భగవాన్ శ్రీమద్రమణ మహర్షి

                                                                                 –  తణికెళ్ళ విశ్వనాథం
 

    

ప్రతిమనిషి తన జీవితంలో బాల్యం, యవ్వనం, కౌమారం, వృధ్దాప్యం మొదలగు శారీరక మార్పులు పొందుతూ ఉంటాడు. అలాగే సుఖదుఃఖాలు, రాగద్వేషాలు చిక్కులు, సమస్యలు మున్నగు వ్యవహారములతో మునిగి తేలుతూ ఉంటాడు. వీటన్నింటిలోనూ అనుసరించి ఉండే ప్రాథమిక భావము ‘నేను’. వ్యవహారికంగా ‘నేను’ జనన మరణాల మధ్య కొట్టుకు మిట్టాడుతూ ఉంటాడు. అదే అధ్యాత్మికంగా ‘నేను’ అనునది సనాతన సత్యమైన ఆత్మ స్వరూపము.

అసలు ‘నేనెవరు’ అని ఎంతోమంది పరిశోధనలు జరిపి తమ అనుభవాల ద్వారా వ్యక్తపరిచారు. దేహం పోతే జీవుడు లేడు, కాబట్టి దేహమే జీవుడన్నారు. అందు ఉన్న ప్రాణమే కానీ,స్థూల శరీరం కాదన్నారు కొందరు. వ్యవహార లోలులు చేసిన ఇంద్రియ సమూహమే జీవుడన్నారు మరికొందరు. అదీకాదు, వీటన్నింటినీ నియంత్రించే ‘బుద్ధే’ జీవుడన్నారు. అయితే నిద్రావస్థలో ఇవన్నీ ఉపసంహరింపబడ్డాయి కదా, అప్పుడున్న శూన్యమే జీవుడన్నారు. ఈ విధంగా ఎవరి అనుభవాలు వారు వెల్లడించారు.

ఆనాడు తపః సంపన్నులైన ఋషీశ్వరులు, తమ స్వార్ధమునకు గాక, లోకాలను పునీతం చెయ్యడానికి తప్పస్సు నొనరించి, అంతర్ముఖంగా తమ అనుభవాలను పురాణ ఇతిహాసాలు, భాష్యాల ద్వారా మనమేమిటో, జగత్ ఏమిటో, సనాతన సత్యమేమిటో తెలియజెప్పారు.సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ఉదాహరణలతో మనముందుంచారు. అటువంటి మహామహుల్లో భగవాన్ శ్రీమద్రమణ మహర్షి యొకరు.

తమిళనాట తిరుచ్చి గ్రామములో సుందరయ్య ఆలఘమ్మ దంపతులకు 29.12.1879 న పుత్రుడు జన్మించెను. ఆ బాలునికి వేంకటేశ్వరుడు అని పేరు పెట్టారు. స్కూల్లో వెంకట్రామన్ గాను, ఇరుగుపొరుగు వారికి రమణగారు ముద్దు బిడ్డడయ్యాడు. ఎనిమదవయేట ఉపనయం అయి తిరుచ్చిలో తమిళం సమగ్రంగా నేర్చుకున్నాడు. 1890 సంవత్సరంలో వెంకటరమణ మధురైలో స్కూలుకి వెడుతున్న ఆటలందు అభిరుచి, చదువుయందు అశ్రధ్ద కనిపించసాగాయి. 1892 లో తండ్రి కాలం చేసిన తర్వాత కూడా అతనిలో మార్పురాక, చదువు పెద్దగా అబ్బలేదు. సంఘంలో పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉద్యాగాలు చేసి, కుటుంబ పోషణ భారంలో పాలుపంచుకోవటం పరిపాటి. కానీ వెంకట్రామన్ కు ఆ దృష్టియే లేకుండెను.

