దేవరకొండ సౌమ్య

సాయంత్రం ఆరయింది. ఆఫీసులో పని ముగించుకుని అప్పుడే బయటకు వచ్చాను. బయట అప్పుడప్పుడే చిన్న చిన్న చినుకులు మొదలౌతున్నాయి. పొద్దున్న అల్మారా నుంచి ఎండాకాలం కట్టుకోవడానికి కొనుకున్న తెల్లబట్టలలో తెల్లని పైజమామీద ఎంబ్రాయిడరీ చేసిన గులాబిరంగు కుర్తా select చేసుకుని వేసుకున్నప్పుడు వానాకాలం మొదలైందన్న విషయం అస్సలే గుర్తురాలేదు.

అలాగే ఆ చినుకులలో సానసన్నగా తడుస్తూ బస్ స్టాప్ కేసి నడిచాను. అప్పటివరకూ వీచిన చల్లగాలి సడన్ గా మాయమయ్యింది. నెమ్మదిగా చీకటవ్వడం మొదలయింది. ఇంతలోనే పెద్ద వాన. "అబ్బా! నా తెల్ల డ్రెస్.. ఎంతో ఆశపడి కొనుకున్నా.. ఈ పాడు వాన ఇప్పుడే రావాలా?.." అనుకున్నా బెంగగా. నా అల్మారాలో ముచ్చటగా మడతలు తీరిన కొత్త డ్రెస్ లు అన్నీ ఇంకా వేసుకోనే లేదు. ఈ వానాకాలం మొదలైతే ఏ రోజు వాన వస్తుందో నమ్మకమే లేదు. ఇంక అవి గూటికే పరిమితమవ్వాలా??

ఇంతలో అటుగా వచ్చిన ఒక కారు, నా బెంగని పెంచడానికో ఏమో, రోడ్ మీద వున్న వాన నీళ్ళని నా మీదకి స్ప్లాష్ చేసి వెళ్ళిపోయింది. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఒక్కవాన ఎంత పని చేసిందో. నన్ను ముద్దగా తడీపేసింది. నా బట్టలు పాడు చేసింది. ఇప్పుడు జలుబు చేస్తుందేమో? రేపు జ్వరం వస్తే? బాబోయ్! ఎంత పని పెండింగ్ లో పెట్టేసి అనవసరంగా ఈ రోజు త్వరగా బయలుదేరాను. రేపు జ్వరంతో ఆఫీసుకి వెళ్ళకపోతే మా మానేజరు... అమ్మో! తలుచుకుంటేనే భయం వేస్తోంది.

నాయీ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ ఒక సెట్విన్ బస్ వచ్చి నా ముందు సడెన్ బ్రేక్ వేసింది. "మేడం! స్టేషన్ కా?" అన్నాడు కండక్టరు. "హమ్మయ్యా!" అనుకుంటూ ఎక్కేసాను. తడిసిన బట్టలతో అసలే ఒళ్ళంతా చిరాకుగా వుంది. దానికి తోడు బస్ నిండా జనం. నిలబడడానికే కష్టంగా ఉంది. తడిసిన తలలు, మట్టి కొట్టుకు పోయిన చెప్పులు. బస్సంతా రకరకాల వాసనలు. తప్పించుకుందామన్నా ఏమీ చేయలేని పరిస్థితి. మూత పెట్టేసిన మూకుడులో ఉడుకుతున్న కూర ముక్కలా ఉంది నా పరిస్థితి. ఒక్కసారి నా ముక్కు కోసి బయటపెట్టే అవకాశం ఉంటే బావుండుననిపించింది.

ఎదో స్టేజ్ వచ్చినట్టయింది. నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు దిగొచ్చుగా.. అహా.. అందరూ ఒకేసారి .. మధ్యలో ఉన్న నన్ను తోసుకుంటూ, నాకేం అని తొక్కుకుంటూ వెళ్ళీపోయారు. గట్టిగా అరవాలనిపించింది. చదువు తాలూకు సంస్కారమో, ఉద్యోగం తాలూకు అలవాటో, నా నోరు నొక్కేసింది. బాధ తాలూకు కన్నీళ్ళు కళ్ళలో గిర్రున తిరిగి క్రిందకి జారసాగాయి. కానీ ఆ వచ్చే కన్నీళ్ళ తడికూడా నాకు చిరాకవుతుందని ఆపేసుకున్నాను.

అప్పటికి బస్ లో కాస్త నిలబడడానికి కాస్త ప్లేస్ దొరికింది. 'హమ్మయ్యా!' అని ఊపిరి పీల్చుకున్నానో లేదో.. తలమీద ఒక నీటి చుక్క టుపుక్కుమంటూ పడింది. ఒళ్ళు జలదరించింది. పక్కన అందరూ ఎత్తు ఎత్తు మనుషులు. ఎవరి జడనుండి వచ్చిందో.. ఎవరి తడిసిన చొక్కానుండి పడిందో? చికాకు ఎక్కువవుతోంది. అంతలో ఇంకో నీటి చుక్క! విసుగ్గా తల పైకి ఎత్తాను. అది బస్సు పై కప్పుకు పడిన కన్నం నుండి పడుతున్న వాన. ఈ వాన నన్ను నిలువునా ముంచేంతవరకూ వదలకూడదని కంకణం కట్టుకున్నట్టు వుంది. సరిగ్గా నా నెత్తి మీదే కన్నం! తప్పించుకోవడానికీ, కదలడానికీ కూడా చోటు లేదు. సరే అని వానకి సరెండర్ అయిపోయి ఎమోషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి పెదవి కొరుక్కుంటూ నిలబడ్డాను.

మొత్తానికి నా స్టాప్ వచ్చింది. దిగి, నాశనం అయిన నా తెల్లని పైజమాకేసి చూసుకుని, నిస్సహాయంగా ఇంటికేసి నడిచాను.

ఇంటికి వెళ్తూనే నాన్న గేట్ దగ్గర నాకోసం ఎదురు చూస్తూ కనిపించారు. "ఏమ్మా! త్వరగా బయలుదేరుతా అని చెప్పి, ఇంకా రాకపోతే ఖంగారు పడ్డాను. మొబైల్ లో కూడా దొరకలేదు, ఏమైంది?" నాన్న మాటలు వినగానే మనసులో ఉన్న బాధంతా బయటకు వచ్చింది. అన్నీ చెప్తూ ఇంట్లోకి వెళ్ళాను. మనసు కాస్త తేలిక పడింది. ఇంతలో అమ్మ, "ఏరా! తడిసిపోయావా?" అంటూ వేడి వేడి టీ కపు చేతిలో పెట్టి తల తుడవడం మొదలు పెట్టింది.

హాయిగా అనిపించింది. అమ్మ అలా తుడుస్తూ ఉంటే చిన్ననాటి రోజులు గుర్తుకురావడం మొదలైంది. అప్పటి నేనేనా, ఈ రోజు ఇలా..? అర్ధం కావడం లేదు. నిజంగా.. నిజంగా నాలో ఇంత మార్పా? స్కూల్లో ఉన్నప్పుడు వున్న సరదా, ఆనందం ఏమైంది? అప్పుడు వాన వస్తే ఒక పండగ! మరి ఇప్పుడు..??

అప్పట్లో వాన వస్తే స్కూల్ బస్ స్టాప్ లో బ్యాగ్ లు పడేసి డ్రైవరు ఎంత చెబుతున్నా వినకుండా "ఇంట్లో ఇచ్చేయ్!" అని అరుస్తూ, వానలో తడుస్తూ దారంతా వానతో ఆడుకుంటూ ఓహ్! పైనుండి పడుతున్న వానకన్నా నేలమీద పడి నిలిచిన నీరు ఇంకా temptingగ అనిపించేది. చిన్ని చిన్ని గుంతల్లోకి దిగి కాళ్ళతో నీళ్ళు కొట్టుకుంటూ .. అబ్బ! ఎంత ఆనందంగా వుండేది? తెల్ల సాక్సులు బ్రౌన్ గా మారినా, ఒళ్ళంతా తడిసి ముద్దయినా, పక్కనుండి వెళ్తూ బళ్ళు నీళ్ళు చిందించి కొట్టినా, అన్నీ ఆటలో భాగమే. అన్నీ నా ఆనందాన్ని పెంచేవే. ఎంతసేపు ఆడినా ఎంత తడిసినా, వాన తగ్గగానే చెట్లని వూపి, అవి దాచుకున్న వాన గుర్తులని జబర్దస్తీగా లాగేసుకుని, ఇంకా వానలో తడుస్తున్న అనుభూతి పొందుతూ, ఎంత ఆనందంగా, వుల్లాసంగా ఉండేదో! ఇప్పుడు బస్సులో చిల్లు నుండి పడ్డ ఒక చిన్న చుక్క కూడా బాధ పెడుతోంది. ఏంటి ఇంత మార్పు? అంత ఆనందాన్ని ఇచ్చిన వాన ఇప్పుడు ఎందుకు ఇంత బాధకి కారణం అయ్యింది?

ఆలోచిస్తూంటే .. వాన ఇవ్వాళ కూడా ఆనందాన్ని ఇచ్చేదేమో అనిపిస్తోంది. కొంచెం సేపు బాధ పెట్టినా, చిన్న నాటి ఙాపకాలని గుర్తు చేసి మనసంతా ఆనందంతో నింపేసింది.

అయినా ఇవ్వాళేదో త్వరగా బయలుదేరి, బస్ లో రాబట్టికదా ఇదంతా జరిగింది. లేకపోతే, రోజూ హడావుడి lifeలో ఇలాంటి కష్టాలకి, ఆనందాలకి చో టేది?

ఎండా, వాన, రాత్రి, పగలు తేడా లేని, తెలియని ప్రపంచంలో, ఇంటి ముందుకు వచ్చి ఆగే కారు ఎక్కి, ఆఫీసు గాజు గోడల మధ్య, ఏ.సీ. గాలి మధ్య, కంప్యూటర్ కలర్స్ మధ్య రోజు గడుపుతూ, ప్రకృతి అందాలని మర్చి పోయి, ఫైల్స్, ప్రాజెక్ట్స్ అప్రైజల్స్, ప్రమోషన్స్ మాత్రమే ఆనందాలకీ, బాధలకి కారణం అయిపోయిన సమయంలో లో వాన ఇచ్చిన కష్టం కూడా తీయని అనుభూతిలా అనిపించింది. ఇంకా నాలో "మామూలు మనిషి" బతికే వుంది అని గుర్తుచేసినందుకు, వానకి "థాంక్స్" చెప్పాలనిపించింది. బయటకు పరుగెత్తుకుని వెళ్ళాను.. కానీ అప్పటికే వాన వెలిసి పోయింది.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     తీసిపారేయలేము
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)