే సరిపోయేవాడుగా..ఇప్పుడు మేము ఎలా తలెత్తుకు తిరగాలి? ఫలానావాడి చెల్లెలు ఇలా మొగుణ్ణి చంపిందని అందరూ అనుకుంటే రేపు మా పిల్లల బతుకు ఏమవ్వాలి? ఎంతపని చేసావు అంటూ అన్నయ్య ఈసడింపు!

అదికాదు సుమా! నువ్విష్టపడే చేసుకున్నావు కదా. ఇద్దరూ ప్రేమించుకున్నారు కదా..? అదేంటి ఇలా చేశావు? అయినా నేను అప్పుడే చెప్పాను కదా సుమా ప్రశాంత్ నువ్వనుకున్నంత మంచివాడు కాడని. అప్పట్లో నువ్వు ప్రేమలో ఉన్నావు నీకేమీ అర్ధం కాలేదు. అయినా ఎంతటి వెధవైనా చంపేస్తారా సుమా? నీకు ఆలోచన రాలేదా? ఇపుడు పసిపిల్లలు ఎలా బతుకుతారే? అంది పక్కనే కూర్చుని భారతి.

ఇంతలా మాట్లాడుతున్నా అలా మూగెద్దులా కూర్చుంటావేంటే? చేసిందంతా చేసి ఇపుడిలా ప్రవర్తించడానికి సిగ్గులేదు. నీ తర్వాత పెళ్ళికావాల్సిన చెల్లెలుంది. అసలే నువ్వు ఎవరితోనో వెళ్ళిపోయావని దానిని పెళ్ళి చేసుకోవడానికి ఎవరూ రావటం లేదు. ఇప్పుడిక ఇలా వింటే ఇంకేమయినా ఉందా?నీ లాంటి వారు పుట్టే కంటే చచ్చినా పీడ విరగడయ్యేది...పాపిష్టిదానా! అన్నాడు విసుగెత్తిపోయిన తండ్రి.

అన్నీ విన్నా తనకు తాను చేసింది తప్పనిపించడం లేదు. పోలీసులు వచ్చారు. వారి పని వారు చేసుకుపోతున్నారు. తనని జైల్లో పెట్టారు. విషయం ఒప్పుకోవడం మూలంగా పెద్దగా వాదోపవాదాలతో పనిలేక శిక్ష వేశారు. అయితే సుమ తన భర్తతో పడిన బాధలు తెలిసాక శిక్షాకాలం తగ్గించి ఐదేళ్ళు మాత్రమే వేశారు. విషయం తేలిగ్గానే తేలిపోయింది. ఇక మిగిలింది పిల్లలు అమ్మకు తప్పదు అనుకుంది. అలా అనుకుందో లేదో..ఎదురుగా అమ్మ, చెల్లి.

నిన్నిలా చూస్తుంటే, నా కడుపు తరుక్కుపోతోందే..నీ పిల్లల్ని ఐదేళు చూసుకోవడం నాకేమీ కష్టం, బరువు కాదమ్మా. కానీ నువ్వు బయటకొచ్చిన తర్వాతైనా లోకం నిన్ను బతకనిస్తుందా? పిల్లల్ని బతకనిస్తుందా? నీ జీవితం ఇలా అయిపోతుందని కలలో కూడా అనుకోలేదే. అంది ఏడుస్తూ.

అమ్మా..ఏడవకు..ఊరుకో అవతల సౌండ్ వస్తే పోలీసులు పొమ్మంటారు.
అంది చిన్నకూతురు దివ్య.

లేదులేవే..అడ్వకేట్ ప్రసాద్ మనకు బాగా ఎరిగున్నవాడే. మీనాన్నకు చిన్నప్పుడు స్టూడెంట్. అతను నన్ను కాస్సేపు మాట్లాడుకోమని పర్మిషన్ ఇచ్చేడు. నేను మీ నాన్నను కూడా రమ్మన్నాను. కానీ దీని ముఖం చూడనని భీష్మించుకుని కూర్చున్నారు అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ..

అక్కా! బావను పోగొట్టుకున్నప్పటినుండీ నివ్వేమీ మాట్లాడటం లేదు. కనీసం గట్టిగా ఏడనైనా ఏడక్కా. అలా మౌనంగా ఉండకు. నాకేంటో చాలా భయంగా ఉంది. అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ..

