మేమోరియల్ స్లోన్ కేటరింగ్ హాస్పిటల్ న్యూయార్క్ లో ఆంకాలజిస్ట్ గా పనిచేస్తున్నాడు డాక్టర్ విశ్వం. పేషంట్స్ రౌండు పూర్తి చేసుకొని డాక్టర్స్ లాంజ్ లో కాఫీ తాగుతూ బయట రోడ్డుపై విరామం లేకుండా వెళ్ళుతున్న ట్రాఫిక్ కేసి చూస్తూ ఏవేవో ఆలోచనల్లో పడ్డాడు విశ్వం.

విశాఖపట్నం వదిలేసి దాదాపు ఇరవై సంవత్సారాలు అవుతోంది. గత సంవత్సరం వెళ్ళినపుడు ఎంతగా మారిపోయిందని. అసలు వాల్తేరు లేనే లేదింక. ఇటు డాల్ఫిన్ నోస్ నుంచి అటు సిం హాచలం దాకా పెరిగిపోయింది. ఆ పాత బీచ్ రోడ్డు హై రైజ్ బిల్డింగులతో నిండిపోయింది. తను చదువుకొన్న మెడికల్ కాలేజీ, కే.జీ.హెచ్. ఆసుపత్రి అన్నీ కూడా బాగా మారిపోయాయి.

చల్లటి ఏసీ గాలి ఒంటికి తగులుతున్నా మనసు కుదుట పడలేక పోతున్నది. ఏవేవో ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అమ్మ సావిత్రి, నాన్న శంకరం, చెల్లెలు సీత, అన్నయ్య రాఘవ, అందరూ అలా గుర్తుకు వస్తూనే ఉన్నారు. అప్పట్లో విశ్వం ఎం.బీ.బీ.యస్. ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నాన్న వీధి గుమ్మమంలో చుట్ట కాలుస్తూ, దగ్గుతూ పేపర్ తిరగేస్తున్నాడు. ఇంతలో సుందరత్తయ్య, నాన్నకి పెద్ద చెల్లెలు, జట్కాబండి దిగింది. "ఏం, పెద్దత్తయ్యా!, బావున్నావా? ఇదేనా రావడం?" అని పలకరించి కాలేజీ ఏదో పనివుంటే వెళ్ళబోయాడు విశ్వం.

"అబ్బ ఉండరా, వెళ్దువు గానీ. అసలు నీ గురించే నేను ఈ వూరు వొస్తేనూ..." అంటూ సుందరమ్మ విశ్వం చేయి పట్టుకొని ఆపేసింది. ఇంతలో శంకరం పేపరు చదవడం ఆపేసి లోపలికి వచ్చి "ఏమిటి సుందరం! ఏమిటి విశేషాలు?" అంటూ చెల్లెల్ని ప్రశ్నిచాడు. "ఏముంటుంది, మీ చెల్లెలికి ఇది అలవాటేగా. మన సీతకో, విశ్వానికో ఏదో పెళ్ళి సంబధం తీసుకొచ్చింటుంది..." వెటకారంగా అంది సావిత్రి. ఇంతలో అందరూ వచ్చి సుందరమ్మ చుట్టూ చేరారు.

"సావిత్రి వదినా! నువ్వు కరెక్ట్ గా చెప్పావు. అన్నయ్యా, మన విశ్వానికి ఒక మంచి సంబధం తీసుకొని వచ్చాను. అనకాపల్లిలో...

మనవాళ్ళే... నరసిం హం గారని, పెద్ద పేరున్న వకీలు. గొప్ప వంశం. వాళ్ళకి ఒకే ఒక్క కొడుకు... అమెరికాలో చదువుకుంటున్నాడు... ఒక్కతే కూతురు... చక్కని చుక్క... పేరు చిత్ర. బీ.ఏ. ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సంగీతం, నాట్యం నేర్చుకుంటున్నది. మన విశ్వానికి అన్ని విధాల తగిన వధువు " అంటూ చెప్పుకొచ్చింది సుందరమ్మ. ఆ రోజంతా భోజనాలు, కబుర్లతో గడిచిపోయింది. మరునాడు మధ్యహ్నాం ఊరెళ్ళిపోయింది సుందరమ్మ.