ఒకనాడు వెంకట్రామన్ దైవికంగా ఒక బంధువు ఎదురయ్యాడు. ఆయనను ఎక్కడ నుండి వస్తున్నారని అడిగాడు వెంకట్రామన్. ఆయన అరుణాచలం నుండి వస్తున్నట్లు చెప్పాడు. అది వినగానే వెంకట్రామన్ మనస్సులో ఒక అద్భుతమైన చైతన్యం కలిగి, కళ్ళుమూసుకుని ధ్యాన నిమగ్నుడయ్యాడు. అరుణాచలం గురించి అతనిలో అంతరంగంగా, ఏదో తెలియని అనుభూతి పొందాడు. క్రమేపి అతని జీవితంలో పెనుమార్పు కనిపించుట ప్రారంభమైనది. ఒకనాడు డాబా మీద ఒంటరిగా కూర్చున్నాడు. పరిపూర్ణ ఆరోగ్యంతో నున్న అతనిలో హఠాత్తుగా చనిపోవుతున్నట్లు భావన, శరీరం స్వాధీనము తప్పుచున్నది. శ్వాస ఆడుటలేదు. కనులు మూతపడుచున్నవి. కానీ అంతయూ తెలియుచున్నది.

ఇరుగుపొరుగు వారిని కానీ , డాక్టర్ ని గానీ పిలవాలని అతనికి తోచలేదు. ఆ సమయంలో వెంకట్రామన్ అంతర్ముఖుడై ‘నేను ఈ శరీరం కాదు. తను శరీరం కన్నా భిన్నమైన వాడినని స్ఫురించెను. తను ఈ స్థూల శరీరం కాదు కాబట్టి మృత్యువు తనను తాకలేదను ధైర్యం కలిగింది. జగత్తు వ్యవహారాలన్ని తనయందే లీనమైనట్లనిపించింది. ఆనాటి నుంచీ తనయందు తను లీనమగుట నిత్యకృత్యమైనది.

క్రమముగా అతనికి ఆత్మధ్యానమందాసక్తి, లోక వ్యవహారములందు అనాసక్తి పెంపొంది ధ్యాన నిమగ్నుడవుతుండెను. చదువుకోమని చెప్పిన పెద్దల మాట పెడచెవిన పెడుతున్నాడని పెద్దవాళ్ళ ఏవగింపులు ఎక్కువయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో తనకు అక్కడేమి పని అని అరుణాచలమునకు బయలుదేర నిశ్చయించాడు. ఒకరోజు అన్నగారు స్కూలు ఫీజు ఇచ్చి కట్టమని చెప్పగా, ఇది దైవికమనుకొని అందుక్కావలసిన పైకము తీసుకుని సెప్టెంబర్ 1896 లో బయలుదేరి అరుణాచలమునకు వెడలిపోయెను.

వెంకట్రామన్ అరుణాచల సన్నిధిలో స్వామిని చేరి, అపరిమితానందభరితుడై ఆనందాశ్రువులతో స్వామిని మ్రొక్కెను. ఆ దినము మొదలు, ప్రతిదినం స్వామిని దర్శించి ధ్యానము చేయుట నిత్య దినచర్య అయ్యెను. కొన్నాళ్ళకు యజ్ఞోపవీతం తీసివేసి కౌపీనము ధరించి ఆలయ చుట్టుప్రక్కల ప్రదేశములందు ధ్యాన నిమగ్నుడవుచుండెను. కానీ కొందరు ఆకతాయిల అల్లరలకు ఆయనకు ధ్యానభంగము కలుగుచున్నదని, ఎవరూ చేరని ప్రదేశమగు పాతాళగంగ గుహకి పోయి అక్కడ తదేక దీక్షతో తపస్సొనరించెను. ఆ సమయమున తేళ్ళు పాములు మొదలగు విషకీటకములు కరిచి బాధపెట్టినను ఆయనకు ఎరుకలేదు. ఆ విధంగా కొన్నేళ్ళు తపస్సు చేసిన ఆయన, ‘బ్రాహ్మణ స్వామి’ గా గుర్తింపబడి పలువురు ఆయన దర్శనమునకై రాదొడగిరి.

