|
| |
నటరంజని :-- శంకగిరి నారాయణ స్వామి |
|
|
ఈ ప్రదర్శన మీ ఊరి దగ్గర్లో జరుగుతుంటే తప్పక చూడండి. మీకు భారతీయ సాంప్రదాయ సంగీతం, నాట్యాల మీద ఏ మాత్రం ఆసక్తి లేకపోయినా సరే, వెళ్ళి చూడండి. మీరు ముగ్ధులౌతారని నా హామీ. వారి అమెరికా పర్యటన వివరాలు పైన ఇచ్చిన లంకెలో ఉన్నాయి.
విఘ్నేశ్వరునికీ భూదేవికీ నమస్కృతులిడి సాంప్రదాయకమైన తోడాయమంగళంతో ప్రదర్శన ప్రారంభించారు. నారాయణ తే నమో నమో, శరణు శరణు సురేంద్ర సన్నుత - ఇత్యాది అన్నమయ్య భక్తి పద మాలికలతో విష్ణుదేవుని వివిధ రూపాలలో స్తుతించి మంగళాచరణం చేస్తుంది ఈ అంశం. ఐదుగురు అంధ కళాకారులతో సరికొత్తవిధంగా నాట్యరచన (కొరియాగ్రఫీ) చేశారు ఈ అంశానికి. కాళీయ మర్దన కృష్ణుడు, లక్ష్మణ సహిత రాముడు, శేషశాయి, వేంకటేశ్వరుడు మొదలైన విష్ణు రూపాలను సందర్భోచితంగా ప్రత్యక్షం చేశారు ఈ ఐదుగురు అంధ కళాకారులు (ఐ.అం.క.). అటుపైన తిల్లానా ప్రదర్శించారు. వివిధ లయ గతులతో క్లిష్టమైన జతులతో నృత్తానికి పెద్దపీట వేసి కళాకారుని సౌష్ఠవానికి, ఓర్పుకి పరీక్షపెట్టే అంశం తిల్లానా నృత్యం. మన ఐ.అం.క. దీన్ని కూడా ఎంతో ప్రతిభతో నిర్వహించారు. పంచవక్త్రం - సుమారు యాభై నిమిషాల నృత్య రూపకం. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచ ముఖములుగల పరమశివ తత్త్వాన్ని ఆవిష్కరించినది. సృష్ట్యాది లో శూన్యము నుండి శివలింగము ఆవిర్భవించినది - ఇది ఓంకార రూపం. దీని నుండి శివపంచాక్షరీ మంత్రము జనించినది. మంత్రములోని ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క శివుని సృష్టించినది. ఒక్కొక్క శివుడు ఒక్కొక్క శక్తితో కలసి పంచభూతములలోని ఒక్కొక్క భూతము (element) ను సృష్టించినాడు. ఇవన్నీ ఏకమై అర్ధనారీశ్వర రూపముగా అవతరించి యావద్ సృష్టికీ రూప కల్పన చెయ్యడం - సూక్ష్మంగా ఇదీ కథ. అష్టదిక్కులను దిక్పాలకులను ప్రార్థించే నాందితో రూపకం మొదలైంది. చేతుల్లో ధ్వజము, పూర్ణకుంభము, పువ్వుల పళ్ళెం మొదలైన ఆహ్వాన సూచికలను ధరించి ఐ.అం.క. ఒక బాణం రూపంలో నిలుచుండి ఒకటొకటిగా ఎనిమిది దిక్కులకూ తిరిగి ఆవాహన చేశారు. వేద మంత్రోఛ్ఛారణ నేపథ్యంలో శూన్యంనుండి పంచ ముఖమైన శివలింగం అవతరించడం అద్భుతంగా రూపించారు. ఈ దృశ్యం కరిగిపోగానే రంగానికి వెనుకగా ఉన్న ఒక మెట్టు మీద సద్యోజాత శివుడు ప్రత్యక్షమైనాడు. "సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమో నమః" అనే వేదమంత్రం ఆయన్ను ఆవాహన చేసింది. కర్ణాటక పద్ధతిలో వాద్య సంగీతం మొదలైంది. వయ్యారంగా వచ్చి పరాశక్తి అతనితో చేరగా ఇద్దరూ భరతనాట్య రీతుల్లో నాట్యము సాగించారు. వారి సృజనతో పృథ్వీ భూతం ఉత్పన్నమైంది. శక్తీ శివులు రంగం వెనుకభాగంలో కొలువు తీరగా ఐ.అం.క. ముందుభాగంలో ప్రవేశించి పృథ్వి యొక్క అనేక లక్షణాలను ప్రత్యక్షము చేస్తూ వాద్యసంగీతానికి అనుగుణంగా నర్తించారు.
ఇదంతా ఒక ఎత్తు, అర్ధనారీశ్వరుడిగా ఈ సంస్థ సంచాలకులు శ్రీ మైసూరు నాగరాజు గారి నటన ఒక ఎత్తు. దీనికి నాట్య రచన, నేపథ్య సంగీతము ఉత్తరప్రదేశులో చెలామణి అయ్యే "బహురూపియా" (అంటే బహువేష ధారులు) జానపద కళా పద్ధతిలో ఉంది. నడక అడుగులో, చేతి విదిలింపులో, కనుబొమల కదిలింపులో నవరసాలొలికించ గల ప్రజ్ఞ నాగరాజు గారిది. కుడివైపు పౌరుష భరితమైన తాండవ రాజసం, ఎడమ వైపు మృదు పద లాస్య లాలిత్యం సమపాళ్ళలో ఆవిష్కరించారు. సృష్టి తాండవానికి నేపథ్యంగా మాహేశ్వరాణి సూత్రాణి పఠించడం సృజనాత్మకతకి పరాకాష్ఠ. డెట్రాయిట్ నగరంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన ప్రముఖ నాట్యాచార్యులు, నాట్యధర్మి అధినేత ఆత్మకూరి సంధ్య గారికి, వారి బృందానికి మా అభినందనలు, కృతజ్ఞతలు. కొన్ని బొమ్మలు విడియో ముక్కలు వారి గూటిలో చూడవచ్చు. ఈ ప్రదర్శన మీ వూరి దగ్గర్లో జరుగుతుంటే తప్పక చూడండి. వారి ప్రదర్శనల వివరాలు కూడా వారి గూటిలోనే ఉన్నాయి. |
|