రాతివనం - 8వ భాగం

-- సలీం

జరిగిన కథ: అనూష ఒక సాధారణ మధ్య తరగతి టీనేజ్ పిల్ల. అనూష తల్లిదండ్రుల ప్రోద్బలంతో రెసిడెన్షియల్ కాలేజిలో చేరుతుంది. అనూష భయాలకు తగ్గట్టుగా అక్కడి వాతావరణం ఉండటం ఇంకాస్త అయిష్టతను పెంచుతుంది. ఆమె రూమ్మేటు, కల్పన, చదువు వత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడానికి హాస్టలు పైకెక్కుతుంది. మరోపక్క అనూష తండ్రి, రమణారావు, తన కొడుకుకు ఎనిమిదో తరగతి నుంచే ఐ.ఐ.టి. ఎంట్రన్సు కు కోచింగు ఇప్పించేందుక్కు సన్నాహాలు చేస్తుంటాడు. మరో వైపు సూర్యకుమార్ అనే ప్రతిభావంతుడైన హిస్టరీ లెక్చరర్ ఆర్ట్స్ కోర్సులలో విద్యార్థులు తగ్గిపోతుండటం చూసి మధనపడుతూ అటువైపు ఆసక్తి కలిగించేలా పోటీలు నిర్వహిస్తుంటాడు. అందరికంటే భిన్నంగా ఓ జర్నలిస్టు కూతురు, మధుమిత హిస్టరీ గురించి మంచిగా చెప్పి మొదటి బహుమతి గెల్చుకుంటుంది, సూర్య కుమార్ ఆమెను చూసి ఆనందిస్తాడు. అనూషకు ఒంట్లో బాగోలేదని తెలిసి తండ్రి విజయవాడ వెళ్ళి ఇంటికి తీసుకువస్తాడు. ఇక అనూషను వెనక్కి పంపకూడదని నిర్ణయించుకుంటాడు తండ్రి.. హిమవర్ష, అనూష లానే తల్లిదండ్రుల ప్రోద్బలం మీద తనకు ఇష్టం లేని చదువుచదువుకుంటూంటుంది. ఇంటికొచ్చిన అనూషను స్నేహితురాళ్ళు హిమవర్ష, మధుమిత కలుస్తారు. మాటల్లో మధుమిత వాళ్ళిద్దరినీ సాంత్వన పరుస్తూ తమ కష్టాల్లోనే జీవితపు విలువలు నేర్చుకోవడమెలాగో చెబుతుంది.

మరో వైపు రామ్మూర్తి అనే ఒక ప్రతిభావంతుడైన శ్రీచరిత కాలేజ్ లెక్చరర్ సునందా కాలేజిలో జేరాడని శ్రీచరిత ఓనరు ఇంటికి పిలిచి బెదిరిస్తాడు. అయినా రామ్మూర్తి లొంగడు. ఇలా ఉండగా సుందరం అనే లెక్చరర్ ఇంటింటికీ తిరుగుతూ తాను పనిచేసే కాలేజికి ప్రచారం చేస్తుంటాడు.

ఎంసెట్ ర్యాంకులు అధికారికంగా వెలువడకముందే తన పలుకుబడిని, పరిచయాల్ని ఉపయోగించి వాటి వివరాల్ని ఒకరోజు ముందుగానే సేకరించాడు ఈశ్వరరావు.తమ కాలేజీకి ఇంజనీరింగులో మూడు, నాలుగు ర్యాంకులొచ్చాయి.రెండో ర్యాంకు, ఐదో ర్యాంకు సునందా కాలేజీకొచ్చాయి. మెడిసిన్లో మొదటి ర్యాంకు సునందా కాలేజీ కొట్టుకెళ్ళింది. గత రెండు సంవత్సరాలనుంచీ మెడిసిన్లో ర్యాంకులు సంపాదించటంలో సునందా కాలేజీ తన కాలేజీకంటే ముందంజలో వుంది.ఇంజనీరింగు విభాగంలో మాత్రం తమదే పైచేయి. కానీ ఇప్పుడు .....

ఈశ్వరరావు ఆత్రుతగా ఇంజనీరింగులో మొదటిర్యాంకు సంపాదించిన విద్యార్థి వివరాలు కనుక్కున్నాడు. అతను కార్పొరేట్ కాలేజీల్లో చదవలేదు.ఒక మోస్తరు పేరున్న కాలేజీలో చదివాడు అంతే.

ఈశ్వరరావు చురుగ్గా ఆలోచించాడు. క్షణంకూడా ఆలస్యం చేయకుండా అతని అడ్రస్ వెతుక్కుంటూ బయల్దేరాడు. సమయం సాయత్రం ఆరు కావస్తోంది.సీతారాంపురంలో కొత్త వంతెనకు దగ్గరగా ఉన్న చిన్న పెంకుటిల్లు..దాన్ని ఆనుకుని నాలుగైదు గుడిసెలు ...

తమ ఇళ్ళముందు కారొచ్చి ఆగంగానే గిడిసెల్లోని ఆడవాళ్ళు, పిల్లలు బైటకొచ్చి నిలబడి కారులోంచి దిగుతున్న వ్యక్తి వైపు కుతూహలంగా చూశారు. ఈశ్వరరావుకి ఇబ్బందిగా అంపించింది. కానీ తప్పదు. తన కాలేజీ పరువుకి సంబంధించిన విషయం.

"వెంకటేశ్వర్లు ఉండేదెక్కడ?" అని అడిగాడు ఒకావిణ్ణి ఉద్దేశించి.

ఆమె మట్లాడకుండా చేత్తో ఓ గుడిసె వైపు చూపించింది.

"రామారావు అనే కుర్రాడి ఇల్లేనా ఇది?" తను సరైన అడ్రస్కి వచ్చాడో లేదో నిర్థారించుకోవటానికి మరలా అడిగాడు.

"ఆ అదే ఇల్లు. అదుగో బైట నిలబడి ఉందే ...ఆళ్ళమ్మే" అందావిడ.

ఈశ్వరరావు ఆమెను సమీపించి "రామారావు మీ అబ్బాయేగా" అని అడిగాడు. ఆమె కళ్ళల్లో బెదురు...."ఔనయ్యా. మా అబ్బాయే.తప్పేమైనా చేశాడా అయ్యా? ఆడస్మంటోడు కాదు. సదూకునే కుర్రాడు. కట్టపడి సదిపిస్తున్నాం.శానా మంసోడు. ఏమైనా సేసుంటే సెమించడయ్యా" అంది.

"మీ అబ్బాయి మంచికోసమే వచ్చాను.మేలు చేయటానికి తప్ప దండించటానికి రాలేదు" అనగానే ఆమె స్థిమితపడింది.

"ఇంతకూ రామారావున్నాడా?"

"లేడయ్యా. యాడకో బోయినాడు"

"పోనీ వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు ఉన్నా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడి వెళ్తాను"

"పనికెళ్ళాడయ్యా. ఈడనే. అడితిలో కట్టెలు కొడ్తుంటాడు. ఎల్లి పిల్సుకొస్తానుండు. చనంలో వత్తా" ఆమె అతని సమాధానం కోసం ఎదురుచూడకుండా వేఅంగా పక్క సందులో కెళ్ళింది. పదినిముషాలు కూడా గడవకముందే ఒకతన్ని వెంటపెట్టుకొచ్చింది.

అతను పంచెను గోచీకట్టులా బిగించి కట్టుకుని ఉన్నాడు. నడుంపైన అనాచ్ఛాదితంగా ఉంది. శరీరమంతా చెమటతో తడిసిపోయి ఉంది.కంగారుగా వచ్చీరావటంతోనే "దండాలయ్యా...సెమించాలా...ఇంట్లో కూసో బెట్టటానికి కుక్కి మంచం తప్ప మరేం లేని పేదోల్లం" అన్నాడు.

"మీ కష్టాలు తొందర్లోనే తీరిపోతాయి వెంకటేశ్వర్లు...బంగారంలాంటి కొడుకుని కన్నారు. అబ్బాయికి మంచి భవిష్యత్తుంది. ఎటొచ్చీ ఇంజనీరింగు చదివించే స్థోమత మీకుందా అని"

"అంతంత పెద్ద సదువులు సదివించటం కట్టమయ్యా. నేనా కూలి సేస్కునేటోణ్ణి. మీ అస్మంటి దెరమ పెబువులే ఓ దారి చూపాల"

"అందుకే గదా మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను.నేను చెప్పినట్లు చేస్తే మీ అబ్బాయి చదువు విషయం నేను చూస్కుంటాను.

"సెప్పండయ్యా...ఆడి సదువు కోసరం నా తలకోసి మీ కాల్ల కాడ పెట్టమన్నా పెడ్తాను"

చాలా చిన్న పని. మీ అబ్బాయిని పిలిపించు.వివరంగా చెప్తాను" అన్నాడు ఈశ్వరరావు.

మరి కొద్ది నిముషాల్లో రామారావు వచ్చాడు.

"బాబూ...ఏ కాలేజీలో ఇంటర్ చదివావు?" చాలా లాలనగా అడిగాడు ఈశ్వరరావు.

"సెయిట్ థామస్ జూనియర్ కాలేజీలో"

"ఎంసెట్‌కోసం ఎక్కడైనా కోచింగ్ తీసుకున్నావా?"

"లేదు సార్. సెల్ఫ్ కోచింగే"

"సరే. తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు?"

"కంప్యూటర్ ఇంజనీర్ కావాలనేది నా కల. అందుకోసమే కష్టపడి చదివాను సార్. ఎంసెట్ కూడా బాగా రాశాను.వెయ్యి లోపలే ర్యాంకొస్తుందన్న నమ్మకం ఉంది సార్"

"చూడు బాబూ.నీకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీటొచ్చినా సంవత్సరానికి పాతికవేల ఫీజైతే కట్టాలిగా.పుస్తకాలు కొనాలిగా. మీ నాన్న అంత దబ్బు కట్టలేడు.అందుకే నేనో ప్రొపోజల్‌తో వచ్చా. ఎంసెట్ కోచింగ్ శ్రీ చరిత్ర కాలేజీలో తీసుకున్నానని చెప్పు. షార్ట్ టెర్మ్ కోచింగ్ అని చెప్పు.పేపర్ల వాళ్ళొచ్చినా, టీవీ వాళ్ళొచ్చినా ఇదే విషయం చెప్పు.నీ ఫీజులన్నీ నేను కట్టి ఇంజనీరింగు చదివిస్తాను. మిగతా ఖర్చులు కూడా నేనే భరిస్తాను. సరేనా!"

రామారావుకి విషయం అర్థంకాక ఉక్కిరిబిక్కిరి అయిపొయాడు. అతని కళ్ళకు తన ఎదురుగా నిలబడి ఉన్న వ్యక్తి దేవదూతలా కంపిస్తున్నాడు.తన కోరికలు తీర్చటానికి వచ్చిన దేవదూత...

వెంకటేశ్వర్లు కళ్ళకైతే అతను సాక్షాత్తూ దేవిడిలానే కంపించాడు. చచ్చిపోతున్నాను మొర్రో అని కాళ్ళూ, గడ్డాలూ పట్టుకున్నా రూపాయి విదల్చని లోకంలో ఇలాంటి మునుష్యులు కూడా ఉంటారా....కలా నిజమా... ఇల్లు వెతుక్కుంటూ వచ్చి చదివిస్తానంటున్నాడే...దేవుడు కాక మరేమిటి...

అతను అమాంతం కిందకు జారిపెయి ఈశ్వరరావు కాళ్ళు పట్టుకున్నాడు. "అయ్యా. మీరు నిజంగా దేవుళ్ళు...ఏ సేసినా మీ రునం తీరదయ్యా" అంటూ వలవలా ఏడ్చేశాడు.

ఈశ్వరరావుకి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి బయల్దేరేముందు అనుకున్నాడు. మొదట ఐదు లక్షల ఆఫర్ ఇవ్వాలని, అప్పటికీ ఒప్పుకోకపోతే మరో రెండు లక్షలు ఎరవేద్దామనుకున్నాడు. తీరా ఇక్కడికొచ్చి వీళ్ళ పేదరికం చూశాక, చేప వూర్కెనే గాలానికి తగులుకుందని అర్థమైపోయింది. ఇపుడో లక్షలో తన పనైపోయింది. దానికి తోడు తనిప్పుడు దేవుడిలా, ధర్మాత్ముడిలా అవతారం దాల్చాడు. స్వామి కార్యం స్వకార్యం అంటే ఇదేనేమో అనుకున్నాడు.

"మీరు మరెవ్వరికీ మాటివ్వకూడదు. ఎవరెంత ప్రలోభబెట్టినా మాట మార్చకూడదు."సరేనా" అన్నాడు.

"మే కూటికి పేదోల్లమే కాని మాట మార్చే రకం కాదయ్యా" అన్నాడు వెంకటేశ్వర్లు. అతనికెందుకో విషయం మింగుడు పడటం లేదు. ఎవరో ముక్కు మ్హం తెలీని వ్యక్తి ఇంటి కొచ్చి తన కొడుకుని చదివిస్తాననటం ఏమిటి...వేలంపాట పాడబోతున్నట్లు మరెవరైనా వచ్చి ఎక్కువ ఇస్తామన్నా మాట మార్చవద్దని అడగటమేమిటి? ఇందులో అసలు తిరకాసేమైనా ఉందా? తన కొడుకుని పోటీ పడి చదివించబోతున్నారంటే ఏదో మతలబు ఉండే ఉంటుందనిపించింది. కానీ అదేమిటో అతని చదువురాని బుర్రకి అందటం లేదు.

ఈశ్వరరావు రామారావుని దగ్గరకు పిలిచి అన్ని జాగ్రత్తలు చెప్పాడు."ఇకనుంచీ నీ చదువు బాధ్యత నాది.నువ్వు చేయవలసిందల్లా నేను చెప్పినట్లు వినటమే" అన్నాడు. తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి మరునాడు వచ్చి కలుసుకోమని చెప్పాడు. రామారావునడిగి అతని ఫొటో ఒకటి తీసుకున్నాడు.

తన కారు దగ్గరకు సంతృప్తిగా వెళ్ళిన ఈశ్వరరావు కొద్ది దూరంలో పార్క్‌చేసి ఉన్న రామ్మూర్తి కారు చూడగానే గతుక్కుమన్నాడు.పోటీకి వస్తారని ఊహించాడు కానీ ఇంత వేగంగా పావులు వాళ్ళూ పావులు కదుపుతారనుకోలేదు.

అతని మనస్సులో సన్నటి అలజడి....వెంకటేశ్వర్లు మాట మీద నిలబడతాడా....రామ్మూర్తి రెండు లక్షలు ఇస్తానంటే లొంగిపోతాడేమో....పేదవాళ్ళు కదా.డబ్బు అవసరాలు చాలా ఉంటాయి.ఆసలే పాపిష్టి డబ్బు...

మరలా వెనక్కి వెళ్ళాడు. ఆశ్చర్యంగా చూస్తున్న వెంకటేశ్వర్లు చేతిలో పాతికవేలు పట్టాడు. "ఇది మీ ఖర్చులకోసమని ఇస్తున్నా. ఎవ్వరొచ్చినా ఒకటే మాట చెప్పాలి. రామారావు శ్రీ చరిత కాలేజీలో కోచింగ్ తీసుకున్నాడు. మర్చిపోవద్దు." అన్నాడు.

అంత డబ్బు ఎన్నడూ చూడని వెంకటేశ్వర్లు ఉబ్బితబ్బిబ్బయ్యాడు.తన కొడుకు రూపంలో లక్షీదేవి తన పూరి గుడిసెలో తిష్ఠవేసిందని మురిసిపోయాడు.

మరునాడు మధ్యాహ్నం మూడింటికి రిజల్ట్స్ వెలువడ్డాయి. సాయంత్రానికల్లా టీవీల నిండా ప్రచారపు హోరు..ఏ చానెల్ తిప్పినా ఒకతే గోల...ఎంసెట్ ర్యాంకుల గురించి..శ్రీ చరిత జూనియర్ కాలేజీ ప్రభంజనం...ఇంజనీరింగ్లో మొదటి ర్యాంకుతో పాటు మూడు నాలుగు ర్యాంకులు కైవసం...మొదటి వంద ర్యాంకుల్లో యాభై ఆరు స్థానాల్ని నిలబెట్టుకున్న శ్రీ చరిత...అని ఒక ప్రకతన వచ్చిన కొద్దిసేపటికే సునందా కాలేజీ వాళ్ళ ప్రకటన...గత కొన్ని సంవత్సరాలుగా మెడిసిన్ ర్యాంకుల్లో విజయఢంకా నోగిస్తున్న ఏకైక సంస్థ....గెలుపుకి మరో పేరు సునందా...విజయానికి అసలైన దారి సునందా...

రాత్రి ఎనిమిదింటికల్లా న్యూస్ చానెల్స్‌లో ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థుల ఇంటర్వూలు...."మీ అబ్బాయి లేదా అమ్మాయి ఎంసెట్‌లో ర్యాంకు తెచ్చుకున్నందుకు తల్లితండ్రులుగా మీరెలా ఫీల్ అవుతున్నారు" అని యాంకరమ్మ నవ్వుతూ ప్రశ్నలు ..."మీకు ర్యాంకు రావటం వెనుక ఎవరి ప్రోత్సాహం ఎక్కువగా ఉంది? అసలు మొదటి ర్యాంకు వస్తుందని వూహించావా? ఫ్యూచర్‌లో ఏం కావాలనుకుంటున్నావు? లాంటి ప్రశ్నలకు రామారావు తడబడకుండ సమాధానాలు చెప్పాడు. "శ్రీ చరిత కాలేజీ టీచర్ల ప్రతిభ వల్లనే తనకు మొదటి ర్యాంకు వచ్చిందనీ, డౌట్స్ వస్తే ఓపిగ్గా వివరించేవారనీ, వాళ్ళకు జీవితాంతం ఋణపడి ఉంటానని చిలుక పలుకులు చెప్పాడు.

మనునాడు ఉదయం పేపర్లనిండా ప్రకతనలే. ఒక పేజీ నిండా శ్రీచరిత ప్రకతన....విద్యార్థుల ఫొటోలతో సహా....మరో పేజీ నిండా సునందా కాలేజీ ప్రకతన...హైద్రాబాద్, విజయవాడ, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్టణం కేంద్రాల్లో పెద్ద పెద్ద హోర్డింగులు వెలిశాయి.ఒక న్యూస్ ఛానెల్ తన థర్టీ మినిట్ ప్రోగ్రాంలో శ్రీచరిత కాలేజీ అథ్యాపకులతో చర్చా సమావేశం నిర్వహించి వాళ్ళ విజయ రహస్యాలేమిటో ప్రజలకు తెలిసేలా చేసింది. రెండ్రోజులు పోయాక అదే న్యూస్ ఛానెల్లో సునందా కాలేజీ ప్రతిభ గురించి చర్చ జరిగింది.

శ్రీచరిత కాలేజీ మరో అడుగు ముందుకు వేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొదటి ఐదు ర్యాంకులు తెచ్చుకున్న విధ్యార్థులకు బహుమతులు, బొకేలు ఇప్పించింది.సునందా కాలేజీ వాళ్ళు తామేమీ చెప్పటానికి ముఖ్యమంత్రి ద్వారా ర్యాంకులు తెచ్చుకున్న విధ్యార్థులకు క్యాష్ అవార్డులు ఇప్పించింది. ప్రకటనల యుద్ధం రెండు వారాలదాకా హోరాహోరీగా కొనసాగింది.

ఆదివారం సాయంత్రం...శ్రీచరిత లేడీస్ హాస్టల్ కోలాహలంగా ఉంది. సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు పేరెంట్స్ కానీ బంధువులు కానీ వచ్చి విద్యార్థుల్ని కలుసుకోవచ్చు. విజయవాద నుంచి, విజయవాడ చుట్టుపక్కల ఊళ్ళనుంచి చాలామంది వచ్చారు.గుంటూరు, తెనాలి, రాజమండ్రిలాంటి వూళ్ళనుంచి కూడా తల్లితండ్రులు వచ్చారు. రెండు గంటలైనా తమ పిల్లల్ని చూసుకోవచ్చన్న ఆశ...పిల్లకోసం రకర్కాల తినుబండారాలు చేసుకొచ్చారు. పిల్లలు చెప్తున్న కబుర్లు వింటూనే కొసరికొసరి తినిపిస్తున్నారు.

అనూష అందరికి దూరంగా సిమెంటు గట్టుమీద కూచుంది.పిల్లలకి తాముతెచ్చిన ఆహారపదార్థాల్ని తినిపిస్తున్న తల్లుల్ని చూస్తే ఆ అమ్మాయికి పక్షులు తాము ఏరుకొచ్చిన ఆహారాన్ని ముక్కుతో తమ పిల్లలకు తినిపించే దృశ్యం గుర్తొచ్చింది. చప్పున ఇల్లూ, అమ్మా గుర్తొచ్చి దిగులు మేఘంలా కమ్మేసింది.

హైద్రాబాద్ అంటే ఎంతో దూరం కదా...ఈ రెండు గంటల కోసం పన్నెండు గంటల ప్రయాణం చేయాలి....నాన్నకు ఎంత కష్టం..పాపం నాన్న...వస్తాననే అన్నాడు. తనే వద్దంది. శ్రమకు శ్రమ...ఖర్చుకు ఖర్చు...

కానీ ఇప్పుడు తల్లిదండ్రుల్ని కలుసుకున్న పిల్లల మొహాల్లోని సంతోషం చూసినప్పుడు కొద్దిగా ఈర్ష్యగా, మరింత బాధగా అంపించింది.ఒక్కసారిగా ఒంటరితనం ప్రళయ ప్రభంజనంలా చుట్టేసినట్లు...అసంకల్పితంగానే కన్నీళ్ళు వచ్చాయి.

"ఏడుస్తున్నావు కదూ...మీ నన్న రాలేదనేగా" ఆమె పక్కన కూచుంటూ అంది కల్పన.

"నేనే రావద్దన్నాను.దూరం కదా" కళ్ళు తుడుచుకుంటూ అంది అనూష.

"మరెందుకు ఏడుస్తున్నావు?"

"ఇల్లు గుర్తొచ్చిందే. అమ్మా నాన్న తమ్ముడూ అందరూ గుర్తొచ్చారు."

"మీ నాన్న హైద్రాబాద్ నుంచి రావాలి. కానీ మాది గుంటూరేగా. అరగంట ప్రయాణం. మహా అయితే గంట...చొశావా అనూ మా నాన్న రాలేదు. ఏడుస్తూ అంది కల్పన.