వెంకట్రామన్ తల్లి ఆయనను ఇంటికి తీసుకువెడదామని వచ్చి బ్రతిమలాడింది. అప్పటికే సనాతన సత్యాన్ని తెలుసుకున్న వెంకట్రామన్ కు సంసార వ్యవహారములేవీ పట్టలేదు. అందుకే ఆయన నిరాకరణే తల్లికి సమాధానమైంది. తల్లి నిరాశత్ మరిలిపోయెను. తదుపరి వెంకట్రామన్ విరూపాక్ష గుహకి పోయి 1916 దాకా ఏకాగ్రతతో తపస్సునందు నిశ్చలుడై ఉన్నాడు. ఎందరో ఆయన దర్శనము చేసుకుని తత్వ శాస్త్రమున సందేహ నివృత్తిగావించుకొనేవారు. కావ్యకంఠ బిరుదాంకితుడు శ్రీ గణపతి శాస్త్రిగారు, గురుభావంతో రమణమహర్షి మీద ‘రమణ పంచకము’ , ‘రమణగీత’ రచించారు. ఆయన రచనలో మహర్షి సాధారణ మానవుడు కాదని, సాక్షాత్తు భగవత్ స్వరూపుడని అందుకు ఆయనను ‘భగవాన్ శ్రీమద్రమణ మహర్షి’ అని కీర్తించాడు. మహర్షి ఖ్యాతి నలుదిశలా వ్యాపించి, ఎంతోమంది భారతీయులే కాక, విదేశీయులు హంఫ్రీస్, పాల్ బ్రాంటన్, కొహెన్ చాస్విక్ మొదలగువారు ఆయనను గురుభావంతో దర్శించి వారి అనుగ్రహమును పొందారు.

1917 ఏప్రిల్ లో ఆయన తల్లి వచ్చి, కొండకింద ఆశ్రమవాసి అయినది. అయిదేళ్ళ తర్వాత విముక్తురాలను చేసి ముక్తి కలుగునట్లు అనుగ్రహించెను. తర్వాత తల్లి సమాధివద్ద ఆశ్రమము నిర్మించి చివరిదాకా అక్కడనే ఉండి ఎందరో భక్తులను అనుగ్రహించారు. కొందరు ఆయన ఒనర్చు విగ్రహారాధనను పరిహసించగా, అథమ విగ్రహమైన ఈ స్థూల దేహమునకు ఉపచారములు చేయగా లేనిది, ఆ పరమాత్మ రూపమైన విగ్రహానికి ఏల పూజించరాదు అన్నారు. మన దేశీయులే గాక వివిధ దేశాల నుండి వచ్చిన జిజ్ఞాసులకు, ఆత్మబోధచేసి యోగసాధన ద్వారా వారికి తమకు తాముగా అజ్ఞానాంధకారము నుండి తేరుకుని నేను, నీవు, నాది అనే భేద ప్రవృత్తులు పోయి సనాతన సత్యాన్ని తెలుసుకునేటట్లు చేసిన మహాజ్ఞాని శ్రీ భగవాన్ రమణమహర్షి.

