మనలో దాగిన మహామంత్రం?

--ప్రఖ్య మధు బాబు

'కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే...' అంటూ ఓ సుప్రభాతం ఆకాశవాణిలోంచి ఊరి జనాల్ని, నిద్రాణమైన చైతన్యాన్ని తట్టి లేపేది. గ్రామం చిన్నది. జీవన సంగ్రామం పెద్దది. పరిక్షల్లో పూజలు, కోర్కెల కొబ్బరి ముక్కలు, తిరుపతి కొండ మొక్కులు, రోజులు గంటలుగా గా గడిచిపోయే రోజులనుండి నేటి దాకా మనసులో మోగుతున్న ఆ గుడిగంటలు,అన్ని భయాలని దూరంచేసే ఆంజనేయ దండకం, మరేలోకాలకో తీసుకెళ్ళే శివాలయంలో మహన్యాసం,జరం తగ్గించ్చే మహత్తున్న తాయెత్తు, మామ్మ దిష్టి మంత్రం, కోయదోర, కొండదేవత, పాము మంత్రం, ముత్యాలమ్మ జాతర, పూనకాలు, మండే నిప్పు కణికెలు, వాటిపై నడిచే శక్తినిచ్చే నిప్పులాంటి నమ్మకాలు. అన్నిటిలో గోచరమయ్యే ఓ మంత్రం - మనలో దాగిన మనః సంకల్ప తంత్రం.

మంత్రం మన తరతరాలుగా వేదాలుగా,వ్రతాలుగా, పెళ్ళి మంత్రాలుగా, శుభాశుభాలలోనూ, యజ్ఞయాగాలలోనూ, వస్తూనే వుంది. మంత్రం జీవన సంగీతానికి ఓ శ్రుతిగా, అంతర్లీన సంస్కృతిగా నిరంతరం జన్మిస్తోంది. ఒక్కోసారి అనిపిస్తుంది మానవాతీత శక్తులంటూ ఏమీ లేవేమో అని, మానవుడు మానవుడుగా నిర్మలంగా జీవించగలిగితే అన్నీ మానవ సహజ శక్తులుగా వస్తాయని.

మంత్రసాధనని, యోగశక్తులని అన్వేషించేవారికి నిగూఢమైన కల్పతరువు 'పతంజలి యోగసూత్రాలు '. ఇందులో ఒక్క శ్లోకాన్ని తీసుకుని ఒక ఆధ్యామిక పద్ధతిగా ప్రతిపాదించి ప్రపంచవ్యాప్తమైన ప్రఖ్యాతిని, శిష్యగణాలని తయారుచేసుకున్నవారు ఎందరో. నాడు, నేడు మారని ఓ అపురూపగ్రంధం ఇది. శ్రీరామచంద్రులకు పాఠ్య పుస్తకంగా, ఆధునిక జీవనంలో పాశ్చాత్యులకు సైతం అష్టాంగ మార్గ దర్శకంగా పతంజలి యోగ సూత్రాలు వున్నాయి. ఒక సాధారణ మానవుడు సాధకుడుగా, సిద్ధుడుగా, జీవన్ముక్తుడుగా, పరాముక్తుడుగా ఎలా పరిణామం చెందుతాడో చెప్పబడింది.

మనిషిని మనీషిగా మార్చే ఆ సిద్ధ శక్తులలో మౌలికమైనవి ఏవి? ఏ శక్తిని మనం సాధించటం చేత మరిన్ని మహత్తర విభూతులను దర్శించగలం అని ప్రశ్నిస్తే పతంజలి మహర్షి జవాబు అద్భుతం! ఇవిగో ఆ మూడు శక్తులు - మైత్రి (Friendship), కరుణ (Compassion), ఆనందం (Bliss).ఇవా సిద్ధులంటే అనిపిస్తుంది ఒక క్షణం. కాని లోతుగా ఆలోచిస్తే దర్శనమవుతుందా సత్యం. స్నేహం ఒక భావం మాత్రమే కాదు. సర్వాంతర్యామిగా వున్న ఆ పరబ్రహ్మతత్వంతో పరిచయాన్ని, నిరంతర సాంగత్యాన్ని సంపాదించుకుని, అనుక్షణం ఉపాసన ద్వారా అనుభూతి చెందుతూ, ఏ ప్రహ్లాదుడో, కుచేలుడో లేక చైతన్య మహా ప్రభువుగానో అయిపోయి అర్జునుడిలా ఆ దైవాన్ని తన స్నేహితుడిగా దగ్గరగా పొందగలిగే సిద్ధిని చిన్నగా 'స్నేహం' అన్నారు పతంజలి.

ఏళ్ళ క్రితం San Francisco లో పెద్ద భూకంపం వస్తే ఒకే ఒక్క తోట (Garden) మాత్రం చెక్కు చెదరలేదు. అదే California లోనే వున్న Santa Rosa. అక్కడ Luther Burbank అనే ఓ మహానుభావుడు నిరంతరం మొక్కలతోనే జీవిస్తూ, వాటితో మైత్రిని పెంపొందించుకుంటూ వుండేవారు. దాని ఫలితంగా Genetic విచిత్రాలుకూడా జరిగాయి. శ్రీ పరమహంస యోగానంద ప్రత్యేకంగా Luther Burbankను చూసేందుకు వచ్చారు. ప్రేమతోను ప్రకృతితో మైత్రితోను మొక్కలలో ఎలాంటి మార్పులుతేవచ్చో చూసి ఆయన చాలా ఆనందించారు. అందులో ఇప్పటికి వున్నదొక పెద్ద నాగజెముడు (Cactus) చెట్టూ. ఆశ్చర్యమేమిటంటే దీనికి ముళ్ళు లేవు.Luther Burbank అన్నారు, "నేను రోజూ ఈ మొక్కతో మాట్లాడే వాడిని. నీకు ముళ్ళు అక్కర్లేదు నేను నిన్ను చూసుకుంటున్నాను అని". అలా కొనాళ్ళకి ముళ్ళులేని Cactus తయారయింది.

మైత్రిని ఓ సాధనగా, కరుణ భరితంగా, స్వచ్చంగా ఆనందంగా వుండగలిగితే ప్రకృతికూడా స్పందిస్తుంది ఆ అర్హుడైన సాధకునికి పరాశక్తి అనుగ్రహం లభిస్తుంది శాస్త్రాలూ చెపుతున్నాయి. ఆధునిక యుగంలో యండమూరి 'థ్రిల్లర్ ' అన్న నవలలో కధానాయకుడు ప్రేమే ప్రేరణగా తపస్సు చేసినట్లు ప్రకృతి లయంగా సిద్ధులను సాధించినట్లు బాగా వర్ణించారు.

మంత్రశక్తి ప్రధానంగా ఈమధ్యకాలంలో మంచి కీర్తిగాంచిన చిత్రం Harry Potter. దీని విజయం వల్ల మనకి అనిపిస్తుంది - హనుమకొండ అయినా హాలీవుడ్ అయినా మన అలోచనలో, అంతరంగంలో ఒక అన్వేషణ వుంది అని. ఆ అన్వేషణకి తగ్గ ప్రేరణని, ప్రతిభని ప్రకృతి మనకి ప్రసాదించినదేమో అని. ఈ విలువలని, అంతర్జాతీయ ఖ్యాతిగాంచే సాంకేతిక,వైద్య శాస్త్రాది రంగాలలో జిజ్ఞాసని మన దేశమే మనకు ఇచ్చిందనిపిస్తుంది. Robert Svabodha ఓ గ్రంధంలో అన్నారు - "భారతదేశంలో ఆవుల్లో కూడా మాతృత్వం కనిపిస్తుంది. వాటిల్లో కూడా ఎంత ప్రేమ వుందంటే దూడ మరణిస్తే యజమాని గడ్డితో దూడ ప్రతిరూపాన్ని తయరుచేసి ఎదురుగా వుంచాలి లేకుంటే ఆ ఆవు పాలివ్వదు.ఇలాంటి విశేషం ఇక్కడ మా అవుల్లో లేదు (అమెరికాలో)" అని.

ఎంత నిజం! భరతమాత మనకిచ్చిన అపురూప సంస్కృతి ఒక వరం. ఋషుల తపోబలమైన జ్ఞానం ప్రవాహమై మనలో ఈరోజు దేశంతరాలలో కూడా ప్రభవిస్తోంది. ఆ సత్యనిరతి మహాత్మునికి ఒక మంత్రమై, భరతావని స్వతంత్రమైంది.ఆ విశ్వసంధాన శక్తి పరమహంసగానో, లేక పరావాక్కు గానో రూపుదిద్దుకుంటే ఒక వివేకానందుడైంది, విజయభేరి మోగించింది. తపస్సు అంటే కళ్ళుమూసుకుని (లేక కళ్ళుమూసుకుపోయి) ఓ మూలసౌధంలో వున్నాయన కోసంచేసేది కాదు, ఎక్కడైనా,ఇప్పుడే, ఇక్కడే ఆ సర్వాత్మని గుర్తించేది. ఆ అదృశ్య మహా జ్వాలని ఓ అమ్మ థెరీసా మానవసేవ అంది. ఓ శంకరులు మాధవసేవ అన్నారు, పరమశివుణ్ణి చండాలునిలో దర్శించి అద్వైతాన్నీ ప్రతిష్టించారు.

అయితే నాలో దాగిన ఈ నిగూఢశక్తిని నేనెలా వెలికితీయను? శివరాత్రిజాగరణే సినిమాలు చూస్తూ చేసే నేను కుండలిని శక్తినెలా జాగరణ చెయ్యగలను? ఇవన్ని ప్రయత్నిస్తే కొంపమునిగిపొతుందా? నాకేమన్నా అయిపోతుందా? అన్న ప్రశ్నలని వచ్చే సంచికలలో శాస్త్రమిచ్చే సమాధానాలని ఉదాహరణలతో వివరంగా చూద్దాం.

శ్రీ గురుభ్యో నమః