నిజమే దివ్యా..నేను ఇక మాట్లాడాల్సిందే..నేను పుట్టినప్పటినుండీ ఇప్పటిదాకా నేను దురదృష్టవంతురాలినని నన్ను వెలివేసి చివరికి నా కంచం, చాప, దుప్పటి, నా బట్టలు దూరంగా పెట్టినప్పుడే గట్టిగా ఏడవలేకపోయాను. ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నప్పుడు పొరపాటున నాన్న కంట్లో పడినప్పుడు తిట్లు, దెబ్బలతో నా ఒంటిని తూట్లు పొడిచినప్పుడు ఏడవలేకపోయాను. దేవతలాంటి అమ్మను నా పుట్టుకకు విపరీర్ధాలు తీసి నాన్న, అమ్మను నిత్యం చంపుకు తింటున్నప్పుడు నేను ఏమయిందో తెలీక ఏడవలేకపోయాను. చదువనేదే అవసరం లేదని, నన్ను పుర్తిగా ఇంటిపని చేయిస్తుంటే, నాకు నేనే కష్టపడి మార్కులు తెచ్చుకుంటే వినిపించుకునే వారే లేనప్పుడు ఒంటరిగా కూర్చుని ఏడవలేకపోయాను. నాలో అందం లేదని, నల్లగా ఉంటానని, నిరంతరం ఇంట్లో అంతా బాథపడి నన్ను అవమాన పరుస్తున్నప్పుడు నాకు ఏడుపురాలేదు. నాకోసం ఎవరొచ్చినా నేను పనికిరానిదాన్నని, బస్టాండ్ లొ పాటలుపాడి సంపాదిస్తుందిలే అని నిత్యం నాన్న హేళన చేస్తున్నప్పుడు నాకు కన్నీరే రాలేదు. పెళ్ళి పేరిట రెండో పెళ్ళి వాడిని, కాలు కన్ను లేనివాడిని తీసుకొచ్చి నీ ముఖానికి వేరే ఎక్కువ అని అన్నప్పుడు నేను ఏడవలేదు. కానీ, పసితనం నుండి ప్రేమ ముఖమే ఎరుగని నాకు ప్రశాంత్ కనబడి నాకోసం చచ్చిపోడానికి కూడా సిద్ధమే అంటే నేను మురిసిపోయాను. గాల్లో తేలిపోయాను. నాకు జీవితముందని గర్వపడ్డాను. నన్నూ ప్రేమించేవారున్నారని మురిసిపోయి నా సుఖాన్ని ఏ మాత్రం సహించలేని అమ్మ, నాన్నలకు నేను ఎందుకు భయపడాలనే ఆలోచన నాకు కలిగి నన్ను నన్నుగా ప్రేమిస్తున్న ప్రశాంత్ తో జీవితాన్ని సంతోషంగా గడపడానికి వచ్చాను. మొదట ఏడాది బాగానే ఉంది. రెండో సంవత్సరమ్ నుండి మొదలయ్యింది నా బాధ. అనుమానం, ఏదో మాట అనడం, పాతవేవో తవ్వి నా శీలాన్ని శంకించడం, ఎక్కువయ్యింది. వాడొక మృగం. వాడికి శరీరంతోనూ, మనసుతోనూ ఆడుకోవడమయితే తెలుసుకానీ ప్రేమించడం మాత్రం తెలియదని ప్రేమంటూ నా శరీరం కోసమే వెంటపడ్డానికి తెలుసుకోడాని నాకు ఒక సంవత్సరం పట్టింది. కనబడి పలకరించిన ప్రతీ ఆడదాన్ని అలానే ప్రేమిస్తాడనీ, ఒక్కొక్కరికి ఒక్కో టైము కేటాయిస్తాడని, అసలు వాడికి ఆరేళ్ల అమ్మాయి నుండి అరవై ఏళ్ళవరకు ఏ స్త్రీనైనా కామాన్ని తీర్చే ఒక యంత్రంలానే చూస్తాడని, నాకు ఏడాది గడిచేదాకా, తనమూలంగా మోసపోయిన ఒక స్త్రీ చెప్పేదాకా తెలియలేదు. అయినా ఏరోజుకారోజు మారకపోతాడా అనే ఆలోచిస్తూ ఉండిపోయాను. కానీ అలోచనే పొరపాటయ్యింది. నా జీవితాన్ని నా చేజేతులారా నేనే పాడుచేసుకున్నానని తెలుసుకున్నాను. అప్పటికే ఇద్దరు పిల్లలు. వారికోసమైనా జీవించాలని తాపత్రయపడ్డాను. కానీ, వ్యవహారం పూర్తిగా శృతిమించిపోయింది.ఆఖరికి ఈ బిడ్డలు కూడా తనకి పుట్టలేదనే నిందతో వీధంతా అరచి గోల చేశాడు. చివరికి నన్ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాలని తన స్నేహితునితో మాట్లాడుతుండగా నేను అనుకోకుండా వినడం జరిగింది. అది ఎలా అని తెలుసుకోలేకపోయాను. కానీ ఎన్నడూ లేనిది నాకు రాత్రి రెండు గ్లాసుల పాలు తెచ్చి ఇద్దరం ఇకమీదట నుండి చక్కని జీవితాన్ని గడుపుదాం అన్నప్పుడే నాకెందుకో అనుమానం కలిగింది. పాల గ్లాసులో ఒకటి కొద్దిగా రంగు మారి ఉండటం గమనించాను. నేనే మాటల్లో పెట్టి గ్లాసులు మార్చాను. అంతే దెబ్బకు చచ్చాడు. అయినా నాకు ఏడుపు రాలేదు. నాకు రాదు కూడా. వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు అంటూ విరగబడి నవ్వుతోంది. నవ్వుతోంది..నవ్వుతూనే ఉంది.

