సుజననీయం : లక్ష్యం

-- తమిరిశ జానకి


ఏ మనిషికైనా సరే జీవితంలో ఓ 'లక్ష్యం' అంటూ ఉండాలి. అది లేకపోతే బ్రతుకు మోడువారిన చెట్టులా ఉంటుంది.

'లక్ష్యం' అన్న పదం చాలా విలువైనది. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తాపత్రయపడడం, దానికోసం కష్టపడడం తల్లితండ్రుల లక్ష్యం. విద్యార్థులకు విద్యనార్జించడం లక్ష్యమై ఉండాలి. ఉద్యోగస్తులకు అంచెలంచెలుగా ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలన్న లక్ష్యం, అలాగే వ్యాపారస్తులు, కళాకారులు తమతమ రంగాల్లో ముందుకు సాగుతూ పేరుప్రతిష్టలు సంపాదించుకోవాలన్నది లక్ష్యం గా ఉంటుంది. ఇలా ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు.

'చెరపుకురా చెడెదవు ' అన్న నానుడిని పాటిస్తూ, ఎవరి లక్ష్యమైనా ఇతరులకు హాని కలిగించకూడదన్న విషయాం మరిచిపోకూడదు. తన మేనల్లుడిని సం హరించాలన్న క్రూరమైన లక్ష్యంతో కంసుడు ఎంతోమంది పసికందుల ప్రాణాలు తీసాడు. ఈ లక్ష్యం వల్ల కంసుడు పాపాన్ని మూటకట్టుకోవడం తప్ప సాధించిన ప్రయోజనమేమి లేదు.

స్వలాభాపేక్షతోగానీ, తనకి పేరుప్రతిష్ఠలు రావాలనిగానీ కాక పదిమందికి ఉపయోగపడే లక్ష్యంతో జీవితం సార్థకం చేసుకున్నాడు అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆంధ్రరాష్ట్ర అవతరణకై ఆమరణ నిరాహారదీక్ష చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన అమరుడాయన.

'ధర్మో రక్షతి రక్షితః' - ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించడం కష్టతరమైన పనేమి కాదు. ఇది ప్రతిఒక్కరివల్ల జరుగుతుందని తెలుసుకోవాలి. ఏ విధంగా? ఎవరి లక్ష్యాన్ని వారు గుర్తించినపుడు, లక్ష్యసాధనలో నిమగ్నమైనపుడు.

ఉదాహరణకు, ఉపాధ్యాయుడు సక్రమంగా శిష్యులకి బోధించగలిగినప్పుడు ఆయన లక్ష్యం నెరవేరినట్టే. ఆ బోధన పట్ల శిష్యులు తమ మనసును లగ్నంచేస్తే శిష్యుల లక్ష్యమూ నెరవేరినట్టే. ఇక్కడ ఇరువురూ కూడా తమతమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారనే చెప్పాలి. ఎవరి ధర్మాన్ని వారు సవ్యంగా పాటిస్తే ధర్మాన్ని రక్షించడమే అవుతుంది కదా!

లక్ష్యసాధనలో కష్టనష్టాలెదురైనా క్రుంగిపోనవసరం లేదు. ఓటమి ఎదురైనా 'ఓటమి విజయానికి తొలిమెట్టు 'గా భావించుకొని మరింత పట్టుదలతో, నేర్పుతో పైమెట్టుమీద కాలు మోపేందుకు ప్రయత్నించాలి. లేకుంటే తొలిమెట్టే భవిష్యత్తుని అడ్డుకునే గట్టవుతుంది.

నైతికంగా, సామాజికంగా, సాంఘికంగా వేలెత్తి చూపలేని లక్ష్యం తో మనిషి ముందుకు సాగిపోతే ఉత్తమజన్మ పొందినందుకు సార్థకత చేకూరినట్లే అని భావించవచ్చును.

మీ

తమిరిశ జానకి


సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.