సిలికానాంధ్ర, "సర్వధారి" యుగాది వేడుకలో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ప్రస్తుతపఱచబడిన కవిత ఇది.డాటు సైటమ్ము అదృష్టవంతుడో
ప్లాటు సైటమ్ము ఆగర్భ శ్రీమంతుడో
కాదు, కొద్ది సైటున్న ఇంజనీరన్న మురారి
ఆంధ్రావని గని అని
అమెరికా పని అని
గాలిలో తేలి
వెంటనే వాలి
వచ్చేను వేలీ
ఇచ్చేది కూలీ
అటుకాని
ఇటుకాని
మధ్యతర గతిలో
మధ్యతరగతిలో
ఫ్రీ ఉగాది చెట్నీ
ఫ్రీమాంటు మాట్నీ
ఎండవేళన సన్నివేలన
తిన్నాక లంచి
కనిపించె బెంచి
చిరు కునుకు లాగించ
కన్నుల్లొ
నలు దిశల కష్టాల
నల్లులే నల్లులు
ఒకటే బిల్లులే బిల్లులు
అప్సరసలు రారు
అప్పుసరసులే గాని
నౌకర్లు చాకర్లు లేరు
గాస్తో నడచే కార్లు, పుకార్లు గాని
హిస్టరీ లేదు, క్రెడిట్ హిస్టరీ గాని
కిరాణా సరుకులు
రవాణా పరుగులు
వీకెండది, నాకెండది
అమెరికాఖండ చండ ప్రచండుని ఎండది
అంటుండగానే ..
ప్రయాణమై
నిదుర విమానమై
ఇలను వీడి
కలను చేరెను ...

* * * * ~*~ * * * *

నల్లని వారు
నామాలు కలవారు
నెమలిపింఛాలవారు
కాటుక కన్నులతో
గిన్నెలతో నిండు వెన్నలతో
వన్నెచిన్నెలతో
వెన్నెలా కాంతులతో
గోప కాంతలతో
ద్వారకా నగరమది
సౌందర్య సగరమది
ద్వాపర యుగము
రసభావజగము
హరిమురారి
జగత్సర్వధారి
శ్రీవారి సామ్రాజ్యము
భక్త సాయుజ్యము
అంతలో పొంతలో
ద్వారకా ద్వారంపు చెంతలో
వింతొకటి గాంచేను
జీర్ణవస్త్రాల వారు
మడిగట్టి
ముడిచుట్టి
మొలన మూటల్లె కట్టి
ఉన్నారు క్యూ కట్టి
కృష్ణకృష్ణా ! యని బానర్లు చేపట్టి !
పొగతాగుతూ ఒకడు
చెవిపోగుతోనొకడు
సెల్ఫోనులోవొకడు
చెలిఫోనులోనొకడు
బుక్కుతోనొకడు
గోడ చెక్కుతూనొకడు
"ఎవరయ్యవీరు?
ఎందులకు వేచేరు? "
యని అడుగ,
"వీరందరూ
మాధవుని మిత్రులట
స్వామిని చూడగా ఆత్రులట
కుచేలునికి వరములివ్వగా విని
సిరిసంపదలుగని
తమకునూ దొరకునని గని
అటుకులను చేబూని
ఉగాదికై పలు బహుమతులు కొని
ద్వారకకు వచ్చేరు
ద్వారాన వేచేరు
వారు సుచేలుడు, నచేలుడు,
మాతమ్ముడు, వారల్లుడూ .."
గోశాలనుండి
గోవుందుడొచ్చునని
తమను చూడొచ్చునని
పడిగాపుపడి వారు
కృష్ణమాయలో పడినారు
పొలములకు కొందరు,
స్థలములకు కొందరు
వరములకు కొందరు
వరహాల కొందరు
చిన్నిల్లు, పెద్దిల్లు
చివరికీ మిగిలేది నిల్లు
ఎన్నైన చాలవే ఈ జీవితం చిల్లు
కాగితం మిల్లు
చెంతనే ఓ మూల ఒదిగి
నిలుచుండె గోపన్న
ఓ పల్లె వాడు
చిన్ని గొల్లవాడు
గోవిందు చూసినను పండుగే
లేకుంటె దండుగే
కాని, కాని లేని నేను
కానుకేమివ్వను
అని శోకించినాడు
ఇల్లంత శోధించినాడు
గోపన్న ప్రియ రవళి
కృష్ణునకి మురళి
చిన్ని వేణువును చేసేను
సిగ్గుతో దాచేను
ఇంతలో వింతగా
పలుదిశల పరిమళములు
చందనపు గంధములు
పూలతలు వూగుతూ
వృక్షములు వొంగుతూ
నీలి వర్ణము
నెమలి పింఛము
విష్ణుడా? కృష్ణుడా ?
వీడా ...ఈ చిన్ని వాడా?
చిన్ని వేలికి కొండ
ఆలమందల అండ
వీడా..ఈ చిన్ని వాడా?
కాళింది పైనెక్కి
కాలమును తొక్కేది
వీడా..ఈ చిన్ని వాడా?
గీతను బోధించి
నుదుటి గీతను మార్చేది
వీడా..ఈ చిన్ని వాడా?
జీవుళ్ళ పోషించు
దేవుళ్ళు పూజించు
వీడా..ఈ చిన్ని వాడా?
గోవింద మంత్రమున
గోలోకమిచ్చేది
వీడా.. ఈ చిన్ని వాడా?
కనుల తేజమో
కనుల కనరాని దేవతాబీజమో
కాంతి వలయమొ
అది దిగ్భ్రాంతి నిలయమో
క్షణములో
వీక్షణములో
మోదమో మోక్షమో
బ్రహ్మానందమో
గోవిందునందమో
దివ్యరస గంధమో
భగవంతుడు
ప్రేమ రసవంతుడు
తల్లినేగన్న తల్లినేగన్న
మూలమందున్న పరమాత్ముడు
"అన్నమే తినలేద గోపన్న?"
అనుచూనే అక్కునన్ జేర్చి
వెను వెంటనే
వెన్న ముద్దలు తీసి
గోవిందుడే గోరుముద్దలుగ పెట్టగా
కనుల వర్షమో హర్షమో
కురవగానణచుకొని
వేణువును తీసి
గోపన్న వినయముగనిచ్చె
కృష్ణునకు నచ్చె
వేణువది
చిన్ని వేణువది
గీతకారుని
సంగీతకారుని
వేణువది
చిన్ని వేణువది
రేపల్లె ధేనువది
కైవల్య కామధేనువది
వేణువది
చిన్ని వేణువది
గానమో జీవన గానమో
నిద్రాణమౌ కుండలినికది ప్రాణమో
వేణువది
చిన్ని వేణువది
ఆత్మ సానువది
జీవి మేనువది
వేణువది
చిన్ని వేణువది....
అంతలో
"జయ కృష్ణా ముకుందా మురారి
జయ గోవింద బృందా విహారి .."
అని పాట వినిపించె
నిద్రనూ జనిపించె
కనులు తెరవగ
ఆ ద్వారకను తలపించె
సిలికానాంధ్రయే అగుపించె
ఉగాదికేతెంచె మురారి
పర్వదిన రహదారి
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఏమీ బాగోలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)