సుమకు ఎందుకో చాలా భయం వేసింది. తనకంతా అయోమయంగా ఉంది. పాపం! అక్క ఎంతగా అవేదన చెందిందోకదాని మొదటిసారిగా మనసుకు అనిపించింది. తల్లి దేవమ్మకు కన్నకూతుర్ని ఇంతగా క్షోభ పెట్టామా అని తెలుసుకుని కుమిలిపోయింది. సుమ జీవితం ఇలా అయిపోవడానికి కారణం తల్లిదండ్రులుగా మేమే కదా అని ఆవేదన చెందింది. మౌనంగా ఇంటిదారి పట్టారు. కానీ ఇద్దరి మనసులు మాత్రం అల్లకల్లోలంగా ఉన్నాయి.

అమ్మా! అక్క పిల్లల్ని మాత్రం తక్కువగా చూడకండమ్మా అంది మెల్లగా బాధను దాచుకుంటూ..
సమాధానంగా ఏమీ చెప్పలేకపోయింది దేవమ్మ.

* * *

ఊ చెప్పు..ఎందుకింత లేటు..అంది అపరకాళిలా అవతారమెత్తి సంధ్య.
నిజం. సంధ్యా.. ఈరోజు స్టాఫ్ లో చాలామంది లీవ్ లో ఉన్నారు. దాంతో పని ఎక్కువయ్యింది. కావాలంటె..శివాజీని అడుగు.
మధ్యలో ఆ వెధవెందుకు? చెప్పు..ఉదయం నేను ఫోను చేసినప్పుడు నీ సెల్ ఎందుకు ఎంగేజ్ డ్ లో ఉంది. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆడా, మగా? ఆడయితే ఎంతకాలం నుండి పరిచయం..నిన్నటి నీ సెల్ లో ఇప్పుడె వచ్చేస్తున్నా అని ఎవరికి మెసేజ్ ఇచ్చేరు? ఎక్కడికి వెళ్ళేరు? చిట్టా విప్పింది.

అబ్బా..సంధ్యా..అర్ధం చేసుకోవు..ఉదయం రాజేష్ మాట్లాడాడు. చాలా కాలమయిందని కాస్సేపు మాట్లాడాను. వాడికే నేను ఇంటికి రావాలా? ఆఫీసుకు వస్తావా అని మెసేజ్ ఇస్తే అలా సమాధానం ఇచ్చాను. అయినా సంధ్యా నువ్వనుకున్నంత నీఛుడ్ని కాదు. నాకు ఆడపిల్లల్తో మాట్లాడటం వారితో తిరగటం లాంటి అలవాట్లు చిన్నతనం నుండి లేవు. కావాలంటే మా అన్నయ్యని అడుగు. లేదా మా ఇంట్లో ఎవర్నయినా అడుగు అన్నాడు బ్యాగ్ ను పక్కన పెడుతూ..శ్రీనివాస్.

