36. ఇతడొకడే సర్వేశ్వరుడు

ఇతడొకడే సర్వేశ్వరుడు
సితకమాక్షుడు శ్రీ వేంకటేశుడు||

పరమయోగులకు భావనిధానము
అరయ నింద్రాదుల కైశ్వర్యము
గరిమ గొల్లెతల కాగిట సౌఖ్యము
సిరులొసగేటి ఈ శ్రీ వేంకటేశ్వరుడు||

కలిగి యశోదకు కన్నమాణికము
తలచిన కరికిని తగుదిక్కు
అలద్రౌపదికిని ఆపద్భంధుడు
చెలరేగిన ఈ శ్రీ వేంకటేశుడు||

తగిలిన మునులకు తపముల సత్ఫలము
ముగురు వేలుపులకు మూలము
ఒగి నలమేల్మంగ కొనరినపతి యితడు
జిగిమించిన ఈ శ్రీ వేంకటేశుడు||


శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సర్వేశ్వరుడు, చల్లని చూపులతో భక్తులను పాలించు ఆశ్రిత వత్సలుడు. యోగుల సంపద, ఇంద్రాది దేవతల విభూతి, గోపకాంతల మురళీమోహనుడు. యశోదమ్మకు ముద్దుబిడ్డడు, ఆపదలో కొట్టుమిట్టాఅడుతున్న గరరాజుకి దిక్కు. ద్రౌపదికి ఆపద్భాంధవుడు, మునీంద్రులకు తపః ఫలము, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు మూలరూపము, అలమేల్మంగను అక్కున జేర్చుకున్న లోకనాథుడు ఈ శీ వేంకటేశ్వరుడు.

జిగిమించు = శాంతిని మించిన;
కరి = ఏనుగు;
కమలాక్షుడు = కమలముల వంటి కన్నులు కలవాడు.

 
37. ఇతని కంటె మరి
ఇతని కంటే మరి దైవము కానము యెక్కడ వెదకిన నితడే
అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికాధారముతానె||

మదిజలధులనొకదైవము వెదకిన మత్య్సావతారంబితడుయ్
అదివోపాతాళమందు వెదకితే ఆదికుర్మమీ విష్ణుడు
పొదిగొని యడవుల వెదకి చూచితే భూవరాహమనికంటిమి
చెదఱక కొండల గుహలవెదకితే శ్రీనరసింహుబున్నాడు||

తెలిసి భూనభోంతరమున వెదకిన త్రివిక్రమాకృతి నిలిచినది
బలువీరులలో వెదకిచూచితే పరశురాముడొకడైనాడు
తలపున శివుడును పార్వతి వెదకిన తారకబ్రహ్మమురాఘవుడు
కెలకుల నావులమందల వెదకిన కృష్ణుడు రాముడునైనారు.||

పొంచి అసురకాంతలతో వెదకిన బుద్ధావతారంబైనాడు
మించిన కాలము కడపట వెదకిన మిదటి కల్క్యావతారము
అంచెల జీవులలోపల వెదకిన అంతర్యామై మెరసెను
యెంచుక ఇహమున పరమున వెదకిన యీతడే శ్రీ వేంకట విభుడు||

ఏక మేవాద్వితీయం బ్రహ్మ అని తెలుసుకున్నాం. ఒక్కడైన భగవంతుడు సర్వాంతర్యామి! భక్తితో ఎక్కడ వెదికితే అతి శయమైన మహిమలతో ప్రత్యక్షమౌతాడు!
ఈ జగత్తునకు ఆధారభూతుడైన అట్టి పరబ్రహ్మము యొక్క అవతారాలను అన్నమాచార్యుల వారు అనేక కీర్తనలలో అధ్భుతమైన భావుకతతో అందంగా వర్ణించారు. అట్టి కీర్తనలలో ఇదొక మచ్చుతునక! ఈ కీర్తనలో దశావతార క్రమము కక్కగా పాటించబడటమే కాకుండా అర్ధవంతమైన పద ప్రయొగంతో అంతర్యామిని మన కళ్ళెదుట ప్రత్యక్షం చేసే పద్ధతి పాటించబడినది! స్థూలంగా దశావతారాలతో స్వామి రూపింపబడినా, ఆ పరమాత్ముడే మనందరి హృదయాలలో అంతర్యామిగా వెలుగోందుచున్నాడు. ఆ వెలుగును చూడండి అని పాటను ముగించడం అన్నమయ్య ప్రత్యేకత.

భోనభోంతరములు = భూమ్యాకాశమధ్యములు
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech