పర"దేశి" కతలు: ఓ పెళ్ళయిపోయింది బాబూ!

-- తాటిపాముల మృత్యుంజయుడు

ప్రతినెల పదవతారీఖు వస్తుందంటే నేను జుట్టు పీక్కోవటం మొదలెడతాను. ఇదేదో వైద్యశాస్త్రానికి సంబంధించిన వ్యాధి అనుకుంటే పొరపాటే. ఆ నెల రాయవలసిన కథకు ప్లాట్ దొరికేంతవరకు జుట్టు పీక్కొనే పర్వం ఓ వారం రోజులపాటు కొనసాగుతుంది. అలా జుట్టు పీక్కుంటున్న నన్ను చూసి సుందర్రావు శ్రేయోభిలాషిలా 'ఏంటి గురూ! పని చాలా ఎక్కువగా ఉందా?' అంటూ ఆరా తీసాడు. 'అదేంలేదు. వచ్చేనెల సంచికలో 'పరదేశీ కతలు ' కు నేను రాయవల్సిన కథకు పాయింట్ వెదకుతున్నాను. పాయింట్ దొరికి, కథ రాసేంతవరకు ప్రసవవేదన పడాల్సిందే' అన్నాను. నా సమాధానాన్ని విని తన క్యూబ్ కు వెళ్ళిన సుందర్రావు పది నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చాడు 'ఏదైనా ప్లాట్ దొరికిందా?' అంటూ. నేను లేదని అనగానే 'నువ్వేం వర్రీగాకు. రెండు వారాల క్రితం జరిగిన రభస... మా బావమరిది ఉన్నట్టుండి పెళ్ళి చేసుకున్నాడు చూడు... కావల్సినంత మసాలా ఉంది. ఎంచక్కా కథ రాసుకోవచ్చు.' అంటూ 'మా బావమరిదితో మాట్లాడు. జరిగిందంతా చెప్తాడు.' ఈస్ట్ కోస్ట్ నెంబరిచ్చాడు.

సుందర్రావు బావమరిది పేరు గణపతి. గణపతి పెళ్ళి హడావుడిగా వారం రోజుల్లో 'కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగదు ' తరహాలో జరిగిపోయినట్టు సుందర్రావు చెప్పడం గుర్తు. వీలుచూసుకొని సాయంత్రమే ఫోను చేసాను. విషయం చెప్పాను. 'అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకు?' అంటూ చమత్కారంగా అన్నాడు. 'అచ్చమ్మ పెళ్ళిలో బుచ్చెమ్మ వాయనంలా నా పెళ్ళి మీద మీ కథేంటి?' గట్టిగా నవ్వాడు. అవును, ఒకని కడుపు నొప్పి ఇంకొకనికి ఎలా అర్థమవుతుంది. అంతా వివరంగా చెప్పాను. 'నీవే తప్ప నితః పరంబెరుగ ' అని గజేంద్రుడు శ్రీహరితో అన్నట్టు 'బాబ్బాబు! అర్థం చేసుకో. ఈనెల నా కథకు నీ పెళ్ళే దిక్కు.' అంటే 'సరే సార్! మీరు అంతగా ఏడుస్తున్నారు కాబట్టి నేనే నాకు తెలిసింది రాసిస్తాను. మీ ఫాక్స్ నెంబరివ్వండి ' అన్నాడు. అలా గణపతి దగ్గరినుండి వచ్చిన మ్యాటర్ ను తిరగేసి రాస్తే వచ్చిన 'గణపతి పెళ్ళి ' ఈ క్రింది విధంగా వచ్చింది.

****

గణపతి అమెరికాలో ఉండే అందరి సాప్ట్ వేర్ ఇంజనీర్లలాగే ఆంధ్రానుండి వచ్చి పనిచేస్తున్నాడు. 'అంటే, అమెరికాలోని ఆంధ్రులందరు సాప్ట్ వేర్ ఇంజనీర్లైతే, అమెరికాలోని సాప్ట్ వేర్ ఇంజనీర్లందరు ఆంధ్రులా?' అనే గణిత సంబంధమైన ప్రశ్న తలెత్తవచ్చు. దానికి జవాబు 'దాదాపు తొంభైశాతం' అనుకోవచ్చు. ఇంతకు ముందు 'విజయవాడ ఏదైనా వీధిలో నిలబడి సుబ్బారావు గారు అని పిలిస్తే కనీసం పదితలలు తిరిగి చూస్తాయని ' సామెత. అదే చందానా అమెరికా హైవే మీద డ్రైవ్ చేసుకుంటూ తలతిప్పి చూస్తే పక్క కార్లో మన బ్రదర్ ఉంటాడు. వాల్ మార్ట్ స్టోర్స్ లో డబ్బులు చెల్లించే లైన్లలో మన ముందు వెనకాలా మన ఆంధ్ర అన్నయ్యలు తమ్ముళ్ళే ఉంటారు.

