వీరతాళ్ళు వేస్తాం, వస్తారా?! - 5

--వేమూరి వేంకటేశ్వరరావు

ముందుమాట: తెలుగులో రాయటమన్నా, మాట్లాడటమన్నా చాల కష్టం అనే భావం మనలో చాలమందిలో ఉంది. అందుకనే ఎందుకొచ్చిన గొడవనీ, తేలిగ్గా ఉంటుందనీ శుభ్రంగా ఇంగ్లీషులో మాట్లేడేసుకుంటాం. ఏ భాషైనా సరే వాడుతూన్నకొద్దీ వాడిగా తయారవుతుంది; వాడకపోతే వాడిపోతుంది. కనుక మన భాష కుంటుతూనో, మెక్కుతూనో మాట్లాడుతూ ఉంటే వాడితేరి వాడుకలోకి వస్తుంది. ఇంగ్లీషులో ఉన్నంత పదజాలం తెలుగులో లేదు. ఇంగ్లీషులో వాడుకలో ఉన్న మాటలు దరిదాపు 50,000 ఉంటాయని అంచనా. ఇదే రకం అంచనా వేస్తే తెలుగులో వాడుకలో ఉన్న మాటలు ఓ 15,000 ఉంటాయేమో. మన భాష పెరగటం మానేసింది. మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని మనమే ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. మాయాబజారు సినిమాలో చెప్పినట్లు మాటలు మనం పుట్టించకపోతే మరెక్కడనుండి పుట్టుకొస్తాయి?

ఒక భావానికి సరిపడే మాట సృష్టించే బధ్యత మనదే. తెలుగులో ఆధునిక అవసరాలకి పనికివచ్చే కొత్త మాటలు సృష్టించి వాటిని వాక్యాలలో ప్రయోగించి చూస్తే ఎలాగుంటుందో చూడాలని ఒక కోరిక పుట్టింది. ఈ ప్రయోగంలో పాఠకులని కూడా పాల్గొనమని ఇదే మా ఆహ్వానం. ప్రతినెలా మేము ఐదో-పదో మాటలు తయారు చేసి వాటి ప్రవర, పుట్టుపూర్వోత్తరాలు కొంతవరకు చెప్పి, అవసరం వెంబడి వాటి వాడకం ఎలాగో మీకు సోదాహరణంగా చూపిస్తూ ఉంటాము. ఆ తరువాత కొన్ని ఇంగ్లీషు మాటలు ఇచ్చి వాటితో సరితూగగల తెలుగు మాటలని ప్రతిపాదించమని పాఠకులని ఆహ్వానిస్తూ ఉంటాం. మేమడిగిన మాటలని తెలుగులో ఏమంటే బాగుంటుందో మీరు సూచించాలి. మీ సూచనని బలపరచటానికి ఆ తెలుగు మాటని ఒక వాక్యంలో ప్రయోగించి చూపండి. మా స్వకపోల కల్పితాలైన మాటలతో పాటు పాఠకులు సూచించిన వాటిలో కొన్ని ఎంపిక చేసి ప్రచురిస్తూ ఉంటాము. ఈ దిగువ చూపిన విధం మీకు నచ్చితే దాన్ని ఒక మూసగా తీసుకుని మీరూ ప్రయత్నించి చూడండి. లేదా కొత్త పంధాని సూచించండి. పాఠకులు పంపిన అంశాలని ప్రచురణ సౌకర్యానికి సవరించే హక్కు మాకు ఉంది. ఇదొక ‘విక్కీ’ నిఘంటువుని తయారుచేసే ప్రయత్నంలా ఊహించుకొండి. విక్కీ విజ్ఞానసర్వస్వంలో అందరూ పాల్గొన్నట్లే ఇదీను.

“ఇంగ్లీషు మాటలకి తెలుగు మాటలేనా లేక తెలుగు నుండి ఇంగ్లీషులోకి కూడా ప్రయత్నం చేద్దామా” అని సిలికాన్ వేలీ నుండి తాటిపాముల మృత్యుంజయుడు అంటున్నారు.

ఊహ బాగానే ఉంది. ఏదీ పోపు (తాలింపు) కి ఇంగ్లీషు మాట చెప్పండి, చూద్దాం! మన స్త్రీలు ధరించే ఆభరణాలకి ఇంగ్లీషు మాటలు ఉన్నాయా? ముక్కుపుడక ని nose stud అనీ, దుద్దులు ని ear studs అనీ, మట్టెలు ని toe rings అనీ అంటున్నాము. ఈ ఇంగ్లీషు పేర్లు మనమే పెట్టేమో, ఇంగ్లీషువాళ్ళే పెట్టేరో నాకు తెలియదు. ముక్కర ని nose ring అనొచ్చేమో కాని, వడ్డాణం, నాగరం, పాపిడిచేరు, కంటె, వంకీ మొదలైనవాటిని ఇంగ్లీషులో ఏమంటాం? ఇప్పుడు జరుగుతూన్న అన్యాయం ఏమిటంటే మనమే ఈ ఇంగ్లీషు మాటలకి అలవాటు పడిపోయి, “ఆఁ ముక్కుపుడక అంటే మరీ బైతు భాషలాగా, కంఠహారం అంటే మరీ గ్రాంధికంగానూ ఉన్నాయి, nose stud అనీ, necklace అనీ ఇంగ్లీషులో అంటే మాటలు ఫేషనబుల్‌గా లేవూ!” అని అంటున్నారు కొందరు!

“నాకు తెలుగులో రాయాలని కోరిక ఉంది కానీ, వేళకి తెలుగు మాట తట్టటం లేదండీ” అంటూ మన ప్రయత్నం చూసి సిలికాన్ వేలీ నుండి రమ కాకులవరపు స్పందించేరు. అలా అనేసి ఊరుకోకుండా, ”solo performance" ని ‘ఒంటరి/ఏకాంత ప్రదర్శన’ or something like that will sound bad, I feel in English it sounds much better” అంటూ వాపోయారు! నిజమేనేమో! వీళ్ళ మాట మన చెవికీ, వీళ్ళ రూపు మన కంటికీ ఇంపు! మరి ఇంగ్లీషు రాని వాళ్ళతో ఎలా మాట్లాడటం? “నా పెళ్ళానికి నొప్పులొస్తున్నాయి” అంటే మరీ బైతు భాషలా ఉంటుంది, అదే భావాన్ని ఇంగ్లీషులో, “my wife is in labor” అంటే చెవికి ఇంపుగా ఉంటుంది.

ఇలా నాలుగు నీతులు చెప్పేసినంత మాత్రాన రమ గారి సమస్య పరిష్కారం కాదు కదా! అందుకని ఆమెకి సహాయం చేసే నిమిత్తం ఇక్కడ కొంచెం బిగ్గరగా ఆలోచిస్తాను. ‘ఒంటరి పోరాటం, ఒంటరి జీవితం, ఏకాంత సేవ’ వంటి మాటలు ఉన్నాయి కదా. అవి బాగున్నప్పుడు ‘ఒంటరి/ఏకాంత ప్రదర్శన’ అంటే వచ్చిన నష్టం ఏమిటి? పోనీ, మరొక విధంగా ఆలోచిద్దాం. అష్టావధానం, శతావధానం, ఏకాహం, మొ. మాటలు ఉన్నాయి కదా. అలాగే ‘ఏకావధానం’ అనొచ్చేమో! ఇంగ్లీషులో solo, duet, quartet, group అనే విశేషణాలని వాడుతున్నాం కదా. Duet ని ‘యుగళ గీతం’ అనీ, group song ని ‘బృంద గీతం’ అనీ అన్నట్లే solo కి quartet కి మాటలు తయారు చెయ్యమని పాఠకులని ఆహ్వానిస్తున్నాను. మన సంగీత సంప్రదాయంలో quarter లేదు కనుక, కనీసం solo performance కి మంచి మాట వెతికి పెట్టండి.

