సంస్కృతీ విలువలు - భవితకు పునాదులు

                                                                                                                   – సత్యశ్రీ

    

`యథా యథాహి ధర్మస్య, గ్లానిర్భవతి భారతః అభ్యుర్ధాన మధర్మస్య  తదాత్మానం సృజామ్యహం' అంటాడు గీతలో శ్రీకృష్ణుడు. గీత అంటే ఎప్పుడొచ్చిన సినిమా లేదా ఆ అమ్మాయి ఎవరూ అనే రోజుల్లో ఉన్నాం మనం. పెద్ద వాళ్ళల్లోనే కొందరికి తెలిసినా మరికొందరికి ఎప్పుడో చిన్నప్పుడు విన్న గుర్తు అనే స్టేజీకి వచ్చేసారు చాలామంది. మరిక పిల్లల సంగతి చెప్పక్కర్లేదు.

మన భాష, సంస్కృతి, సాహిత్యం, కళలు, కళాకారులు సజీవంగా ఉండాలి. భావితరాలకు తెలియజెప్పాలి అంటూ విదేశాల్లో తెలుగు సంఘాలు అనేకం వారి శక్తి మేరకు కృషి చేస్తూనే ఉన్నాయి. వారు తమ తమ దేశాల్లో చేసుకుంటున్న పండగలకు, కార్యక్రమాలకు భారత దేశం నుండి కళాకారులను తీసుకువెళ్ళి ప్రదర్శనలిప్పించి సమున్నంతంగా గౌరవించి పంపిస్తున్నాయి. తెలుగు సంఘాల పుణ్యమా అని వేరే దేశం వెళ్ళి తమ ప్రతిభను చాటిచెప్పి అక్కడి ఎన్.ఆర్.ఐ.లచే సన్మానాలు  పొంది తిరిగి భారత్ కు వచ్చి మరింత పేరు తెచ్చుకుంటున్నారు. మరి ఇక్కడ భారతదేశంలో ఏ కార్యక్రమం జరిగినా, లేదా పండగలప్పుడైనా తెలుగు కళలు, జానపదాలు, సాహిత్యం, సంగీతం, నృత్య ప్రదర్శనలు ఉన్నాయంటే ఆ కార్యక్రమాలకు జనమే రారు. మరి అదే ఏ సినీ హీరోయిన్నో, లేదా సంగీత దర్శకుడో / దర్శకురాలో ఆడి, పాడి జనాలను ఉర్రూతలూగించేసే వారు వస్తారని ప్రచారం చేస్తే హౌస్ ఫుల్ గా జనం వచ్చేస్తారు.  

పెద్ద, చిన్న, యూత్ అని తేడా లేకుండా అందరూ సినీ మోజులో పడి కొట్టుకుపోతున్నారు. సినిమా హీరో, హీరోయిన్లే ప్రాణం, ఆరాధ్యదైవాలు. వారు వేసిన డ్రెస్ లు, చెప్పే డైలాగ్ లు ఇవే కావాలి. పాటలు, డ్యాన్సులకైతే ఇక చెప్పక్కర్లేదు. టి.వి. పెడితే చాలు ప్రతీ ఛానల్ లోనూ పాటలు, డ్యాన్స్ ప్రోగ్రామ్ లు లేవంటే ఆశ్చర్యపోవాలి గానీ ఏ దైవ సంబంధమైన కార్యక్రమమో ప్రైమ్ టైమ్ లో వేస్తే అది అతిశయోక్తి అవుతుంది. 

ఎంతో శ్రమించి, ఎందరో పోరాటాలు చేసి, టీవీలలో, పత్రికలలో ఊదరగొట్టితే ఎట్టకేలకు మన ప్రభుత్వం స్పందించింది కనుక తెలుగుకు ప్రాచీన భాష హోదాను తెప్పించుకోగలిగాం. ఇంతా చేస్తే ప్రతీ తెలుగు వాడు గర్వకారణంగా భావించే భాగ్యనగరంలో మకుటాయమానంగా చెప్పుకోదగిన కట్టడాల్లో ఒకటైన తెలుగు లలితాకళాతోరణానికి నిధులిచ్చి అభివృద్ధి చేస్తామనగానే ఒక వ్యక్తి ప్రస్తావించిన విధంగా దేశ రాజకీయ నాయకుడి పేరును పెట్టేయడానికి మన ప్రభుత్వం జి.ఓ. జారిచేసేసింది. ఆనక తెలుగు ప్రేమికులందరూ టీవీ ఛానళ్ళ వెంబడి, పత్రికల్లోనూ తెలుగు లలితకళా తోరణం పేరు మార్చడానికి ససేమిరా అనడంతో దిగిరాక తప్పలేదు ఆంధ్ర ప్రభుత్వానికి. 

