మాళవికాగ్నిమిత్రం - రెండవ భాగంమొదటి భాగానికై ఈ లంకెను అనుసరించండి

మాళవికపై రాజు మనస్సు లగ్నం కావడాన్ని గురించే ఆమె చెబుతున్నదని ధారణి గ్రహించింది. ఇరావతి అక్కడినుంచి వెళ్ళగానే మహారాణి వెంటనే మాళవికను, వకుళావళిని పిలిపించింది. చీకటి కోనలా ఉండే పాతాళ గృహంలో వారిద్దరినీ బంధించి ఉంచింది. మాధవిక నే ఆమెను కావలి పెట్టింది. తన ముద్ర ఉన్న ఉంగరం తెచ్చి చూపితే తప్ప, ఎవరు వచ్చినా వారిని విడుదల చేయవద్దని కఠినంగా ఆజ్ఞాపించింది. తను ప్రేమించిన మాళవికను చెలికత్తెతో సహా మహారాణి చెఱసాలలో బంధించిందన్న సమాచారం గౌతముడి ద్వారా విన్నాడు రాజు. చాలా విచారించాడు. అప్పుడు గౌతముడు "మహారాజా! నాకు పాము కరిచినట్లు నమ్మిచి నటిస్తాను. ఆ విషయం రాణిగారికి చెప్పి, చికిత్స కోసం అని సర్పముద్ర వేసి ఉన్న ఆమె ఉంగరం సంపాదిద్దాము. దాంతో మనం మాళవికను చెఱనుండి విడిపించవచ్చు" అని తెలియచేసాడు. ఆ ఉపాయానికి రాజు చాలా సంతోషించాడు. గౌతముడు పెద్ద నాటకం ఆడి సర్పముద్ర ఉన్న ఉంగరం తీసుకుని పాతాళ గృహానికి వెళ్ళి మాధవికకు చూపించాడు. మాధవికకు అనుమానం కలిగింది. గౌతముని ప్రశ్నించింది. అందుకు గౌతముడు మన మహారాజు జన్మనక్షత్రానికి పాపగ్రహవేధ తగిలిందట. అందువల్ల నిర్బంధంలో ఉన్న వారి నందరినీ విడిచిపెట్టమని జ్యోతిష్కులు సలహా ఇచ్చారు. రాజుగారు ఆ సమాచారం రాణికి తెలుపగా ఆమె నాకీ ఉంగరం ఇచ్చి పంపారు" అని చెప్పాడు. గౌతముడు మాళవిక, వకుళావళికలను చెఱనుండి విడిపించి వెంటపెట్టుకుని ఉద్యానవనంలోని సముద్రగృహం అనే చలిక వద్ద వారిని ఉంచి, రాజుగారి దగ్గరకి వెళ్ళి జరిగినదంతా విన్నవించాడు. ఆనందంతో గౌతముడిని అభినందించాడు మహారాజు. తరువాత వారిద్దరూ సముద్రగృహం వద్దకు వెళ్ళారు. తలవని తలంపుగా ఇరావతి చెలికత్తె చంద్రిక ఎదురైంది. రాజు, గౌతముడు ఒక గోడ చాటుకుపోయి దాక్కున్నారు. తరువాత సముద్ర గృహంలోకి వెళ్ళారు. గౌతముడు వకుళావళికి ఏదో చెప్పి బయటకి వచ్చారు. ఒక రాతి తిన్నె మీద గోడకానుకుని కూర్చునాడు గౌతముడు. చల్లగాలికి అతనికి కునుకు పట్టింది. సముద్ర గృహంలో రాజు మాళవిక కబుర్లు చెప్పుకుని వినోదిస్తున్నారు. గౌతముడు ఉద్యానవనంలో ఉన్న సంగతి తన చెలికత్తె ద్వారా విని ఇరావతి ఉద్యానవనానికి వచ్చింది. నిద్రపోతున్న గౌతముని చూచింది. నిపుణిక వంకర టింకరగా ఉన్న తీగ తీసి గౌతముని మీద పడేసింది. గౌతముడు ఉలిక్కి పడి లేచి 'అయ్యో! పాము పైనపడింది' అని అరిచాడు. కళ్ళు తెరిచి చూచి 'భగవంతుడి దయ వలన ఇది తీగ అయింది. పాము కరిచిందని లోగడ అబద్దమాడాను. భగవంతుదు మేలు చేసాడు' అని తనలో తాను అనుకున్నాడు. అతని మాటలు ఇరావతి విన్నది. గౌతముడి అరుపులకు సముద్రగృహంలో ఉన్న రాజు, మాళవిక బయటకు వచ్చారు. వారిని చూచి ఇరావతి ఎదురుగా వచ్చి నిలుచున్నది. ఆమెను చూచి అందరూ తత్తరపాటు చెందారు. అప్పుడు రాజు గౌతముడికి కనుసైగ చేసాడు. రాజు ఇరావతిని సమాధాన పరచడానికి ప్రయత్నించాడు. ఇరావతి కోపంతో తన చెలికత్తె నిపుణికని పిలచి ఈ సంగతంతా రాణిగారితో చెప్పమని ఆమెను పంపింది. నిపుణిక నాలుగడుగులు వేసిందోలేదో, రాణి వద్దనుంచి వస్తున్న మాధవిక ఎదురువచ్చి 'మన ప్రభువుల జన్మ నక్షత్రానికి గ్రహపీడ పట్టింది. అందువలన జ్యోతిష్కుల సలహా ప్రకారం మాళవికా, వకుళావళికలను చెఱనుండి విడిపించవలసి వచ్చింది. రాజుగారి క్షేమమే మనందరికీ ప్రధానం. కావున నీవు కూడా దానికి సమ్మతించాలని' అని రాణిగారు ఇరావతితో చెప్పమన్నారు అని నిపుణికకు చెప్పింది. వెంటనే నిపుణిక వెనకకు వచ్చి రాణిగారి సందేశం ఇరావతికి రహస్యంగా అందచేసింది. ఇక్కడ కథ ఇలా ఉండగా అక్కడ అంతఃపురంలో రాజుగారి కుమార్తె వసులక్ష్మిని పెంపుడు బంగారు వన్నె కోతి భయపెట్టింది. అప్పుడా పిల్ల క్రిందపడి స్పృహ కోల్పోయింది. రాణిగారి ఉత్తర్వు ప్రకారం అంతఃపురద్వారపాలకురాలు జయసేన పరిగెత్తుకు ఉద్యావనానికి వచ్చి వృత్తాంతమంతా రాజుగారికి విన్నవించింది. ఇరావతి, నిపుణిక, రాజు, గౌతముడు గబగబా అంతఃపురం చేరుకున్నారు. చివరకు ఆపిల్లకు స్పృహ వచ్చింది. ఆ అమ్మాయి భయం పోగొట్టడానికి అందరూ ఏవేవో మాటలు చెబుతూ గడిపారు. గౌతముడు ఇదీ ఒకందుకు మంచిదే అనుకున్నాడు. ఉద్యాన వనంలో మాళవికా, వకుళావళిక దిగులుగా ఉన్నారు. తమ సంగతి తెలిసి రాణి ఏమిచేస్తుందో అని భయపడుతూ మెల్లగా అక్కడినుంచి బయలుదేరారు. మాళవిక దోహదం చేసిన రక్తారోక వృక్షం అయిదురోజులలోనే చక్కగా పుష్పించి ఉండడం చూచి వనపాలికలు ఆ సమాచారం రాణిగారికి తెలియచేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ మాటలు మాళవిక, వకుళావళికలు విన్నారు. ఈ సంగతి రాణికి తెలిసిన తరువాత ఆమెను దర్శించటం ఉచితంగా ఉంటుందని వారు అనుకున్నారు. మరునాడు వనపాలికలు రక్తరోక వృక్షం పూచిన సంగతి రాణికి మనవి చేసరు. రాణి చాలా సంతోషించి వనపాలికలకు బహుమానాలిచ్చి పంపింది. రాణి మామగారైన పుష్యమిత్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు. యజ్ఞాశ్వం వెంట రక్షణార్ధం రాణి కుమారుడైన వసుమిత్రుని సైన్య సమేతంగా పంపి ఉన్నాడు. తన కుమారుడు క్షేమంగా విజయంతో తిరిగి రావాలని రాణి ఆనాటినుంచి ఒక వ్రతం పట్టి ఉన్నది. ఆ వ్రతం ఆ రోజుతో పూర్తి కానున్నది. అందువలన ఆనాడు ఉద్యాపనలు చేసింది. పూజలు, దానాలు నిర్వర్తించింది. తరువాత ఉద్యానవనానికి రమ్మని పరిచారికల ద్వారా రాజుకు సందేశం పంపింది. పండిత కౌశిని చూచి 'మనం వసంతోత్సవానికై ఉద్యానవనానికి పోతున్నాము. మీరు మాళవికను పెండ్లికుమార్తెను అలంకరించినట్లు అలంకరించండి' అని చెప్పింది. అందరూ కలసి ఉద్యానవనానికి వెళ్ళడానికి సన్నద్ధులైనారు. యజ్ఞశేనుడితో యుద్ధానికి వెళ్ళిన వీరశేనుడు యుద్ధంలో విజయం పొందాడు. యజ్ఞశేనుణ్ణి ఖైదీగా పట్టుకున్నాడు. ఆ వృత్తాంతం మంత్రికి తెలియచేశాడు. మంత్రి ఆ సమాచారం ఒక పత్రికలో వ్రాసి రాజుగారికి పంపాడు. రాజు అది చదివి సమాధానంగా 'మనం ఒక రాజ్యాన్ని జయించాము. కానీ ఆరాజ్యాన్ని పాలించాలనే కోరిక నాకు లేదు. ఆ రాజు మనలను ఎదిరించాడు కాబట్టి అతనికి తగిన శిక్ష వేశాం. అది జరిగిపోయింది. శత్రువు లొంగిపోయిన తరువాత అతనిని కష్టపెట్టటం ధర్మం కాదు. కనుక మనం జయించిన రాజ్యాన్ని రెండుగా విభజించి ఉత్తరభాగం యజ్ఞశేనుడికీ, దక్షిణభాగం మాధవశేనుడికీ ఇప్పించండి' అని వ్రాసి మంత్రికి పంపించాడు. తరువాత గౌతముని తీసుకుని రాణి కోరిక ప్రకారం ఉద్యానవనానికి వెళ్ళాడు. అంతా ఉద్యానవనంలో సమావేశమై వినోదంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమీపంలోనే అగ్నిమిత్ర మహారాజు తండ్రి పుష్యమిత్రుడు అశ్వమేధయాగం ఆరంభించాడు. ఆయన వద్దనుంచి ఒక పరిచారికుడు వచ్చి, కానుక లేఖ తీసుకువచ్చి రాజుకి మ్రొక్కి వాటిని సమర్పించాడు. ఆ జాబులో 'యాగాశ్వం వెంట మన వసుమిత్రుని పంపాను. సింధునదీ తీరాన యవన రాజు గొప్ప అశ్విక దళంతో వచ్చి యాగాశ్వాన్ని పట్టుకున్నాడు. మన వసుమిత్రుడు యవన రాజుని ఎదిరించాడు. చివరకు యవన రాజుని ఓడించి గుఱ్ఱాన్ని విడిపించుకుని వచ్చాడు. మన అశ్వమేధయాత్ర దిగ్విజయంగా నెరవేరింది. పూర్వం సగర చక్రవర్తి, అంశుమంతుని సహాయంతో యజ్ఞం నెరవేర్చినట్లుగా నేను నా మనుమని సహాయంతో యాగ దీక్షకు పూనుకోడానికి సన్నాహాలు చేస్తున్నాను. నీవు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి యజ్ఞాన్ని జరిపించి పోవలసినదిగా కోరుతున్నాను' అని ఉంది. ఏడాది క్రితం యజ్ఞాశ్వం వెంటవెళ్ళిన తన కుమారుడు క్షేమంగాను, విజయంతోను తిరిగిరావడం రాణికి ఎంతో ఆనందం కలిగించింది. వసంతోత్సవం మరింత వైభవంగా జరిపించాలని నిశ్చయించుకుంది. వెంటనే భేరీ, మృదంగాది వాద్యాలు మ్రోగించవలసిందిగా ఆమె ఆజ్ఞాపించింది. ధారణి, మాళవిక చెయ్యిపట్టుకుని నడిపించుకుంటూ రాజు దగ్గరకి వచ్చి 'ప్రభూ! నేదీ వసంతోత్సవ శుభసమయంలో నా కుమారుడి క్షేమ సమాచారం నాకు అందచేసారు. నాకు మిక్కిలి ఆనందం కలిగించారు. ఈ సంతోషసమయంలో మీకీ కన్యారత్నాన్ని కానుకగా సమర్పించుకుంటున్నాను' అని రాజు చెయ్యి, మాళవిక చెయ్యి కలిపింది. రాజు మాళవిక కరగ్రహణం చేశాడు. 'ప్రాణేశ్వరీ! నీ ఆజ్ఞను నేను శిరసావహించడానికి సర్వదా సంసిద్ధుడను. ఈ కన్యామణిని హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను' అని చెప్పాడు. ఇంతలో విదర్భదేశ మంత్రి పంపిన సంగీత విద్యలో నిష్టాతులైన ఇద్దరు కన్యలు వచ్చారు. రాజు ధారణిని చూచి వారిలో ఒకరిని నీవద్ద అట్టేపెట్టుకో అని సూచించాడు. రాణి మాళవికతో వారిద్దరిలో ఒకరిని నీవు ఎన్నికో అని చెప్పింది. మాళవిక విదర్భ కన్యలను సమీపించింది. వారు ఒకరినొకరు చూచుకుని గుర్తు పట్టారు. మాళవిక కంట తడి పెట్టింది. ఆ కన్యలు కూడా దుఃఖం ఆపుకోలేకపోయారు. రాజు అది గమనించి ఏమిటని అడిగాడు. అప్పుడా విధర్భ కన్యలు 'మహారాజా! ఈ మాళవిక మా రాకుమార్తె. తమరు చెరవిడిపించిన మాధవశేనుని చెల్లెలు. ఆయన చెఱలో చిక్కినప్పుడు మంత్రి అయిన సుమతి ఈమెను తప్పించి సురక్షిత ప్రాంతానికై తీసుకు వెళ్ళడు. తరువాత ఈమె ఏమైందీ, ఏం జరిగిందీ మాకు తెలియదు' అని వినయంగా విన్నవించారు. ఆ కన్య ఈ కథంతా చెబుతున్నప్పుడు మాళవిక దుఃఖం ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడవసాగింది. పండిత కౌశికి తక్కిన విషయమంతా బయట పెట్టింది. సుమతి తన అన్న అని తెలియచేసింది. తరువాత తాను సన్యాసిని వేషంలో అంతఃపురంలో చేరడం మొదలైన సంగతులన్నీ వివరించింది. ఈ కథంతా విని అందరూ విచారించారు. రాణి పండిత కౌశికి విషయంలోనూ, మాళవిక విషయంలోనూ తాను చేసిన పనికి పశ్చాత్తాపపడింది. మాళవికను దగ్గరకు తీసుకుని ఓదార్చింది. తరువాత వారంతా జరిగిన విషయాలన్నీ తలచుకుని సంతోషమూ, ఆశ్చర్యమూ పొందారు. చివరకు అందరూ మేళ తాళాలతో రాచనగరు చేరారు. కౌశికి రాజుని, రాణిని చూచి 'మీ ఉదారగుణం వలన నేను ఒక సంవత్సరం సుఖంగా, క్షేమంగా గడప గలిగాను. మా రాకుమార్తె అదృష్టం పండింది. మా రాకుమారుడు తమ దయవలన తిరిగి పరిపాలన చేపట్టాడు. కనుక మీరి శెలవు యిస్తే మా దేశానికి వెళతాను' అని అన్నది. అందుకు రాజు 'మన రెండు రాజ్యాల మధ్యా ఎటువంటి భేదమూ లేదు. మీరు ఇక్కడ ఉన్నా మీ దేశంలో ఉన్నట్లే. వేరే భావన మీకు అక్కర లేదు. మీరు మీ రాకుమారుణ్ణి చూడదలిస్తే ఆయననే ఇక్కడకి పిలిపిస్తాను. మీరు ఇక్కడే కాలం గడపండి' అని చెప్పాడు. తరువాత అగ్నిమిత్రుడు కుటుంబ, పరివార సమేతంగా తండ్రి యాగానికి వెళ్ళి ఆ వైభవాన్ని చూచి తిరిగి వచ్చాడు. మాధవశేనుణ్ణి పిలిపించాడు. బావమరిదిగా అతనికి జరిపించవలసిన మర్యాదలన్నీ జరిపించాడు. అందరినీ సముచిత గౌరవ లాంఛనాలతో సత్కరించాడు. మాళవికను పరిణయమాడి, రాజ్యపాలన సాగిస్తూ సుఖంగా కాలం గడిపాడు.

(సమాప్తం)మువ్వల సుబరామయ్యగారు విజయవాడలో జయంతి పబ్లికేషన్స్ అధినేత. గత మూడు దశాబ్దాలుగా వారు వివిధ ప్రాచీన గ్రంధాలను ముద్రించి, ఎన్నోగ్రంధాలకు తెలుగులోకి అనువాదాలు చేయించి అమితమైన సాహితీ సేవలను అందించారు. యువ, మిసిమి, రచన, ఆంధ్ర జ్యోతి, వంటి అనేక పత్రికలలో వారి వ్యాసాలు ఎన్నో ప్రచురింపబడ్డాయి. వారికున్న ఈ ప్రాచీన సాహిత్య పరిజ్ఞాన్ని దృష్టిలో పెట్టుకుని వారిని ఈ సాహిత్యాలను పామరులకు సైతం అర్థమయ్యే రీతిలో అందించమన్న మా అభ్యర్థనకు వారుచేసిన రూపకల్పనే ఈ శీర్షికే, "ప్రాచీన సాహిత్య దర్శనం"గా వెలుగొందగలదు. ప్రతినెలా వారు ఒక ప్రాచీన కావ్యాన్ని తీసుకొని దానిని సరళతరమైన భాషలో అందించడమేకాకుండా అవసరమైన వ్యాఖ్యలను కూడా జతపరుస్తారు.
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఏమీ బాగోలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)