వన వినోదిని

-నరసింహాచార్య (సాధన)

మదిలో రస స్ఫూర్తి ఇనుమడించిన వేళ, ప్రపంచంలో తనకున్న శక్తియుక్తులన్నిటినీ కూడదీసుకుని కళాకారుల మనస్సు కళా సృష్టి చేస్తుంది. కొన్ని వందల భావాలు ఒకే చిత్రంతో చెప్పడానికి తన కుంచెను సర్వ రీతుల్లో ఆనందనర్తనమాడిస్తారు చిత్రకారులు. సరిగ్గా ఆ సంగతులను తెలుసుకుని ఆనందిచేదే రసజ్ఞ హృదయం. కుంచె కొసల నుండి జాలువారే వేలాది భావాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నమే ఈ శీర్షిక. ప్రతి నెలా శ్రీ శేషగిరి రావు గారి చిత్రాలకు వెనుక కథ ఇందులో మీకోసం.....
భావ కవన సంచారిణి,తపోవన విహారిణి రస హృదయ విలాసిని, ముగ్ధ సౌందర్య వినోదిని, స్నిగ్ధ సుకుమార సులోచని, ఈ హరిణి నిశ్ఛల జీవనంతో, నిర్మల వర్తనంతో సాధుపుంగవుల సహవాసముతో అమరిన సద్గుణ జీవన ప్రతీక, మునిజన మానస పుత్రిక ఈ హరిణ రాణి.

నయగారాలతో, నయనరాగాలతో, కదిలే కాలంతో, ఎగసే వేగంతో పోటీపడుతోంది ఈ మనోవేగగామిని. వేంటాడే చూపులను,వేటాడే తూపులనుండి అవలీలగా, అలవోకగా తప్పించుకుంటూ, బిత్తర చూపులతో, తత్తరబాటుతో, చూపరులను అలరంచే రస హృదయ రనంజని ఈ మృగ నయని.

నాటి సీతను మురిపంచి, రావణ వధకు శ్రీకారం చుట్టిన మాయా వినోదిని అరాళకుంతల శకుంతల నేత్రాలను పుణికిపుచ్చుకుని దుష్యంతుని పరిష్వంగానికి చేర్చి, భరతవంశానికి నాందీభూతమైన ఈ అజినం చరిత్రకే మణిదీపం తృణప్రాయమైన ఆశలకు పోకుండా కేవలం తృణాలతో తృప్తిపొందే విరాగిణి.

తపోధనులను ఆజన్మాంతము అలరించి, తనచర్మాన్ని వస్త్రంగా, ఆసనంగా చేసి తరించిన పరిపూర్ణ ముముచ్చువు.

కాలంతో పాటు ముందుకు దూకుతూ, వెంటాడే గతకాలపు తూపుల్లాంటి అనుభవాన్ని వెనక్కి చూస్తూ గమనిస్తూ, జీవన యానంలో, భూత భవితవ్యాలపై అప్రమత్తమవ్వాలన్న సత్య బోధిని ఈ అచంచల హృదయ మోదిని.

మానవ జీవనానికి, కస్తూరి పరిమళాన్ని అద్దుతూ నగరాజు హిమవంతుని రాజ ఠీవికి "చామర" సేవతో సార్ధక్యాన్ని కల్గంచిన ఈ "చమరీ" జాతి మృగం పరుగుల తరంగంలా, పరువపు తురగంలా రసహృదయ రాజ్యాన్ని తలపంపజేసే తలపుల తరంగిణి

ఇంతటి అద్భుత భావాన్ని తనమనసులో నిలిపి, రంగుల లోకంలో యోగ విహారం చేస్తూ, మనోవీధిలోని భావాలకు అద్దంపట్టారు ఈఅనుభవ చిత్రకారులు. చిత్ర విచిత్ర కాంతులీనే ఈ చిత్రంలోని హరిణ రాణి సొగసులు ఒక్కసారి చూస్తే మరపురానివి. వనకాంత చిత్రణ లో కాని,పవన చలిత వృక్షాలుగాని బాగా చిత్రించబడినాయి. లేడి మెడ వెనుకకు తిరిగినప్పటి ఆ అందం మహా కవులకే సాధ్యం. ఈ చిత్రం రసజ్ఞులను ఒక్కసారిగా ఎన్నోకోణాలలో ఆలోచింపచేసేదిగా ఉంది "యద్భావం తద్భవతి" అనే ఆర్యోక్తి కి అద్దం పడుతూ, రసహృదయులకు జ్ఞాన నేత్రమైన ఈ చిత్రం "కొండపల్లి" వారి ప్రతిభకు అక్షర చిత్రం.
ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఏమీ బాగోలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)