భారతదేశంలోని కళలు, వనరులు, పూర్వకట్టడాలు, పుర్వ రాజరికాలు ఇవన్నీ మనకు కేవలం ఒక చరిత్రలోని అధ్యాయాలే తప్ప మన ఘనమైన సంస్కృతీ వారసత్వపు సంపదలుగా అందరూ భావిస్తేనే అది భవిష్యత్ తరాలకు కనీసం నామమాత్రంగానైనా వివరాలు తెలుస్తాయి. 

నేటి పిల్లలకు కనీసం మన పూజలూ, వ్రతాలు, ప్రార్ధనలు ఇవన్నీ అమ్మలు, అమ్మమ్మలు చేసే సెంటిమెంట్ వ్యవహారాలు. తప్పించి వాటిల్లోని మంచి ఏమిటి, కనీసం అటువంటివి మన ప్రాచీనులు మనకోసం ఎందుకు ఏర్పాటు చేశారు అనే విషయాలను ఆలోచించుకునే అవకాశమేలేదు. ఎందుకంటే నేటి తరం వాళ్ళకు పండగ ఒక దండగ. పేదవాళ్ళకు ఒక గుదిబండగ. ధనికులకు షాపింగ్ సంబరం. అందుకే ఏదైనా పండగ వస్తోందనేది పేపర్లో వచ్చే అన్ని రకాల కంపెనీల అడ్వర్టైజ్ మెంట్లవల్లే తెలుస్తోంది. కనీసం క్యాలెండర్ చూసి ఈ నెల్లో ఏ పండగలున్నాయనేది తెలుసుకోవాలనే కుతూహలం కూడా చాలావరకు హరించుకుపోతోంది. అలాఅని ఆచరించేవారు లేరని పూర్తిగా చెప్పలేము. కానీ క్యాలెండర్లు మాత్రం నేడు హాలిడేస్ ను లెక్కించుకునే సాధనాలుగా మాత్రమే మిగిలిపోతున్నాయి.  

ఇంట్లో తల్లి చెప్పి ఇవాళ పండగ. పూజ చెయ్యి.. నాతో పాటు.. అంటే నాకు హోమ్ వర్క్స్ ఉన్నాయి. ప్రోజెక్ట్ వర్క్స్ ఉన్నాయి. అంటూ వెళ్ళి ఫోన్ లో ఛాటింగ్ లు, పండగ శుభాకాంక్షల ఎస్. ఎమ్.ఎస్.లూ. అటువంటి వీరే ఏ పబ్లిక్ ప్లేస్ లోనో ఏదైనా టి.వి. ఛానల్ ప్రోగ్రాం చేస్తే మాత్రం పండగ స్పెషాలిటీ గురించి సూపర్బ్ గా లెక్చర్లు ఇచ్చేస్తారు. అదీ నేటి ట్రెండ్. కనీసం వారికి పది మందిలో చెప్పి గొప్పలు పొందడానికైనా కనీసం తెలుసుంటే సంతోషమే.

నేడు ఒక టీవీగేమ్ షోలొ నలుగురు అమ్మాయిలు పాల్గొన్నారు. అందులో గజిబిజి అనే రౌండ్ లో స్క్రీన్ మీద వాక్యాలు వస్తాయి. వాటిని కరెక్ట్ గా గెస్ చేసి చెప్పిన వారికి పాయింట్లు. అందులో రామలక్ష్మణులు, నలభీములు, వాలి సుగ్రీవులు వంటి పదాలు వచ్చాయి. అందులో పిల్లలకు నలభీములంటే ఎవరో తెలీదు. అంతకు ముందు రామలక్ష్మణులంటే అన్నదమ్ములని చెప్పింది యాంకర్. అందుకు నలభీములంటే కూడా అన్నదమ్ములేనేమో అని అలవోకగా చెప్పేసిందో చిచ్చరి పార్టిసిపెంట్.. పైగా అది అడిగిన యాంకర్ ను రిక్వస్ట్ చేస్తోంది.. ఏంటంటే.. ఇంత కష్టమైన ప్రశ్నలు, హిస్టరీ నుంచి ఎందుకు అడుగుతారు. సినిమాల నుండి అడగచ్చు కదా. ఏదైనా ఇట్టే చెప్పేస్తాం. ఫలానా హీరోకి ఎంతమంది అమ్మాయిలతో సంబంధం ఉంది, భార్య పేరేంటి, కొడుకు పేరేంటి, ఏ పాట ఏ సినిమాలోది ఇటువంటివి అడిగితే ఎంతో తేలిగ్గా చెప్పేస్తారట.  