అమెరికాలో పని చేసే సాప్ట్ వేర్ల జాతికి చెందిన కొన్ని గుణగణాలివి. బ్రహ్మచర్యత్వం, అమెరికాలో ఉన్నా పొద్దున లేచింది మొదలు తాగే కాఫీ టిఫిన్ తో బాటు రాత్రి భోజనం వరకు పదహరణాల తెలుగు భోజనం తినడం, తెలుగు పాటలు వినడం, వచ్చిన తెలుగు సినిమా వదలకుండా వీడియో వేసుకొని చూడడం, నచ్చిన అమ్మాయి ఇండియాలో దొరకగానే ఓ రెండువారాలు సెలవు తీసుకొని పెళ్ళి చేసుకొని పెళ్ళాన్ని అమెరికాకు తీసుకొనివచ్చి చీకూచింతా లేని జీవితాన్ని గడపడం మొదలైనవి. కాని, ఈ మధ్య మన ఆంధ్ర ఇంజనీర్లు పురాణాల్లో గంధర్వుల్లా శాపగ్రస్తులయ్యారు. అదే 'గ్రీన్ కార్డ్' కు సంబంధించింది. ఎన్ని సంవత్సరాలు పనిచేసిన గ్రీన్ కార్డ్ ఎండమావిలా మురిపిస్తుందే కాని చేతికి మాత్రం రావడం లేదు.

ఇక అసలు కథకి వస్తే...

ఆ రోజు గణపతి జీవితంలో ముఖ్యమైన రోజు. అతని కళ్యాణానికి నాంది పలికిన రోజు. ఉదయం లేవగానే అతని ఫోను మోగింది. ఇండియా ఇంటినుండి ఫోను. ఫోను ఎత్తగానే 'నీ పెళ్ళి గురించే, మీ బామ్మ మాట్లాడుతానంటోంది. ఇదిగో మాట్లాడు ' అవతల తండ్రి కంఠం. బామ్మ గొంతు వినిపించగానే 'ఏం బామ్మా! ఆరోగ్యం బావుందా?' అడిగాడు గణపతి. 'ఏం బాగోలేరా! ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది. కాని, ఒరే, గణపతి, నీ పెళ్ళి చూసే వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాన్రా. మొన్న ఇక్కడో అమ్మాయిని చూసాను. పిల్ల ముద్దుగుమ్మలా ఉంది. నువ్వు వెంటనే వచ్చేయ్. ఈ ముహూర్తాలు దాటిపోతే వచ్చేవి మౌఢ్యం, అధికమాసం. మళ్ళీ ఆర్ణెల్ల దాకా ముహూర్తాలు లేవు ' ఆవల బామ్మ మాటల ప్రవాహం.

'బామ్మా! నీ చావుకు నా పెళ్ళికి ముడి పెట్టాడం ఏమీ బాగోలేదు. ఇక్కడ దేశదిమ్మరిలా ఉంది నా జీవితం. ఇదిగో ఇక్కడ ప్రాజెక్ట్ అయిపోయేటట్టుంది. ఓ నెలరోజుల్లో ఇంకో ప్రాజెక్ట్ వెతుక్కొని తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళాలి.' గణపతి నిట్టూర్పు.

'అవున్రా! నీ ఆకుపచ్చకార్డు వచ్చిందట్ర? అది వస్తే నీకీ సమస్యలు ఉండవన్నావు గదా' బామ్మ విచారణ.

'ఆయనే ఉంటే మంగలి ఎందుకన్నట్టు, గ్రీన్ కార్డ్ ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు ' మనవడి జవాబు.

'ఇక్కడ ఎన్ని దేవుళ్ళకి మొక్కుకున్నా నీ పెళ్ళి కావడం లేదు. అక్కడ అమెరికా దేవుళ్ళకి మొక్కుకోరా. ఫలితం అగుపడుతుందేమో' బామ్మ అయిడియా.

'ఇక్కడి దేవుళ్ళు కూడా మన దేశం నుండి మాలాగే వచ్చినవాళ్ళే. అదే వెంకటేశ్వరుడు, రాముడు, కృష్ణుడూనూ. తేడా ఏంటంటే వాళ్ళూ రావటానికి వీసా అక్కర్లేదు ' మనవడి కౌంటర్.

'అది కాదురా నేను మాట్లాడేది. అదే కిరస్తానీవాళ్ళా దేముడు ఎవరు.... అదే ఏసుక్రీస్తు... నేనే మొక్కుకుంటాను... నా మొర తప్పక ఆలకిస్తాడు.' మనవడి పెళ్ళికి బామ్మ కొత్తపథకం.

'సరేలే బామ్మ! నేను పనికి వెళ్ళాలి ' ఫోను పేట్టేసాడు గణపతి. అతనికి కసిగా ఉంది. తన పెళ్ళి ఇప్పుడు కాస్తా ప్రపంచ సమస్య అయింది. జీసస్ కు కూడా ప్రార్థనలు వెళ్ళుతున్నాయి.

ఆఫీసుకు చేరుకోని తన క్యూబ్ దగ్గరకు వెళ్ళగానే అక్కడ కోలాహలగా ఉన్నట్టనిపించింది. తనతో పనిచేసే ఆంధ్రా ఇంజనీర్స్ పోగయ్యారు. ముఖాలు సంతోషంతో వెలిగిపోతున్నాయి. 'ఏమిటీ, ఈ రోజు ఎవరిదైనా బర్త్ డేనా?' అడిగాడు గణపతి.

'అంతకంటె ఎక్కువ. మనకు పునర్జన్మ లాంటిది...' జరుగుతున్న విషయాన్ని చెప్పుకొచ్చాడు ఒక కొలీగ్. ఆరోజు ఐ.ఎన్.ఎస్ దగ్గరినుండి ఒక శుభవార్త వచ్చిందని, ఫోర్ ఎయిటీ ఫైవ్ స్టేటస్ లో ఉన్న వాళ్ళందరు ప్రియారిటీ డేట్ ఉన్నా లేకున్నా గ్రీన్ కార్డ్ కు అప్లయ్ చేసుకోవచ్చని ఐ.ఎన్.ఎస్. డైరక్టర్ 'గాంజాలెజ్' చెప్పాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ దినదిన గండం లా బ్రతుకుతున్న కొన్ని వందల వేల ఉద్యోగులకు, కుటుంబాలకు పెద్ద ఉపశమనం. అయితే అప్లయ్ చేసుకోటానికి మూడు వారాల వ్యవధి మాత్రమే ఉంది.

'అమ్మోయ్! మూడు వారాల టైం ఏమి సరిపోతుంది. ఎన్ని పనులు చేయాలి. బర్త్ సర్టిఫికేట్లు, మ్యారేజీ సర్టిఫికేట్లు... ఎన్నెన్నో!' అంటూ ఒకతని నిరుత్సాహం.

'అరెరే! నా భార్య, కొడుకు రేపు ఇండియా వెళదామనుకుంటున్నాడు. అది పోస్ట్ ఫోన్ చేయాలి ' అంటూ ఇంకొకరి అభిప్రాయం.

'నీవే నయం. మావాళ్ళు ఇండియా ఆల్రెడీ ఇండియా వెళ్ళారు. ఇప్పుడు ఉన్నఫళంగా బయలుదేరి రమ్మనాలి ' మరొకరి ఆవేదన.

'ఇంకా నయం. నేను బ్రహ్మచారినే. నాకలాంటి బాధల్లేవు.' అని గణపతి అనుకొంటుంటే, 'గణపతీ! నువ్వో విషయంలో జాగ్రత్త పడాలి.' అని ఓ కొలీగ్ చెప్పటం మొదలెట్టాడు. గ్రీన్ కార్డ్ అప్లయ్ చేసే సమయంలో భార్యక్కూడా అప్లయ్ చేస్తే ఏ గొడవ ఉండదు. భర్త కార్డు వెంట భార్యకు వచ్చేస్తుంది. అదే గ్రీన్ కార్డ్ అప్లయ్ చేసుకున్న తర్వాత పెళ్ళి చేసుకొని భార్యకు గ్రీన్ కార్డ్ అప్లయ్ చేస్తే ఆవిడకు గ్రీన్ కార్డ్ రావడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. అప్పటివరకు ఇండియానుండి రావటానికి వీలుపడదు. కాబట్టి 'ఇక్కడ అబ్బాయి - అక్కడ అమ్మాయి ' తరహాలో విరహవేదన పడాల్సిందే.

'అందుకే ఈ మధ్య ఇండియాలో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి ఎవరు పిల్లనివ్వట్లేదు. పెళ్ళయిన తర్వాత ఓ మూడు సంవత్సరాలు భర్త దగ్గరకు వెళ్ళదని తెలిస్తే ఏ పిల్ల తండ్రైనా ఎందుకు ఒప్పుకుంటాడు. ' అని ఆరిందలా ఇంకో కొలీగ్ అన్నాడు.

ఈ సంగతి తెలిసేసరికి గణపతి గుండె గుభేల్ మంది. ఇన్నిరోజులు అమెరికాలో సెటిల్ అయిన తర్వాత పెళ్ళిచేసుకోవచ్చనుకున్నాడు. కాని చూస్తుంటే తనకి అస్సలు పెళ్ళి కాదేమో. ఒకపక్క తన జీవిత చిరకాల వాంఛ, గ్రీన్ కార్డ్ రాబోతుందన్న సంతోషం. ఇంకోపక్క, జీవితంలో ముఖ్యమైన ఘట్టం, జీవించటానికి ఓ అర్థం కల్పించే పెళ్ళి కాదేమోనన్న భయం పట్టుకున్నాయి.

ఎలాగైనా మూడువారాల్లో పెళ్ళి చేసుకొని తీరాలి అని నిర్ణయానికి వచ్చేసాడు. సాయంత్రం ఇండియాకి ఫోను చేసాడు. ఫోనెత్తిన తండ్రితో 'నాన్నా, నేనర్జంటుగా బామ్మతో మాట్లాడాలి ' అన్నాడు. తండ్రి కొద్దిగా కంగు తిని తన తల్లికిచ్చాడు. బామ్మ ఫొనులో 'ఎరా గణపతి...' అంటు మాటాడుతుండగానే 'బామ్మా! నువ్వు ఈరోజు ఉదయం చెప్పిన అమ్మాయి, బావుందన్నావే, నాకు సరిజోడి అవుతుందంటావా?' ఆతృతగా అడిగేసాడు. ఈ మాటలకి 'అయితే, నా విన్నపం ఆ ఏసుక్రీస్తు విన్నాడన్న మాట.' ముసిముసిగా నవ్వుతున్న బామ్మతో 'వేళాకోలం కాదు. ఇది సీరియస్ మాటర్. నేచెప్పేది జాగ్రత్తగా విను. నేను మూడు వారాల్లో పెళ్ళి చేసుకోవాలి. లేకుంటే జీవితమంతా బ్రహ్మచారిగా ఉండాల్సి వచ్చే ప్రమాదముంది.' వాపోతూ తన గోడంతా వెళ్ళగక్కాడు గణపతి. అందుకు బామ్మ 'ఆ అమ్మాయి నీకోసమే పుట్టినట్టుంది. ఒకరికొకరు ఈడుజోడు చక్కగా సరిపోతారు. మిగతా విషయాలు నాకొదిలేసెయ్. నీ పెళ్ళవటం పూచీ నాది ' హామీ ఇచ్చింది. 'ఏసుక్రీస్తు గాంజాలెజ్ రూపంలో వచ్చాడే బామ్మా' అంటూ అతన్ని గురుంచి రెండు మాటలు చెప్పాడు గణపతి.