ఆవిడ ఊరెళ్ళీన వారానికల్లా అమ్మానాన్నలతో, అన్నావదినలతో, చెల్లెలుతో పాటు విశ్వం బయలుదేరాడు పెళ్ళిచూపులకి. నరసిం హంగారు, వాళ్ళావిడ లక్ష్మి గుమ్మంలోనే ఆహ్వానించి, అందరిని లోనికి తీసుకెళ్ళారు. సుందరమ్మ "ఒరేయ్ విశ్వం! చూడరా, పిల్ల బంగారం లాగా లేదూ" అని విశ్వాన్ని అడిగింది. విశ్వం మొహమాటపడకుండా కళ్ళన్నీ పెద్దవి చేసుకొని చిత్రను చూశాడు. 'నిజంగా బంగారపు బొమ్మే!" అని మనసులో అనుకొని పైకి చిత్రకు వినపడేలా "అత్తయ్యా! నాకు చిత్ర బాగా నచ్చింది. మరి చిత్రకు నేను నచ్చానో లేదో ఆడుగు" అన్నాడు. అందరూ చూచేలా తల ఊపింది చిత్ర.

ఈ లోపల శంకరం పెద్దగా దగ్గుతూ అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. "నాన్నా, నాన్నా" అంటూ విశ్వం తండ్రి దగ్గరకు పరిగెత్తాడు. డాక్టర్ని పిలిపించారు. "ఇది మాములు దగ్గు కాదు. వెంటనే ఆసుపత్రిలో చేర్పించండి" అని ఏవో మందులిచ్చి వెళ్ళిపోయాడు. 'ఈ సమయం, ఈ ఘడియ బాగో లేవు. ఇంటికెళ్ళి ఉత్తరం రాస్తాం" అని నరసిం హం గారికి చెప్పి తిరిగొచ్చేశారు.

తరువాత నాన్నకి కొంచెం నయమయ్యింది. డాక్టర్లు "నాన్నకి ఎర్లీ రిటైర్ మెంట్ మంచిది. బొంబాయిలో ట్రీట్ మేంట్ కి తీసుకెళ్ళండి" అని చెప్పారు. నాన్న ఆ పై ఆర్నెల్లు కాన్సర్ వ్యాధితో పోరాడి వెళ్ళిపోయాడు. రాఘవన్నయ్యకి ఉద్యోగరీత్యా ఢిల్లీకి వదినతో వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది, తను, అమ్మ, చెల్లెలు.

విశ్వం డాక్టరు కోర్సు పూర్తిచేసి విశాఖపట్నంలో ఒక క్లినిక్ లో చేరాడు. చెల్లెలుకి పెళ్ళి చేశాడు. నాన్నపై బెంగతో ఆయన పోయిన నాలుగేళ్ళకి అమ్మకూడా వెళ్ళిపోయింది. ఒక కొడుకుగా తండ్రినీ, తన కుటూంబాన్ని కలత పెట్టిన వ్యాధిని అంతం చేయడానికి కంకణం కట్టుకొన్నాడు విశ్వం. బొంబాయిలో రిసెర్చ్ స్కాలర్ గా కేన్సర్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో చేరాడు. కేన్సర్ రిసెర్చ్ లో పెద్ద పేరు సంపాదించాడు. పదిహేనేళ్ళుగా న్యూయార్క్ లో స్థిరపడి కేన్సర్ నివారణలో మరింత పేరు సంపాదించాడు. వృత్తిలో పడి పెళ్ళి చేసుకోలేడు. కానీ, ఆనాడు చూసిన చిత్రను మాత్రం మరచిపోలేదు.

ఇంతలో కొలీగ్ బ్రూస్ వచ్చి భుజం తట్టి ఆలోచనల్లోంచి లేపాడు, "హౌ ఆర్ యూ డూయింగ్, విష్? వుయ్ హేవ్ ఎన్ ఇంటరెస్టింగ్ కేస్ దిస్ ఆఫ్టర్ నూన్. ఏ టెర్మినల్లీ ఇల్ పేషంట్ ఫ్రం ఇండియా. ఐ థింక్ దే నీడ్ యూ దేర్" అంటూ వెళ్ళిపోయాడు. ఎలివేటర్లో క్రింద ఫ్లోర్ వెళ్ళాడు. ఎలివేటర్ డోర్ తెరచుకోగానే ఓ టీనేజ్ అమ్మాయి "ఆర్ యూ డాక్టర్ విశ్వం?" అని ఆడిగింది. 'అవును " అని తలూపాడు.

