సిలికానాంధ్ర కుటుంబము

సిలికానాంధ్ర ఆరవ వార్షికోత్సవం - శతక ధారా పద్య సమ్మోహనం

సిలికానాంధ్ర ఆరవ వార్షికోత్సవ సందర్భంగా ఆగస్ట్ 4, 2007న పాలోఆల్టోలోని స్పాన్ గన్ బర్గ్ కళామంటపంలో 'శతక పద్యధారా సమ్మోహనం' పేరిట నూతన అవధాన ప్రక్రియ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో 'పంచ సహస్రావధాని 'గా పేరొందిన శ్రీ మేడసాని మోహన్ గారు 108 పద్యాలను ఆశువుగా చెబుతారు.

శార్దూల వృత్తంలో ఏకమకుటంతో ఈ శతక పద్యాల నిర్వహణ జరుగుతుంది. 'ప్రవాసాంధ్ర జీవన శైలి ' వస్తువుగా తీసుకొనబడే ఈ పద్యాల హరివిల్లులో ఇంతకు ముందెన్నడూ జరగని రీతిలో 54మంది పృచ్చకులు పాల్గొంటారు. విద్యా, ఉద్యోగ, వివాహ, సంతాన, వ్యాపార, స్వగృహ, సాంస్కృతిక, అధ్యాత్మిక, మరియూ వృద్ధాప్య మొదలైన తొమ్మిది ముఖ్యమైన ప్రవాసాంధ్ర జీవన పర్వాలు పద్యాల హరివిల్లులో రమ్యంగా, హృద్యంగా వర్ణింపబడతాయి.

వర్ణన, దత్తపది, న్యస్తాక్షరి, మరియు సమస్య అనే నాలుగు అంశాలను పృచ్చకవర్గం ఎన్నుకుంటుంది. అలాగే ఈ మధ్య సిలికానాంధ్ర పిల్లలు ప్రముఖ రంగస్థల పౌరాణిక నటుడు, గుమ్మడి గోపాలకృష్ణగారి శిక్షణలో నేర్చుకున్న పౌరాణిక పద్యాలను ఆలపిస్తారు. ప్రతి పద్యానికి నేపథ్యంలోనున్న అర్థాన్ని మేడసానిగారు వర్ణిస్తారు. ఇక అందర్ని ఆహ్లాదపరిచే అప్రస్తుత ప్రసంగం కూడా ఉంటుంది.

కార్యక్రమం చివరగా ప్రేక్షకులకు చవులూరించే తెలుగు భోజనం కూడా ఉంటుంది. మీరందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ విన్నూత్న కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని సిలికానాంధ్ర ఆహ్వానిస్తున్నది.

'ఆంధ్ర సాంస్కృతికోత్సవం - 2007' - శంఖారావం

అక్టోబర్ 6న జరిగే 'ఆంధ్ర సాంస్కృతికోత్సవా'నికి సిలికానాంధ్ర మాజీ అధ్యక్షుడు, కొండిపర్తి దిలిప్ గారి గృహంలో జులై 7న శంఖారావం చేసారు. ఈ ఉత్సవానికి నూకల సిద్ధార్థ మరియు చివుకుల రవి సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా కొండిపర్తి దిలీప్ మాట్లాడుతూ చిన్నాపెద్దా, ఆడామగా భాగస్వామ్యంతో, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ సౌకర్యాలతో జనరంజకంగా ఉండే కార్యక్రమాలను రూపొందిచాలన్న ఆశయమున్నట్టు తెలిపారు. అధ్యక్షుడు విస్సమ్రాజు శ్రీఫణి మాట్లాదుతూ ఈ సాంస్కృతికోత్సవం ఇంతకు ముందు జరిగిన ఉత్సవాలకంటే భిన్నంగా, అధ్భుతంగా ఉండాలన్న అభిలాషను వ్యక్తం చేసారు. సభకు విచ్చేసిన సభ్యులు ఉత్సవంలో ఉండవలసిన అంశాల గురించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేసారు. వారవారానికి మరింత అందంగా రూపుదిద్దుకొంటున్న ఈ ఉత్సవ విశేషాలను సుజనరంజనిలో ప్రతినెల ప్రచురిస్తాము.