తెలుగు తేజో మూర్తులు - సంఖ్యా శాస్త్ర బ్రహ్మర్షి సీ. ఆర్. రావు

-- ఈరంకి వెంకట కామేశ్వర్

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టత పెంపొందించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు; అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన; కనపరచిన కౌశలం, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.

ఈ శతాబ్దిలో సంఖ్యా శాస్త్రం (స్టాటిస్టిక్స్)లో సర్వ శ్రేష్టుడిగా ఎదిగిన ఉద్దండ మహాపండితుడు, దిగ్గజం కల్యంపుడి రాధాకృష్ణ రావు గారు (సీ ఆర్ రావు). సంఖ్యా శాస్త్రానికి పునాదివేసి, దాని పురోభివృద్ధికి దోహదం చేసి, దాని ఫల స్వరూపాన్ని మానవాళికి ఉపయోగసాధనాలైన వైద్య, వాతావరణ, ఆర్ధిక ఇత్యాది రంగాలకు పరిమాణాత్మక పద్ధతులలో అందించాడు ఈ సంఖ్యా శాస్త్ర బ్రహ్మర్షి.

కల్యంపుడి రాధాకృస్ణ రావు గారు సీ డి నాయుడు, లక్ష్మికాంతమ్మ దంపతులకు సెప్టెంబరు 10, 1920లో జన్మించారు. పది మంది సంతానంలో ఈయన ఎనిమిదవవాడు. విశాఖపట్ణంలో పాఠశాల విద్యనభ్యసించి, గణితంలో ఎం ఏ పట్టాను ప్రధమ శ్రేణిలో పొందారు. గణిత శాస్త్రం పై అభిరుచి, ఆకస్మికంగా "ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్" (ఐ ఎస్ ఐ) సంస్థను సందర్సించిన సందర్భం ఆయన పరిశోధనా దృష్టికోణాకి స్ఫూర్తిమంతమై నిలవటమేకాక, సంఖ్యా శాస్త్ర స్వరూపాన్నే మార్చేయడానికి కారణం అయ్యింది. అప్పట్లో ఐ ఎస్ ఐ సంస్థ ప్రెసిడెన్శీ కాలేజి అవరణలో, రెండు గదులలో ఉండేది. అప్రెంటిస్ గా చేరి కాలానుగుణంగా ఈ జగత్ విఖ్యాత, సుప్రసిద్ధ సంస్థకు సంచాలకులైయ్యారు.

1940 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గణితంలో ఎం ఏ పట్టా సంపాయించి, 1943 లో కొల్కట విశ్వవిద్యాలయం సంఖ్యా శాస్త్ర రంగంలో ఎం ఏ లో పట్టాతోపాటు బంగారు పతకం కూడా సాధించారు.

ఎదురు కున్న ప్రతిబంధకాలు

ఎదురు కున్న ప్రతిబంధకాలలో ముఖ్యమైంది - గణిత శాస్త్ర పట్టా ఉన్నా ఉద్యోగ అవకాశాలు ఆట్టేలేకపోవడం. దానికి తోడు రెండవ ప్రపంచ మహాయుద్ధం కొనసాగుతూ ఉండింది. మిలిటరిలో చేరాలన్నా అవకాశం చిక్కలేదు. ఈ పరిస్థితి, ఆయన జీవితాన్నే ఓ మలుపు తిప్పింది. సుప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు పి సి మహాలనోబిస్ స్థాపించిన కొల్కతలోని ఐ ఎస్ ఐ సంస్తను సందర్శించి అందులో చేరారు. సంఖ్యా శాస్త్రం మీద మక్కువతో అభ్యాసం కొనసాగించారు. తన అంతరంగాలనుండి పుట్టుకొచ్చింది కాబట్టే ఆయన సాధనతో ఈ శాస్త్ర రంగ వికాసానికి కారణభూతులైయ్యారు.

1946లో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మేటి గణాంక శాస్త్ర పండితుడు ఆర్ ఏ ఫిషర్ మార్గదర్శంలో డాక్టరేట్ పట్ట సాదించారు. 1965 లో ఆయన సంఖ్యా శాస్త్ర రంగంలో చేసిన కృషికి గాను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ సైన్సెస్ ఇచ్చింది. గణాంక శాస్త్రం లో రావు గారు అందరికి సుపరిచుతులు. ఈ శాస్త్ర విభాగంలోకి యవ్వరు అడుగు పెట్టినా రావు గారి సిద్ధంతాలు, పద్ధతులు, ప్రమేయాలు (తీరంస్) అభ్యసించని వారుండరు. గణాంక శాస్త్ర సీమలో ఏ పత్రాలు వెలువడినా వాటిలో రావు గారి ప్రక్రియలకు అన్వయంగానో, అనుబంధంగానో ఉంటాయి. వీరి ప్రభావం అలాంటిది మరి!.

భారత, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, గ్రీస్, ఫిన్లాండ్, జర్మనీ, పొలాండ్, స్పైన్, స్లొవాకియా, స్విట్జర్లాండ్ ఇత్యాది పదహారు దెశాలలో విభిన్న విశ్వవిద్యాలయాలనుండి అందరూ అబ్బుర పడేలా ముప్పై ఒక్కటి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు; వారి పాండిత్య ప్రకర్షలు ఎట్టివో ఇక వేరే చెప్పనక్కరలేదు.

రావు గారు సంఖ్యా శాస్త్ర విషయాల గూర్చి ఇరవైకు పైగా పుస్తకాలు వ్రాసేరు. నాలుగు వందలకు పైగా పరిశోధనా పత్రాలు విభిన్న పత్రికలలో ప్రచురించారు; దదాపు యాబై పీ హ్ డి (డాక్టరేట్) విద్యార్ధులకు మార్గదర్శకుడిగా (గైడ్ గా) ఉన్నారు. వీళ్ళు, మరో రెండు వందల మంది డాక్టరేట్లకు మార్గదర్శకులుగా నిలిచారు. ప్రస్తుతం కల్యంపుడి రాధాకృష్ణ రావు గారు పెన్సల్వేనియా రాష్ట్ర విశ్వవిద్యాలయం లో అచార్యాయుడిగా, మల్టివేరియేట్ ఎనాలసిస్ కేంద్ర సంచాలకుడిగా (డైరెక్టర్ గా) పనిచేస్తున్నారు.

సంఖ్యా శాస్త్రంలో ఏ పట్టబద్రుడైనా రావు గారి రచనలు చదివి తీరుతాడు. వీరి పరిశోధనా ఫలితంగా నెలకొన్న నియమాలు (తీరంస్), సిద్ధంతాలు విద్యార్ధులకు పాఠావళి అంశాలలో భాగమే.

"ఏ సమస్యనైనా పరిష్కరించాలంటే ఏ కార్యవర్గాన్నో (కమిటీ) వేయనక్కరలేదు, సంఖ్యా శాస్త్ర పరమైన (స్టాటిస్టికల్) సలహా తీసుకుంటే చాలు" అని వారి ఉవాచ. సంఖ్యా శాస్త్ర రంగంలో నిష్ణాతులైన బ్లాక్వెల్, ఫిషర్, హామింగ్, రూబిన్, నేమన్ తో కలసి ఎన్నో పరిశోధనలు చేసి ఫలితాలను వెలువడించారు.

అందుకున్న పురస్కారాలు, బహుమతులు

తన సుధీర్ఘ ప్రయాణంలో ఎన్నో పురస్కారాలను, బహుమతులను, మన్ననలు అందుకున్నారు. వాటిలో ముఖ్యమైనవి:

 • భారత ప్రభుత్వం నుండి పద్మ విభూషణ్ అందుకున్నారు.
 • అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ఇచ్చి గౌరవించారు.
 • అమెరికన్ సంఖ్యా శాస్త్ర (స్టాటిస్టికల్) సంఘం, విల్క్స్ మెడల్ (బృహత్ సాధనకు ప్రత్యేక పతకం) ఇచ్చి గౌరవించింది.
 • రాయల్ స్టాటిస్టికల్ సంస్త నుండి "గై" పతకం అందుకున్నారు.
 • భారత రాష్ట్రీయ శాస్త్ర పరిషత్తు (ఇ ఎన్ ఎస్ ఏ) నుండి మెఘనాద్ సాహ మెడల్ అందుకున్నారు.
 • శాంతి శ్వరూప్ భట్నగర్ పురస్కారం అందుకున్నారు.
 • బోస్ సంస్త నుంచి జే సి బోస్ పతకం అందుకున్నారు.
 • ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ నుండి మహాలనోబిస్ శతవార్షిక బంగారు పతకాన్ని అందుకున్నారు.

సంఖ్యా శాస్త్ర సిద్ధంతానికి పునాది వేసి, దాని పురోగాభివృద్ధికి దోహదం చేసి, దాని ఉపయోగాలను జీవశాస్త్రం, ఆర్ధికశాస్త్రం, గణితంలో, ఇంజినీరింగ్ ఇలా విభిన్న క్షేత్రాలకు తోడ్పడేలా కృషి చేసినందుకు, అమెరికా దేశం సి ఆర్ రావు కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ ఇచ్చింది. జూన్ 12, 2002 నాడు, అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ వైట్ హౌజ్ లో రావు గారికి ఈ పతకం బహూకరించి గౌరవించారు.

