"సింధూ...ఏం చేస్తున్నావే..ఒక్కదానివీ మేడ మీద? కిందకురా...నేను ఎన్నిసార్లు చెప్పాను అలా ఒక్కదానివే ఉండకే అని" అంటూ తల్లి మాధవి....

అమ్మ పిలుపు విన్న సింధూర ఉలిక్కిపడి "ఆ వస్తున్నానమ్మా...." అంటూ దిగులుగా కిందకి దిగి వస్తున్న తీరును చూస్తూ, డైనింగ్ టేబుల్‌వద్ద వున్న తండ్రి రాఘవ "రామ్మా! సింధూ...ఎంతకాలం ఇలా దిగులుగా వుంటావురా..జరుగుతున్నవి ఎందుకు జరుతున్నాయో...ముందు ముందు ఇంకా ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో వున్నాయి మన జీవితాలు.నిజమగా నీ స్నేహితురాలు రమ్యకు జరగరాని అన్యాయమే జరిగింది.కానీ ఎందుకు ఇలా జరిగింది? అనేది అందరికీ ఒక ప్రశ్నలానే మిగిలిపోయింది.తెలుసుకోవాలంటే వాళ్ళ అమ్మానాన్నలకే చాలా కాలం పడుతుంది.ఎందుకంటే ఒక విధంగా పలుకుబడి, డబ్బు వుంటేనే నేడు ఏ కష్టమయినా ఒక కొలిక్కి వచ్చేది. పాపం వారికి ఆ రెండూ లేవు.ఎదిగిన బిడ్డను పోగొట్టుకోవటమనేది ఎంత నరకమో తెలియనిది కాదు.అప్పటికి నాకు తెలిసినంత, చేతనయినంత సాయం చేశాను.ఆ తర్వాత భగవంతుడున్నాడు.ఆయనే ఇస్తాడు తీర్పు.నువ్వు ఇలా ప్రతిరోజూ దిగులుగా వుంతే ఎలా చెప్పరా!రేపు నీ ఆరోగ్యం ఏమయినా అయితే ఎలా చెప్పు? నువ్వు మా గురించి కూడా కొద్దిగా ఆలోచించాలి తల్లీ..." ఆంటూ దగ్గర కూర్చోబెట్టుకుని తెలియచెప్పాడు.

"లేదు నాన్నా! తనతో నాకు దాదాపు పదేళ్ళ స్నేహం వుంది.తన మనసు నాకు తెలుసు.ఎప్పుడూ తాను అనుకున్నది సాధించాలని..తానొక పెద్ద వుద్యోగం చెయ్యాలని..అంటూ ఉండేది.ప్రేమ, పెళ్ళి ప్రస్తావన తెచ్చేది కాదు..అలాంటిది నాకు తెలియకుండా రవితో ప్రేమ ఏంటో....పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని ఆత్మహత్య ఏంటో నాకేమీ అర్థం కావటంలేదు.అసలు ఆ రవి ఎవరో కూడా తెలియదు.నాకేమీ తోచటం లేదు.అది చనిపోయాక పోలీసులు నన్ను కొన్ని ప్రశ్నలడిగారు. నేను నాకు తెలిసింది చెప్పాను.ఆ తర్వాత ఆ కేసేమయిందో ఏమీ తెలియదు.కొన్నాళ్ళు పోయాక తాను రవిని ఎంతో ప్రేమించిందనీ, రవికి ఏమాత్రం ప్రేమ లేదని, అతను చదువు ముఖ్యం ఆంటే తాను తట్టుకోలేక చనిపోయిందని, పిచ్చిమాటలు వింటుంటే ఎలా నవ్వుతూ, మామూలుగా వుండగలను నాన్నా?" అంది సింధూర కళ్ళు తుడుచుకుంటూ....

"నిజమేరా! నీ మాటలతో నేను కూడా ఏకీభవిస్తాను..కానీ..అలాగని మనం ఏం చెయ్యగలం చెప్పు? నాకు చేతనయినంత సాయం నేను చేశాను కదా?" ఆడిగాడు రాఘవ.

"అలా అంటే ఎలా నాన్నా? అదే నాకే ఇలా జరిగివుంటే, నేనేం చెయ్యగలను..నేను చేతనయినంత సాయం చేశాను అంతే అంటారా? మీలా అందరి నాన్నలు పోయింది మనపిల్ల కాదు కాబట్టి ఎవరు ఎలా పోతే మాకేంటి అనో..ఆ అమ్మాయి మీద నిందో..లేదా పిరికితనాన్నో ఇలా మోపుతూ ఎవరికి వారు తప్పించుకు పోతుంటే మాలాంటి ఆడపిల్లలు మాటేమిటి నాన్నా?" నిలదీసింది సింధూర.