నీగురించి మీవాళ్ళు ఎందుకు నిజం చెబుతారు. ఎవరి బిడ్డ వారికి ఎలాంటివాడైనా గొప్పోడే కదా! అయితే మొన్న నీకు ఆ గీత ఎందుకు ఫోన్ చేసింది.
అదేంటి సంధ్యా..అలా మాట్లాడతావు? ఆ రోజు నేను తలనొప్ప్లని ఇంట్లో ఉండిపోతే బాస్ ఏద్ ఫైల్ అడిగితే నా కబోర్డ్ కీస్ ఎక్కడపెట్టానని అని అడిగింది. అంతే. ఆ విషయం ఆరోజే అప్పుడే చెప్పాను కదా. అరచినంతపనిచేశాడు శ్రీనివాస్.

ఏమో? ఆ ఫోనులో ఏమి మాట్లాడుకున్నారో నాకేమయినా వినిపించిందా? ఏమైనానా? మీరేం చెబితే అది వినాల్సిందే కదా. అంది లోపలికి వెళ్తూ సంధ్య.

నూర్ముయ్..బుద్ధిలేకుండా మాట్లాడకు. నోటికి వచ్చిందల్లా..మాట్లాడటం నీకు అలవాటయింది అని కాస్త కోపంగా అనేలోగానే చేతికందిన ఫ్లవర్ వాజ్ ను మీదకి విసిరింది. దాంతో నుదుటికి పెద్దదెబ్బే తగిలింది. వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు. కట్టుతో ఇంటికి వచ్చి ఇంత దెబ్బ తనకు తగిలినా సరే కనీసం సారీ అయినా చెప్పకుండా ఇక ఆ గీత దగ్గరనుండి పరామర్శలు వస్తాయేమో! అనడం శ్రీనివాస్ భరించలేకపోయాడు.

సంధ్యా నువ్విలా ప్రవర్తించడం ఏమైనా బావుందా? కనీసం నేను ఒక మనిషినని కూడా నీకు కనబడుట లేదు. నేనేమయినా నిన్ను అన్నానా? అడిగాడు ఉదయం లేచి ఆవేదనగా?

తలకు దెబ్బేగా తగిలింది. నేనేమీ చంపలేదుగా? సంతోషించండి. అని విసురుగా వెళ్ళడంతో శ్రీనివాస్ అహం దెబ్బతిని అయితే సంధ్యా ఇక మనం కలిసి ఉండలేం..విడిపోదాం..అన్నాడు కోపంగానే..

పీడా వదిలిపోయింది..ఆ పనిచేయి..అంటే నువ్వు గీత ముందుగానే తయారయ్యారన్నమాట. నన్ను అడ్డు తొలగించుకోమని అదే చెప్పిందా..అలాగే అయిఉంటుంది. అంది గిన్నెలు నేలపై పడేస్తూ.

సంధ్యా నీకు పిచ్చా? గీతకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లల తల్లి. నాకు సీనియర్. ఆవిడ నన్ను తమ్ముడు అంటుంది తెలుసా? నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? నాకయితే అర్ధం కావడం లేదు. అయినా నీతో నాకు మాటలేమిటీ? చీ, చీ రానురానూ నాది పాడు జన్మయిపోయింది. అనుకుంటూ బయటపడ్డాడు శీనివాస్.

* * *
సంధ్యా..సంధ్యా
ఏంటారుపులు..ఇంట్లో ఎవరికీ చెవుడు లేదు. మెల్లగా మాట్లాడు. అంది సంధ్య ఏమాత్రం మర్యాదలేకుండా.

నేను నిన్ను కట్నం కోసం వేథిస్తున్నానా? నిన్ను చంపేస్తానని రాత్రి కిరోసిన్ డబ్బా కొన్నానా? నాతో పాటు నోరే లేని అమ్మను కూడా ఇరికించి కేసు పెడతావా? ఎంత ధైర్యమే నీకు... లేని మాటలు నిలబడతాయనుకోకు..అన్నాడు కోపంగానే..