"నువ్వసలు ఈ రోజు పర్మిషన్ ఉందని చెప్పావా"

"ఎందుకు చెప్పలేదూ....నిన్నా చెప్పాను.మర్చిపోతరేమోనని ఈ రోజు ఉదయం కూడా చెప్పాను. ఐనా రాలేదు"

"ముఖ్యమైన పనులెమనా ఉన్నయేమో....పాపం రావాలనుకున్నా రాలేకపోయారేమో"

"కాదు.నాకు తెలుసు.కావాలనే రాలేదు.నేను చెప్పాగా. మా ఇంట్లో ఎవ్వరికీ నేనంటే ప్రేమ లేదు. అదుగో రోహిణి వాళ్ళ అమ్మ చూడు.ఎంత ప్రేమగా తినిపిస్తుందో. మా అమ్మ ఎప్పుడూ అలా తినిపించలేదు."

అనూష అటు వైపుకు చూసింది."నీకు చేపల వేపుడు ఇష్టమైన చాలా శ్రద్ధగా చేసి తెచ్చాను తెలుసా. చాలంటే ఎలా...ఇంకో రెండు ముక్కలు తిను తల్లీ" అంటోంది రోహిణీ వాళ్ళమ్మ. ముళ్ళు లేకుండా చూసి తినిపిస్తోంది. "ఇక చాలమ్మా.కడుపు నిండిపోయింది" అంటూ రోహిణి గారాలు పోతుంది.

"నీ అభిప్రాయం సరైంది కాదు కల్పనా. ప్రేమ ఉండటం వేరు. దాన్ని వ్యక్తపరిచే విధానం తెలీటం వేరు. కొంత మందే తమ గుండెల్లో నిండి ఉన్న ప్రేమ ఎదుటి వ్యక్తికి తెలిసేలా మాట్లాడగలరు....ప్రవర్తించగలరు. చాలామందికి ప్రేమను వెల్లడించడం రాదు. మీ నాన్న, అమ్మ కూడా అంతే ననిపిస్తుంది. నువ్వంటే వాళ్ళకు బోలెడంత ప్రేమ. నువ్వే సరిగ్గ అర్థం చేసుకోలేకపోతున్నావు.నిశబ్దంలో కొన్ని వేల అర్థాలుంటాయి తెలుసా...మాటల కన్నా మౌనమే బలమైనది"

"నువ్వు కవిత్వం రాస్తావు కాబట్టి కవిత్వంలా మాట్లాడితే నిజమై పోతుందా ఏమిటి?"

సరే.నువ్వు చెప్పిందే నిజమని నమ్ముదాం.నేను కళ్ళు కాచేలా ఎదురు చూస్తున్నను కదా.కనీసం రావటానికి కుదర్లేదని చెప్పొచ్చు కదా"

అనూషకి నవ్వొచ్చింది. "కోపంలో నువ్వు అసలు విషయం మర్చిపోతున్నావు.మనకు ఫోన్ సౌకర్యం ఎక్కడుంది? మనం బైటికి చేయాలంటే గంతలు గంటలు నిలబడి, మన వంతు వచ్చాక అర నిముషం మాట్లాడటానికి అవకాశం కూడా అవకాశం ఉండదే...బైటి నుంచి మనకెవరైనా ఫోన్ చేయాలంటే కనీసం ఆపాటి అవకాశం కూడా లేదు కదా"

ఔను కదా అన్నట్లు చూసింది కల్పన.

కల్పన అనూషతో మాట్లాడుతున్నా చూపంతా ఎవరెవరి తల్లితండ్రులొచ్చారు...ఏమేం తెచ్చారు..ఏం మాట్లాకుంటూన్నారు...లాంటి విషయాలమీదే కేంద్రీకృతమైంది.

"రమణి వాళ్ళ నాన్న చూడు. దాని కోసం సున్నిఉండలు తెచ్చారు. కొత్త డ్రెస్సు కూడా తెచ్చారు. బర్త్‌డే లాంటి సందర్భం ఏమీ లేదు. కానీ నా దురదృష్తం చూశావా...పండగలకూ, పుట్టిన రోజులకు కూడా కొత్త బట్టలుండవు. నీకో విషయం తెలుసా..అందరూ పుట్టిన రోజునాడు చాలా సంతొషంగా ఉంటారు కదా.నేను చాలా విషాదంగా గడుపుకుంటాను. ఇలాంటి తల్లిదండ్రులకు ఎందుకు పుట్టానా అంటూ దుఃఖపడ్తూ గడుపుతాను. నీకు మరో విషయం తెలుసా...ఈ గురువారమే నా పుట్టిన రోజు. ప్లీజ్ ఎవ్వరికి చెప్పకు...మీ నాన్న రాలేదా...బర్త్‌డే డ్రెస్ కొన్లేదా అంటూ మరింత ఏడిపిస్తారు"

"చెప్పనులే. ఐనా ఈసారి మీ నాన్న తప్పకుండా వస్తారు"

"రారు.బెట్" అంటున్నప్పుడు కల్పన కళ్ళల్లో మరోసారి నీళ్ళు వూరాయి.

సమయం ఏడుగంటలయింది. వాచ్‌మన్లు వచ్చి తల్లిదండ్రుల్ని వెళ్ళిపొవల్సిందిగా అడుగుతున్నారు. రెండు గంటల క్రితం మతాబాల్లా వెలిగిన పిల్లల మొహాలు ఇప్పుడు ఆరిపోయిన చిచ్చుబుడ్లా ఉన్నాయి.కన్నీటి వీడ్కోలు...బరువైన గుండెలు....వెనక్కి తిరిగి పదేపదే తమ పిల్లల దీనమైన మొహాలు చూసుకుంటూ కదిలి పోతున్న తల్లిదండ్రులు...ఏడ్చి ఏడ్చి అగ్నిపూలుగా విచ్చుకున్న ఆడపిల్లల అందమైన కళ్ళు....

"చూశావా కల్పనా...కలుసుకోవతంలో ఎంతటి ఆనందం ఉందో విడిపోవటంలో అంతకు మించిన వ్విషాదం ఉంది.మనిద్దరికి ఈ ఆనందం దొరకలేదని బధపడ్డాం.మనకా విషాదం తప్పినందుకు సంతోషపడవచ్చుగా" అంది అనూష.

"నీ కవిత్వం...వేదాంతం ఆపుతల్లీ ...అలా వాళ్ళు విడిపోతూ బాధపడటంలో ఎంతటి బలమైన ఆత్మీయత, ప్రేమా దాగున్నాయో తెలుసా..ఈ ప్రసెమ లేని బతుకు దేనికి? ఆత్మీయతలూ, అనురాగాలు లేని జీవితం ఒక జీవితమేనా" అంది దిగులుగా.

"నిజమే కల్పనా...విడిపోతున్నందుకు విలవిల్లాడిన ఆ హృదయాల నిండా ప్రేమ వుంది. అది తీయటి విషాదం" అంది. బాధతో ఆమె గొంతు వణికింది. కల్పన చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమిరింది.రెండు కన్నెటి బొట్లు కల్పన చేతిమీద పడి "నీకు మేమూ తోడున్నం" అంటూ పల్కరించాయి.

(సశేషం)

భావుకతను సృజనాత్మకతను రంగరించిన కథనశైలితో విశేష ప్రతిభ కలిగిన కథకుడు, నవలాకారుడు శ్రీ సలీం. కథా ప్రక్రియలో తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం,వెండి మేఘం నవలకు తెలుగు యూనివర్శిటీ సాహిత్య పురస్కారం (రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు), వి. ఆర్. నార్ల పురస్కారం లభించాయి. 'రూపాయి చెట్టూ కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక అవార్డు, కాలుతున్న పూలతోట నవలకు బండారు ఈశ్వరమ్మ స్మారక పురస్కారం లభించాయి.