దేవ రహస్యం - మంత్ర మహాత్మ్యం

"మంత్ర శక్తి ఎలా కలుగుతుంది? కేవలం ఒక మంత్రాన్ని లక్షల సార్లు ఉచ్చరించడం వల్లనే అయితే టేప్ రికార్డర్ లో మంత్రాన్ని ఎల్లప్పుడూ జపం చేసేలా పెడితే సరిపోతుందిగా!? ", అని అడిగాడో శిష్యశిఖామణి.

"అవును. అలా చేస్తే తప్పకుండా మంత్రశక్తి కలుగుతుంది - కాని ఆ టేప్ రికార్డర్ కి !", అన్నారో గురువు గారు.

ప్రార్ధనలు మామూలు మానవభాషలో నిర్మించబడినవి. వాటికంటే దివ్యలోకాలనుండి వినబడిన మంత్రాలు శక్తివంతమైనవిట. అలా విన్న వారిని ద్రష్టలు అంటున్నాం. మంత్రాలు బీజాక్షర నిర్మితాలు. అంటే ఏ అక్షరం ఎక్కడ వుండాలో అలా వున్నవి అన్న మాట. ప్రపంచంలో అనేక మతాలలో ఈ మంత్రాలు, అంటే దివ్య శబ్దాలు వున్నాయి. బుద్ధిజంలో పాళీ భాషలో, హిందూ మతంలో సంస్కృతంలో, క్రైస్తవమతంలో హిబ్రూ, లాటిన్ భాషలలో, ఇస్లాంలో అరబిక్ భాషలో దివ్యశబ్దాలు వున్నాయి, దేవదత్తాలుగా భావించబడుతున్నాయి. అయితే వాటి స్వరూపం, వినియోగం భిన్నంగా వుండొచ్చు. అందుకే మంత్రాన్ని చదువుతున్నప్పుడు ఉచ్చారణ సరిగా వుండడం, తగినంత శ్రద్ధతో చెయ్యడం అవసరం. చాలా మంది పదాలని తుంచిగాని, తొందర తొందరగా గాని, తప్పులతో గాని చేస్తూ వుంటారు. దీనివల్ల తగిన ఫలితాలు త్వరగా రావని శాస్త్రం చెపుతోంది. మంత్రాన్ని గురుముఖంగా నేర్చుకోవలసినదిగా అందుకే చెప్పడం జరిగింది.

మంత్ర శక్తి మూలకాలు

మంత్ర శక్తితో బాటు జంటగా రెండు ప్రధానమైన విషయాలున్నాయి అని అనేక మంత్రశాస్త్ర గ్రంధాల సారం. 1. భక్తి : ఇది సాధకుడిని దివ్య శక్తితో అనుసంధానంగా వుంచుతుంది. భక్తి ఒక బీజం లాంటిది. 2. మంత్ర శక్తి: ఇది కొలవడానికి కొలమానంలేదు, ప్రత్యక్షానుభూతి కావాలంటే సిద్ధులు రావాలి. పరోక్షానుభూతి సాధ్యమే! 3. దేవతానుగ్రహం : ఇక్కడ సాధకుడి వ్యక్తిత్వం, పూర్వ జన్మ సంస్కారాలు, ఈ జన్మలో కర్మలు అన్నిటిని బట్టి ఇది వుంటుంది. కొందరు గురు అనుగ్రహంతో దేవతను కూడా మెప్పించగలుగుతారు.

బుజ్జి గోపాల్

ముందు భక్తిని గురించి మాట్లాడదాం. కొద్ది కాలం కింద బృందావనంలో ఒక గొప్ప సాధకురాలు వుండేదిట. ఇప్పటికి ఆ తపస్విని ఇంటిని సాధకులు పుణ్యక్షేత్రంలా దర్శిస్తూ వుంటారు. ఆమె రాధాకృష్ణులని చిన్నపిల్లలుగా, నిజమైన బిడ్డలుగా భావిస్తూ పూజిస్తుండేది. వాళ్ళకి పాలుపెరుగులు పెట్టడం, స్నానం చేయించడం ఇలా ఎన్నో! ఇవన్నీ ఏదో విగ్రహాలకు చేయిస్తున్నట్టు కాక నిజంగా రాధా కృష్ణులు వున్నట్టు, వారికి అన్నం ముద్దలు పెడుతున్నట్టు ప్రవర్తిస్తుండేది. మొదట్లో ఇదంతా భ్రమ, మతిభ్రమ అని భావించారు చుట్టు పక్కల వాళ్ళు. చిత్రమేమిటంటే కొంత కాలానికి ఆమె రాధకి, కృష్ణుడికి అని పెట్టే లడ్డూలు, వెన్నముద్దలు అందరి ఎదురుగానే మాయమవడం మొదలు పెట్టాయి. దాంతో అందరికి అర్ధమైంది, నిజంగానే ఆమె చిన్న పిల్లలుగా రాధా కృష్ణులని అక్కడ దర్శిస్తోందని. అతి సూక్ష్మంగా ఆ నారాయణున్ని చిన్న పిల్లవానిగా చూస్తూ, పరాత్పర దివ్యస్వరూపమైన రాధాదేవిని బాలికగా దర్శిస్తూ నిజంగానే వారి సాన్నిధ్యంలో ధన్యురాలవుతుండేదిట. అయితే ఈ కధ ఇక్కడితో అయిపోలేదు. ఓ చిన్న సంఘటన జరిగింది - ఆమె భక్తికి పరీక్షో, భగవత్ తత్వాన్ని అర్ధం చేసుకోవాలనుకునే వారికి జవాబో! అనుకోకుండా పిల్లి వచ్చింది. చిన్నవాడైన కృష్ణుడు "అమ్మా! పిల్లి వచ్చిందే భయం! " అంటూ వచ్చాడు. ఏదో ధ్యాసలో వున్న ఆమె అందిట, "నువ్వు విశ్వరూపుడవి, నారాయణుడవి నీకు భయమేంటిరా! " అని. అంతే కృష్ణుడు, రాధా ఇద్దరూ మాయమై పోయారు. ఎంత వెతికినా కనిపించలేదు, ఎంత పిలిచినా రాలేదు.

అలా ఆమె చింతిస్తుండగా కొంతకాలానికి చైతన్య మహా ప్రభువుల దర్శనమైందిట. ఆయన చెప్పారు, "అమ్మా! భగవంతుడిని నువ్వు చిన్ని వాడుగా భావించి, ప్రేమించి భక్తితో ఆహ్వానించావు. అలా చేసినన్నాళ్ళూ రాధాకృష్ణులు కూడా చిన్ని వారుగా హాయిగా దర్శనమిచ్చారు. ఎప్పుడైతే వారిని విశ్వరూపులుగా, పరాత్పర శక్తిగా దర్శించాలన్న తలంపు కలిగిందో, నీ లక్ష్యంతో పాటు భగవత్ స్వరూపంకూడా అంతుపట్టనంత పెద్దదిగా మారింది. సాధనలో, భక్తి మార్గంలో ఎంత సాధారణమైన, అనన్యమైన భక్తి వుంటే అంత త్వరగా సాక్షాత్కారం లభ్యమవుతుంది" . ఈ మాటలు విని ఆమె తన సాధనతో మళ్ళీ శ్రీ కృష్ణ సాక్షాత్కారాన్ని పొందిందిట. ఇదే ప్రహ్లాదుడి భక్తిలోనూ, కన్నప్ప భక్తిలోనూ కూడా వున్న రహస్యం అనిపిస్తుంది.

అతీతమైన పరబ్రహ్మ తత్వాన్ని ఎలా భావిస్తే అలా దర్శనమవుతుంది. నారద భక్తి సూత్రములు ప్రేమ దర్శనమును గురించి చెప్పాయి. ప్రార్ధనకు పైమెట్టు మంత్ర సాధన, మంత్ర సాధనకు పై మెట్టు ధ్యానము, ధ్యానమునకు పైమెట్టు భావ నిర్మితమైన తాదాత్మ్యం అని ప్రేమోపాసకుల నమ్మకము. నారద భక్తి సూత్రాలు ఇలా మొదలవుతున్నాయి. సా త్వస్మిన్ పరమప్రేమరూపా అమృత స్వరూపా చ యల్లబ్ద్వా పుమాన్ సిద్ధో భవతి, అమృతో భవతి, తృప్తో భవతి అంటే భక్తి అనేది భగవానుని యందు పరమ ప్రేమ స్వరూపమైనది, అది అమృతమయమైనది, ఇది పొందిన మానవుడు సిద్ధపురుషుడగును, అమరుడగును, తృప్తుడగును అని అర్ధము.

మరి సాధన ఎప్పుడు చెయ్యాలి? ఎప్పుడు జపం చేస్తే మంత్రం సిద్ధిస్తుంది? మా ఇంట్లో దేవుడి గది సరిగ్గా లేదు, పిల్లలు గోల చేస్తారు, సమయం సరిగ్గా కుదరట్లేదు అనుకునే మనకి ఈ చక్కటి ఉదాహరణ నచ్చవచ్చును.

ఒక తుమ్మెద వుంది. అది తామర పూవులో చేరి మకరందాన్ని సేవిస్తూ వుంది. అంతలో సూర్యుడు అస్తమించాడు. తామరపువ్వు కూడా ముడుచుకుని పోయింది. ఆ తుమ్మెద కూడా ఆ పువ్వులోనే వుండిపోయింది. అప్పుడా తుమ్మెద అనుకుందిట: రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీః ఇత్థం విచింతయతి కోశగతే ద్విరేఫే హా! హంత! హంత! నళినీం గజ ఉజ్జహార - నారద భక్తి సూత్రములు

రాత్రి గడచిపోతుంది. మళ్ళీ తెల్లవారుతుంది. సూర్యుడు ఉదయిస్తాడు. తామరలు వికసిస్తాయి - అని. అంతలో ఎక్కడనించో వచ్చిన ఏనుగు ఆ పూలని పెకలించి నమిలేసిందిట. తుమ్మెద కోరిక మనసులోనే వుండిపోయింది. కాబట్టి ఫలానా పని పూర్తి అయ్యాక (మొక్కుబడిగా) నేను మంత్ర జపం, పూజ చేస్తాను అనుకోవద్దని నారదులవారే చెపుతున్నారు. సత్యనారాయణ వ్రత కధలో కూడా ఈ విషయం ప్రస్ఫుటంగా చెప్పారు. కాలాతీతమైనది సాధన. అనంతమైన పరబ్రహ్మ శక్తిని దేవతా రూపంగా మనం భావించినపుడు, నిర్మలంగా సాధనతో మెప్పించాలనుకున్నపుడు కాలంతో నిమిత్తంలేదని భగవత్గీతలో కృష్ణుడు చెప్పాడు.

గణితంలో తెలియని విలువని 'ఏక్స్ ' అనుకుంటున్నాము. లెక్కని సాధించాక దాని విలువ తెలుస్తోంది. అలాగే సాధనా రంగంలో, తెలియని అతీతమైన శక్తిని - రాముడనో, కృష్ణుడనో అనుకుంటున్నాం. సాధన చేసాక ఆ తత్వ స్వరూపం అర్ధమవుతుంది. అందుకని విష్ణువే దేవుడు, శివుడు కాదు అనో, లేక వీళ్ళిద్దరూ కాదు నేనే దేవుడిని అనో మనం విచారించ నక్కర్లేదు అని అన్ని ఉపనిషత్తులు చెపుతున్నాయి. ప్రేమించడం సాధన లక్ష్యం, ద్వేషించడం కాదు. ద్వేషించడం నేర్పేది మతమే కాదు అన్నారు మహమ్మద్ ఆలి.

ఎక్కడిదో తెలియదు కాని, పశ్చిమ గోదావరి జిల్లా ఊనగట్ల గ్రామంలో వుండే ఓ గాయత్రీ ఉపాసకులు ఈ కింది శ్లోకం నేర్పేవారు. ఇది పరమ గురువుని గురించి బాగా చెపుతోంది. యస్యాం తర్నాది మధ్యం నహి కర చరణం నమ గోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణం నభవతి పురుషో నో నపుంసో నచ స్త్రీః నాకారం నొవికారం నహి జని మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి

ఇందులోని అద్భుతమైన రహస్యం గ్రహిస్తే బ్రహ్మవిద్య గోచరిస్తుంది, సాధకుడిని సిద్ధునిగా చేస్తుంది. సమయానుకూలంగా మారే సామాన్య విలువలకూ, చిన్న చిన్న లింగవయోభేదాలు, ఆచార సాంప్రదాయాలు, తరతరాలుగా రావడం తప్ప ఏ ఉపయోగమూ లేని మూఢ విశ్వాసాలకి, పాపపుణ్యాలకి, స్వభావాలకి, స్వ భావాలకి అతీతంగా, 'విశ్వాభావంగా ఆ పరమ గురువు (ది మాష్టర్ ఆఫ్ ది యూనివర్స్) ఉన్నాడు.

ఆయన మనం ఊహించుకున్నట్టు మడి కట్టుకుని పులిహార, పరవాన్నం పంచిపెడుతుంటాడు అనుకోవాలా? కిరీటాలు పెట్టుకుని, ఒళ్ళంతా ఇరవైనాలుగు కేరెట్ల బంగారం వేసుకుని, పది నిమిషాలకోసారి అభయం ప్రదర్సిస్తూ వుంటాడా?

లక్ష్మీ దేవి

లక్ష్మీ దేవి నిజంగా పువ్వులో కూచుని వున్నప్పుడు చేతుల్లోంచి చిల్లర నాణాలుగా పడుతుంటాయా? మనల్ని ఏరుకోనిస్తుందా? ఈ ఫొటోలు పెట్టుకుని మురిసిపోయే మనకి ఒరిగే నిజమైన లాభం ఏంటి? వీటికి జవాబు ఇందాక మనం అనుకున్నదేనేమో!

'యథ్ భావం తత్ భవతి '

మనమెలా అనుకుంటే అలాగే జరుగుతుందిట. లక్ష్మి అంటే డబ్బులిచ్చే అమ్మవారు అని మనం అనుకుంటే అదే కలుగుతుంది. మన ఆలోచనాపరిధి విస్రుతమయ్యే కొద్దీ దేవతాప్రభావ వలయం పెద్దదవుతుందిట. ప్రతి మంత్రం దాని శక్తి చైతన్యంతో కాలాతీతం, వ్యోమాతీతమైన ఋతంభరా పౌనఃపున్యంతో (అంటే ఆంగ్లంలో ఆమ్నీప్రెజెంట్, డివైన్ అండ్ ఆల్ నోయింగ్ కమ్యూనికేషన్ ఫీక్వెన్సీ) ప్రభావిత మండలాన్ని చేరుతూ ఉంటుందిట.

అందుకే లక్ష్మీ దేవి ఇచ్చే ధనాన్ని శ్రీసూక్తంలో ఇలా వర్ణించారు అని గతంలో ఒక సారి అనుకున్నాం.


"ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే .. "

అగ్ని ధనమేంటి? గడ్డకట్టించే చలిలో మిలియన్ డాలర్లు ఏంచేసుకుంటాం? కాస్త వెచ్చగా వుంటే చాలనుకుంటాం. అప్పుడు అనిపిస్తుంది అగ్ని ధనమేనని! అగ్ని అనే ధనం శరీరంలోంచి పోతే ప్రపంచాన్ని వశంచేసుకున్నవాడైన రావణుడైనా శవం అవుతాడు కదా! అగ్ని ధనమే, ఆ ధనంతోనే భూగోళం సూర్యుడి పుణ్యమా అని మానవాళికి చోటునిచ్చింది. అలాగే వాయువు, జ్ఞానము, వర్షము ఇవన్నీ ధనరూపాలే. బ్యాంకులో వున్నదే ధనం కాదు, బుర్రలో వున్నదీ ధనమే అని ప్రవచించారు. అది లేకపోతే భావ దారిద్ర్యం ఏర్పడుతుందిట. అందుకే "ధియోయోనః ప్రచోదయాత్ " అని బుద్ధి పెంపొందించమని గాయత్రీ మంత్రంలో ప్రార్ధిస్తారుట.

మనకవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ చెప్పినట్టు "తెరచే కిటికీని బట్టి పరతెంచే పుష్పపరాగం ఉంటుంది.... గదికీ మదికీ కూడా గవాక్షాలుంటాయి....."

ఆ మనసు కిటికీ తెరిస్తేనే దివ్యలోకాలు కనిపిస్తాయి.కొంచెం ఓపికపట్టి మంత్ర సాధనచేసి మంచి తలపుల తలుపులు కూడాతీస్తే మనలోనే, మనతోనే వున్న దేవుడు మనింట్లోకి శాశ్వతంగా ప్రవేశిస్తాడు అంటున్నారు, మనం మనసారా ఆహ్వానిద్దామా?

శ్రీ గురుభ్యో నమఃమంత్ర నాదం

గాయని: దీప్తి బొమ్మకంటి

ఈ మాసం మంత్రం: సరస్వతీ మంత్రం

ఓం ఐం హ్రీం క్లీం శ్రీ సరస్వత్యై నమః

సాధన: ఈ మంత్రాన్ని పునరావృతం చేస్తూ కానీ, వింటూ కానీ ధ్యానం చేయ వచ్చును. ఉఛ్చారణ తెలిసేలా, నేర్చుకోవడానికి అనువుగా ఈ మంత్ర నాదం అందించే ప్రయత్నం చేయడమైనది.

ఉపయోగాలు:

* విద్యాభివృద్ధి, వాక్సిద్ధి, ఙానసంపత్తి, ఙాపకశక్తి, శాంతము
* తలనొప్పి, రక్తపోటు, నడుం నొప్పి తగ్గడం
* పరిక్షలలో విజయం, ఇంటర్ వ్యూలలో విజయం, వ్యాపార చర్చల్లో అగ్రస్థానం
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     తీసిపారేయలేము
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)