నేను ఆడదాన్ని. లేనిమాటలు మాట్లాడతానని లోకమేకాదు చట్టం కూడా నమ్మదు. మేము ఏడిస్తే మీకు పుట్టగతులుండవు. కట్నం కేసు పెడితే కనీసం ఏడేళ్ళూ జైలుగోడల మధ్య కుళ్ళి కుళ్ళీ చావల్సిందే.. అంటూ విరగబడి నవ్వుతోంది సంధ్య.

అవును..ఎక్కడైనా ఆడవారికి న్యాయం జరగాలని ప్రభుత్వం కొన్ని చట్టాలు తెచ్చింది. అంతేకానీ, నీలాంటి వారికి కాదు. అదీ నేను చెబుతా అవసరమైతే మినిష్టర్ ను కలుస్తా నా నిజం ఏ ఒక్కరికైన వినిపించక మానదు.

నిజం ఎవరికి కావాలి శ్రీనివాస్. నేను ఏది చెబితే అదే చట్టం. గృహ హింస నేరం కింద నీ సిగెరెట్టుతో నేను కాల్చుకున్నా అంటూ ఒంటిని చూపుతూంటే శ్రీనివాస్ కళ్ళు తిరిగిపోయాయి. నీకు తగిలిన ఆ దెబ్బ కూడా నాపై నువ్వు కిరోసిన్ పోస్తుంటే నేను ప్రాణరక్షణకు తోసాను నువ్వు ప్రమాదవశాత్తు పడ్డావని ఇప్పటికే అన్నీ చెప్పాను. మీకోసం జైలు గోడలు ఎదురుచూస్తున్నాయి. అంటూ నవ్వుతున్న తీరు చూస్తుంటే నిజంగానే చంపేయాలన్న కోపం వచ్చింది. కానీ అప్పటికే చెయ్యి దాటిపోయింది. పోలీసులు గృహహింస కేసు కింద శ్రీనివాస్ ను తన తల్లితో సహా అరెస్ట్ చేసారు. వెంటవెంటనే సంధ్య అవేదనవి విషయం ఏమిటో కూడా తెలియకుండా మహిళా సంఘాలు సంధ్యకు న్యాయం చేయాలని వారి పనిని వారు చేసుకుపోతున్నారు. టివీలలో సంధ్యపై చర్చ కూడా జరుగుతోంది. అలాంటివారిని ఉరితీయాలి. లేదు లేదు కాళ్ళు చేతులు నరికి పోగులు పెట్టాలి అంటూ మహిళలు తమ తమ ఉనికిని వారు చాటుకుంటున్నారు.

* * *
బాధలకోర్చ లేక సుమ జీవితం అర్ధం లేనిది అయితే, చట్టాల్ని దుర్నినియోగం చేసే సంధ్య లాంటివారు లోకంలో లేకపోలేదు. అయితే పురుషుల వల్ల స్త్రీలు బాధలు పడుతున్నారనేది ఎంత నిజమో, అదే విధంగా ఒక కోణంలోంచి గమనిస్తే పురుషులు కూడా స్త్రీల ములంగా ఎంతో నరకం అనుభవిస్తున్నది కూడా నిజం. అయితే న్యాయం ఉన్నా లేకున్నా, ఇలాంటి రెండు రకాల జీవితాలు జైలు గదుల్లో జీవితాల్ని వెళ్ళదీస్తున్నదీ నిజమే. తప్పులు రెండు చోట్ల జరుగుతున్నా శిక్షమాత్రం ఒకరే అనుభవిస్తున్నది నిజమే!! ప్రస్తుతం మనం జీవితంలో జీవం లేదు. జాతరలో బలిపశువుల్లా ఉన్నాము. ఎ వేటకు ఏ ప్రాణం బలి అవుతుందో అర్ధం కాని తీరులో ఉంది.

వీళ్ళు బతికున్న శవాలు. వీరు చేజారిపోయిన జీవితం కోసం మళ్ళీ పుడతారు. అపుడు మనుషులుగా కాదు. అయుధాలై పుడతారు. నిరంతరం వేటాడుతూనే ఉంటారు. అవును సమాజ ఉద్ధరణ కోసం మనసుల కంటే ఆయుధాలే ముందు ముందు అవసరమేమో!

 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech