గగనతలము-15                               రాశులపరిచయము
 

    

నక్షత్రపాదములు లేక చరణములతో రాశుల ఏర్పాటు

ప్రతీ నక్షత్రములో నాలుగు చరణములు లేక పాదములు ఉంటాయని మనము తెలుసుకున్నాము. ఇటువంటి తొమ్మిది చరణములతో రాశులు ఏర్పడినవి. అశ్వని భరణి మరియు కృత్తిక యొక్క మొదటి చరణము కలిసి మేషరాశి ఏర్పడినది. కృత్తిక యొక్క మిగిలిన మూడు చరణములు, రోహిణి మృగశిర యొక్క రెండుచరణములతో వృషభరాశి ఏర్పడినది.
మృగశిర తరువాతి నక్షత్రము ఆరుద్ర. మృగశిర యొక్క మిగిలిన రెండు పాదములు, ఆరుద్ర మరియు పునర్వసు యొక్క మొదటి మూడు పాదములు కలిసి మిధునరాశి ఏర్పడినది. పునర్వసు యొక్క మిగిలిన ఒక పాదము, పుష్యమి మరియు ఆశ్లేష నక్షత్రములతో కర్కాటకరాశి ఏర్పడినది. ఇచట నక్షత్రము మరియు రాశికూడ ముగిసినవి. అంటే చివరి నక్షత్రముయొక్క నాలుగో పాదము ముగియు స్థానము మరియు రాశి ముగియు స్థానము ఒకటే అని అర్థము.
ఈ విధముగ రాశి మరియు నక్షత్రము కలిసి ముగిసిన దానిని రాశిసంధి అంటారు. మరియు ఆ నక్షత్రమును గండాంత నక్షత్రము అంటారు.
మఖ, పూర్వఫల్గుణి (పుబ్బ), ఉత్తరఫల్గుణి మొదటి చరణముతో సింహరాశి ఏర్పడినది. ఉత్తరఫల్గుణి యందు మిగిలిన రెండు చరణములు, హస్త మరియు చిత్ర నక్షత్రముయొక్క మొదటి రెండు పాదములతో కన్యారాశి ఏర్పడినది.
ఇదే విధముగ..
చిత్ర మిగిలిన పాదములు, స్వాతి, విశాఖ మూడు పాదములతో తులారాశి
విశాఖ మిగిలిన పాదము, అనూరాధ, జ్యేష్ఠా నక్షత్రములతో వృశ్చికరాశి ఏర్పడినది. ఈ జ్యేష్ఠానక్షత్రము గండాంత నక్షత్రము మరియు జ్యేష్ఠాంతమున రాశియంతము అగుచుండుట వలన అది రాశిసంధి.
మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ మొదటి చరణముతో ధనూరాశి,
ఉత్తరాషాఢ మూడు చరణములు, శ్రవణము, ధనిష్ఠ రెండు చరణములతో మకరరాశి,
ధనిష్ఠ రెండు చరణములు, శతభిషం మరియు పూర్వాభాద్రపద మూడు చరణములతో కుంభరాశి
పూర్వాభాద్రపద అంతిమపాదము, ఉత్తరాభాద్రపద మరియు రేవతి నక్షత్రములతో మీనరాశి ఏర్పడుచున్నవి.
ఈ నక్షత్రపాదముల క్రమము మరియు రాశుల ఏర్పాటు ప్రారంభములో తికమకగా అనిపించినా కొంత కాలమునకు అలవాటుగా మారిపోతాయి. “అనగననగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగ వేము తియ్యనుండు” అని వేమనగారు చెప్పినట్లు ఈ రాశ్యాదివిభాగములు కొంత సమయమును కేటాయించి అభ్యాసము చేయుటవలన శాశ్వతముగ మస్తిష్క పటలములో చోటును ఏర్పాటు చేసుకుంటాయి.
రాశియందలి విభాగములు
విభిన్న రాశులలో గ్రహముల స్థితిని బట్టి జాతకముయొక్క ఫలితములు చెప్పబడతాయి. ఆ విధముగ ఫలితములు చెప్పడానికి పెద్ద ఆధారము గ్రహముల బలము. గ్రహముయొక్క బలమును తెలుసుకోవడానికి రాశి కొన్ని భాగములుగ విభజించబడినది. ఆ రాశివిభాగములనే వర్గములంటారు. అటువంటి వర్గములలో ముఖ్యమైనవి షడ్వర్గములు. ఆ షడ్వర్గములకు ఆధారము రాశి యొక్క నిర్మాణములో భూమికను నిర్వర్తించేవి అంశాది విభాగములు.
60 వికలలు : ఒక కల
60 కలలు : ఒక అంశ
60 అంశలు : ఒక రాశి
12 రాశులు : ఒక భగణము లేక రాశిచక్రము
చాలా నిశితముగ పరిశీలిస్తే కాలవిభాగములకు ఈ రాశివిభాగములకు పూర్తిగా సారూప్యత కనిపిస్తుంది. దానికి కారణము కాలగణన ఈ రాశ్యాది విభాగములలో గ్రహముల స్థితులను బట్టి చేయబడుతుంది. మన పఞ్చాఙ్గములలో ఇవ్వబడే తిథ్యాది కాలసూచకములు ఆ విధముగ ఏర్పడినవే.

షడ్వర్గములు

1 రాశి : రాశులు పన్నెండు. వానిని గురించి మనమిపుడే తెలుసుకున్నాము.
2 హోరా : రాశియొక్క సగభాగమునకు హోర అని పేరు. అనగ హొర 15 అంశల రాశి విభాగము.
3 ద్రేష్కాణము : రాశియొక్క మూడవ భాగమునకు ద్రేష్కాణము అని పేరు. అనగ ఒక ద్రేష్కాణము యొక్క ప్రమాణము 10 అంశలు.
4 నవాంశ : రాశియొక్క తొమ్మిదవ భాగమునకు నవాంశయని పేరు. ఒక రాశియందు తొమ్మిది నవాంశలుండును. ఒక నవాంశయొక్క ప్రమాణము 3 అంశల 20 కలలు.
5 ద్వాదశాంశ : రాశియొక్క పన్నెండవ భాగమునకు ద్వాదశాంశయని పేరు. ఒక ద్వాదశాంశ యొక్క ప్రమాణము 2 అంశల 30 వికలలు.
6 త్రింశాంశ : రాశియొక్క ముప్పదవ భాగమునకు త్రింశాంశ అని పేరు. సమ విషమ రాశులయందు త్రింశాంశల ఆధిపత్యము వేరు వేరుగా ఉండును.

ఈ షడ్వర్గలు గ్రహముల బలమును సూక్ష్మముగా పరిశీలించుటకు ముఖ్యముగా ప్రయోగింతురు. వీనిని మనము ఒక వ్యక్తి చిరునామా లేక వైద్యశాస్త్రములోని వివిధ రకములైన పరీక్షలతో పోల్చి చూడవచ్చును.
ఉదాహరణకు ఒక వ్యక్తి భారతదేశములో ఉన్నాడనుకుందాము. అతనిని తెలుసుకొవడానికి ఇది మొదటి మెట్టు మాత్రమే. తరువాత అతని రాష్ట్రము, ఆ తరువాత నగరము, ఆ తరువాత వీధి, ఆ తరువాత అతని ఇంటిసంఖ్య మనము ఆ వ్యక్తి వరకు చేరుకోవడానికి సహకరిస్తాయి.
నాడి పరీక్షించిన వ్యక్తికి, లేక ఎక్స్ రే తీసిన వ్యక్తికి తదుపరి ప్రయోగములు (సి టీ స్కాన్ లేక ఎమ్ ఆర్ ఐ లాంటివి) ఏ విధముగ చేయించి సూక్ష్మముగ తెలుసుకొన ప్రయత్నిస్తామో అదే విధముగ గ్రహముయొక్క బలమును తెలుసుకోవడానికి ప్రాధమికముగా ఈ షడ్వర్గలను పరిశీలిస్తామన్నమాట.
సశేషము...................

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech