సన్యాసి - ఆషాఢభూతి

శ్లో: ధనమార్జాయ కాకుత్స, ధనమూల మిదం జగత్
అనర్తం నాభిజానామి, నిర్ధనస్య మృతస్య చ
అర్థం: లోకమంతా ధనమే ప్రధానముగా గలది గావునా ధనమును బాగుగా సంపాదించు. డబ్బు లేనివాడు చచ్చినవానితో సమానము. వీరిరువురికి భేదము కానరాదు.

ప్రస్తుతము అనగా కలియుగ ప్రథమపాదంలో భరతవర్షానికి పశ్చిమ దిశన గల అమెరికా ఖండానా కాలిఫోర్నియాలోని ఇసుకలోయలో ఒక తెలుగువాడు నివసించుచున్నాడు. అతని నామధేయము సన్యాసి.

అతడు అందరి అమెరికా జనుల వలనే రెండు చేతులకి దోరికినంత అప్పుచేసి ఓ గృహాన్ని, మరి రెండు వాహనములను, ఒకటి తనకు మరియొకటి తన భార్యా పిల్లలకి, మరియు ఇతర సౌకర్యములను సమకూర్చుకొని ఆనందముగా జీవించుచున్నానని భ్రమలో బ్రతుకుచుండెను.

కాని కాలమంతయు ఎప్పుడూ ఒకలాగే నడవదు గదా. అప్పుడప్పుడు ఓడలు బండ్లవునని మనందరికి ఎఱుకయే గదా. అలాంటి ఆపదయే ఇప్పుడు ముంచుకొచ్చినది. అమెరికా దేశము ఆర్థిక సంక్షోభములో బడిన కారణమున అతనికి రావలిసిన నెలసరి రాబడి తక్కువ గాసాగినది. చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక అతని పరిస్థితి నీటిని వీడి ఒడ్డున పడిన చేప చందమయినది. ఒకనాటి వేకువఝామున కలత నిద్రలేచి 'అయ్యో దేవుడా! నేను ఈ దుస్థితినుండి బయపడుటెట్లు? నన్ను కాపాడు నాథుదెవ్వడు?' అని దీర్ఘముగా విచారించుచుండ అతగాడికి తన కంప్యూటర్ యంత్రములో 'ఓ అదృష్టజాతకుడా!' అంటూ ఒక అంతర్జాల ఉత్తరము యేతెంచినది. దురదృష్టం బారిన పడ్డ సన్యాసి తనకేదో అదృష్టం పట్టబోవుచున్నదని తలంచి ఆ ఉత్తరమును తెరచి గబగబా చదువసాగెను.

ఓ ప్రియమైన స్నేహితుడా!

మొదటగా నీకు నా హృదయపూర్వక శుభాకంక్షలు తెలియజెప్పుచున్నాను. నన్ను 'ఆషాడభూతి ' యని అనెదరు. నేను ఇప్పుడు నీకు, నాకు, ముఖ్యముగా నీకు, నిన్ను వరించబోవు ధనలక్ష్మిని గురించి వివరించెదను. సావధానముగా వినుము. ప్రస్తుతకాలంలో ఈ అంతర్జాలాన్ని ప్రజలంతా దుర్వినియోగపరచుచున్నారని నాకు తెలుసును. ఈ అతి ముఖ్యమైన విషయాన్ని నేను నీకు అంతర్జాలం ద్వారా చేరవేయుట సబబు కాదని తెలిసినను నిన్ను కలసుకొనుటకు వేరే మార్గములేక ఈ ఉత్తరమును పంపుచున్నాను. ధనలక్ష్మి వచ్చి తలుపు కొట్టినపుడే మనము ఆలస్యం చేయకుండా గృహములోనికి ఆహ్వానించవలెను. లేనిచో ఒకసారి చేజారిన సదవకాశము మరల తిరిగి రాదు.

నేను ఆఫ్రికా దేశానా ఒక బ్యాంకులో పనిచేయుచున్నాను. మా బ్యాంకులో ధనగుప్తుడను ఒక వ్యాపారి చాలా సంవత్సరాల క్రితము ఒక మిలియను డాలరులు భద్రపరిచినాడు. ఆ ధనము కాస్తా వడ్డీకి పై వడ్డీ మరియు పైపైవడ్డీలన్నీ కలుపగా ఇప్పుడు పది మిలియను డాలరులైనవి.

గతవారము నేను ఆ ధనగుప్తుడిని బ్యాంకుకు వచ్చి తన ధనము తీసుకెళ్ళమని కబురు పెట్టటానికి ప్రయత్నిచాను. ఎక్కడ వెదికినను, ఎంత వెదికినను ఆ ధనగుప్తుడి ఆచూకీ లభించలేదు. చివరకు రక్షకభటుల సహాయమర్థించినాను. అప్పుడు నాకు ఒక ఆశుభమైన సంగతి తెలియవచ్చినది. అదేమనగా, రెండు వత్సరాల క్రితం ఆ ధనగుప్తుడు సకుటుంబంగా విమానయానం గావిస్తుండగా పెద్ద ప్రమాదం సంభవించి ఆ విమానము సముద్రములో కుప్ప కూలిపోయినదనీ, అందులో ప్రయాణించుచున్న వారందరు ప్రాణములు కోల్పోయారనియు తెలియవచ్చినది.

అనగా ధనగుప్తుడు తన ధనము తీసుకోకుండా అసువులు బాయడమే గాకుండా మరి ఆ ధనము తీసుకొనుటకు వారసులెవ్వరు లెరయ్యిరి. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మా దేశపు న్యాయచట్టము ప్రకారము ఆ ధనము తీసుకొనుటకు రాబోవు రెండు సంవత్సరాలలో ఎవ్వరు ముందుకు రాకున్నచో ఆ ధనము ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళును.

అలా ఆ ధనము వేరెవ్వరికి ఉపయోగపడకుండా ప్రభుత్వ హస్తగతము గావుటము నాకు లేశమాత్రము ఇష్టము లేదు. ఇంతవరకు నాకు తప్ప ఈ విషయము వేరే ప్రాణికి తెలియదు. నీకు ఇప్పుడు తెలిపినాను గాబట్టి నీవే ఈ చిదంబర రహస్యము తెలిసిన రెండవ ప్రాణివి.

ఈ సమయములో నేను నిన్ను అర్థించునదొక్కటే. నాకు నీవు గతించిన ధనగుప్తుని వేలు విడిచిన మేనమామ మనవడివని వ్రాసినచో నేను నీ బ్యాంకులో నీ పేర ఏడు మిలియనులు వేసి నేను మూడు మిలియనులు తీసుకొందును. ఈ విధముగా ఇద్దరము పరస్పర సహాయము జేసుకొనిన వారవుదము.

ఈ ఒప్పందం నీకు సమ్మతమనే భావింవుచున్నాను. నీ జవాబు గురించి ఎదురు చూస్తుంటాను.

ఇట్లు,

నీ శ్రెయోభిలాషి,

ఆషాఢభూతి

చదవడం పూర్తి చేసిన సన్యాసి మన్సు మన్సులో లేకుండా పోయినది. డబ్బులుంటే కొండ మీది కోతి అయినను దిగివస్తుంది గదా. వద్దంటే ధనము వచ్చుచున్నచో నిరాకరించుట ఎంతవరకు అభిలషణీయం. మరి పరుల ధనమునకు ప్రలోభబడుట ఎంతవరకు సమర్థనీయమని ప్రశ్నించుకున్నాడు కూడా. ఈ ప్రపంచంలో ఇంతమంది ఉండగా మరి ఈ అషాఢభూతి నాకే ఎందుకు సహాయము చేయవలెనని కోరుకుంటున్నాడు అనే సందేహము మనసులో తలెత్తినది కూడా. ఈ ప్రశ్నలతో సతమతమవుతూ 'నా మనసులో వేదన పడుటకంటే ఆ ఆషాఢభూతినే అడిగి సందేహ నివృత్తి చేసుకొనవచ్చును గదా' అని నిర్ణయించుకున్నవాడై ఆషాఢబూతికి కంప్యూటర్ ద్వారా ఉత్తరం వ్రాసినాడు.

కొద్ది గంటల సమయం లోపే ఆషాఢభూతి నుండి సమాధానము వచ్చినది.

****************

'ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నందుకు చాలా సంతోషము వేసినది. అవును, నేను ఎవెరికైనను ఈ గుప్తధనమును ఈయవచ్చును. కాని, ఆ ఎవరోఒకరు ఎవరా, ఎలా ఎంచుకోవాలా అని ఆలోచిస్తుండాగా నీ పేరు అంతర్జాలములో చూడటం తటస్థించినది. నీ పేరు 'సన్యాసి ' నాకు ఎంతగానో ఒప్పినది. వెనువెంటనే ఈ ధనమతయూ నీకే ఇవ్వవలసినదని అనిపించినది. అయినను ఐశ్వర్యమునకు అంతు ఎక్కడిది?

నీవు బాల్యంలో చదువుకొన్న చిన్నయసూరి మహాశయుడు రచించిన మిత్రప్రాప్తిని మననం చేసుకో. రాజుకాని, సామాన్యుడుకాని మంచి స్నేహితులను పొందినపుడు అతని జీవితము ధన్యమవుతుంది కదా! మంచి స్నేహితుల వలన ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఎటువంటి ఆపద కలిగినను ఆ స్నేహితుడు తీర్చగలుగుతాడు. అందుకు ఉదాహరణగా చిత్రగ్రీవుడు మరియూ హిరణ్యకుడు అను కపోతరాజు, మూషికముల కథ మనకు చెప్పలేదా?

అయ్యగారు వచ్చేవరకు అమావాస్య ఆగదు. కావునా నీవు నన్ను నీ స్నేహితునిగా ఎంచుతూ ఇంకా తాత్సారం చేయకుండా నీ బ్యాంకు పేరు, అక్కౌంటు నెంబరు మరియు నీ ఇంటి విలాసము తెలియపర వలసిందిగా మనవి.'

ఇది చదువుకొన్న సన్యాసి మనస్సు కొంత కుదుటపడినది. ప్రశాంత మనస్కుడై ఆలోచించగా నిమిషనిమిషమునకు ఆషాఢభూతిపై నమ్మకము హెచ్చుకాసాగినది. డబ్బు లేనివాడు దమ్మిడీకి కొఱగాడు. ఇప్పుడూ తను ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఆషాఢభూతిని ఆశ్రయించుటయే మేలని నిర్ణయించుకొన్నాడు.

మరునాడు ఆషాఢభూతికి కావలయు అన్ని వివరములు ఇచ్చినాడు. తదుపరి గంట గంటకు ఆషాఢభూతి ఎమంటాడా అని ఎదురు చూడసాగాడు. కొద్ది రోజుల తరువాత ఆషాఢభూతి 'ఇచ్చట ఈ కార్యము సజావుగా సాగించుటకు నాకు కొంత డబ్బు చేతి ఖర్చులకు, జేబు ఖర్చుల నిమిత్తం అవసరమున్నది. గాన, నీ బ్యాంకు నుండి నేను ఇరవై వేల డాలరులు తీసుకొందును. కార్యము పూర్తి అయిన వెంటనే నీ ఏడు మిలియనులు బ్యాంకులో వేసెదను. ఇది సత్యప్రమాణముగా నేను చెబుతున్న మాట. నన్ను నమ్ము ' అంటూ సన్యాసికి వ్రాసాడు.

చేసేది ఏమిలేక సన్యాసి సరే అన్నాడు. అలా అన్న కొద్ది నిమిషములలోనే తన బ్యాంకు నుండి ఇరవై వేల డాలరులు స్విస్ బ్యాంకులోనికి మాయమైనవి.

తరువాత ఎన్నో రోజులు సన్యాసి దినమునకు ఎన్నో తడవలు తన బ్యాంకులో ఏవైనా డబ్బులు జమ అయ్యాయేమోనని చూసుకొన్నాడు. దమ్మీడి రాలేదు. ఆషాఢభూతికి ఎన్నియో ఉత్తరములు వ్రాసినాడు. అతని వద్దనుండి ఒక్క మాట కూడా లేదు. అతని జాడ తెలియకున్నది.

ఇరవై వేల డాలరులు పోగొట్టుకున్న వాడై డబ్బిచ్చి తేలు కుట్టించుకున్న వాడివలే తన బాధ ఎవరికీ చెప్పుకోలేకుండా నిద్ర రాని రాత్రులు ఎన్నియో గడిపినాడు. చివరకు మోసపోయానని తెలుసుకొని రాత్రి నిద్రలో 'ఒరేయ్ ఆషాఢభూతీ' అని పలవరించాడు.

పక్కనే నిదరోతున్న సహధర్మచారిణి మేలుకొని 'ఎవరండీ, ఈ ఆషాఢభూతీ' అని ప్రశ్నించినది. అప్పుడు సన్యాసి తన గొడు అంతయూ తన సగభాగానికి వెల్లడించాడు.

అంతా విని 'చాల్లెండి సంబడం. మీరు బాల్యంలో చదివిన ఆషాఢభూతి కథ మరిచిపోయారా, ఏమిటీ? మన అదృష్టం బాగుండి ఇరవై వేలతో సరిపోయింది. ఇకనైనా బుద్ధిగా మెదలండి ' అంటూ సన్నగా కంపిస్తున్న భర్తను తనకేసి హత్తుకుంది ఆ భార్యమణి.

ఇతి సన్యాసి-ఆషాఢభూతి కథ సమాప్తః

శుభం భూయాత్!

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఏమీ బాగోలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)