ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారినీ ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారాకానీ (fax: 408-516-8945) మాకు జులై 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.తాము.

ఈ మాసం సమస్య

" తే.గీ.|| ఓడలే బండ్లు ఆ బండ్లు ఓడలగును ! "క్రితమాసం సమస్య

" ఆ.వె.|| నోట్లు వుంటె చాలు ఓట్లు వచ్చు! "ఈ సమస్యకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

మొదటి పూరణ - కృష్ణ ఆక్కులు, కూపర్టీనో, కాలిఫోర్నియ.

ఆ.వె||పదవిమెట్లు నెక్కువారల నీతికి
ఎన్ని తూట్లు వున్న ఎన్నికత్తి
పోట్లు పొడిచి వున్న పోటిన గెలుతురు
నోట్లు వుంటె చాలు ఓట్లు వచ్చు


ఆ.వె||కులం వుంటె చాలు గుణములేకున్నను
మంచి చేయ కున్న మందు చాలు
చోరులైన నేమి జోరుగ గెలువరే
నోట్లు వుంటె చాలు ఓట్లు వచ్చు


ఆ.వె||ప్రజల మేలు తలచి ప్రగతి పనులు చేయు
నేతలు కరువైరి నేడు చూడ
ప్రజలనిధులు చల్లి ప్రతినిధులౌదురు
నోట్లు వుంటె చాలు ఓట్లు వచ్చు


రెండవ పూరణ - MVC రావు, బెంగళూరు

ఆ.వె.|| జనుల గోడు వినను జడులైన నాయకు
లెన్నికలపుడేమొ వేడు కొనుచు
ధనము మధ్యమిచ్చి దాసుల జేతురు
నోట్లు వుంటె చాలు ఓట్లు వచ్చు


మూడవ పూరణ - మాజేటి సుమలత

కవిత|| ఓట్లు వేయుచుంద్రు ఓటు సమయమపుడు
పాట్లు తప్పుననుచు పదవి వస్తె
అట్లె పేద ప్రజ నేమార్చు చుందురు
నోట్లు వుంటె చాలు ఓట్లు వచ్చు


నాల్గవ పూరణ- బత్తల సుబ్రమన్యం

కవిత|| ఎవ్వరడ్డము లేక యెన్నికల గెలువంగ
చదువు సంధ్యలు లేకున్న చాల మేలు
మతుల మసిజేయు మాయ మాటల తోడు
నోట్లు వుంటె చాలు వోట్లు వచ్చు.


ఐదవ పూరణ - శ్యామసుందర్ పుల్లెల, శాన్ హోసే, కాలిఫోర్నియా

గుండె అలవ తిరగ దండిగా డబ్బొచ్చు
నోట్లు ఉంటె చాలు ఓట్లు వచ్చు
ఓట్లు తినిన గుండెకోపిక వచ్చురా
బ్రదుకు చక్రమిట్లు పరగులిడును

(ఇక్కడ ఓట్లు = oats గా చదవవలెను)

ఆరవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే, కాలిఫోర్నియ

ఆవె.|| పెద్ద బిల్డరయ్యి పేట్రేగ వచ్చు, ప్రొ
నోట్లువుంటె చాలు! ఓట్లు వచ్చు
పొడిది మాటమీద ప్రోనోటె లేదయా,
రాజకీయమందు రామచంద్ర!


పాఠకులనుంచి మరిన్ని మంచి పద్య కవితలు

రచనా ప్రేరణ- బత్తల సుబ్రమణ్యం, రోచెష్టెర్ హిల్స్, మిచిగన్

వయసు యుత్తర దిశ కేగు వార్ధక్యమందు
కలము బట్టుట కేమి కారణంబనగ
కనుల కొసల జూసి కళ్ళ జోడును సరిజేసి
గొంతు నొకయింత సవరించి గూడార్థమివరించె.


నెత్తి మీదను జుత్తు నెరసి పోయినతోడ
అర్దాంగి ఆదరణ అరవాసియై మిగులంగ
తిండి తిప్పలు, తీర్థము తిన్నె మీదకు జేర
గురువు దైవము లపుడు గురుతు వత్తురు గాదె.


తిన్న తిండి యొక యింత తికమకలు సేయ
కనులు మూతపడక కదలాడు తను జూసి
నిద్ర చెడినదనుచు పత్ని నిష్క్రమించిన రేయి
కవిత లల్లుట యొక్కటే కాలగమనమునకు దారి.


తెల్లవారిన యంత తేనీరు (తే)లేదనుచు
ఆలి అరచిన తోడ అలుక బూనిన మగడు
నులక మంచము నెక్కి నిదుర రాక
కవితలల్లు నపుడు తనదు కష్టముల గూర్చి.


కృష్ణ ఆక్కులు గారు పంపిన కంద పద్యాలు

కం||పురిపేరు భాగ్యనగరం
పురిలో బాంబులవి పేలు వుగ్రపనులచే
వరదలు పారు చినుకులకు
మరియూ బ్రిడ్జిలును కూలు మనుషుల పైనే


కం||బారులు బారులు తీరుగ
బీరుల బారులు వెలియగ విరివిగ పురిలో
కారుల లోచేరి యువత
కోరిన తీరున గడిపిరి కోరిక తీరన్


కం|| వలువలు గంతలయిన విల
విలలాడెను పేదరాలు విలువల కొరకై
కులుకుల తారలు తెలిపిరి
వెలనచ్చినచో వలువలు విప్పెదమనుచున్


కం||దొంగతనం హత్యలు చే
యంగ పనికి రారు జాబు యందున చేరన్
మంత్రి పదవికై నటులన్
చందంగా ఈ గుణములు చక్కగ నొప్పున్


కం||కావలెను తెలంగాణని
పోవలదు విడిచని తీరు పోరగ అర్థం
కావుట లేదు ప్రజలకును
ఏవిధముగమేలు జరుగు ఏదిజరిగినన్
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     తీసిపారేయలేము
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)