మన "సు" కవి - ఆచార్య ఆత్రేయ

"మనసున్న మనిషికి సుఖము లేదంతే"; "వేసవి లోను వానలు రావా, కోవెల శిలకు జీవము రాదా, జరిగే నాడే జరుగును అన్నీ, జరిగిన నాడే తెలియును కొన్ని" - అని సరళ మైన తెలుగు పదాలలో, వేద సారాన్ని రంగరించుకుని, భావయుక్తముగా రాసిన చేసిన తత్వ చింతకుడు, మన"సు" కవి - ఆచార్య ఆత్రేయ. మనిషి భావలను అత్యంత ప్రతిభావంతంగా రాసిన కవి, రచయిత, మానవతావాది ఆత్రేయ.

"మౌనమె నీ భాష ఓ మూగ మనసా"; "మనసు మూగది, మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది "; ఇలా గుప్పెడు మనసులోని అసంఖ్యాక భావాలను, మనోగతాలని అర్ధంచేసుకుని అచ్చ తెలుగులో విషయాలను తేట తెల్లం చేసిన తత్వజ్ఞుడు.

"చదువురాని వాడవని దిగులు చెందకు, మనిషి మనసులో మమతలేని చదువులెందుకూ" అని తన దైన రీతిలో (సున్నితంగా) అడిగేరు ఆత్రేయ. ఇలా, చదువులోని నిక్షిప్త అర్ధాన్ని, మర్మాన్ని ఉద్బోదించారు. మమతలు నేర్వని మనిషి చదువు ఎందుకు అని ప్రశ్నించారు. "మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలప్పుడు ఏమోతాయో, మనిషికి మనసే తీరని శిక్ష దేవుడిలా తీర్చు కున్నాడు కక్ష"; ఇంకో పాటలో "పులకించిన మది పులకించు, వినిపించని కధ వినిపించు, కనిపించని ఆశలను నింపు, గానం మనస్సునే మరిపించు"; ఇలా వైవిద్యమైన పాటలు రాయడం అసాధారణం. గుండెలోతుల్లోంచి వెల్లువెత్తిన పాటలివి.

మరో కోణంలో తరచి చూస్తే ఆత్రేయ గారు తెలుగు భాషా పటిమతో పాటు మనసు, హృదయం భాష కూడా క్షుణ్ణంగా ఎరిగిన తాత్వికుడు. చక్కటి తెనుగులో సరళమైన పదలేశాలతో విషయం యొక్క అర్ధం, పరమార్ధం చాటిన మేటి కవి. కలత చెందిన మనస్సును, దాని స్థితి, గతులనీ ఆత్రేయ లాగ అర్ధం చేసుకుని, వాటికి భాష్యం చెప్పినవారు తెనుగు సాహిత్యంలో మరొకరు లేరని ఘంటాపదంగా చెప్పవచ్చు.

తన రచనలు సమాజంలో మార్పు తీసుకురవాలని ఆకాంక్షించారు. సందర్భానుసారంగా, భావాలను అతి సామాన్య పద భాషా ప్రయోగంతో, అసాధారణ ప్రభావాన్ని ప్రజల మనసులమీద కలిగించారు. గుండెల్లోతుల్లోకి వెళ్ళి కదలించే మాటల శక్తి ఉండి, మనసుకి హత్తుకుపోయే భావాలను పతిభింబించిన ప్రతిభామూర్తి.

"మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే; మన్సున్న మనిషికి సుఖములేదంతే .... " అని జీవతానుభవంలోని భావాలను, తనలోని భారతీయ తత్వంతో రంగరించి పాటల రూపంలో సరళమైన సుమధుర భాషలో, మనసులను స్పందింపచేస్తూ రాసిన పాట. "నే వెళ్ళుదారి ఓ ముళ్ళ దారి, రాలేరు యవ్వరు నాతో చేరి" అంటూ తనదైన పంథా ఏంటో చెప్పకనే చెప్పారు ఆత్రేయ. ఆయన రచనలలో - భావుకత; ఆవేదన; భక్తి; సామాజిక మూల్యాలతోపాటు మానవతావాదిని కూడా చూడవచ్చు.

అటు తెలుగు రంగస్థలంలో రాణించి, ఇటు తెలుగు సినీ రంగంలో - కవిగా, సినిమా పాటల, మాటల (డయలాగులు) రచయితగా మన్ననలు అందుకున్నారు. దర్శకత్వం కూడా వహించారు. ఇలా బహుముఖ ప్రజ్ఞలతో నాటక, సినీ రంగాలలో తన విశిష్టత చాటుకున్న వ్యక్తి ఆత్రేయ.

బాల్యం, రంగస్థలం, సినీ రంగప్రవేశం

1921, మే 7 న, నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట లోని మంగళంపాడు గ్రామంలో సీతమ్మ, కృష్ణమాచార్యుల దంపతులకు జన్మించారు కిళాంబి వేంకట నరసిమ్హాచార్యులు. వీరు ఆత్రేయ గోత్రికులు. మనదరికీ ఆచార్య ఆత్రేయ గా పరిచయం. 1940, ఫిబ్రవరి 10 న, ఆత్రేయ గారికి పద్మావతి గారితో వివాహం జరిగింది. అధ్యాపకుడిగా శిక్షణ పొందేరు. బ్రిటీష్ కి విరుద్ధంగా "క్విట్ ఇండియా" ఉద్యమంలో పాల్గొని కారాగారవాసం అనుభవించారు. తరువాత చిన్న చిన్న ఉద్యోగాలు చేసి, తిరుత్తణి మున్సిఫ్ కోర్టులో, సెటిల్మెంట్ ఆఫీసులో గుమాస్తాగా పనిచేసారు. తరువాత జమీన్ రైతు ఉపసంపాదకుడిగా, గుడివాడలో నాటక కళా పరిషత్ కార్యదర్శిగా పనిచేసారు.

"ఈనాడు" (1947), "ఎన్ జీ ఓ" (గుమాస్తా - 1949) నాటకాలు వాసికెక్కాయి. ఈ నాటకం యెన్నో మన్ననలు అందుకుంది. 1949 ఆంధ్ర నాటక కళా పరిషత్ శ్రేష్ట నాటక అవార్డు పొందింది.

ఆత్రేయ గారి రంగాస్థల కార్య కలాపాలు చిత్తూరు లో మొదలైయ్యాయి. తరువాత వేంకటగిరి అమెచ్యూర్స్ తో అనుభందం, ఆయనకి జట్టుకీ పేరు, ఖ్యాతి తెచ్చి పెట్టేయి.

ముందు రంగస్థల నాటకాలతో మొదలయినా, తరువాత వరసెట్టి చాలా నాటకాలు రాసారు. 1946 లో గౌతమ బుద్ధ, 1947 లో ఆశోక సామ్రాట్ రాసారు. ఈ నాటకాలు అంతగా ఆదరణ పొందలేదు. ఓ మంచి నాటక రచయితగా ఆయనకు పేరు తెచ్చి పెట్టింది "పరివర్తన" (1947). ఇది ప్రోగ్రెసివ్ రైటర్స్ మద్రాసులో వేసారు. ఆత్రేయ గారు రాసిన ఎన్ జీ ఓ, సమకాలీన నాటకాలలో ఓ కొత్త ఒరవడిగా రాణించింది. ఈ నాటకం అప్పటి సమాజిక వాస్తవాలకు అద్దంపడుతూ, మధ్య తరగతీకుల నిత్య జీవిత పోకడలు, డబ్బు కోసం పడే యాతన ప్రతిభింబించారు.

"సంసారం" సినిమాకు రచయితగా సినీ జగత్తులో అడుగిడడానికి అవకాశం లభించి, పరిస్థితులు ప్రతికూలించి, కే ఎస్ ప్రకాశ రావు గారి "దీక్ష" లో పాటలు, మాటలతో తన సుదీర్ఘ ప్రవ్స్థానం మొదలు పెట్టి, నాలుగు దశాబ్దాలపాటు - భక్తి, భావ, శృంగార, దేశ భక్తి రసాలొలికిస్తూ జనరంజకమైన మాటా-పాటలను అందించి చెరగని ముద్ర వేశారు.

పది నాటకాలు, పదిహేను నాటికలు రచించారు ఆత్రేయ. విశ్వశాంతి (1953); కప్పలు (1954); భాష్యం (1957); నాటకాలు రాసేరు. ప్రగతి, దొంగ, వర ప్రసాదం - ఏక పాత్రాభినయాలు రచించారు. ఆయన రాసిన "ఎవరుదొంగ" నాటకాన్ని 2004 లో మందనపల్లి రచయితల సంస్థ వేసింది.

ఆయన రాసిన ప్రధమ సినీ పాట "పోరా బాబూ పొ! పోయి చూడు ఈ లోకం పోకడ". అక్కడనుంచి నాలుగు దశాబ్దాల పాటు సినిమా రంగంతో అనుబందం కొనసాగించి సుమారు 200 సినిమాలకు పైగా పాటలు, మాటలు రాస్తూ వచ్చారు. చిత్రాలలో వాస్తవాల గురించి, జీవిత సత్యాల గురించి ఆయన మాటలలో, పాటలలో పేర్కుంటూ వచ్చారు - లోతైన భావాలు కలిగి, మనసును ఆలోచింప జేసే పాటలతో అలరించారు. అఖండ మేదస్సుతో ప్రజల మనస్సులలో హత్తుకుపోయేటట్టుగా రచనలు చేశారు.

యెన్నో మధుర మైన పాటలు రాశారు. భావ యుక్తంగా, రసాలొలొకిస్తూ ఉంటాయి వారి పాటలు. ఆయన కూర్చిన అక్షర మణి హారాలు - "పచ్చ గడ్డి కొసేటి పడుచు పిల్లా", "ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి"; "ఎక్కడికి పొతావు చిన్నవాడ"; "సాపాటు యెటూలేదు పాటైన పాడు బ్రదర్ (ఆకలి రాజ్యం)" యెప్పటికి మరపురాని పాటలే. జే కే భారవి ఆత్రేయ గారి శిష్యుడు.

అక్షర శిల్పి

అక్షర శిల్పి - "శిలలపై శిల్పాలు ఛెక్కినారు, మనవారు సృష్టికే అందాలు తెచ్చినారు"; పాటలో అంధులకి కూడా ఆంధ్ర శిల్ప కళావైభవం అర్ధమయ్యేటట్టు రాసినది. అందరిని అచ్చమైన తెలుగుదనంతో ఆనందపరచిన పాట. "రాతి స్థంభలకే చేతనత్వము కలిగించి సరిగమ పదనిస పదములు పాడించిన "దిట్ట కవి;"తేట తేట తెలుగుల "అంటు తన భాషా మమకరాన్ని చాటుకున్నారు.

"భారత మాతకు జే జేలు, బగరు భూమికి జే జేలు .... " అంటూ తన దేశ భక్తిని చాటుకున్న "స్వా" తంత్ర కవి; ఆయన "స్వ" తంత్ర భావాలు, నిభద్దతా, దేశ భక్తి, సామాజిక స్పూర్తి, సాహిత్య సేవానురక్తి, తత్వ చింతన దర్శనమిస్తాయి; సమాజంలో ఉండే అసమానతలు, అవక తవలకు అర్ధం చేసుకుని వాటిని నివారించే ప్రయత్నం చేసారు. విలువలు, ప్రమాణాలు పడిపోయిన తరుణాలను చూసి విచారిస్తూ సాంఘిక ప్రమాణాలు నిలపెట్టడానికి ప్రయత్నం చేశారు. మనసు తత్వాన్ని కాచి వడపోసిన "మన" "సు" కవి; ఆయన మనసులోంచి వెల్లువైన గీతాలు నేటికీ, ఏనాటికి అపురూప పాటలే - చక్కటి సాహిత్యం, భావాలు కలిగి ఉన్నాయి కనుక.

భావాలు: - మనోభావం, సమాజిక స్పృహ; జాతీయ భవాలు; భాషాభిమానం; దేశాభిమానం; స్వాభిమానం; మనసు - తత్వాన్ని కాచి వడ పోసిన తత్వ చింతకుడు; షడ్ రుచులు ఆస్వాధించి వాటి సారాన్ని ముడి సరుకుగా ఉపయోగించిన కవి; విషయావగాహన; సుఖ - దుఃఖాలు; కలిమిలేములు; మమతానురాగాలు; ఆత్మీయత కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఆయన మాటలలో, పాటలో, అర్ధమే కాక, నిగూడార్ధం, పరమార్ధాలు కనిపిస్తాయి.

ఆత్రేయ లక్షం మార్చుకోక, దృక్పదం మళ్ళించుకోక, సాధన చేస్తూ వచ్చారు. మానవ ప్రవృత్తి ఉట్టిపడుతూ ఉంటుంది ఆత్రేయ పాటలలో. అందుకనే వారి రచనలలో నిశితదృక్కు; లోతైన భావాలు, ఆవేశం, తపన, భగ్న హృదయాలాపన; మంచి భాషా శైలి; వస్తువు పట్ల అవగాహన కొన్ని అసామాన్య లక్షణాలు; వీరి శబ్దార్ధప్రయోగాలు అపూర్వం; పరిణితి చెందిన వ్యక్తిత్వం; ఇక చెప్పేదేముంది, వారి కలం నుండి వెలువడిన పాటలకు, మాటలకు జన హృదయాంతరాళలోకి వెళ్ళి పోయే శక్తి లభించేది. అందుకనే ఈ "మనసు కవి" నుండి "మన" "సు" కవి సాక్షాత్కరించాడు.

ఆత్రేయ పాటలు - వరహాల మూటలు

తన రచనలతో రసాలొలికించిన కవి ఆత్రేయ. వేదాంత దోరణి కలిగి ఉండి, జీవిత సారాన్ని రంగరించి, తన పాటలలో అతి నిగూడ సత్యాలను అలవోకగా రాసి అందించిన మహా కవి. తెలుగు భాషలోని తేట తనాన్ని, మాధుర్యాన్ని ఇలా అభివర్ణించారు తన పాటలో:

తేట తేట తెలుగుల, తెల్లవారి వెలుగు లా
ఏరులా సెలవేరులా కల కలా గల గలా
కదలి వచ్చింది కన్నె అప్సరా
వచ్చి నిలచింది కనుల ముందురా

తెలుగు వారి ఆడపడచు ఎంకిలా
ఎంకి కొప్పు లోని ముద్ద బంతిపువ్వులా
గోదారి కెరటాల వలె నా మదిలో పలికినది
చల్లగా చిరు జల్లుగా
జల జలా జర జరా .....
కదలి వచ్చింది కన్నె అప్సర
వచ్చి నిలచింది కనుల ముందురా

తెలుగుదనంతో పాటు రస రమ్యతను ప్రతిభింబిస్తుంది ఈ పాటలో. "అహో ఆంధ్ర భోజా! శ్రీ కృష్ణ దేవ రాయా!, విజయంగర సామ్రాజ్య తెజో విరాజా " అంటూ రాశారు; భావంతో పాటు నిండు తెలుగుదనం కనిపిస్తుంది. ఆయన రాసిన మాటలూ (డయలాగులు) వరాహ మూటలే. ఓ సన్నివేశంలో - " ఆ చుట్టాలా!, ఉన్నప్పుడు తింటారు, లేనప్పుడు తిడతారు " అని, అతి సున్నితంగా, అత్యంత నిగూడార్ధం చెప్పారు. మానవుల ప్రవృత్తి, దోరణి అర్ధం చేసుకున్న ఆయన పరిణితి చెందిన వ్యక్తిత్వం, కాబట్టి సరళమైన తెలుగులో అలా చెప్పారు.

భావ రసం

భావ రశం - "రాళ్ళలో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు? " అని మనిషి మదిలో మెదిలే భావాలు, అటు రాళ్ళలో ఉండే రూపం, భావం అర్ధంచేసుకుని తత్వంతో ముడివేసారు.

కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో ఉన్న నీరు కళ్ళ కెలా తెలుసు, రాళ్ళలో ఉన్న నీరు కళ్ళ కెలా తెలుసు
నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
....
తనే మంటై వెలుగిచ్చు దీపం
చెప్పదు తనలో చలరేగు తాపం

నే వెళ్ళుదారి ఓ ముళ్ళ దారి, రాలేరు యవ్వరు నాతో చేరి
నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు

వేసవి లోను వానలు రావా, కోవెల శిలకు జీవము రాధా
జరిగే నాడే జరుగును అన్నీ, జరిగే నాడే జరుగును అన్నీ, జరిగిన నాడే తెలియును కొన్ని

నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు ....

"నే వెళ్ళుదారి ఓ ముళ్ళ దారి, రాలేరు యవ్వరు నాతో చేరి" అంటూ తనదైన పందా ఏంటో చెప్పకనే చెప్పారు ఆత్రేయ. " అందమైన జీవితము అద్ధాల సౌధము " అంటూ మరో పాట రాసారు. ఇవన్నీ అక్షర సత్యాలే!. జీవితానుభవాలని, తత్వంతో ముడి వేశి చెప్పిన మాటలు, పాటలునూ. అందుకే అవి హృదయాన్ని హత్తుకుపోయేలా ఉంటాయి. అలాటి అసమాన ప్రతిభ కలిగిన వారు ఆయన. వాడుక భాషలో విషయాలు, భావాలు చెప్పి, వాటి అర్ధం, పరమార్ధం చాటి, మనసులను మెప్పించి జన హృదయాలను రంజింపచేసి వారి నోట ఆ మాటలు పలికిస్తూ ఆ పల్లవులని నెమరవేసుకునేటట్లుగా చేసిన అద్బుత కవి.

మధుర రశం>/h3>

మధుర రశాలొలికిస్తూ అనేక పాటలు రాశారు. వాటిలో - పల్లె పాటలు; ప్రేమికుల పాటలు; దేశ భక్తి పాటలు; మనిషి, మనసు, మమతానుభందాల మీద పాటలు; చేదు, కటువు, దుఃఖ, విచార, తత్వ భావాల పాటలు; అనేకం చోటు చేసుకున్నాయి. పల్లె పాటలు - జన పదాలలో ఉండే స్థితి గతులు, వాతావరణం అద్దం పట్టాయి; ప్రేమికుల పాటలలో వారి మదిలో కదలాడే హృదయ భావనలను వ్యక్తపరిచారు. దేశ భక్తి పాటలలో తన "స్వ" తంత్ర పోరాట అనుభావాలని రంగరించ్చి రాశారు; రాజకీయలలో ఉన్న కుళ్ళుని యెండకట్టేరు;

మానవతా విలువలను, సామాజిక భాధ్యతలను, భారతీయ తత్వాన్ని క్షుణంగా అర్ధం చేసుకుని, వాటిని రంగరించి, అత్యంత సమర్ధవంతంగా తన మాటలో, పాటలో వ్యక్తపరిచారు ఆత్రేయ.

కన్నులు నీవే కావాలి, కలనై నేనే రావాలి
కవితై నీవే పారాలి, కావ్యం నేనై నిలవాలి
....

"నువ్వు నేను ఏకమైనాము "; "చీరలెత్తుకెళ్ళాడా చిన్ని కృష్ణుడు, చిత్తమే దోచాడా ఈ చిన్ని కృష్ణుడు "; "పులకించని మది పులకించు "; "యే తీగ పూవునో ఏ కొమ్మ చేసెను, కలిసింది ఈ వింత అనుబంధమో"; "కడవెత్తు కొచ్చింది కన్నె పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్ల "; "కన్నులు నీవే కావాలి"; "నీవు లేక వీణ పలకలేనన్నది "; "మౌనెమ నీ భాష ఓ మూగ మనశా "; "కారులో షికారు కెళ్ళే చిన్నా దనా "; "చిన్న మాట, ఒక చిన్న మాటా "; "చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి"; "ఈనాటి ఈ బంధం ఏ నాటిదో "; "నా పాట నీ నోట పలకాల సిలకా" వంటి అద్బుత పాటలు అందించారు.

అప్పటిలో కొత్త పంథాలో రాసిన పాట - " కన్నె పిల్లవని కన్నులున్నవని ....". దీనిలో ప్రత్యేకత ఏమిటంటే, సంగీతానికి పదం సమకూర్చటం. ఈ ప్రయోగం - బాగా ఫలించింది. అటు ప్రేమికుల జంట పాడుకున్నదిగా చూపించి, తనలోని కవి హృదయానికి ప్రేరణ ఇచ్చి, చిక్కనైన తెలుగు లో చక్కటి పాట సృష్టించారు. జన హృదయాలనూ, సంగీత ప్రియులనూ ఆకట్టుకున్నారు.

కన్నె పిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నవే చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలు అన్ని రువ్వి యెన్నిన్ని కలలు రప్పించావు వయ్యారి

సంగీతం నువ్వైతే సాహిత్యం నేనౌతా, సంగీతేం నువ్వైతే సాహిత్యం నేనౌతా

కన్నె పిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నవే చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలు అన్ని రువ్వి యెన్నిన్ని కలలు రప్పించావు వయ్యారి

స్వరము నీవై స్వరమున పదము నేనై
గానం గీతం కాగా
కవిని నేనై నాలో కవిత నీవై
కావ్య మైనది తలపో పలుకో మనసో

కన్నె పిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని వగలు పోతున్నవే చిన్నారి
చిన్న నవ్వు నవ్వి వన్నెలు అన్ని రువ్వి యెన్నిన్ని కలలు రప్పించావు వయ్యారి

తన నా తన నా అన్నా
తానా అన్నా తాళం ఒకటే కదా
పదము చేర్చి పాట కూర్చ లేదా

దనిని దసస అన్నా నీద అన్నా స్వరమే రాగం కాదా
నీవు నేనా అన్నా
నీవునేనని అన్నా మనమే కాదా

కన్నె పిల్లవని కన్నులున్నవని యెన్నెన్ని కవిత చెప్పి మెప్పించావు గడసరి
చిన్న నవ్వు నవ్వి వన్నెలు అన్ని రువ్వి కలిసి మెప్పించేది ఎప్పుడని

"తాళి కట్టు శుభవేళ మెడలో కల్యణమాల, ...." - ఇది ఒక మరపు రాని మధుర పాట. పాడడానికి ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం గారు చాలా శ్రమపడవలసి వచ్చింది.

"తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యణమాల, తాలి కట్టు శుభవేళ మెడలో కళ్యణమాల
యేనాడు ఎ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో, యెనాడు ఈ జంటకో రాశి వున్నాడు విధి ఎప్పుడో
....."

తెలుగు సినిమాలో ప్రప్రధమ " వర్షం పాట "

ఆత్రేయ కలం నుంచి వచ్చిన విరిజల్లే - "చిటపట చినుకులు పడుతూవుంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టు నీడ కై పరిగిడుతుంటే, చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చ ఉంటుందోయి ...." ఇది తెలుగు సినీ రంగ చరిత్రలో ప్రప్రధమ వర్షపు పాట. అపూర్వ జనాదరణ పొందింది. తరువాత మరికొన్ని వర్షం పాటలు రాశారు - "కురిసింది వాన, నా గుండెలోనా, నీ చూపులే జల్లుగా"; "స్వాతి ముత్యపు జల్లులో". ఇవి కూడా బాగా రాణించాయి.

చేదు, కటువు అనుభావాలు, చింతిత క్షణాలలో ....

"శిగలోకి విరులిచ్చి"; "ఎవరికోసం, ఈ శూన్య నందనం"; "ఎవరో రావాలి"; పాటలు రాశారు. "జీవన తరంగాల "పాటలో ఆచార్య ఆత్రేయ హృదయావేదనతో నిండిన భవాలతో పాటు అనేక సత్యాలని అనుసంధానం చేసి, సమాజం లోని రుగ్మతలు, మనుషులలో ఉన్న ఋణాల భందం అద్బుతంగా వర్ణించారు.

"పదిమాసాలు మోసావు పిల్లలను, బ్రతుకంతా మొసావు బాధలను
ఇన్ని మోసిన నిన్ను మొసేవాళ్ళు లేక వెళుతున్నావు

ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో, యవరికి యవరు సొంతము, ఎంతవరకీ బంధము

కడుపు చించుకుని పుట్టిందోకరు, కాటికి నిన్ను మోసేదోకరు
తలకు కొరిమీ పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చే దెవరు, ఆపై నీతో వచ్చే దెవరు

ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో, యవరికి యవరు సొంతము, ఎంతవరకీ బంధము

మమతే మనిషి బంధిఖనా, భయపడి తెంచుకుని పారిపోయిన
తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది

ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో, యవరికి యవరు సొంతము, ఎంతవరకీ బంధము

తాళి కట్టే మగడులేడని తరలించుకుపోయే మృత్యువు ఆగదు
ఈ కట్టెను ఆ కట్టెలు కాల్చక మానవు
ఆ కన్నీళ్ళకు చితిమంటలారవు
ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు

ఈ జీవన తరంగాలలో ....

భక్తి రసం

"ఉన్నావా, అశలున్నావా"; "శేష శైలా వాస శ్రీ వేంకటేశ"; "ఎన్నాళ్ళని న కన్నులు కాయగ ఎదురు చూతురు గోపాల"; "వేగరార ప్రభో, పాహి హరే"; వంటి అద్బుత పాటలు ఆయన కలం నుండి విలువడ్డాయి.

దేశం మీద

దేశ భక్తి పాటలు అనేకం రాశారు. మరపు రాని కొన్ని పాటలు తరచి చూస్తే - బడి పంతులు చిత్రంలో - " భారత మాతకు జేజేలు, బంగరు భూమికి జేజేలు, ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవ ధాత్రికి జేజేలు" అని తనలోని దేశ భక్తిని చాటుకున్నారు. భారత దేశ స్వాతంత్ర సంఘర్షణ లోని - " క్విట్ ఇండియా " ఉద్యమంలో పాల్గొని కట కటాల వెనక ఉన్నారుకదా. దేశం, స్వాంతంత్రం, స్వేచ్చా కోసం తాపత్రేయం పడ్డారు - దేశ భక్తిని చాటటమే కాదు; దేశంలోని అసమానతలను, సమాజం గురించి, దానిలో ఉన్న రుగ్మతలను ఉద్దేశించి చక్కగా రాశారు. కొన్ని ఉదాహరణలు:

ఆకలి రాజ్యం - ఒక కవిగా, రచయితగా తన సామాజిక ధర్మం నిర్వర్తించారు ఆచార్య ఆత్రేయ. భారత దేశంలోని అసమానతను, స్థితి గతులను, బాగోగులను ఒక్క పాటలోకి దట్టించి అసమానతను, తారతమ్యాలకు చిత్రం కట్టేరు ఆత్రేయ. చావుకు మేళం కట్టి తీసుకు వెళ్ళే వాళ్ళు, బతికుంటే, తిన్నావో లేదో, అసలు ఒక్క పూట తిండి దొరికిందో లేదో పట్టించుకోని సామజిక వైనాన్ని సున్నితంగా ప్రశ్నించారు. కొందరివైనా హృదయాలు మారుతుందేమోనని!.

" సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రధర్, సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రధర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రధర్
...."

ఈ భావ యుక్తమైన పాట వెనుక వారి స్వగాధ కూడా కొంత వరకు దాగివుంది. తినడానికి తిండి లేక, ఉండడానికి గూడు లేక, చేతిలో కాసు ముక్కలులేక, ఎలా నెట్టుకు రాడం అన్న సందర్భాలని కళ్ళకు కట్టారు. సత్తా ఉన్నా, అది చాటు కోవడానికి అవకాశం లేదు. మనిషికి ఎంత విద్వత్తు ఉన్నా నేటి సమాజం చూసేనా? కొద్దో గొప్పో "పట్టు పరిశ్రమ" చేయక తప్పదు. నేటి కాలధర్మం కదా మరి!

వారి చేదు, కటువు అనుభావలనే ముడి సరుకులా తీసుకుని, భావ యుక్తంగా పాటలలోకి జీవితానుభవాలను క్రోడీకరించిన అనుభవజ్ఞుడు. అందుకనే వారి పాటలు అక్షర సత్యాలు. "సత్యం చూడాలంటే భారత దేశంలోనే చూడాలి; దానికి విరుద్ధం కూడా ఇండియా లో సత్యమే" అని వ్యాఖ్యానించారు ఓ ప్రముఖ కుష్టు వ్యాధి చికిత్స చేసే డాక్టర్. ఇలాటి ధోరణే ఆత్రేయ గారి పాటలలో కనిపిస్తూ ఉంటుంది.

రాజకీయాల మీద

సమకాలీన రాజకీయాల మీద తన అక్షరాస్త్రం సారించారు. రాజకీయలలోని, స్వార్ధం, కుళ్ళు, ప్రజలను మభ్య పెట్టి మాయల చేసే విధానాన్ని, డబ్బు ఎలా తింటారో, అసలు పార్టీలు ఎందుకు నడుపుతారో, పార్టీలు ఎందుకు చీలుస్తారో కనులకి కట్టినంట్టు వర్ణించారు. ఉదాహరణకు:

" మల్లయ్య గారి, యెల్లయ్య గారి కల్లబొల్లి బుల్లయ్యో, అయ్యా బుల్లయ్యా నీ అవతారాలు ఎన్నైయ్య
గట్టులు కొట్టి పొలం కలుపు కుంటాడు, ఓ బుల్లయ్య, పొట్టలు కొట్టి దినం గడుపు కుంటాడు ఒక యెల్లయ్య
చిన్న వాళ రెక్కల కష్టం ఇక్కడ దోస్తాడు, ఆ బుల్లయే, పెద్ధ వాళకు కట్టులు కట్టలు అక్కడ ఇస్తాడు, బుల్లయే అక్కడ ఇస్తాడు
..."

మనిషి, మనసు, మమతా

మనిషి, మనసు, మమతా - వీటికి సంబందించి అనేక పాటలు రాశారు. రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. ఆత్రేయ పాటాలలో ప్రత్యేకతలు ఏమిటంటే - మనుషుల మనసులని, మమతలని, స్వభావాలతో పాటు, తత్వాన్ని రంగరించి పాటలు రాశారు. చిత్త శుద్ధి కలిగి ఉంటాయి వీరి భవాలు. అందుకనే ఇవి జన హృదయాలలో నేటికీ మోగుతూనే ఉన్నాయి. మనిషి మనసునీ తత్వాన్ని అచ్చ తెనుగులో అత్యంత రమణీయంగా, సంవర్ధవంతంగా, హృదయానికి హత్తుకు పోయేలా పాటలు రాశారు అచార్య ఆత్రేయ గారు. ఉదాహరణకు:

" మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే ....
ఒకరికిస్తే మరలి రాదు ఓడిపోతే మరచిపోదు, గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకు పడదు "

ఇలా మనసున్న మనిషి పడే, తపన, అంతరంగంలో అనుభవించే ఆవేదన, పరిపరవిధాల పరిబ్రమించే సున్నిత, చంచల, కోమల, రంజిత మనస్స్థితులను తన అక్షరమాలలో పేర్చారు ఆత్రేయ. తెలుగు నాట ఇంత జనప్రియం పొందిన పాటలు లేవు అంటే అతిశయోక్తి కాదు. వారి తెలుగు భాషా ప్రతిభ, తత్వ చింతన అత్యున్నత స్థాయివి.

"అంతా మట్టే నని తెలుసు, అదీ ఒక మాయే నని తెలుసు, తెలిసి వలచి విలపించుటలో తీయదనం యవరికి తెలుసు ". చివరికి అంతా మట్టిలోనే కలిసేది. కాని నేను, నావి అన్న కాంక్షలు మనిషిని మనిషిలా బతకనివ్వవు. ఈ పరమార్ధాన్ని ఎంతో ఆశువుగా సూటిగా వాడుక భాషలో సున్నిత మనసుని, మనస్కుల భావాలని విశిదీకరించి చెప్పారు. ఇన్ని తెలిసినా యెందుకీ కాంక్ష? అని ప్రశ్నించారు. మరి అదే మాయ కదా!.

"మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతోలప్పుడు ఏమోతాయో, మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చు కున్నాడు కక్ష "; " మనస్సు మూగది, మాటలు రానిది, మమత ఒకటే అది నేర్చినది " అని ఏతీగ పూవునో పాటలో అక్షర మాల కూర్చారు. మరి మనస్సుకి మమత ఒకటే నేర్చుకుంటే, మరు జన్మలో ఈ మమతప్పుడు ఏమైపోతాయి? అందుకనే మనసెరిగి మసలుకోవాలి, బుద్ధినెరింగి నడచుకోవాలి.

మరొక పాటలో:

" కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది;
కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకూ .. ";


" గుందెమంటలార్పే చన్నీళ్ళు కన్నీళ్ళు కన్నీళ్ళు, ఉండవమ్మ ఉండవమ్మ చాన్నాళ్ళు
పొయినోళ్ళు అందరు మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు .... ";


" మనిషి పొతే మాత్రమేమి మనసు ఉంటది, మనసు తోటి మనసు ఎపుడో కలిసిపోతది
చావు పుటక లేని దమ్మ నేస్తమ్మన్నది, జనమ జనమకది మరీ గట్టి పడతది "


అత్రేయ గారిని మన "సు" కవి అని ఎందుకంటారో ఇక వెరే చెప్పనక్కర లేదు.

ఆత్రేయ మీద వెలువడిన రచనలు

మాజీ పార్లమెంట్ సభ్యుడూ, నటుడూ, కొంగర జగ్గైయ్య - ఆచార్య ఆత్రేయ తెలుగు సాహిత్యానికి అందించిన మహత్తర సేవలు మరచిపోకండా ఉండడానికి బృహత్తర కృషిచేశారు. ఇటీవల, ఆచార్య ఆత్రేయ అవార్డు - మొదలి నాగభూషణ శర్మ గారికి - అభినందన వారు ఆచార్య ఆత్రేయ స్మారక అవార్డు ప్రకటించి, ఆత్రేయ సినీ సంగీత విభావరి కూడా నిర్వహించారు. తెలుగు నాటక రంగం అంతరించుకోకుండా విశిష్ట కృషి చేస్తూ, "ఆచార్య ఆత్రేయ అండ్ కాంటెంపరరి తెలుగు తియేటర్" (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ) పుస్తకం రచించేరు. 2008 "ఆచార్య ఆత్రేయ అవార్డు "ఎం ఎస్ రెడ్డి కి ఇచ్చారు.

మన "సు" కవి - ఆచార్య ఆత్రేయ

ఆచార్య ఆత్రేయ గారు సెప్టెంబర్ 9, 1989 లో తన అమూల్య అక్షర సంపదనూ, భౌతికాన్ని వీడి అనంత యాత్రకు వెళ్ళి పోయారు. తెలుగు వారి మనసులలో శాశ్వతంగా గూడు కట్టుకున్నారు. ఆయన రాసిన పాట, మాటలలో చెప్పాలంటే - " పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు ". లోకం యెప్పుడూ జ్ఞాపకం పెట్టుకునేలా రాసి, అనంత లోకాలకు వెళ్ళినా, జన హృదయాలలో మిగిలిపోయారు. వారి మాట, పాట, భావాలు రానున్న తరాలకి స్పూర్తిధాయకం.

"మనిషి పొతే మాత్రమేమి మనసు ఉంటది, మనసు తోటి మనసు ఎపుడో కలిసిపోతది, చావు పుటక లేని దమ్మ నేస్తమ్మన్నది, జనమ జనమకది మరీ గట్టి పడతది ". ఇలా పాడుకో తియ్యగా చల్లగా అంటూ ప్రజల మనసులలో మమతల గుడి కట్టుకుని నిలచిపోయారు. ఆత్రేయుడు తరలిపోయాడు. జీవిత సత్యాలని తన పాటలో చెప్పి సంఘంలో సత్-చింతనకు ప్రేరణ కలిగించడం, అన్యాయాలు, అసమానతలు, అక్రమాల గురించి చెప్పటం, ప్రజలలో మార్పు కోసం ఆయన పడిన ఆవేదన, తపన కూడా కనిపిస్తాయి.

"ఈనాటి ఈ బంధం ఏ నాటిదో, అది యేనాడు పెనవేశెనో" అని రాశారు. ఆయన పాట భావార్ధాలు, అంతరార్ధాలు అర్ధం చేసుకుంటే ఆయన అణణ్య చింతకుడే! అన్నది విదితమౌతుంది. "ఇంటికి దీపం ఇల్లాలే"; "ప్రేమా పిచ్చి రెండు ఒకటే"; చివరికి యేదీ శాశ్వతంకాదు, అన్నీ పోయేవే అంటూ జీవిత సత్యాలని, భారతీయ తత్వాన్ని ఉద్భోదించిన పాటగాడు, మాటలరేడు, మన "సు" కవి.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     తీసిపారేయలేము
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)