మనసున్న మనిషికీ

-- డా.మాదిరాజు రామలింగేశ్వర రావు

దేవుడి గదిలోంచి గంట గణగణా మ్రోగుతోంది.

"ఇంకా ఎంత సేపు నీ పూజ! షుగర్ పేషంట్ నని తెలుసు కదా! ఆ కార్యక్రమమేదో కొద్దిగా ముందుగా ముగించకూడదూ!" పతంజలి ముందు గదిలోంచి అరిచాడు.

వయసులో వున్నప్పుడు ఎక్కడ తిరిగేవాడో, ఏం చేసేవాడో, ఏ వేళకు ఇంటికి వచ్చేవాడో పతంజలికే తెలిసేది కాదు.

పగటిపూటయితే రెండు దాటితే కాని ఇంటికి వచ్చేవాడు కాదు. అప్పటిదాకా పతంజలి భార్య గాయత్రి ఎదురుచూసి చూసి సొమ్మసిల్లిపోయేది. అయితే ఒక్కనాడూ భర్తతో తన కష్టం చెప్పుకునేది కాదు.

పతంజలి భార్య కళ్ళలోకి చూసి ఉంటే నీడలు కనపడి ఉండేవి. కాని అంత తీరిక ఎక్కడిది?

ఆటోమొబైల్ షాపు ఏ క్షణాన పెట్టాడో కాని పతంజలి క్షణం విశ్రాంతి లేదు.లారీ ఓనర్లకు, కార్ల ఓనర్లుకు వేలకొద్దీ అప్పులివ్వడం, ఆ అప్పుల్ని వసూలు చేసుకోవడానికి పగలు రాత్రీ వాళ్ళచుట్టూ తిరగటం - వసూలు చేయటం చేతకాక అప్పుతెచ్చిన కంపెనీలకు కట్టడం - ఆ వడ్డీ అమ్మకం మీద వచ్చిన లాభానికి సరిగ్గా సమానంగా సరిపోవటం - ఇదీ పతంజలి వ్యాపారసరళి!

పతంజలి చాలాసార్లు ఆ వ్యాపారం ఎత్తేసి ఇంకేదయినా మొదలుపెడితే బాగుండునని అనుకున్నాడు. అయితే తెలిసిన లైనులోనే ఇంత కష్టనష్టాలు వస్తూంటే తెలియని వ్యాపారంలోకి దిగటం లోతు తెలియని నీటిలోకి ఈతకు దిగటంలాంటిది!

అందుకని అలాగే మొండిగా నెట్టుకొచ్చాడు.

పతంజలికి ఒక కొడుకు, ఒక కూతురూ!

కొడుకుని బి.టెక్. చదివించడానికి చాలా కష్టపడ్డాడు అనటం కంటే రక్తాశ్రువులను చిందించాడు అంటే బాగుంటుంది.

పతంజలి కొడుకు భరద్వాజ తెలివిగలవాడే. అయితే ఎంసెట్లో మంచి ర్యాంకు తెచ్చుకోలేకపోయినందువల్ల ప్రైవేటు ఇంజనీరింగు కాలేజీలో పెద్ద మొత్తం ఫీజు కట్టి చేరాల్సి వచ్చింది.

"ఎంసెట్ కు మంచి కోచింగ్ ఇప్పించి వుంటే తనకు మంచి ర్యాంకు వచ్చి ఉండేదని" భరద్వాజ వాళ్ళతో వీళ్ళతో అంటున్నప్పుడు పతంజలి వాళ్ళవైపు చూసి ఒక జీవం లేని నవ్వు నవ్వుతాడు.

కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివించడమే తనకు శక్తికి మించిన పని అయింది.ఇంక ఆ పైన నలభైవేలో, యాభైవేలో కట్టి హాస్టల్లో పెట్టి ఇంటెన్సివ్ కోచింగ్ చదివించమంటే తనకు సంబంధించి నంతవరకు "పెట్టుడు రెక్కలతో ఎగరటమే"

అయినా...ఎక్కడ చదివితే ఏమిటి? చదివే చదువు అదే కదా! చదవాలనే పట్టుదల ఉండాలి కానీ...ఇప్పుడు మాత్రం చిటికెలో మంచి ర్యాంకుతో పాస్ కాకూడదా అనుకున్నాడు పతంజలి.

భరద్వాజ "మోటార్ బైక్" కొనమన్నప్పుడు పతంజలి మొదటిసారిగా రుద్రుడే అయినాడు.

కాలేజి బస్సులో వెళ్ళటమంటే భరద్వాజకి నామోషీ! వాడి స్నేహితుల్లో చాలామంది "బైక్" కొనుక్కున్నారు.

పతంజలి ఓ రోజు కొడుక్కి "లెసన్" తీసుకున్నాడు.

ఆ పేటలో చాలామందివి డాబా ఇళ్ళు. ఇంకా మాట్లాడితే రెండు మూడు అంతస్తుల ఇళ్ళు. వీళ్ళ ఇల్లు ఒక్కటే పెంకుటిల్లు.

అందరిళ్ళలోను పాచిపని చేయటానికి పని మనుషులు వున్నారు.బట్టలుతకటానికి మనుషులు ఉన్నారు. కొందరిళ్ళల్లో అయితే వంట చేసేందుకు కూడా మనుషులున్నారు. దాదాపు అందరిళ్ళల్లోను స్విచ్ వేయగానే మోటారు పని చేయటం మొదలుపెడుతుంది. మంచినీళ్ళు వంటిళ్ళలోకి వస్తాయి, టాంకును కూడా నింపుతాయి.

పతంజలి ఇంట్లో మున్సిపల్ టాప్ కూడా లేదు. గాయత్రి వెళ్ళి రోడ్డుకు కొంచెం ఆవతలగా ఉన్న పబ్లిక్ టాప్ లో రెండు బిందెలు నీళ్ళు తెచ్చుకుంటుంది. పప్పు సరిగా ఉడుకుతుందో లేదో అనుమానమే!

పతంజలికి కనీసం మోపెడ్ కూడా లేదు. నలుగురితో కాంటాక్టుకు అనుగుణంగా ఉంటుందని అనుకున్నానెలవారీ బిల్లు ఎక్కువ అవుతుందని మోపెడ్ కొనలేదు. ఎన్నిచోట్ల తిరిగినా సైకిలు మీద సవారీనే! వయసులో వున్నప్పుడు బాగానే వుంది., కానీ యాభయ్యిలో పడ్డాక మనస్సు ఉరకలేస్తున్నా, శరీరం మొరాయిస్తుంది.

కొడుకు చదువుకోసం రెండు లక్షల పైన ఖర్చు అయింది. గాయత్రి మెడలో బంగారం మొదట తాకట్టులోకి వెళ్ళి ఆ తర్వాత అమ్మకానికి బలైపోయింది.

కొడుకు చదువునుండి నేర్చుకున్న పాఠాలను పతాంజలి కూతురు విషయంలో అమలు చేశాడు. నిజానికి కూతురు శ్రావణి, భరద్వాజ కన్నా చురుకైనిది. చక్కని రూపం...శ్రావ్యమైన కంఠం...తల్లి నుండి పుణికిపుచ్చుకున్న సౌజన్యం...సహనం...అద్భుతమైన అవగాహన...అంతకు మించిన జ్ఞాపకశక్తి..

కడివెడు గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ ...అన్నట్టు ఇన్ని సుగుణాలున్నా పతంజలి "ఓవర్ కాషియస్" ముందు వృధా అయిపోయినయ్.

శ్రావణికి డాక్టరు కావాలని కల. తండ్రితో ఒకసారి తన మనసులోని మాట చెప్పింది. కానీ ఆ మాట వింటూనే కస్సుమన్నాడు."ఇప్పటికే వాడి చదువుకి నగా, నట్రా అమ్మి కట్టుబట్టల్తో మిగిలాం! ఇక నీ డాక్టరీ చదువుకయితే రోడ్డు మీద కెక్కి ముష్టి యెత్తుకోవాలి! అలాంటి ఆశలేమీ పెట్టుకోకు! బి.యస్సి వరకు చదివించగలను.అంతకుమించి నా వల్ల కాదు. యం.పి.సి. తీసుకుంటావో, బై.పి.సి. తీసుకుంటావో నీ ఇష్టం!" అన్నాడు పతాంజలి

శ్రావణి తండ్రికి ఏమీ సమాధానం చెప్పలేదు.

కాలేజీలో చేరటానికి అప్లికేషన్ తెచ్చినప్పుడు పతాంజలి దానివైపు ఆసక్తితో చూశాడు. యం.పి.సి. గ్రూప్ లోకి చేరేందుకు ఉపయోగించే అప్లికేషన్ అది.

పతంజలి కూతురు కళ్ళలోకి చూడలేక పోయాడు.

అప్లికేషన్లో వెతుక్కుని ఎక్కడ సంతకం పెట్టాలో చూసుకొని సంతకం పెట్టేసి మౌనంగా శ్రావణి చేతిలో పెట్టేసి అక్కడ నుంచి ఏదో పని వున్నట్టు వెళ్ళిపోయాడు.

శ్రావణికి ఇంటర్లో ఆ గ్రూప్ లో రాష్ట్రంలోనే రెండో స్థానం వచ్చింది. ఆ తర్వాత అదే వూళ్ళో బి.కాం. చేరింది.

భరద్వాజ బి.టెక్. అయ్యాక హైదరాబాద్ వెళ్ళి చిన్నాచితకా ఉద్యోగాలు చేశాడు. ఏవేవో అడ్వాన్సుడు కంప్యూటర్ కోర్సులు కూడా చేసేడని పతంజలి విన్నాడు.

బహుశా ఒక సంవత్సరం పాటు అలా గాలి పటంలా గిరికీలు కొడుతూ చివరకు ....హఠాత్తుగా ...ఒక ప్రముఖమైన సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరేడు.

అంతే...ఇక వెనుదిరిగి చూడలేదు.రెండుసార్లు ఆ కంపెనీ తరపున అమెరికా వెళ్ళివచ్చాడు. యాభైవేల రూపాయల దాకా నెలకు జీతం వస్తోందని పతంజలి వాళ్ళనోట వీళ్ళనోటా విన్నాడు. మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు కదా ఇక పెళ్ళి చేస్తే బాగుంటుందని పతంజలి, గాయత్రి అనుకున్నారు.

ఊళ్ళో సిద్ధాంతిగారికి చెపితే ఆయన కూడా రెండు మూడు మంచి సంబంధాలు పంపాడు. జాతకాలు బాగున్నయి.పిల్లల కనుముక్కు తీరూ..అందం..చందం..అన్ని రకాలుగా బాగున్నాయి.

ఓసారి సెలవు పెట్టి వచ్చి పిల్లల్ని చూసుకోవాల్సిందిగా పతంజలి కొడుక్కి ఫోన్ చేశాడు.

సమాధానం విన్న పతంజలి అవాక్కయ్యాడు.

"మీకా శ్రమ అవసరంలేదు. మా కంపెనీలో పనిచేసే అమ్మాయిని నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. అమ్మాయి పుట్టిందీ పెరిగిందీ చెన్నై లోనే. వాళ్ళమ్మ, నాన్నా చెన్నైలో పేరుమోసిన డాక్టర్లు! మా పెళ్ళయి కూడా మూణ్ణెల్ల పైనే అయింది. నేనే మీకు ఫోన్ చేద్దమనుకుంటునాను., ఇంతలోనే మీరు చేశారు". పతంజలికి షాక్ నుంచి తేరుకోవటానికి చాలా సేపు పట్టింది. నెమ్మదిగా శక్తిని కూడగట్టుకొని "మన భాష కాదన్నావు..సరే..మన కులమేనా?" అడిగాడు.

"ఆ! ఇంకా ఈ కాలంలో కులాలేమిటి?....మతాలేమిటీ..నాన్సెన్స్! అన్నాడు భరద్వాజ.

"అంటే? "

"అవును..అంతకన్నా వివరాలు మీకు అనవసరం!"

పతంజలికి చాలా కోపం వచ్చింది.కులం కాని అమ్మాయిని చేసుకున్నందుకు కాదు..పెళ్ళిచేసుకుని మూడు నెలల దాకా విషయం దాచినందుకు...తన ఊళ్ళో తాను ఎంత పలుచనయిపోతాడు!

"కనీ, పెంచి, పెద్దచేసిన తల్లితండ్రులకు ఒక్క మాట అయినా చెప్పకుండా...." సగంలో ఆగాడు పతంజలి.

"చెపితే ఏం చేస్తారు? వద్దంటారు..అంతేగా..అందుకే చెప్పలేదు" భరద్వాజ గొంతు చాలా కరుకుగా వుంది.

"నీకో చెల్లెలు పెళ్ళికి వుందని తెలుసు కదా! నిజానికి దాని పెళ్ళి చేశాక నీకు చెయ్యాలి. కానీ ఉద్యోగంలో స్థిరపడ్డావు...చేతులు కాల్చుకుంటున్నావు. అందుకని మేము కూడ నీకు వివాహం చెయ్యాలననుకున్నాం. కానీ మాకు ఆ అదృష్టం... నువ్వు దక్కనీయలేదు." పతంజలి బాధగా అన్నాడు.

"శ్రావణి పెళ్ళికీ, నా పెళ్ళికీ సంబంధం ఏమిటీ? ఇప్పుదు దాని పెళ్ళికి నేనేమయినా అడ్డువచ్చానా?" అడిగాడు భరద్వాజ

పతంజలికి ఏం మాట్లాడాలో తెలీలేదు.

కాసేపు మాటల కోసం పెనుగులాడి చేతకాక మౌనంగా ఉండిపోయాడు.

"ఉండనా మరి"

పతంజలి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు.

"ఆగాగు! కోడల్ని ఇక్కడికి తీసుకురా! మాకూ అచ్చట్లూ ముచ్చట్లూ ఉంటాయి కదా!" అన్నాడు.

"అలాంటివేమీ పెట్టుకోకండి! తను బాగా పెద్దింటి పిల్ల. మన పెంకుటింటి వాతావరణంలో ఇమడలేదు." ఆ మాట అంటూనే ఫోన్ పెట్టేశాడు.

పతంజలికి లాగి చెంప మీద కొట్టినట్టనిపించింది.భరద్వాజ మాట్లాడిన మాటలకు వేటికీ ఆయన మనసు గాయపడలేదు. కాని పెంకుటింటిని గురించి మాట్లాడిన మాటలు ...

పతంజలికి ఆ పెంకుటింటితో ఉన్న సంబంధం ఆత్మకు, పరమాత్మకూ ఉన్నంత సంబంధం.

పసిగుడ్డుగా పతంజలి ఆ ఇంట్లోనే కళ్ళు తెరిచాడు.అక్కడే గుడ్డ ఉయ్యాలలో ఊగాడు.తల్లి వేలు పట్టుకొని నడవటం నేర్చాడు. దొడ్లో బాదం చెట్టుకింద చాప పరచుకొని తండ్రి పాఠాలు చెప్తూంటే బుద్ధిగా విన్నాడు.

అక్కడే గాయత్రి చిటికెన వ్రేలు పట్టుకొని కొత్త కాపురానికి శ్రీకారం చుట్టాడు.

అమ్మ గతించినా, నాన్న గతించినా, చెల్లెలు అత్తింటి కాపురానికి వెళ్ళినా, పతంజలికి ఆ ఇంటిపై పెరిగిందే తప్ప తరగలేదు.

వర్షాకాలం వస్తే చూరు కారుతున్నా అదో ముచ్చుటగా చూసేవాడే తప్ప ఒక్క క్షణం కూడా వెలితిగా ఫీలయ్యేవాడు కాదు.

ఉప్పురిసి పోయిన గోడలను రిపేరు చేయించే స్తోమత లేక, కప్పు పదేపదే నేయించే ధైర్యం చాలక అలాగే సరిపెట్టుకున్నాడు.

తండ్రి తనకిచ్చిన ఒకే ఒక ఆస్థి ఆ పెంకుటిల్లు. చుట్టూ ఉన్న వాళ్ళంతా పాత ఇళ్ళను పడగిట్టి డాబాలు వేసుకున్నారు. పచ్చని చేనులో దిష్టిబొమ్మలా ఈ పెంకుటిల్లు ఒక్కటే మిగిలిందని ఇరుగూ పొరుగూ ఎగతాళిగా అనుకుంటున్నా విని చలించలేదు.

ఆ ఇంటి గోడల్లో తన మధురమైన బాల్యం ఉంది. ఆ ఇంటిలోంచి వీచే గాలిలో ఒకనాటి యౌవనపు పరిమళాలున్నాయి.అంతదాక ఎందుకు! ఈనాటికీ ఆ ఇంటి అణువణువునా తన తల్లితండ్రుల ఊపిర్లు వెచ్చగా తగులుతూ తనను పలకరిస్తూనే ఉంటాయి.