“కొత్త తెలుగు పదాలని సృష్టించటం, మరియు ఉన్న పదాలకి కొత్త వాడుకలని కనిపెట్టటం, మరియు వీటన్నిటిని ఒక దగ్గర క్రోడీకరించటం కోసం నేనొక వికి (Wiki) సైటు (telugupadam.org) నీ, మరియు చర్చా సమూహం (http://groups.google.com/group/telugupadam) ని ప్రారంభించా. ఈ సైటు, సమూహాలలో చేరి చర్చలలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను..” అంటూ మాచేత వీరతాడు వేయించుకున్న వీవెన్ హైదరాబాదు నుండి ఇంగ్లీషులో ఆలోచిస్తూ తెలుగులో వాక్యం రాసేరు! Discussion group ని ‘చర్చా సమూహం’ అన్న పెద్దమనిషి బుర్రకి wiki అన్న మాటకి తెలుగు మాట తట్టినట్లు లేదు!! అయినా ప్రయత్నించినందుకు మెచ్చుకోవాలి. పైన ఇచ్చిన లంకెని ఉపయోగించి ఆ స్థలాన్ని సందర్శించి, చర్చలలో పాల్గొనండి. ఈ స్థలాన్ని నేను సందర్శించేను. ఈ స్థలంలో కూడా మొట్టమొదట స్పందించిన వ్యక్తి, “ఇంగ్లీషులో ఉన్న మాటలు వాడేసుకోక ఎందుకీ గొడవ” అంటూ అరిగిపోయిన గ్రామఫోను రికార్డులా పాత పాటనే పాడేడు. ‘తెల్ల దొర’ పిల్లలు ముద్దొస్తున్నారని కన్న బిడ్డకి అన్యాయం చేస్తామా? టన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం!

కొత్త పదాలని సృష్టించటం అనేది నేనిప్పుడు కొత్తగా సృష్టించిన ప్రక్రియ ఏమీ కాదు. కొత్త పదాల అవసరం అలా పుట్టుకొస్తూనే ఉంటుంది. ఈ విషయం గురించి నేను ఇదివరలో ఎన్నో విధాలుగా సమాధానం చెప్పేను. ఇప్పుడు మరొక విధంగా ప్రయత్నిస్తాను. ఉదాహరణకి ఈ దిగువ జాబితాలో తెలుగు పేర్లు చూడండి: మిరప, సపోటా, సీతాఫలం, రామాఫలం, బొప్పాయి, జామి, మొక్కజొన్న, మొదలైనవి. ఇవేవీ మనదేశపు పంటలు కావు. ఇవన్నీ దక్షిణ అమెరికా, కరిబియన్ ప్రాంతాల నుండి నుండి మనకి బుడతగీచుల వల్ల దిగుమతి అయినవి. “వీటికి మనం బుడతగీచు పేర్లు వాడేసుకుంటే సరిపోయేది కదా, ఎందుకొచ్చిన గొడవ,” అని అప్పట్లో ఎవ్వరూ అనుకున్నట్లు లేదు! వీటికి ఈ తెలుగు పేర్లు ఎలా వచ్చేయో చెబుతాను.

అసలు పాశ్చాత్యులు అమెరికాకి రావటానికి కారణం మనమే! అంటే భారతీయులం. మన దేశానికి వచ్చి మిరియాలు, మొదలైన సుగంధ ద్రవ్యాలు కొనుక్కుందుకి, సముద్రపు దారి కనుక్కునే హడావుడిలో వీళ్ళకి కాలం కలిసొచ్చింది. దారి తప్పితే తప్పేరు కాని, తంతే బూర్ల గంపలో పడ్డట్లు ఈ అమెరికా ఖండంలో వచ్చి పడ్డారు! ఇక్కడ (అంటే దక్షిణ అమెరికా, కరిబియన్ ప్రాంతాలు అని చదువుకొండి) వీళ్ళకి మిరియాలు కనిపించలేదు కాని మిరపకాయలు కనిపించేయి. అంతవరకు మిరియాలని peppers అనేవారు. ఇవి కూడా అవే కాబోలు అని అనుకుని వీటిని కూడా peppers అనటం మొదలెట్టేరు. కాని మిరియాలు నల్లగా, గుండ్రంగా ఉంటాయి కదా, ఈ మిరపకాయలు ఎర్రగా, కోలగా ఉన్నాయి కదా, వీటినీ మిరియాలే అంటే ఏం బాగుంటుందని నాలాంటి చాదస్తుడు గొణగటం మొదలెట్టి ఉంటాడు. ఈ సణుగుడు భరించలేక, అప్పటినుండి నల్లగా, గుండ్రంగా ఉన్న వాటిని black peppers అనిన్నీ, ఎర్రగా, కోలగా ఉన్న వాటిని red peppers అనిన్నీ అనటం మొదలెట్టేరు. మిరియాల జాతి వేరు, మిరపకాయల జాతి వేరు. అయినా ఈ పేర్లు అలా అతుక్కుపోయాయి.

ఏమండి? మరి ఈ మిరపకాయలని బుడతగీచులు మనదేశం తీసుకు వచ్చినప్పుడు వాటిని వాళ్ళు red peppers అనే అర్ధం స్పురించేలా ఏదో పోర్చుగీసు భాషలో మాట మాట్లాడి ఉంటారు. దానిని మనవాళ్ళు తెలిగించి “ఎర్ర మిరియపుకాయలు” అనే వారు (నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో ఈ ఎర్ర మిరియపుకాయలలో మిరియాలూ అన్నే ఉన్నాయన్న విషయం తెలిసి కూడా!) మన తెలుగు వాళ్ళు చాలా జోరుగా మాట్లాడుతారు – మీరు గమనించేరో లేదో. ఈ జోరులో ఆ మిరియపుకాయ కాస్తా మిరపకాయ అయింది. దీన్నే తెలుగు బాగా రాని వాళ్ళు మెరపకాయ అని అనటం నేను విన్నాను కానీ, ‘మిరప’ సరి అయిన ప్రయోగం.

ఇక సపోటా సంగతి చూద్దాం. స్పేనిష్ భాషలోనూ, పోర్చుగీసు భాషలోనూ కూడ ఈ పండుని ‘సపోటా’ అనే అనేవారు. ఎందువల్ల? దక్షిణ అమెరికాలో అప్పటికే ఉంటూన్న ‘ఇండియన్లు’ వీటిని సపోటా అనే వారు. ఇది అచ్చుతో అంతం అయే మాట కనుక మన భాషలో ఇమిడిపోగలిగింది. కనుక దీన్ని మనమే కాదు, ప్రపంచం అంతటా సపోటా అనే అంటున్నారు.

పోతే, జామ పండు. ఇదీ మన దేశపు పండు కాదు. దీన్ని దక్షిణ అమెరికాలో ‘గ్వావా’ (guava) అంటారు. ఇంగ్లీషులోనూ ఆ మాటే స్థిరపడి పోయింది. కాని గ్వావా నుండి ఈ జామ అన్న మాట రాటానికి ఏదో వ్యాకరణ సూత్రం ఉండే ఉంటుంది.

ఇదే విధంగా మెక్సికో వంటి ఉష్ణమండలాలలో మరో రెండు జాతుల పళ్ళు దొరుకుతాయి. వాటికి వాళ్ళ భాషలో ఉన్న పేర్లు మన నోట ఇమడవు. అందుకని మనలో ఎవ్వరో మహానుభావులు వాటికి ‘సీతాఫలం’, ‘రామాఫలం’ అని పేర్లు పెట్టేరు. చూడండి మన తెలుగు పళ్ళల్లో ఈ రెండింటికే “ఫలం” అనే సంస్కృతపు తోక ఉంది. మిగిలినవి అన్నీ “పండు” తోనే అంతం అవుతాయి.

హవాయిలో star fruit అనే మరొక పండు దొరుకుతుంది. దీని స్వస్థలం శ్రీలంక ట! పొరుగు దేశపు పండు కనుక ఈ పండుకి తెలుగులో ఏదో పేరు ఉండే ఉండొచ్చు. కాని నేనెప్పుడూ వినలేదు. ఎవ్వరూ ఏమీ అనకపోతే - ఎవ్వరూ ఎమీ అనుకోకపోతే - నేను దీనికి ‘హనుమాఫలం’ అని పేరు పెడుతున్నాను. ఇప్పుడే – ఈ వాక్యం రాస్తూ ఉంటే - ఈ ఆలోచన వచ్చింది! మీకు నచ్చకపోతే వాడకండి కాని నన్ను తిట్టుకోకండి!

ఈ కథ ఇంతలా సాగదీసి ఎందుకు చెప్పుకొచ్చేనంటే మనవాళ్ళు వీటికి తెలుగు పేర్లు పెట్టేరు కనుక ఈ ఆస్తిని మనం వాడుకుంటున్నాం. మన పిల్లలకి ఈ ఆస్తిని పెంచి, పెరిగించి ఇవ్వాలి కానీ, ఉన్న మాటలనే వాడుకోకుండా అడుగంటిస్తే ఏమి బాగుంటుంది? మీరే చెప్పండి!

ఈ పాత మాటల సంగతి అలా ఉంచి ఇప్పుడు ఈ మధ్యనే తయారయిన ఒక సరికొత్త ఇంగ్లీషు మాటని తీసుకుందాం. కంప్యూటర్ ని ఉపయోగించటం తెలిసినవాళ్ళకి wiki, wikipedia అనే మాటలు తెలిసే ఉంటాయి. Wiki ని Encyclopedia ని సంధించగా wikipedia వచ్చింది. Encyclopedia అంటే మనకి తెలుసు. దీనిని తెలుగులో ‘జ్ఞానసర్వస్వం’ అందాం. మరి ఈ wiki ఏమిటి?