ఆయన బోధించిన తత్వ సారాంశం. అన్ని అవస్థలలోనూ ‘నేను’ అంటూ అనుసరించి నిరంతరం నీలోనే ఉండి, జ్ఞాన జ్యోతిగా ప్రకాశించే ముర్తివే నీవు. త్వక్, మాంస, రుధిర, స్నాయు, మేథో, అస్థి సంకులమైన ఈ శరీరం ‘నేను’ కాదు. ‘నేను’ అనునది ఆత్మస్వరూపము. అదే ఎరుక స్వరూపం. అదే నిర్వికల్ప, నిర్గుణ, నురుపాధిక సత్తా అయిన పరబ్రహ్మము.అన్ని రూపాలు తానే అయినవి. సృష్టిలో అన్నే వేరువేరుగా కనిపించినా,వాటిలో చైతన్యస్వరూపంలో ఒకే ఆత్మ ప్రకాశిస్తోంది. అది ప్రాణం కంటే భిన్నమైనది కాబట్టి ఆత్మకి మరణం లేదు. మనస్సు కంటే వేరే అయినది. కాబట్టి రాగద్వేషాలు, సుఖఃదుఃఖాలు లేవు. ఆత్మ చైతన్యం శక్తి నుండి అజ్ఞానమైన తలపులే మనస్సు. ఇది నేను ఆనందానికి హేతుబంధమైన అవిద్యా స్వరూపం. మనస్సు నుండె జగత్తు,అందు వ్యవహారాలు కల్పించబడ్డాయి. దానిని మరలా సాలిపురుగులా తనయందే లయమొనర్చును. అన్ని అవస్థలకు ఈ మనస్సే కారణము. సుషుప్తి నందు మనస్సు లీనమైపోవును. కావున జగత్తు ఉండదు. మేఘములు వాయువుచే రావింపబడును. కొనిపోబడును కూడా. అదే విధంగా మనస్సు బంధమును గాక మోక్షమునూ కలుగజేయును. నేనెవరను విచారణ చేత మనస్సణుగును. నేను ఈ శరీరం కాను. ఎరుక స్వరూపాన్ని అన్న సత్యాన్ని తెలుసుకున్నాక, ఉన్నది తానేనని, అది పరమాత్మ స్వరూపమని సృష్టి అంతా తనలోనే ఉందని తెలుసుకుంటాడు. ఇది తెలియక జనన మరణాల మధ్య కొట్టుకు మిట్టాడుతూ ఉండడం అజ్ఞానం. ఈ అజ్ఞానంతోనే ఆకాశం నీలంగానూ, ఒయాసిస్సులో నీళ్ళను చూస్తున్నాడు. అజ్ఞాని మనస్సు జగత్తుని, జ్ఞాని మనస్సు పరబ్రహ్మమును వదలదు. అన్నీ మారినా ‘నేను’ మారదు. తాను ఎవరని విచారించి, అవాస్తవిక స్థితికి వచ్చి యదార్ధమును అనుభవ పూర్వకంగా తెలుసుకునుటే ముక్తి. పరమాత్ముడు ఏకరూపం. రెండో వస్తువు లేదు కాబట్టి నిత్యం, నిర్మలం. మనస్సుకు అతీతం కాబట్టి ప్రశాంతం. ‘నేను’ కి ఆధారం మార్పులేని పరమాత్మ. జీవితకాలంలో మనదృష్టి, జగత్తు వ్యవహారాల మీద లగ్నమై ఉన్నంతకాలం ‘నేను’ అనేది మరుగున పడి ఉంటుంది.

మనలను పునీతం చేయడానికి దేహం ధరించిన సగుణ బ్రహ్మ ఆయన. దేహం ధరించిన ప్రతీ జీవి కర్మానుబంధులే. కర్మానుసారంగా ఆయనకు కూడా చికిత్సకు లొంగని వ్రణము చేతిమీద లేచింది. వచ్చిన భక్తులు కొందరు దానికి మందు రాసి కట్టు కడుతూ ఉండేవారు. కొందరు భక్తులు ఇంత గొప్ప తపః సంపన్నులు ఆయనే సంకల్పించి చేతిపుండును నయం చేసుకోవచ్చు కదా అని ఆయనతో అన్నారు. ఆయన నేను దేహాన్ని కాదు. దేహమందున్న సచ్చిదానంద స్వరూపుడను అని తెలుసుకున్న జ్ఞాని. అందుకని దేహధర్మాలు వారికంటవు. అందుకే ఆయన అన్నారు. ఈ పుండును నేనేమన్నా రమ్మంటినా పొమ్మనుటకు. మీరు చేయు సేవలకు అది ఎందులకు పోవును. అయినా ఇది నా దేహమని దానికి ఒక చేయి ఉందని, చేతి మీద పుండు ఉందని నాకు స్ఫురణ లేదు అన్నారు. తుదకు 1950 ఏప్రియల్ 14వ తేదిన శుక్రవారం ఆయన దేహం చాలించారు. భక్తులు ఆశ్రమమందే ఆయన సమాధిని నిర్మించారు. ఈ రోజుకీ దేశవిదేశాల నుండి ఎందరో భక్తులు రమణాశ్రమమును దర్శించి, భగవాన్ శ్రీమద్రమణ మహర్షి అనుగ్రహమును పొందుతూనే ఉన్నారు.

 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech