మూలం: స్టెఫాన్ త్సైక్

జరిగిన కథ:

వీరవాఘ రాజ్యంలో విరాట్ గొప్ప యోధుడు. అచంచల రాజభక్తి కలవాడు. అయితే రాజుగారి బావమరిది రాజ్యం మొత్తం ఆక్రమించాలన్న దురుద్దేశంతో వీరవాఘ సైనికుల్ని కొందర్ని లంచాలతో లోబర్చుకొని దండెత్తి వచ్చాడు. ఆ విపత్కర సమయంలో రాజుగారు విరాట్ ను సైన్యానికి నాయకత్వం వహించి శత్రువుని ఎదుర్కోమని కోరాడు. ఆనాటి రాత్రి జరిగిన సంగ్రామంలో విరాట్ తన శక్తియుక్తులతో శత్రువుల గుడారంపై దండెత్తి రాజవిద్రోహులను కడతేర్చాడు. మరుసటి రోజు ఉదయం విరాట్ చనిపోయిన విద్రోహులలో ఒకరిని తన అన్నగా గుర్తించాడు. తన చేతులతో స్వంత అన్ననే చంపుకొన్న సంఘటన విరాట్ ని ఎంతగానో కలచివేసింది. విజయకేతనంతో తిరిగి వచ్చిన విరాట్ కు రాజుగారు వజ్రాలతో పొదిగిన తమ పూర్వీకుల ఖడ్గాన్ని బహుకరిస్తూ సర్వ సైన్యాధ్యక్ష పదవిని అప్పగించబోయాడు. అయితే విరాట్, సొంత అన్ననే చేజేతులా చంపుకున్నానని, ఇక జీవితంలో ఖడ్గాన్ని ముట్టబోనని ప్రతిజ్ఞ చేశాడు. ఇలా చెడు జోలికి పోని, ధర్మబద్దుడైన విరాట్ కు రాజుగారు ప్రధాన న్యాయాధికారి పదవీ బాధ్యతలను అప్పగించాడు. ధర్మకాటాతో సమంగా తూచినట్లు విరాట్ ప్రతి నేరాన్ని లోతుగా పరిశీలించి మరణశిక్ష తప్ప వేరే తగిన శిక్షలను విధిస్తూ త్వరలోనే రాజ్యంలోని ప్రజల మెప్పును పొంది గొప్ప న్యాయాధికారిగా పేరొందాడు. అయితే ఒకరోజున కొందరు కొండ జాతీయులు ఒక యువకుణ్ణి పదకొండు మంది ప్రాణాలు అపహరించాడంటూ బంధించి తీసుకువచ్చారు. అయితే ఆ యువకుడు విరాట్ ను న్యాయాన్ని చెప్పడానికి నీకేం అధికారముందంటూ, ఇతరులు చెప్పేది విని నీవేం తీర్పు చెబుతావంటూ నిగ్గదీస్తాడు. పదకొండుమందిని చంపిన ఆ కొండజాతీయ యువకుణ్ణి పదకొండు సంవత్సరాల పాటు భూగర్భంలోని చీకటి గదిలో నిర్భందించి ప్రతీ సవత్సరం పదకొండు కొరడా దెబ్బలు తినేలే తీర్పు ఇస్తాడు విరాట్. తీర్పు విన్న ఆ ఖైదీ 'నేను ఆవేశ పిశాచం ఆవహించి ఆ క్షణంలో హత్యలు చేస్తే నీవేమో ప్రశాంతంగా నీ తీర్పుతో నా జీవితాన్ను హరిస్తున్నావు ' అంటూ విరాట్ ను నిందిస్తాడు. ఆ యువకుని కన్నుల్లో తనచే చంపబడ్డ అన్న కన్నులు చూచాడు విరాట్. ఆ మాటలకు చలించి సత్యమార్గాన్ని అన్వేషించటానికి ఒక నెలరోజులు సెలవు తీసుకొంటాడు. నల్లని దుస్తులు ధరించి అట్టడుగున గాఢాంధాకారంలో నున్న చెరసాలకు చేరుకుంటాడు. తను తీర్పు ఇచ్చే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో అనుభవం ద్వారా నేర్చుకుంటానని, ఆ అనుభవం ముందు ముందు సరైన తీర్పులు ఇవ్వటానికి దోహదపడతాయని కొండజాతి యువకునితో చెబుతాడు. అందుగ్గాను విరాట్ ఖైదీ దుస్తులు ఆ యువకుణ్ణి ఎవరికి తెలియకుండా ఓ నెలరోజులు బయటికి పంపిస్తాడు. మరుసటిరోజునుంచి కొండజాతి యువకునికి శిక్షగా విధించిన కొరడాదెబ్బలను తనకే అమలుపరచారు. భరించలేనంత నొప్పిగా ఉండేది. ఒంట్లో నిస్సత్తువతో నేలపై అలాగే పడిపోయేవాడు. కాని, ఆ చీకటి గుహలో, ఏకాంతంలో రాగద్వేషాలకి అతీతంగా, స్వార్థచింతనలేని కాలాన్ని గడపసాగాడు. ఆత్మావలోకనంలో అలౌకిక ఆనందం పొందాడు. ఇంతలో ఆయన మనసులో భయంగొలిపే ఆలోచన ఒకటి వచ్చింది. ఒకవేళ మాటైచ్చిన ప్రకారం ఆ కొండజాతి యువకుడు తిరిగి రాకపోతే? తనను విడిపించకపోటే? తను ఈ చీకటిగుహలో శేషజీవితాన్ని గడపాల్సిందేనా? ఇలాంటి ఆలోచనలతో పిరికివాడయ్యడు విరా రాజుగారికి ఈ విషయం తెలిసివచ్చి విరాట్ ను చెరసాలనుంచి విడిపించాడు. ప్రధానన్యాయమూర్తి లేదా తన అంతరంగ సలహాదారునిగా ఉండమని కోరాడు. కాని విరాట్ వాటిని సున్నితంగా తిరస్కరించి సాదాసీదగా ప్రశాంతమైన జీవనం గడపసాగాడు.

ఆరు సంవత్సరాలు ప్రశాంతంగా గడిచాక ఒకరోజు సాయంత్రం ఆయన పడుకొని ఉన్నప్పుడు పెద్దగా అరుపులు, కొరడా దెబ్బల శబ్దం, ఓ మనిషి ఆక్రందన వినిపించాయి. విరాట్ లేచి చూశాడు. తన కుమారుడు ఒక బానిసను కొరడాతో కొడుతున్నాడు. బానిసను బలవంతంగా మోకాళ్ళమీద కూర్చోబెట్టి కొరడాతో కొడుతుంటే ఆ దెబ్బలకు బానిస శరీరం రక్తం చిమ్ముతోంది. ఆ బానిస విరాట్ వైపు చూశాడు. తను హత్యచేసిన తన సోదరుడి కళ్ళు తనను చూస్తున్నట్టు అనిపించింది. కొరడాతో కొట్టబోతున్న కొడుకు చేతిని పట్టుకొని ఆపాడు. ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించాడు.

వాళ్ళు చెప్పిన దానినిబట్టి విరాట్ కి అర్థం అయింది ఏమిటంటే ఈ బానిస రోజు కొండచెలమ నుంఛి కావిడితో నీళ్ళు మోసుకొచ్చి, ఇంట్లో తొట్లు నింపాలి. రోజంతా అదే పని అతనికి. అయితే మధ్యహ్నాంవేళ వడదెబ్బకు తట్టుకోలేక అలిసిపోయి చాలా ఆలస్యంగా నీళ్ళకావిడి మోసుకొచ్చేవాడు. అట్లా ఆలస్య్మగా వచ్చినప్పుడల్లా అతన్ని దండించేవాళ్ళు. అయితే నిన్న ఆలస్యంగా వచ్చాడని విపరీతంగా కొట్టడం వల్ల అతను ఇంటినుంచి పారిపోయాడు. పారిపోయిన విషయం తెలుసుకున్న విరాట్ కొడుకులు గుర్రాల మీద వెంటాడి నది దగ్గర అతన్ని పట్టుకోగలిగారు. ఆ బానిసను తాళ్ళతో కట్టేసి ఆ తాడుని ఒక గుర్రపు జీనుకు కట్టి ఈడ్చుకొనివచ్చారు. అతన్ని కాళ్ళు రక్తం కారుతున్నాయి. ఆ బానిస మళ్ళీ పారిపోయే ప్రయత్నం చేయకుండా, ఈ బానిసను చూచి మిగతా బానిసలు అలాంటి పని చేయకుండా అందరికి భీతిగొలిపేలా కఠినంగా శిక్షిస్తున్నారతన్ని.

విరాట్ ఆ బానిస వంక చూశాడు. బలిపశువు కసాయి వాడివైపు దీనంగా చూసినట్టు ఉందా చూపు. తను ఒకప్పుడు ఎదుర్కొన్న భయానక పరిస్థితే అది.

"ఆ మనిషిని వదిలెయ్యండి, శిక్ష విధించింది చాలు" అన్నాడు కొడుకులతో.

ఆ బానిస విరాట్ ముందుకొచ్చి అతని పాదాల దగ్గర భూమిని ముద్ద్దుపెట్టుకున్నాడు.

జీవితంలో మొదటిసారిగా విరాట్ కొడుకులు వాళ్ళ తండ్రిమీద కోపంతో అక్కడినుండి వెళ్ళిపోయారు. విరాట్ కూడా గదికి వచ్చేశాడు. చల్లని నీళ్ళతో ముఖం, కాళ్ళు కడుక్కున్నాడు. చల్లని నీటి స్పర్శ తగలగానే తానేమి చేస్తున్నది అకస్మాత్తుగా బోధపడింది విరాట్ కు. చెరసాలనుంచి విడుదలైన తర్వాత మొట్టమొదటిసారి ఇతరుల విషయంలో జోక్యం చేసుకొని తీర్పు ఇచ్చాడు. ఆ రాత్రి విరాట్ కు నిద్రపట్టలేదు. ఆ ఆరు సంవత్సరాల్లో ఆయనకు నిద్ర దూరమైన రాత్రి ఇదే. ఆ చీకట్లో ఆయన కళ్ళు తెరిచి శూన్యంలోకి అలా చూస్తూ అలోచిస్తునే ఉన్నాడు. ఆ చీకటీలోనే విరాత్ కు బానిస బెదురుచూపులు, తన చేతిలో చనిపోయిన అన్న క్రోధపు చూపులు, కొడుకుల ద్వేషపు చూపులు కళ్ళముందు కనిపించాయి.

తన కొడుకులు ఆ బానిసపట్ల అంత అన్యాయంగా ఎలా ప్రవర్తించగలిగారని పదేపదే తనను తాను ప్రశ్నించుకున్నాడు. పనిని నిర్లక్ష్యం చేశాడనే నెపంతో బానిస రక్తం చిందించి ఇంటిని అపవిత్రం చేశారు. చిన్న పొరపాటు చేసినందుకు సాటివ్యక్తిని అంత క్రూరంగా ఎలా కొట్టగలిగారు? తన ఇంట్లో జరిగిన ఈ తప్పుకి కొరడాదెబ్బలు తిన్నదానికన్నా ఎక్కువ బాధ కలిగింది విరాట్ కి.

ఆరోజు సాయంత్రం జరిగిన సంఘటనలో శిక్షింపబడింది ఉన్నత వంశస్థుడు కాదు. ఒక బానిస. రాజశాసనం ప్రకారం పుట్టుకముంచి ఎవరో ఒక యజమాని ఆధీనంలో ఉండే ఒక జీవమున్న శరీరం పేరే బానిస. మనుషులంతా భగవంతుని ప్రతిరూపాలైతే, కొందరు మనుషుల్ని బానిసల్ని చేసే రాజశాసనం భగవంతుని దృష్టిలో సమంజసమైందా? ఒక మనిషి శరీరం మరికరి ఆధీనంలో ఉండడం ఆ భగవంతుని దృష్టిలో న్యాయసమ్మతమేనా? ఒక బానిసను హింసించినవాడు, అతని జీవితాన్ని నాశనం చేసినవాడు భగవంతుని ముందు నిర్దోషి కాగలడా?

దీన్నీ గురించి ఋషులు ఏమైనా చెప్పారేమో చూద్దామని పక్కమీదనుంచి లేచి దీపం వెలిగించాడు. తాళపత్రగ్రంధాలు ముందేసుకున్నాడు. కులం, సంపదల కారణంగా మనిషికి, మనిషికి మధ్య బేదాలుండటం ఆ గ్రంధంలో కనిపించింది. చాలాసేపు ఆలోచిస్తూ గడిపాడు. ఆ తరువాత దేవునిముందు మోకరిల్లి "వివిధ రూపాల్లో జగమంతటా వ్యాపించిఉన్న ఓ భగవంతుడా! ఎప్పటికప్పుడు నా తప్పుల్ని ఎత్తిచూపి, సన్మానమార్గాన నడిపించడానికి, నీ దూతలు వివిధరూపాల్లో నా జీవనమార్గంలో ఎదురవుతున్నారు. చనిపోయిన నా సోదరుని కళ్ళలో నీ దూతను గుర్తించగల శక్తిని నాకు ప్రసాదించు. నేను నా జీవితాన్ని పవిత్రం చేసుకుని, పాపాలకు దూరంగా బతికేలా చెయ్యి" అని ప్రార్థించాడు.

విరాట్ ముఖంలో మళ్ళీ వెలుగొచ్చింది. ఆయన కళ్ళలో విచారం తొలగిపోయింది. ఆకాశంలో మినుకుమినుకుమంటూ ప్రకాశిస్తూ ఆహ్వానించే నక్షత్రాల్ని, తొలిసంధ్యకు ముందు వీచే పరిశుద్ధ పవనాల్లోని తాజాదనపు ఆనందాన్ని అనుభవించడానికి ఇంటినుంచి బయటకు వెళ్ళాడు. తోటగుండా ప్రయాణించి నది వద్దకు చేరుకున్నాడు. సూర్యోదయం కాగానే పవిత్ర నదీప్రవాహంలో మునకలేశాడు. స్నానం అయ్యాక ఉదయం జరిగే దైవప్రార్థనల్లో కుటుంబసభ్యులు అందరితో కలిసి పాల్గొనడానికి త్వరగా ఇంటికి బయలుదేరాడు. చిరునవ్వుతో అందరిని పలకరించాడు. స్త్రీలను అక్కడినుంచి వెళ్ళిపొమ్మని సైగ చేశాడు. ఆ తరువాత కొడుకులతో చెప్పాడు.

"పవిత్రంగా, పాపాలకు దూరంగా జీవితాన్ని గడపటానికి ఇన్నేళ్ళ నుంచి నేను తాపత్రయపడుతున్న విషయం మీకు తెలుసు. నేను ఉంటూన్న ఈ ఇంటినేల నిన్న రక్తం చిందించింది. ఆ రక్తం ఒక సజీవ వ్యక్తిది. ఆ రక్తం చిందిన అపరాధం నుంచి నేను బయటపడాలని, నా ఇంట్లో జరిగిన దారుణానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటున్నాను. చిన్న అపరాధానికి క్రూరంగా దండన పొందిన ఆ బానిస ఈ క్షణం నుంచి బంధవిముక్తుదవుతాడు. భగవంతుడి ముందు జరిగే పాపపుణ్యాల విచారణలో మీపై, నాపై నేరారోపణ చేయకుండా ఉండేందుకైనా అతన్ని వదిలేయండి. తనకు ఇష్టమున్న చోటికి అతను వెళ్ళుతాడు" అన్నాడు.

కొడుకులంతా మౌనంగా ఉండిపోయారు. అది నిరసనతో కూడిన మౌనం అని విరాట్ కు అర్థం అయ్యింది. "మీరు సమాధానం చెప్పడంలేదు. మీరేం చెబుతారో వినకుండా, మీ అభీష్టానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాలనుకోవడం లేదు" అన్నాడు.

"మీరొక అపరాధికి స్వేచ్చ ఇవ్వాలనుకుంటున్నారు. శిక్షించడానికి బదులు బహుకరించాలనుకుంటున్నారు. మన ఇంట్లో చాలామంది సేవకులున్నారు. కాబట్టి ఒకడు లేకుంటే నష్టమేమి లేదు. కాని వాణ్ణి చూసి రేపు ఇంకొకడు పారిపోతాడు. మిగిలినవాళ్ళు కూడా వెడతామంటే ఎలా ఆపగలం?" అన్నాడు పెద్దకొడుకు.

"వాళ్ళు వెళ్ళిపోవలనుకుంటే నేను అడ్డుపడను. వాళ్ళను వెళ్ళనిస్తాను. నేనొకరి జీవిత నిర్ణేతను కాను. మరొకరి జీవితాలను నిర్దేశించేవాడు అపరాధి."

"మీరు రాజశాసన నిబంధనల్ని బలహీనపరుస్తున్నారు. ఈ భూమి మనదైనట్టు, ఈ భూమిపై పెరిగే చెట్లు మనవైనట్టు, వాటికి కాసే కాయలు మనదైనట్టు, ఈ బానిసలు కూడా మన ఆస్తి. వాళ్ళు మీకు సేవ చేసినంత కాలం మీకు చెందుతారు. మీరు వాళ్ళకు చెందుతారు. కొన్ని వేల సంవత్సరాలనుంచి పరంపరగా వస్తున్న సంప్రదాయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారు. బానిస అతని స్వంత జివితానికి యజమాని కాడు. మరొక యజమానికి అతను సేవకుడు" అన్నాడు రెండవ కుమారుడు.

"భగవంతుడు మనకు ప్రసాదించిన హక్కు జీవించడం. ఆ అధికారం అందరికీ ఉంది. నేను పాపాలనుంచి దూరంగా బతుకుతున్నాననే భ్రమలో ఉన్నాను. కాని నేను ఇన్ని సంవత్సరాలుగా ఇతరుల జీవితాల్ని శాసిస్తునే ఉన్నాను. ఇప్పుడూ మీవల్ల నాకు చక్కగా అర్థం అవుతోంది. సరైన వ్యక్తి ఎవ్వరూ మనుషుల్ని మృగాలుగా మార్చడు. నేను బానిసలందరిని విడుదల చేస్తాను. వాళ్ళ విషయంలో పాపానికి దూరంగా ఉంటాను" అన్నాడు విరాట్.

కొడుకుల కనుబొమలు కోపంతో ముడిపడ్డాయి.

"పొలాలు ఎండిపోకుండా నీళ్ళెవరు పెడతారు? పశువుల్ని ఏవ్రు మేపుకొస్తారు? ఇకనుంచి మేము సేవకులుగా మారాలా? మీరు ఏనాడైనా ఇంట్లో చిన్నపని చేశారా? ఇతరుల శ్రమ మీద ఆధారపడి మీ జీవితం ఇంత సుఖంగా నడుస్తున్నదని మీరు ఏనాడు ఆలోచించలేదు. ఈ పరుపులు, మంచాలు తయారుచేనది బానిసలే. మీరు నిద్ర పోయేవరకు పంకా విసిరేది బానిసే. బానిసల్ని వదిల్లేద్దామని అనుకున్నట్టే ఆ ఎద్దులను కూడా వదిలెయ్యండి. వాటికి మాత్రం నొప్పి కలిగించడం ఎందుకు? వాటికి బదులుగా మేమే కాడిలాగి పొలం దున్నుతాం. మీరొకటి గుర్తుంచుకోండి. ప్రపంచం బలప్రయోగం మీద ఆధారపడి నడుస్తుంది. భూమిపై కూడా బలప్రయోగం చెయ్యకపోతే అంటే దున్నకపోతే భూమికూడా పంటలనివ్వదు. అంటే బలప్రయోగం మీద ఆధారపడే లోకం నడుస్తోంది. మనం దానికి దూరంగా ఉండలేము" అంటూ గట్టిగా పెద్దకొడుకు వాదించాడు.

"కాని నేను దూరంగా ఉంటాను. బలం ఏ రకంగాను సరైంది కాదు. నేను నా జీవితాన్ని ధర్మపథంలో నడుపుకుంటాను." అన్నాడు విరాట్.

"కాని పాపం చెయ్యాల్సిన అవసరం కలిగించే అన్నిటినుంచి నేనె దూరంగా ఉంటాను. అందుకే బానిసలందర్ని విముక్తుల్ని చెయ్యండి. మీకు అవసరమైన పనులన్ని మీరే స్వయంగా చేసుకోండి" వివరించాడు విరాట్.

కొడుకులు వచ్చే కోపాన్ని బలవంతంగా దిగమింగుకున్నారు. పెద్దకొడుకు మళ్ళీ అందుకున్నాడు. "మీరే చెప్పారు. ఇతరుల అభీష్టాలపై ఆంక్షలు పెట్టనని. మరి ఎందుకు మమ్మల్ని శాశిస్తున్నారు? మా జీవితాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? మీరు చేసేది భగవంతుని దృష్టిలో ఏవిధంగా సమంజసమో చెప్పండి?"

విరాట్ చాలాసేపు మౌనం వహించాడు. తల పైకెత్తి కొడుకుల వంక చూశాడు. వాళ్ళ కళ్ళు అభ్యర్థిస్తున్నట్టున్నాయి. ఆ కళ్ళలో ఆశ తొణికిసలాడుతోంది. విరాట్ మనసు ఆర్ద్రమయింది.

"మీరు నాకు పాఠం నేర్పారు. మిమ్మల్ని ఏదో విధంగా అడ్డుకోవడం నా ఉద్దేశం కాదు. ఇంటిని, సంపదను మీరే తీసుకొండి. ఎవెరెవరికి ఏవేవి అవసరమో ఆ విధంగా పంచుకోండి. వాటిలో నాకేమీ భాగమూ వద్దు. వాటితో వచ్చే పాపమూ వద్దు. శాసించేవాడు ఇతరుల స్వాతంత్ర్యాన్ని అణచివేస్తాడని మీరు చెప్పింది నిజమే. కాని తన ఆత్మనే బానిసను చేసుకోవడమనేది అన్నింటికన్నా నీచమైనది. పాపాలకు ఎవరు దూరంగా బతకాలనుకుంటారో వాళ్ళు ఇంటి యాజమాన్యం నుంచి, ఇతరుల జీవితాల్ని నడిపించే బాధ్యతలనుంచి దూరంగా ఉండాలి. ఇతరుల శ్రమపై ఆధారపడకూడదు. స్త్రీలతో భోగవిలాసాలకు, ఆనందంతో వచ్చే సోమరితనానికి దూరంగా ఉండాలి.శ్రమించేవాడికే భగవంతుని ఉనికి తెలుస్తుంది. పేదరికానికే భగవంతుని విశ్వరూపం గోచరిస్తుంది. పాపాలకు దూరంగా బతకాలన్నదే నా కోరిక. ఈ ఆస్తిపాస్తులు అన్నీ తీసుకొండి. శాంతియుతంగా వాటిని పంచుకోండి" అంటూ విరాట్ అక్కడినుంచి లేచిపోయాడు.

ఆయన కొడుకులందరూ ఆశ్చర్యంతో అలాగే నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. వాళ్ళ ఆశ నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. కాని లోలోపల చాలా సిగ్గుపడ్డారు.

చీకటిపడగానే ఇంటినుంచి వెళ్ళిపోవడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు. ఒక చేతికర్ర, భిక్షాపాత్ర, చెట్లు కొట్టే గొడ్డలి, తినడానికి కొద్దిగా పళ్ళు, సిద్ధుల సూక్తులున్న తాళపత్ర గ్రంథాలు కొన్ని సర్దుకున్నాడు. ధోవతిని మోకాళ్ళపైకి ఎగగట్టాడు. భార్యతో, కొడుకులతో, కుటుంబసభ్యులెవరితోనూ చెప్పకుండానే, వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకోకుండానే బయలుదేరాడు.

(సశేషం)

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)