వాహ్! ఎంత బావుంది. ఈ ప్రశ్నలు అడిగిన పిల్లలు బహుశా కాలేజీ చదువుకునే పిల్లలై ఉంటారు. వారికి కనీసం మనం పురాణ పురుషుల పేర్లు కూడా తెలియవు. కనీసం తెలుసుకోవాలనే ఆసక్తి కూడాలేదు. పైపెచ్చు అడిగిన వారికే సవాళ్ళు విసురుతున్నారు. ఫలానా విషయాల మిద అడగచ్చుకదా. అని.

నిజానికి వారిని అనాలా, వారి తల్లిదండ్రులననాలా? చిన్నతనంలో మన ఇతిహాసాలను కథలుగా చెప్పని బామ్మలూ, తాతయ్యలనాలా? లేదా, పిల్లలు పెద్దలు అందరూ కలిసి టివి చూసే సమయాల్లో ఎంతసేపూ సీరియళ్ళూ, క్రైం వాచ్ లు, పాటలు, డ్యాన్సులు అంటూ చూపించే ఛానళ్ళననాలా? 

మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి. మనముందుకొస్తుంటాయి. వాటిల్లోంచి మనకు నచ్చిన దాన్ని ఎంచుకునే స్వేఛ్ఛ మనకే ఉంది. నేడు పోటీ ప్రపంచంలో మనకెదురవుతున్న సవాళ్ళను స్వీకరించడానికి ఎట్లా సమాయత్తమవుతున్నామో అలాగే మనం నేడు అనుభవిస్తున్న సుఖసౌఖ్యాలకు, భోగభాగ్యాలకు కారణం ఎవ్వరు? మనసులు ప్రశాంతంగా ఉండటానికి ఏం ఏం చెయ్యాలి, ఏం ఏం చెయ్యకూడదు. వంటి మౌలిక అంశాలన్నింటిని తెలిపే మన పురాణేతిహాసాలను కనీసం తెలుసుకుంటే లోకజ్ఞానంతో పాటు మనిషి పరిపూర్ణ వికాసానికి దోహదపడే పర్సనాలిటీ డవలప్ మెంట్ కు సంబంధించి ఎన్నో విషయాలు బోధపడతాయి. ఆ మధ్య వరకూ అమెరికన్లు లేదా మరే ఇతర దేశస్థులు వ్రాసిన, కనిపెట్టిన మనో విశ్లేశణా గ్రంథాలను ప్రామాణికంగా చేసుకుని చాలా పర్సనాలిటీ డెవలప్ మెంట్ పుస్తకాలు వ్రాయబడ్డాయి. అవి మనకందరికీ ఆదర్శమయ్యాయి. కానీ ఇప్పుడు వేరే దేశస్థులు ఎన్నో మంచి విషయాలు, మానవ మనుగడకు, జీవనానికి సంబంధించి సోదాహరణలతో సహా ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు వంటి విషయాలను పురాణ గాథలుగా, పిట్ట కథలుగా సంపూర్ణంగా వివరించిన భారతీయ పురాణేతిహాసాలను, గ్రంథాలను వారు మెచ్చుకుంటే తిరిగి ఇప్పుడు మనవాళ్ళు మన మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంత హాస్యాస్పదం గా ఉంది. పొరిగింటి పుల్లకూర రుచి, దూరపు కొండలు నునుపు అనే సామెతలు మన వారి మనస్తత్వాలను, అనుకరణలను గురించి తెలిసిన మన పుర్వీకులు ఎంతో ముందుగానే మనకి ఇటువంటి సామెతల రూపంలో వెల్లడించారనిపించక మానదు. 

కనీసం ఇప్పటికైనా మన పురాణాలు, రామాయణ, భారత, భాగవతాలు జరిగాయా అని ప్రశ్నించే వారందరికీ కనీసం వాటిని చదివి అవి జరిగాయా, లేదా అనే మీమాంసను పక్కనపెట్టి వాటిల్లో చెప్పిన నీతిని గ్రహించుకుంటే వారి వారి జీవితాలతో పాటు తమ కుటుంబ సభ్యులు, సమాజం గురించి కొంచెమైనా ఆలోచించి నేను, నాది వంటి భావాలనుండి విముక్తి చెంది తమ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో అండగా నిలుస్తారని ఆశిద్దాం! 

భగవంతుడు ఒక్కొక్క యుగంలో ఒక్కో అవతారం ఎత్తి రాక్షస సంహారం చేసి అన్యాయాలను, అక్రమాలను ఎదిరించి ప్రజలను రక్షించారని మనందరికీ తెలుసు. మరి నేటి యుగంలో మంచి చేద్దామన్నా, చెపుదామన్నా ఎన్నో అడ్డంకులు, సవాళ్ళను ఎదుర్కోవాలి. అసలు నిజాయితీ అంటేనే విలువలేనిదైపోయింది. ప్రతీచోటా అన్యాయం, లంచగొండి తనం తాండవిస్తున్నాయి. ఎన్నికలప్పుడు వాగ్దానాలకే తప్ప ప్రజా ప్రతినిధులు కూడా మంచి చేద్దామని ఉన్నా చెయ్యలేకపోతున్న పరిస్థితులు నేడు సమాజంలో వేళ్ళూనుకుని ఉన్నాయి. అందరిలో మార్పు రావాలి గానీ ఏ ఒక్కరు నిజాయితీతో ఉన్నా కార్యక్రమాలు సాగవు. పైగా అటువంటి వారు అష్టకష్టాలు పడుతున్న దాఖలాలే ఎక్కువ. మరి మనకి మంచి మార్గం చూపించేవి ఏమిటి అని ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక ప్రజలను ఏ భగవంతుడూ ప్రత్యక్షంగా వచ్చి మార్పు చూపలేడు. ఎందరు రాక్షసులని సంహరించాలి మరి.  

కానీ ప్రజలందరికీ చేరువయ్యేందుకు ఉన్న ఒకే ఒక్క మార్గం మీడియా, సినిమాలు. సినిమాలలో ఏ కొత్త ట్రెండ్ వస్తే అదే నేటి యూత్ ఫ్యాషన్. ఆ మధ్య వరకూ ప్రేమ సఫలం కాకపోతే చావే శరణమని చూపిస్తే సినిమాలు అదే ఫాలో అయ్యారు. కొత్తగా ఒన్ సైడ్ లవ్వంటే అదీ ఆచరించేసారు. విలనీ బాగా పండుతుందని ప్రేమించలేదనే సాకుకు హీరోయిన్ ను కొట్టడ, నరకడం, యాసిడ్ పొయ్యడం వంటివి చూపిస్తే వాటిని ఆచరించేసారు. ఇక కొట్లాటలు, తిట్లు సరేసరి. చంపడం, నరకడం చేస్తే ఫ్యాక్షన్ హీరో అయిపోయినట్టే. కానీ అటువంటివి నిజజీవితంలో క్షణికంలో చేసేసి చివరకు ఎందరు జైళ్ళలో పడి మగ్గుతున్నారు? వారి కుటుంబాలు ఎంత బాధపడుతున్నారో తెలిసేసరికి జీవితం చెయ్యి జారిపోతోంది. మరి ఇంకా రౌద్ర, భయానక సినిమాలు వస్తూంటే సెన్సార్ చెయ్యని బోర్డ్ ఎందుకో కనీసం వారి మనస్సాక్షికైనా తెలియాలి.  

వీటన్నిటి బట్టి చూస్తే ఎవరో వచ్చి కర్తవ్యబోధ చేస్తారని, మనని కాపాడతారని కూర్చునేకంటె ముందుగా ఎవరి కుటుంబాన్ని వారు సన్మార్గంలో నడిపిస్తున్నారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవడానికి కనీసం వారానికి ఒక్కరోజైనా కేటాయించుకుని ఎవరికిష్టమైన ధ్యానం, యోగం, సమాజ సేవ, పిల్లల సేవ, వృద్ధుల సేవ వంటివి చేస్తూ ఎవరిని వారే సరిదిద్దుకోవాలి.

 (శ్రీ తల్లాప్రగడ రావు గారి వ్యాసాలను చదివిన స్ఫూర్తితో)

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech