మధురం మధురాక్షరం - 1

ఆటవికుడైన సామాన్య మానవుని మహా ఋషిని చేసిన మంత్రం శ్రీరామ మంత్రం. రామ అన్న అక్షరాలను పలికిన వారు మహా బలవంతులై చెట్లను, రాళ్ళను ఆయుధాలుగా చేసుకుని రాక్షస సంహారం కావించారు. గుహుడు, శబరి, జటాయువు, హనుమ, విభీషణుడువంటి ఎందరో మహానుభావులు రామసాంగత్యం వలన పునీతులైనారు. మధురం మధురం రామనామం. అది శక్తి ముక్తి దాయకం.

"కూజంతం రామరామేతి మధురం మధురాక్ష్రం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం"

కవిత్వమనే కొమ్మపై కూర్చుని మధురాతి మధురమైన "రామ" అనే అక్షరాలను కమ్మని గొంతుతో పలికిన వాల్మీకి కోకిలకి నమస్కారం" అని ప్రార్ధనలందుకున్ని వాల్మీకి ధన్యజీవి. నారదుని ఉపదేశంతో, బ్రహ్మ వరంతో, రామాయణాన్ని రచించిన మహాఋషి వాల్మీకి. "నానృషిః కుతుతే కావ్యం" అని కదా పెద్దల నుడి. తొలుత ఋషియై తన క్రాంతదర్శిత్వంతో రామాయణ మహాకావ్యాన్ని గాయత్రి మంత్ర పూర్వకంగా రచించి మనకందించిన మహాకవి ఆదికవి వాల్మీకి రచనా సౌందర్యం పరమాద్భుతం.

"వాల్మీకి గిరిసంభూతా రామసాగర గామిని!
పునాతు భువనం పుణ్యా రామాయణ మహానదీ"
శ్లోకసార సమాకీర్ణం సర్గ, కల్లోల సంకులం
కాండగ్రహ మహామీనం వందే రామార్ణవం"

"వాల్మీకి అనే పర్వతం నుండి పుట్టిన రామాయణం అనే మహానది ఈ భూనిని పునీతం చేసి, రాముడనే సముద్రంలో కలిసింది. నదీనాం సాగరో గతిః అన్న చందాన. రామార్ణవంలో చేపలు, మొసళ్ళు, తిమింగలాలుగా శ్లోకాలు,సర్గలు, కాండలు రూపాంతరం చెందేయి. అట్టి రామాయణానికి నమస్కారం" అన్న ఈ శ్లోకంలోని భావన మధురాతి మధురం.

"అహోగీతస్య మాధుర్యం శ్లోకానాంతు విశేషతః!
చిరనిర్వృత్తమప్యేతత్ ప్రత్యక్షమవదర్శితం!!

అహో! ఏమి ఆ వాల్మీకి గాన మాధుర్యం ఆ శ్లోకాల సోయగం. ఎప్పుడో జరిగిన కథను కళ్ళకు కట్టినట్లు రచించిన కవికి సాటియెవరు? కనుకనే చతుర్ముఖుడు స్వయంగా వచ్చి రామాయణాన్ని రచించమని చెప్పి, వాల్మీకికి వరాన్ని ప్రసాదించాడు. "కురు రామ కథాం పుణ్యాం శ్లోకబధ్ధాం మనోరమాం" "శ్లోకరూపంలో రామకథను రచించ"మని పల్కి

"యావత్ స్థాశ్యంతి గిరయః సరితశ్చ మహీతలే!
తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతే!!"

"పర్వతాలు, నదులు ఈ భూమిపై ఉన్నంత కాలం రామ కథ నిలిచి ఉంటుంది." అని అంతే కాదు..

"యావద్రామాయణ కథా త్వత్కృతా ప్రచరిష్యతి!
తావదూర్ధ్వమధశ్చత్వం ముల్లోకేషు వినత్వసి!!"

"ఎంతకాలము రామాయణా కథ లోకమౌలలో ఉండునో అంత కాలము నీవు నా లోకములో (బ్రహ్మలోకములో) ఉండునట్లు వరమొసంగుచున్నాను" అని తెల్పి అంతర్హితుడగును. అంత శక్తివంతమైనది రామాయణం. బ్రహ్మ వర ప్రభావం వల్ల

"హసితం భాషితం చైవగతిర్యాయచ్చ చేష్టితం!
తత్సర్వం ధర్మ వీర్యేణ యధావత్సం ప్రపశ్యతి!!"

"రామాయణ కథలోని పాత్రలు నవ్వు, నడక, మాట, మనుగడ, ఆచరణ సర్వం తనకళ్ళ ముందు కదలాడినట్లు చూసి రచించిన మహా తపస్వి వాల్మీకి. కనుకనే రామాయణం అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి నిలిచి ఉంటుంది.

వాల్మీకి ఉక్తి చాతుర్యం, అలంకార కల్పనలోని మధుర్యం, కథన శైలి, రసపరిపోషణ, అనితర సాధ్యం.
"ఆశ్చర్యమీదమాఖ్యానం మునినాసం ప్రకీర్తితం!
పరం కవీనామాధారం సమాప్తంచ యధా క్రమం!!"
"వాల్మీకి వ్రాసిన ఈ మధురమైన కథ అద్భుతమైనది. తరువాత కవులకు ఆదఋశప్రాయమైనది"

కొన్ని మచ్చుతునకలు:

"నాసీత్ పురేవా రాష్ట్రేవానృవాదీ నరః క్వచిత్!" అయోధ్యలో కానీ ఆ దేశంలో కానీ అబధ్ధం చెప్పేవాడు లేడు" అని తెల్పి, అయోధ్యను పాలించే దశరధుడు,"దీర్ఘదర్శి, మహాతేజః, పౌరజానపద ప్రియః", పల్లెలు, పట్టణాలు అన్న భేదం లేకుండా అందరినీ సమంగా చూసేవాడు. "పది దిక్కులయందు ప్రయాణించగల రధం కలవాడు కనుకనే దశరధుడు అని వాసిగాంచేడు. ఇక ఆయన మంత్రులు...

కీర్తిమంతః ప్రణిహితా యధా వచన కారిణః!
తేజః కమాయశః ప్రాప్తాః స్మిత పూర్వ భాషిణః!!"

"కీర్తిమంతులు, హితాన్ని కోరేవారు, ఆడి తప్పని వారు. నవ్వుతో ముందుగా మాట్లాడేవారు. అంతేకాదు, "దండం పాతయేయుః నుతేష్వపి" - తప్పు చేస్తే కొడుకునైనా దండించేవారు. ఇది రామాయణంలో ప్రత్యేకత. ఇక సీతారాముల దివ్యదాంపత్యం నాన్యతో దర్శనీయం.

"రామస్తు సీతాయాసార్ధం విజహార బహూన్ ఋతూన్
మనస్వీతద్గతస్తస్యా నిత్యం హృదిసమర్పితా"


శ్రీరాముడు అనేక ఋతువులు సీతప్రేమకు పాత్రుడై నిలిచాడు. శ్రీరాముని గుణాలను వర్ణిస్తూ వాల్మీకి ఇలా అంటాడు.

"బుధ్ధిమాన్ మధురభాషీ పూర్వభాషీ ప్రియంవదః|
వీర్యనాన్ న చ వీర్యేణ మహతాస్వేన విస్మితః||

ఎవ్వరినైనా తానే ముందుగా తియ్యగా పలుకరిస్తాడు. బలగర్వం కొంచెమైనా లేనివాడు. ఇట్టి అద్భుతమైన, ఆదర్శవంతమైన గుణాలు కల రాముడు ఎక్కడా తాను భగవంతుడనని చెప్పుకోలేదు. ఇతరులు ఎవరైనా నీవు భగవంతుడివి అన్నా "ఆత్మానం మానుషం మన్యే" - నేను సాధారణ మానవుడిని అని నిక్కంగా పలుకుతాడు. మానవుడిగా ఉంటేనే రావణ సంహారం జరుగుతుంది. దేవతల వలన రావణునికి మరణం లేదుకదా! కనుకనే "ఆత్మానం మానుషం మన్యే" అని అంటాడు, ఇది ఇందలి రహస్యం.

ఇక సుమిత్రచే వాల్మీకి చెప్పించిన మాటలు, అమృత గుళికలు. రాముడు, సీత ఎవరో ఆమెకు బాగా తెలుసు. వనవాసానికి అనుజ్ఞ ఇమ్మన్న లక్ష్మణునితో ఇలా అంటుంది -

రామం దశరధం విధ్ధి, మా విధ్ధి జనకాత్మజాం|
అయోధ్యాం అటవీం విధ్ధి గఛ్ఛ తాత యధా సుఖం||

రాముని తండ్రిగా భావించు, నన్నుగా సీతను భావించు (తల్లిగా)అడవి అయోధ్య అనుకుని హాయిగా వెళ్ళిరా." ఈ మాటలు వాల్మీకి కవితకి పరాకాష్టలు. ఈ శ్లోకంలో రాముడు విష్ణువు, సీత లక్ష్మి ("మాం") అయోధ్య వైకుంఠం అన్న అర్ధాలు కూడా ఉన్నందున సుమిత్ర సీతారాములను లక్ష్మీనారాయణులుగానే భావించింది. రామాయణం సాగరంలో మధురాతి మధురమైన భావాలు గల శ్లోకాలు కెరటాలవలె మనకు దర్శనమిస్తాయి. అన్నింటిని అనుభవించాలంటే తప్పక రామాయణం చదవాలి. ఇప్పుడు కొంచెం రుచి మత్రమే చూద్దాం.

అరణ్య కాండలో మాయలేడి రూపం ధరించిన మారీచుడు మరణ సమయంలో చావు తెలివిని ఉపయోగిస్తాడు. లక్ష్మణుని కూడా సీతకు దూరం చేస్తే రావణుని పని సులభమవుతుందని తలచి...

సప్రాప్తకాలమాజ్ఞాయ చకారచ తతస్స్వరం|
సదృశం రాఘవస్వేవ హా సీతే, లక్ష్మణేతి చ||
రాముని గొంతుతో హా సీతా, హా లక్ష్మణా అని అరుస్తాడు. "మిమిక్రీ" అనే కళ రామాయణంలోనే ప్రారంభమయింది.

సీత లక్ష్మణ స్వామిని వేడుకొంటుంది. "గఛ్ఛ జానీహి రాఘవం" - "వెళ్ళి రాముఇ గురించి తెలుసుకునిరా". "నేను వెళ్ళన"ంటాడు. "తం న సిధ్ధ్యతి సౌమిత్రే తవాపి భరతస్యచ" - "నీకు కానీ భరతునికి కాని నాయెడ దుర్బుధ్ధి ఉంటే అది సాధ్యం కాదు. నేను మీకు దక్కను." అని పరుష వాక్యాలు పలుకుతుంది. సాక్షాత్ లక్ష్మీ దేవి సామాన్య స్త్రీవలే పలుకుతుంది. మానవనైజాన్ని తెల్పేదే రామాయణం. ఆమె రావణుని భస్మం చేయగల శక్తిమంతురాలు. కానీ చేయదు. రామాయణ పాత్రల ద్వారా వాల్మీకి మనకి తెల్పిన సత్యాలు లక్ష్మణుడు ఆమెతో "దైవతం భవతీ మమ" - "నీవి నాకు దైవ సమానురాలవు" అన్నపవిత్ర భావాన్ని ప్రకటించి, "న చిత్రం స్త్రీషు మైథిలీ" - "స్త్రీలు ఇలానే మాట్లాడుతారు" అన్న సత్యాన్ని తెల్పి వెళ్తాడు. రావణుడు సీతను అపహరిస్తాడు. మరలా మరికొన్ని రత్నాలని తరువాత తెల్సికొందాం. స్వస్తి.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఏమీ బాగోలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)