హవాయి భాషలో wikiwiki అనే మాట ఒకటుంది. అసలు హవాయీ భాషలోని మాటలలో అక్షరాలు ఇలా రెండేసి సార్లు పునరావృత్తమవుతూ వస్తాయి. ఉదాహరణకి హనోలులు, వైకీకీ, కమేహమేహ, మొదలైనవి. ఈ వికివికి అనేదానికి సరి అయిన తెలుగు మాట ‘గబగబ.’ మన తెలుగులో కూడ బరబర, దడదడ, రెపరెప, పరపర మొదలైన మాటలు కొల్లలు. ఈ వికివికి లేక గబగబ వేగాన్ని తెలియజేస్తుంది. అందుకని హవాయి విమానాశ్రయం నుండి ఊళ్ళోకి జోరుగా (లేదా గబగబ) తీసికెళ్ళే express bus కి వాళ్ళు ‘వికివికి’ అని పేరు పెట్టేరు. మనం కూడా షంషాబాదు నుండి హైదరాబాదు ఊళ్ళోకి తీసికెళ్ళే బస్సుకి ‘గబగబ’ అని పేరు పెడితే ఎలాగుంటుందంటారు?

ఏది ఏమైతేనేమి, wiki అంటే వేగం కనుక wikipedia అంటే జోరుగా తయారు చేసిన జ్ఞాసర్వస్వం. అంటే, పెద్ద హడావుడి చెయ్యకుండా, తొందరతొందరగా, ఏకరాత్రి పెళ్ళి చేసినట్లు, తయారు చేసిన ‘పుస్తకం’. ఈ wikipedea అనే ఊహ మన తెలుగు వాడి బుర్రలో పుట్టి ఉంటే మనం దాన్ని ‘గబగ్రంధం’ అనో ‘జోరు పుస్తకం’ అనో అనుండేవాళ్ళమేమో!

ఉపోద్ఘాతం అయింది కనుక అసలు విషయానికి వద్దాం. గత సంచికలో పది మాటలు ఇచ్చి వాటికి తెలుగు పదాలు కావాలని అడిగేను. ఈ సారి స్పందన ఎక్కువగా రాలేదు. కనుక నేను ఇచ్చిన వాటిలో కొన్నిటిని తెలుగులోకి తర్జుమా చెయ్యటానికి ప్రయత్నిస్తాను.

Carbohydrate సైన్సు పుస్తకాల్లో ఈ మాటని ‘పిండి పదార్ధాలు’ అంటారు. అంటే starchy substances అని అర్ధం. కాని carbohydrates పరిధి పిండి పదార్ధాల పరిధి కంటె చాలా పెద్దది. Carbohydrate జాతికి చెందినవి, పిండిలా లేనివి అయిన పదార్ధాలు ఇంకా చాలా ఉన్నాయి. ఉదాహరణకి శక్తిని దాచేవి, శక్తిని రవాణా చేసేవి (ఉ. పిండి పదార్ధాలు, గ్లయికోజెన్), నిర్మాణానికి ఉపయోగపడేవి (ఉ. సెల్యులోజు, చీటిన్), మొదలైనవి. కనుక carbohydrate కి ఒక కొత్త పేరు ఉంటే బాగుంటుందని అనిపించింది. Carbon ని కర్బనం అంటున్నారు కదా. Hydrogen ని ఉదజని అంటారు. కనుక carbohydrates కాస్తా ‘కర్బనోదకాలు’ అవుతుంది.

Hydrocarbons కర్బనోదకాలు మన శరీరానికి ఇంధనం లాంటి వస్తువు అయినట్లే, మన యంత్రాలకి కావలసిన ఇంధనాలు రాక్షసి బొగ్గు, రాతి చమురు, మొదలైనవి. ఈ రెండింటిలోను ఉన్న రసాయన పదార్ధాలలో ముఖ్యమైనవి hydrocarbons. వీటిని తెలుగులో ‘ఉదకర్బనాలు’ అందాం. ఈ ఉదకర్బనాల గురించి మరొక సారి చెబుతాను కాని, ఇక్కడ మరొక చిన్న విషయం మనవి చేసుకుంటాను. ఫై వాక్యంలో ‘రాతి చమురు’ అన్న మాట వాడేను. దీన్ని ఇంగ్లీషులో petroleum అంటారు. Petro అంటే రాయి. Oleum అంటే oil లేదా చమురు. Oleo margarine అన్న మాట వినే ఉంటారు. అందులో ఉన్న oleo అన్నా చమురే. ఇండియాలో పాఠకులకి margarine అంటే ఏమిటో తెలియక పోవచ్చు. వారికొరకు - margarine అంటే వనస్పతి. “పిల్లి అంటే ఏమిట్రా?” అంటే “మార్జాలం” అన్నాట్ట వెనకటికి నా లాంటి వాడే! వనస్పతి అంటే ఏమిటంటారా? మన ‘డాల్డా’ వనస్పతికి ఒక వ్యాపారనామం (trade name). చూశారా! ఈ చర్చ చిలవలు పలవలతో పక్కదార్ల వెంబడి ఎలా పెరిగి పోతోందో.

Boundary Condition ఇది చాలా ప్రత్యేకమైన సందర్భంలో గణితంలో వచ్చే మాట. ఆ మధ్య ఒక వైజ్ఞానిక కట్టుకథ (science fiction story) రాస్తూన్నప్పుడు ఈ మాట వాడవలసి వచ్చింది. నేను boundary condition అన్న ఇంగ్లీషు మాట యధాతథంగా వాడినా లెక్కలలో ప్రవేశం లేని వారికి ఎలాగూ అర్ధం కాదు. అందుకని ‘ప్రహరాంక్షలు’ అనే తెలుగు మాటని తయారు చేసి వాడేను. కాని నేను తయారు చేసిన ఈ మాట లెక్కలతో పరిచయం ఉన్న వాళ్ళకి అర్ధం అవుతుందో లేదో ఎలా తెలుసుకోవటం? మేరీలెండ్ లో ఉన్న పిల్లలమర్రి రామకృష్ణని పిలచి నేను తెలుగులో రాసిన వాక్యం చదివి “అర్ధం అయిందా?” అని అడిగేను. టెలిఫోనులో మరో రెండు సార్లు చదివించుకుని, “ ‘ప్రహరాంక్షలు’ అంటే boundary conditions అని అర్ధం చేసుకోవాలా?” అని అడిగేడు! ఇంటి చుట్టూ ఉండే గోడని మనం ప్రహారీ గోడ అంటాం కదా! మిగిలిన తర్కం మీ ఊహకి ఒదిలేస్తాను.

మిగిలిపోయిన మాటలలో కొన్నింటికి భారతదేశం నుండి కిరణ్ కుమార్ చావా పంపిన కొన్ని సలహాలతో పాటు నా అభిప్రయాలని కూడా వ్యక్తపరుస్తూ వచ్చే నెల పరిశీలిస్తాను. మీరు కూడా ఈ దిగువ ఇచ్చిన మాటలతో సరితూగే తెలుగు మాటల గురించి ఆలోచించండి.

  • hardware
  • software
  • program (as in computer program, cultural program)
  • public (public domain, public sector, etc.)
  • private
  • amino acid
  • formic acid
  • matrix
  • wax paper
  • solo performance
మీ ఊహలు veerataallu@siliconandhra.org కి పంపండి.

డా. వేమూరి: నవీన తెలుగు సాహితీ జగత్తులో పరిశోధకులుగా, విజ్ఞానిగా వేమూరి వెంకటేశ్వర రావు గారు సుపరిచితులు. తెలుగులో నవీన విజ్ఞాన శాస్త్ర సంబంధ వ్యాసాలు విరివిగా వ్రాయటంలో ప్రసిధ్ధులు. విద్యార్ధులకు, అనువాదకులకు, విలేకరులకు పనికొచ్చే విధంగా శాస్రీయ ఆంగ్ల పదాలకు తెలుగు నిఘంటువును తయారు చేయడం వీరి పరిశ్రమ ఫలితమే. సరికొత్త పదాలను ఆవిష్కరించడంలో వీరు అందెవేసిన చేయి. కలనయంత్ర శాస్రజ్ఞుడిగా వృత్తిలోను, తెలుగు సాహిత్యంపైన లెక్కించలేనన్ని వ్యాసాలు వ్రాస్తూ, ఉపన్యాసాలు ఇస్తున్నారు.