"నోర్ముయ్..ఎవరితో మాట్లాడుతున్నావో నీకేమయినా అర్ధం అవుతుందా?" అంటూ గద్దించింది తల్లి.

"నువ్వూరుకో మాధవీ! అమ్మాయి బధ పడతలో తప్పేముంది? తాను అడిగింది నాన్నను కాదు, నాలాంటి వాళ్ళని..అది నీకూ వర్తిస్తుంది.నిజమే ఇదే విషయం మన అమ్మాయి విషయంలో జరిగివుంటే మనం ఇలా ఊరుకోము కదా? సరేనమ్మా ..మేము ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పు.." లాలనగా అడిగాడు కూతుర్ని.

"ముందు నువ్వు నీతో పాటు మరికొంత మంది నాన్నలు ఒక గ్రూపుగా తయారయితే ఒక్కొళ్ళకు ఒక్కొక్క రిఫరెన్స్ తప్పకుండా దొరుకుతుంది.దాని ద్వారా ఈకేసుని ఒక కొలిక్కి తీసుకురావచ్చు.ముందంటూ ప్రయత్నిద్దాం నాన్నా" అంటూ ఒప్పించింది

అలా రాఘవ అంగీకరించడం, వారం రోజుల పాటు కష్టపడి అందర్ని ఇలాగే మాటలతో కొందరిని నిలదీసి, మరికొందరు మనసు కరిగింప చేసి దాదాపు ఒక యాభైమంది దాకా పోగయి వారికి తెలిసినంత మేర అధికారుల్ని నిలదియ్యటం..అమ్మాయిని గూర్చి ప్రతిరోజూ ఒక పనిలా వెంటబడ్డారు.దాంతో అధికారుల మీద ఒత్తిడి ఎక్కువయింది.తప్పని సరై చనిపోయిన రమ్య అలవాట్లు, తన ఆలోచనలు తెలుసుకోవటం, కాస్త కఠినంగా రవిని ఎంక్వైరీ చేసే సరికి అసలు రవి మాత్రమే రమ్యను ప్రేమించాడని, ఆ విషయానికి రమ్య సరిగా రెస్పాండ్ కాకపోతే తనేదో అవమానంగా అనుకోవటం, అందుకు స్నేహితులు కూడా వంత పాడటంతో అహం దెబ్బతిని రమ్యను తానే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించటం జరిగిందని తెలిసింది.పలుకుబడి, డబ్బు ఎంత వున్నా ఒక్కోసారి మనసు పనిచేస్తుందని నిరూపించి రవికి శిక్ష పడేలా చేశారు.

***********

"ఇప్పుడు తృప్తిగా వుందా సింధూ..." అడిగాడు తండ్రి.

"నిజమే నాన్నా! ఒక విధంగా తృప్తిగానే వుంది..కానీ ఇకపై ఇలా జరగకుండా అందరూ ఏదైనా చెయ్యాలి" అంది.

"ఇంకా ఏమి చెయ్యాలే? నెలరోజుల పాటు వాళ్ళ వెంబట వీళ్ళ వెంబట పడి రవికి శిక్ష పడేలా చేశారు కదే" అంది తల్లి.

"అది చాలదమ్మా! ఇకపై రవిలాంటి వారెవరూ ఇలాంటి పనులు చేయకూడదు.మనసు ఎవరో బలవంతంగా తీసుకునే సొత్తు కాదు.అసలు ప్రేమ ఏంటి చదువుకునే రోజుల్లో అని అడిగేవారు, తెలియజేసేవారు ఒక్కరు కాదు...వంద మంది వుండాలి.ఒక కాలేజీలో చదువుతున్నది ఒక్క వారి అమ్మాయి ఒక్కతే కాదు.అందరి రక్షణా అందరూ తీసుకోవాలి అనే ఆలోచన అందరిలో రావాలి నాన్నా..వచ్చేలా చెయ్యాలి..." అంది ఆవేశంగా సింధూర.

అమ్మాయి ఆలోచనలో ఎంతో నిజం ఉన్నా, ఒప్పుకోలేక కాదనలేక "అలాగే లేమ్మా, నువ్వన్నదీ నిజమే కానీ..." అంతూ ఆగాడు.

"కానీ....ఏంటి నాన్నా?ఇలా ఎప్పుడో ఒకప్పుడు మనలో ఎవరో ఒకరికి ఇలాంటి ఆలోచనలు వస్తేనే మనం సమాజానికి మేలు చేయగలుగుతాం.నువ్వు ఒప్పుకుంటే సరే...లేకుంటే నేనే అందరితో మాట్లాడి నా నిర్ణయాన్ని గెలుచుకుంటా ..అంతే " అంది స్థిరంగా

"చూడండి..మీరు ఊరుకుంటున్న కొద్దీ ఎలా చేస్తుందో.." అంది కోపం నిండిన స్వరంతో మాధవి.

"నువ్వొరుకో మాధవీ..సింధూర చెప్తున్న నిర్ణయం కాస్త కష్టమైనా మంచిదైనపుడు కష్టపడతంలో తప్పేముంది? మన కూతురే ఇలాంటి సమాజానికి ఉపయోగపడే ఆలోచన చేస్తున్నప్పుడు మనం ముందడుగు వేయకుంతే ఎలాగ? మనం ఇంకా గర్వ పడాలీంత మంచి ఆలోచన మన కూతురికి వచ్చినందుకు. సరేరా సింధూ..నువ్వు నీ ఆలోచనలో నా అడుగు ముందే వుంటుంది" అంటూ ప్రోత్సహించాడు రాఘవ.

కొంతమంది కసిరినా, మరికొంత మంది నీకెందుకు అని తిట్టినా అవన్నీ లెక్క చేయకుండా..ముందుకు దూసుకుపోతుంది సింధూర.తాను తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అందరికీ తెలియజేస్తోంది.కానీ క్లాసులో వున్న కావేరి మాత్రం మా పేరెంట్స్ ఒప్పుకోవటం లేదు.నాకు చాలా అవమానంగా వుంది" అంది దిగులుగా.

"నువ్వేం దిగులు పెట్టుకోబోకు కావేరీ! నేను మాట్లాడుతాగా.ప్రపంచంలో ప్రతిదాన్ని మార్చవచ్చు. ఒక్క మనిషి మనసు తప్ప" అంతూ నవ్వుతూ కావేరి వెంట బయలుదేరింది.

"నువ్వేనమ్మా సింధూరంటే...నువ్వు ఎంతో జీవితం వున్నదానవు.బుద్ధిగా చదువుకోకుండా ఇలా వీధుల వెంట తిరగటం ఏంబాగుంటుందమ్మా.?" అన్నాడు ముకుందం కాస్త విసుగు ధ్వనించే స్వరంతో.

"అలా మేము చదువుకుంటుంటే చదవనిస్తున్నారా అంకుల్?" సూటిగా అడిగింది సింధూర.

"మరి అలాగైతే మీ తప్పే లేదంటారా?" ఎదురు ప్రశ్న వేశాడు ముకుందం.

"తప్పు అనేది ఎవరు చేస్తున్నారు అనేది కాదు అంకుల్ కావలసింది...ఇష్టం లేకుండా ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా ప్రేమించాలి అనటం తప్పు కాదాంటారా?" అడిగింది ఆవేశంగా

"అలా అనటం తప్పే. అలాగని మేము పనులు మానేసి ఎవరెవరు ఎవరిని బలవంతంగా ప్రేమించమంటున్నారో తెలుసుకోవటమేనా నా పని? ఇది స్పీడు యుగం. ఎవరి రక్షణ వారే కల్పించుకోవాలి.అంతే. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆడవారికి సమాన హక్కులు కావాలని, నేడు సమాజంలో అంతా సమానమేనని అంటున్నారు కదమ్మా. మరి అలాంటప్పుడు మీ రక్షణకు మాతోడు, అవసరం ఎందుకు?" ఆవేశంగా అన్నాడు ముకుందం.

"సరే అంకుల్! మీరిన్ని మాటలు అన్న తర్వాత మేము మిమ్మల్ని ప్రాధేయపడటంలో అర్ధం లేదు.కాని ఒక్కటి గుర్తుంచుకోండి అదే కాలేజీలో మీ అమ్మాయి కూడా చదువుతోంది.తనకోసమైనా మీరు వస్తారని ఆశించాను.కానీ తప్పని అర్ధమయింది.మేము వెళ్ళొస్తాం.ఒక మంచి పనికి ఒక్క వ్యక్తి తోడు చాలు..నాకు మా నాన్న చాలు., అనగానే

"మీ నాన్నంతే ఆ రాఘవయ్యేనా?"

"ఆహా అలాగా అయితే పొలిటికల్ స్టంట్ బాగానే చేస్తున్నారు"

"అంకుల్! మీరు సరిగ్గా" అనేలోపే

"ఆ..ఆ...అంతమాట అనకు. నువ్వెళ్ళి ఒక్కసారి నువ్వు పోరాడి లోపల వేయించావే ఆ రవిని అడుగు అంతా నీకే అర్ధం అవుతుంది" అన్నాడు వెళ్ళమని చెయ్యి బయటికి చూపిస్తూ...

సింధూరకు నోట మాట రావడం లేదు.తెల్లవారగానే కాలేజీకి వెళ్ళకుండా రవిని కలిసింది. అతని మాటలు విన్న సింధూరకు సమాజం అంటే తన ఇంట్లో వాళ్ళు కూడా వస్తారని అర్ధం అయింది. విషయం విన్న ప్రకారం తన సీటుకోసం పదవిలో వున్న మరొకరి కొడుక్కు తన కూతుర్ని అప్పగించకుండా తన కూతురి స్నేహితురాలి అప్పగించిన విషయాన్ని కోర్టుకు తెలిపి రవితోపాటు తండ్రికి కూడా శిక్ష పడేలా చేసింది., సింధూర.

*************

కాలేజీలో ఈ విషయం తెలిసుకుని సింధూరను అందరూ పొగడ్తలతో ముంచెత్తారు.ఝాన్సీరాణి అన్నారు...రుద్రమదేవి అన్నారు..నువ్వు తప్పకుండా పోలీసు డిపార్ట్‌మెంట్‌లో చేరు అని ఆచార్య్లు సలహా ఇచ్చారు.ఆ ఏడాది ఉత్తమ మహిళగా కొనియాడి గవర్నర్ చేతులమీదుగా సాహస మహిళగా గుర్తింపునిచ్చారు.పేపర్లు, టి.వి.లు కవర్ చేశాయి.అయినా సింధూరలో ఆ సంబంధిత ఆనందం లేదు. రాత్రి పన్నెండయినా సింధూరకు నిద్ర రాలేదు.అమ్మ ఏం చేస్తుందో అని తల్లి గది వైపుకి వెళ్తే తల్లి పరిస్థితి కూడా అలానే వుంది.

"అమ్మా! నన్ను క్షమించమ్మా...నాకు ఇలాంటి మంచి పేరు రావాలని, అవార్డులు అందుకోవాలని నేను ఈ పని చేయలేదమ్మా.పాపం! మనతో పాటు చిన్నతనం నుండి నాలానే మనింతిలో పెరిగిన రమ్య నాన్నకేం ద్రోహం చేసిందమ్మా? ప్రపంచంలో ప్రతిచోట నన్ను బాధించే విషయం ఇదే! ఏం? వేరే అమ్మాయి అయినా తాను ఒక అమ్మ కూతురు కాదా? మీ చెల్లెలు కాకుంటే వేరే అన్నకు చెల్లెలు కాదా?ఎందుకు కనీసపు ఆలోచనలు కూడా లేకుండా మనిషిగా చెలామణి అవుతారు? అనే ఆలోచన నేనే కాదు, నేను, రమ్య చాలా సార్లు అనుకునే వాళ్ళం. మరి తనకే ఇలా అయితే నేనెలా ఊరుకోగలనమ్మా? నాన్న లాంటి వాళ్ళకు బుద్ధిచెప్పినంత మాత్రాన అందరి ఆలోచనలలో మార్పు వస్తుందని నేను అనుకోను. కనీసం ఒక్కరిలోనైనా మార్పు తేగలిగితే.....దుఖంతో పూడుకు పోగా...తల్లి ఒడిలో తలదాచుకుంది.

"సింధూ..నాకు తెలుసమ్మా! ఈ నేరంలో మీ నాన్నకు భాగం వుందని. అందుకే నేను స్వార్ధంతో ఆ ఆలోచనను తుంచేయాలని చాలాసార్లు చూశాను.కానీ చిన్న పిల్లవైనా సమాజం కోసం చేసిన త్యాగం చూస్తుంటే నాకే సిగ్గుగా వుందమ్మా. నీలాంటి కూతురు పుట్టినందుకు గర్వంగా కూడా ఉంది.ప్రపంచం ఆధునికంగా ఎంత ముందంజలో ఉన్నా, దీపం చుట్టూ పురుగుల్లా పురుష సమాజం స్త్రీలను వెంటాడుతూనే ఉంది. స్త్రీ ఎక్కడ ఉన్నత స్థానంలో ఉన్నా ఇలాంటి బాధ తప్పటం లేదు.కాకుంటే కొన్ని బయటపడుతున్నాయి...కొన్ని తెలియటంలేదు...అంతే.కానీ మార్పు నీలా అందరిలో వస్తే సమాజం కాస్తలొ కాస్తయినా మారుతుందేమో. నీ ప్రయత్నానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది అంటూ దగ్గరకు తీసుకుంది.

మరుసటి రోజు ఒక కవర్ పోస్ట్‌లో వచ్చింది...ముకుందం నుండి మెచ్చుకుంటూ.తానూ తగినంత సహకారం అందిస్తానంటూ..అదే తొలిమెట్టుగా భావిస్తూ సింధూర ధైర్యంగా ముందుకి సాగింది.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఏమీ బాగోలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)