గణపతి మర్నాడే రెండు వారాల సెలవు మీద ఇండియా వెళ్ళాడు. మొదటి వారంలో పెళ్ళిచేసుకున్నాడు. అతని హడావుడి చూసి పెళ్ళికూతురు తండ్రి గణపతి తాళి కట్టడం మరచిపోకుండా జాగ్రత్త పడ్డాడు. రెండో వారంలో పేపర్లన్ని రడి చేసుకొని భార్య డిపెండెంట్ వీసా కొరకు చెన్నయ్ వెళ్ళారు. పనిలో పని అది హానీమూన్ ట్రిప్ కూడా అయ్యింది, ఒన్ షాట్ టూ బర్డ్స్ లాగా. వెనువెంటనే భార్యతో అమెరికా వచ్చాడు. ఒక్క నిమిషం వృథా కాకుండా లాయర్ తో మాట్లాడి అన్ని పేపర్లు ఒకటికి రెండు మార్లు చూసుకొని అతి జాగ్రత్తగా తనకు, భార్యకు గ్రీన్ కార్డ్ కు అప్లయ్ చేసాడు. ఎతావాతా ఈ తతంగం మొత్తానికి ఐదు వేల డాలర్లు పైగా ఖర్చయ్యింది.

కాని మర్నాడే ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు ఒక చేదు వార్త బయటికొచ్చింది. 'గాంజాలెజ్' తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. 'అందరూ గ్రీన్ కార్డ్ కు అప్లయ్ చేసుకోవచ్చన్నది ' తప్పుడు లెక్కట. 'సారీ' అంటూ తన మాటను వెనక్కు తీసుకున్నాడు. అష్టకష్టాలు పడి ఎన్నో డబ్బులు ఖర్చుపెట్టి మూడువారల్లో దీక్షగా పనిచేసి అప్లయ్ చేస్తే ఆ శ్రమను బూడిదలో పోసిన పన్నీరులా వృథా చేసిన గాంజాలెజ్ ను అందరు మూకుమ్మాదిగా శపించారు. అంతకుముందు గాంజలెజ్ ను దేముడన్న గణపతి ఏకమగా 'రాక్షసుడు ' అని తిట్టాడు.

గాంజాలెస్ మీద పెరిగిన కసిని తీర్చుకోడానికి ఆంధ్రా ఇంజనీర్లందరు కొత్త అయిడియా వచ్చారు. 'లగే రహో మున్నాభాయి 'లోని 'గాంధీగిరి 'లా ఒక్కొక్కరు పూలు కొని ఆ పుష్పగుచ్చాల్ని గాంజలెస్ కు పంపించాలని కంకణం కట్టుకున్నారు.

శనివారం మధ్యాహ్నం భార్య వండిన రుచికరమైన భోజనం చేసి సొఫాలో నడుంవాల్చి కునుకు తీస్తుంటే ఫోను మోగింది. అవతల్నుండి ఓ కొలీగ్ 'హలో గణపతి! నువ్వు పూలు కొని గాంజాలెస్ కు పంపించావా? ఐ యాం ఫాలోయింగ్ విత్ ఎవ్రీబడీ.' అంటుటే గణపతికి తిక్క రేగింది. 'నేను పూల మీద మరో యాభై డాలర్లు ఖర్చు పెట్టదల్చుకోలేదు. ఆ డబ్బుతో నేను, నా భార్య ఈ రోజు సాయంత్రం సినిమాకెళ్ళి, దార్లో డిన్నర్ చేసి, ఇంకా ఏమైనా డబ్బులు మిగిలితే నా భార్యకు పూలు కొనిపెడతాను ' అంటు ఫోను పెట్టేసాడు.

సాయంత్రం సినిమాకెళ్ళి ఇంటికి తిరిగి రాగానే ఇండియానుండి ఫోను వచ్చింది. అవతలనుండి బామ్మ కంఠం, 'ఒరేయ్ గణపతి! ఆ గాంజాలెజ్ ఫోటొ ఒకటి పంపించరా. ఫ్రేం కట్టించి దేవుని మందిరంలో పెట్టుకుంటాను '. 'అతను దేముడూ కాదే, రాక్షసుడు ' అంటూ ఫోను పెట్టేసి భార్యను దగ్గరకు తీసుకొన్నాడు గణపతి.

(నోటు: ఈ కథ ప్రచురణకు పంపిస్తున్న తరుణంలో నాకు తెలిసిన వార్త ఏమిటంటే, గాంజాలెజ్ మళ్ళీ నిర్ణయాన్ని మార్చుకొని అందరి గ్రీన్ కార్డ్ అప్లికేషన్లు ప్రాసెస్ చేస్తానని ప్రామిస్ చేసాడట. ఏమైతేనేం, గాంజాలెస్ వల్ల పెళ్ళైన గణపతులెందరో!)