పద్యం-హృద్యం

-- తల్లాప్రగడ

ముందుమాట: ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారినీ ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు ఆగస్ట్ 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము.పద్యంలో యతిప్రాసల నియమాల సులువుగా అవగాహన అవ్వడానికి పాఠకుల సౌకర్యార్థం ఈ లంకెని నొక్కండి.

ఈ మాసం సమస్య

"ఆ.వె. :// వేరువేరుగున్న వేళ్ళన్ని కలిసేను" "

క్రితమాసం సమస్య :
రావణుని బంటు వయితివి రామచంద్ర

మొదటి పూరణ - డా: ఐ.యస్. ప్రసాద్, హైదరాబాద్

తే.గీ.// తోకతో జుట్టి నీ యున్న తోచితాస
నాన బాగుగా గూరుచోన, చిన బుచ్చ
రావణుని, బంటువైతివి రామచంద్ర
మూర్తికాంజనేయా, నీవె స్పూర్తిదాత!

రెండవ పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే,

తే.గీ.// షోకు కోసము సిగరెట్టు పీకలూది
ఆపుకోలేక ఇప్పుడీ యాతనేల
లోకులను చంపు సిగరెట్టనే కలియుగ
రావణుని బంటువయితివి రామచంద్ర!


మూడవ పూరణ - కె.వి.యస్. శ్రీరాం, బెంగళూరు

తే.గీ.// చెప్ప నీకథ మారీచ! చిత్రమగును,
రావణుని బంటువయితివి, రామచంద్ర
బాణధాటికడలి నామపానసుఖము
తెలిసి, భక్తునివైతివి తేకువొప్ప!


నాల్గవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే,

తే.గీ.// రావణాసురుడైన పరవశమొంది
నిన్ను పూజించి నట్లైన అన్ని మరచి
భక్త దాసుడవైతె, నీ భక్తులనర,
రావణుని బంటు వయితివి రామచంద్ర!!


అలనాటి ఆణిముత్యాలు :

శ్రీ కృష్ణదేవరాయుల ప్రసిధ్ధ గ్రంధం, "ఆముక్తమాల్యద" నుండి గ్రహించిన పద్యం: యే కథ వ్రాయవలెనని యోచిస్తున్న రాయలవారికి ఆంధ్ర మహా విష్ణువు ఇచ్చిన ఉపాయం

ఉ. ఎన్నిను గూర్తు నన్న, విను, మే మును దాల్చిన మాల్యమిచ్చు న
ప్పిన్నది రంగమందయిన పెండిలి సెప్పుము, మున్ను గొంటి నే
వన్ననదండ యొక్క మగవాడిడ, నేను దెలుంగు రాయండ,
న్గన్నడ రాయ!, యక్కొదువన గప్పు ప్రియాపరిభుక్త భాక్కథన్

ప్రతిపదార్థం:

ఎన్నిను : ఏ నిన్ను గూర్చి
కూర్తును: రచించేది
అన్నన్ : అంటే
వినుము : వినవలసినది
ఏన్: నేను
మును దాల్చిన : ముందు తాను ధరించిన
మాల్యము + ఇచ్చు : దండ నాకు అర్పించు
ఆ+పిన్నది: ఆ చిన్నది; గోదాదేవి
నప్పిన్నది : నీలాదేవి
రంగమందున్ + అయిన : శ్రీరంగమందు జరిగిన
పెండిలి : వివాహము
చెప్పుము: కథగావ్రాయి
మున్ను: పూర్వం
అన్ననదండన్ : ఆ పూల దండను
ఒక్క మగవాడిడన్: ఒక్క మగవాడిస్తే
ఏవన్: ఏవగించుకుంటూ
కొంటిని: గ్రహించాను
నేను తెలుంగురాయడన్:నేను ఆంధ్రవిష్ణువును
కన్నడరాయ: నీవు కర్ణాట క్షితిపతివి
ప్రియా: ప్రియురాలిచేత
పరిభుక్త: చక్కగా అనుభవింపబడిన (పూలదండను)
భాక్ : పొందిన
కథన్ : కథచేత
అక్కొదువన్ : ఆ వెలితిని
కప్పుము : ఆచ్ఛాదించు, తొలగించు


తా: నిన్ను గురించి పురాణ కథలు అనేకం ఉన్నాయి కనుక ఏ కథ చెప్పుమని నీవు అడిగితే తన కొప్పులో
దాల్చిన దండను ప్రేమతో నాకర్పించిన ఆ చిన్నదాని కథ చెప్పు. పూర్వము నేను ఒక మగవాడిచ్చిన పూలదందను జుగుప్సతో
తీసికోక తప్పలేదు.ప్రియురాలిచ్చిన దండను తీసుకొన్న కథను చెప్పి ఆ కొదువను తొలగించు.
నేను ఆంధ్ర వల్లభుడను, నీవా కర్ణాట చక్రవర్తివి. మనిద్దరి మధ్య ఉన్న ఈ సామ్యం చేత నీవే నా కథ చెప్పగలవాడివి.భక్త హనుమ -- తల్లాప్రగడ

సందర్భం: సీతను తనతో వచ్చేయ్యమని హనుమంతుడు కోరతాడు. క్షేమంగా లంకను దాటిస్తానని చెప్తాడు.

సీ// ప్రణతుడ నువు నా ప్రతలమెక్కుము , ప్రతిపక్షి పక్షుల ప్రతతందు
ప్రతారణము నా ప్రతిహతితొ నిను, ప్రస్యంధమునిటుల ప్రభు చేర్చ,
పవన పుత్రుడొక ప్రభంజనుండయ్యి నీ ప్రమోదములు నిలుపగలడమ్మ
ప్రయాణమునసలు ప్రయాసముండదు, నామాట నమ్మమ్మ నవియకమ్మ

తే.గీ.// రధము లేలను నావంటి పారదముకు
శరములేలను ఇట్టి విశారదునకు
పట్టునెవడు పట్టుకెడతా పట్టపగలె
రామనామము నాదవ్వ రామచంద్ర!

ప్రతిపదార్థం:

ప్రణతుడ = నమస్కారము పెట్టెడి వాడను
నువు నా = నువ్వు నా
ప్రతలమెక్కుము= అరచేయి మీద ఎక్కి కూర్చొనుము
ప్రతిపక్షి = శత్రువు
పక్షుల = పక్షులలాంటి (ఈసడించుకొనే భావంతో)
ప్రతతందు= సమూహం నందు నుంచీ
ప్రతారణము = మాయచేసి
నా ప్రతిహతితొ= నా విఘాతముతో
నిను, = నిన్ను
ప్రస్యంధమునిటుల=అతి వేగముగా ఇటుల
ప్రభు చేర్చ= ప్రభువు, శ్రీరాముని వద్దకు చేర్చటనికి
పవన పుత్రుడొక = ఈ అంజనేయుడు ఒక
ప్రభంజనుండయ్యి = సుడిగాలి లాగా
నీ ప్రమోదములు = నీ సంతోషమును
నిలుపగలడమ్మ= నిలుపగలడమ్మ!
ప్రయాణమునసలు = ప్రయాణమున అసలు
ప్రయాసముండదు= అలసట ఉండదు
నామాట నమ్మమ్మ = నా మాట నమ్ము తల్లీ
నవియకమ్మ= కృశించవద్దు

రధము లేలను = రధములు ఎందుకు
నావంటి పారదముకు= పాదరసములాగా తేలికగా జారిపోగలిగినవాడికి
శరములేలను= బాణములు ఎందుకు
ఇట్టి విశారదునకు= ఇన్ని తెలివితేటలు కలవాడికి!
పట్టునెవడు = (నన్ను) ఎవడు పట్టుకోగలడు
పట్టుకెడతా = (నిన్ను) పట్టుకువెడతాను
పట్టపగలె= పట్టపగలే అందరి ముందరే
రామనామము = రాముడిని నామము (ఆమంత్ర ప్రభావంతో)
నాదవ్వ = నాది అవ్వగా
రామచంద్ర!= రామచంద్రుడా!