సి ఆర్ రావు గౌరవార్ధం ....

 • పెన్న్ స్టేట్ విశ్వద్యాలయం ఈయన్ని గౌరవిస్తూ, సి ఆర్ ఎండ్ భార్గవి రావు సంఖ్యా శాస్త్ర బహుమతిని నెలకొల్పింది.
 • ఈ తెలుగు బిడ్డని గౌరవిస్తూ, తెలుగు నాట, ఉస్మానియా విశ్వవిద్యాలయం సి ఆర్ రావు "ఎడ్వాన్సెడ్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేథమెటికల్ ఎండ్ కంపుటర్ సైన్సెస్" అంకురార్పణం చేసింది.
 • 2000 లో కెంట్ నగర మేయర్, మే 13 ను సీ ఆర్ రావు 'డే' అని ప్రకటించి నగర 'తాళం' (కీ) ఇచ్చి గౌరవించారు.
 • ఇండియా, అమెరికా, బ్రిటన్ దేశాలలో రావు గారి జీవితం మీద, ఆయన సాదించిన విజయాల పై ఎన్నో పత్రికలు ప్రచురించాయి.
 • ఈయన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆరు సమావేశాలు (కాంఫరెన్సులు) నిర్వహించారు.ఆయన మీద ఉన్న గౌరవం, భక్తి ఎలాంటివో ఇక వెరే చెప్పనక్కర లేదు.
 • భారత దేశం లోని ప్రముఖ పత్రిక 'టైంస్ ఆఫ్ ఇండియా' రావు గారిని భారత దేశంలో పది అత్యుత్తమ శాస్త్రవేత్తలో ఒకరుగా గుర్తించింది.
 • అంతర్జతీయ గణిత సంస్త అధ్యక్షుడిగా; భారతీయ సంఖ్యాక్రమాల సంస్థ అధ్యక్షుడిగా; బయోమెట్రిక్ సంస్త అధ్యక్షుడిగా వ్యవహరించారు.
 • అమెరికా, ఇండియా, బ్రిటన్, లిథుయేనియ దేశాల నేషనల్ ఎకాడమి లో సభ్యుడిగా ఉన్నారు.
 • రాయల్ స్టాటిస్టికల్ సంస్త, బయోమెట్రిక్ సంస్త, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కొంబినేటొరిక్స్ ఎండ్ అప్లికేషన్స్, అమెరికా ఎకాడమి ఆఫ్ ఆర్ట్స్ ఎండ్ సైన్స్ గౌరవ సభ్యుడిగా ఉన్నారు.

రావు గారి కొన్ని ప్రమాణాత్మక సిద్ధాంతాలు

సంఖ్యా శాస్త్ర రంగంలో రావు గారి ప్రమాణాత్మక సిద్ధాంతాలలో ముఖ్య మైనవి:

 • రావు-బ్లాక్వెల్ సిద్ధాంతం
 • క్రేమర్-రావు బౌండ్
 • క్రేమర్-రావ్ ఇనీక్వాలిటి
 • రావు స్కోర్ టెస్ట్
 • రావు డిస్టెన్స్
 • రావు ఉదగ్రకోణీయ వరుస
 • ముల్టి వేరియేట్ లీనియర్ మొడల్
 • బూట్ స్ట్రాప్ డిస్ట్రిబుషన్
 • కాగన్-లిన్నిక్-రావు థీరం

సి ఆర్ రావు జీవితం సంఖ్యా శాస్త్ర అభివృద్ధికి అంకితమవడం కాదు, అది విడదీయని అనుభందంగా మారింది. తాను రిటైరయి అమెరికాలో పిల్లల దగ్గరికి వచ్చి, పిట్స్‌బర్గ్ లో వరించి వచ్చిన ఆచార్య పదవి చెప్పట్టి నేటికీ ఎన్నో పరిశోధనలు చేస్తూ ఎందరికో మార్గదర్శకునిగా ఉన్నారు. సంఖ్యా శాస్త్ర రంగంలో అరవై వసంతాలు పూర్తయినా ఇంకా ఆయన కృషి కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన జీవితం, అనుభవాలు, సాదించిన విజయాలు అందరికీ ఉదాహరణంగా నిలిచి పోతాయి. ఇరవై ఒకటవ శతాబ్దిని సంఖ్యా శాస్త్ర శతాబ్దిగా రూపుదిద్ధించారు, తన కృషితో. ఇలాంటి ఘనత మరెందరికి వచ్చేను! ఆయన ఖచ్చితంగా భారత గణిత శాస్త్ర పటుత్వానికి ఒక మచ్చుతునక!