ఆ అమ్మాయిని చూడగానే విశ్వానికి మతిపోయింది. అదే ముఖం... అదే చిరునవ్వు... ఆ... చిత్ర...ఈ అమ్మాయి చిత్రలా ఉండి. 'ఎలా' అని అనుకొంటుండగానే ఆ అమ్మాయి "నా పేరు స్మిత. మా నాన్నని ఈ మధ్యహ్నాం ఎడ్మిట్ చేసారు. నిన్న రాత్రే నాన్నై ఇండియా నుండి న్యూయార్క్ తీసుకొచ్చాం. న్యూజెర్సీలో మా అంకుల్ ఇంట్లో దిగాం" అని చెప్పింది. "ఓ అలాగా, పద చూద్దాం, మీ నాన్నగారిని..." అంటూ పేషంట్ రూం కి దారి తీశాడు.

కేసు హిస్టరీ చదివి అంతా ఆకళింపు చేసుకొన్నాడు. ఆయన పేరు జగన్నాథం. ఇంచుమించు తన వయసే ఉంటుంది. పెద్ద సోషల్ రిఫార్మరట. జగన్నాథంతో సంభాషణ మొదలెట్టాడు. "మెడికల్ ట్రీట్ మేంట్ లో ఒక కొత్త ప్రయోగం చేస్తాను. మీకు తప్పక నయమవుతుంది" అని హామీ ఇచ్చాడు విశ్వం. "మీది విశాఖపట్నం కదూ..." అడిగాడు జగన్నాథం. "అవును" అన్నాడు విశ్వం. "మాది చోడవరం" అంటూ కథ మొదలెట్టాడు జగన్నాథం.

"మా ఆవిడకి పద్దెనిమిది సంవత్సరాలపుడు ఎవరో విశాఖపట్నం నుండి పెళ్ళిచూపులకి వచ్చి, ఆ కుర్రాడి తండ్రి అస్వస్థత కారణంగా తిరిగి వెళ్ళిపోయారట. ఆ తరువాత ఆయన కొన్నాళ్ళకి కాలం చేశారట. ఈ విషయం తెలిసాకా ఎవరూ ఆ పిల్లని పెళ్ళి చేసుకొనే ధైర్యం చేయలేకపోయారు. ఆ తరువాత తనే మా ఆశ్రమంలో చేరింది. మాతో ఉంటూ స్త్రీల హక్కుల కోసం పోరాడింది. ఆశయాలు, ఆదర్శాలు పంచుకొంటూ మేమిద్దరమూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నాం" అని చెప్పుకుపోతున్నాడు జగన్నాథం. "ఇంతకీ మీ ఆవిడ పేరేమిటీ?" అడిగాడు విశ్వం.

"చిత్ర. అదిగో మాటల్లోనే వచ్చేసింది" అన్నాడు జగన్నాథం. చిత్ర ఫ్లాస్క్ లో కాఫీ, చేతిలో పళ్ళు పట్టుకొని డోర్ దగ్గర నిల్చొనుంది. "చిత్రా! ఈయన డాక్టర్ విశ్వం" అంటూ పరిచయం చేశాడు జగన్నాథం.

'నా తప్పేం లేదు...' అన్నట్లు దీనంగా చిత్ర వైపు చూచాడు విశ్వం. 'ఎవరి తప్పు లేనప్పుడు నాకు శిక్షెలా పడింది?' అడిగాయి చిత్ర కళ్ళు. సమాధానం లేదు విశ్వం దగ్గర.

ఇంతలో "డాక్టర్ విష్!" పి.ఏ. సిస్టం అనౌన్స్ మెంట్ విని వార్డ్ వైపు వడిగా నడుస్తూ 'మనకెంతో ఇష్టమైన మనుషుల విలువ వారిని పోగొట్టుకునే ముందు తెలియదు కదా' అని అనుకొంటూ 'ఒక డాక్టర్ గా ఎలాగైనా జగన్నాథాన్ని రక్షించాలి ' అని మనసులో దృఢనిశ్చయం చేసుకొన్నాడు డాక్టర్ విశ్వం.

ఇంతవరకు పాఠకుల తీర్పు: Page Title
     ఏమీ బాగోలేదు
మీమాట ఒక్క మాటలో.... Page Title
    
Test Page

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం.
దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో విస్తారంగా తెలపండి.
వచ్చే సంచికలో ప్రచురిస్తాము.
(Please leave your opinion)

పేరు(Name):

విద్యుల్లేఖ (Email):

అభిప్రాయం (Opinion):


 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)