ఆ షాక్‌లోనే ఇంటికి వచ్చాడు పతంజలి.

గాయత్రికి ఆ విషయాన్ని ఎలా చెప్పాలో తెలీయలేదు పతంజలికి. చెపితే తట్టుకుంటుందో లేదో తెలియెదు.

అయితే గాయత్రి ఆ విషయాన్ని చాలా తేలికగా తీసుకుంది.

"అంతేనా! ఇంకా చాలా ఆశ్చర్యం కలిగించేవి, బాధ కలిగించేవి మీ జీవితంలో జరుగుతాయి. అప్పుడేమవుతారు మీరు? " అడిగింది గాయత్రి.

శ్రావణి కూడా "అలానా!" అని ఊరుకుంది.

పతంజలికి చాలా ఆశ్చర్యం అనిపించింది.

శ్రావణి పెళ్ళి గురించి ఇక ఆలోచించడం మంచిదనుకున్నాడు పతంజలి.

అయితే ఆడపిల్ల పెళ్ళి అంటే మాటలా? కట్నాలూ, కానుకలూ ఎక్కడి నుండి తెస్తాడు?

ఇన్నాళ్ళూ భరద్వాజ చేతికి వస్తాడు, పిల్ల పెళ్ళికి బెంగపడనవసరం లేదు అనుకున్నాడు. కానీఎ...భరద్వాజ విసురు చూస్తుంటే ....ఇదే మాట గాయత్రితో అంటే, "అడిగి చూడండి! అడగలేదనే సొడ్డు మనమీదెందుకు" అంది.

భరద్వాజతో ఫోన్లో మాట్లాడే ధైర్యంలేక శ్రావణి పెళ్ళికి చేతనయినంత సహాయం చేయమని ఉత్తరం వ్రాశాడు.సమాధానం వెంటనే వచ్చింది. కార్డు మీద ఒక లైనులో - "ఆ పాత కొంపను అమ్మవచ్చిన డబ్బుల్తో శ్రావణి పెళ్ళి చేయండి"

పతంజలికి ఈసారి చాలా కోపం వచ్చింది.తమామయించుకోలేక మళ్ళీఉత్తరం రాశాడు. "అష్టకష్టాలు పడి నిన్ను చదివించి ఇంజినీరుని చేశాను. తండ్రి ఋణం ఇలాగేనా తీర్చుకునేది? - అని

మళ్ళీ తిరుగుటపాలో ఉత్తరం వచ్చింది. ఈసారి కొంచెం పెద్ద ఉత్తరం. "కన్నందుకు కూడు పెట్టావు. చదివించావు. అది నీ బాధ్యత - దీనికి డబ్బుల్తో లెక్కకడుతున్నావా? అయినా నేను చదువుకోలేకపోతే నువ్వు చదివించలేవు కదా! నేను ఇంజినీరుని కావడానికి నువ్వు కారణమనే భ్రాంతిలో ఉండొద్దు. ఎవడి అదృష్టాన్ని బట్టి వాడు ఏదయినా పొందుతాడు తప్ప ఎవరి త్యాగాలూ అక్కరకు రావు. ఆ అవసరమూ లేదు.నువ్వు రెండు దశాబ్దాల పాటు ఆ వ్యాపారం చేశావు. ఏం సాధించావు? ఏమి మిగిల్చావు? మా సంగతి వదిలెయ్. కనీసం నువ్వయినా సుఖపడగల్గావా? ఎందువల్ల? దురదృష్టవంతుల్ని బాగు చేయగలవారూ లేరు, అదృష్టవంతుల్ని చెరపగలిగేవారూ లేరు.ఈ విషయాన్ని ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది"

పతంజలి ఉత్తరం చదివి నిశ్చేష్టుడై పోయాడు. తన చేతుల్తో ఎత్తి పెంచిన బిడ్డ తనకి పాఠాలు చెప్తున్నాడు.

వాడి చేతుల్లో బెత్తం ఉంది. తను చేతులు కట్టుకుని వాడి ముందు నిలబడి ఉన్నాడు.ఈ పాఠం తనకు వచ్చే వరకు వాడు దండించి తీరతాడు.

ఈ ఉత్తరాన్ని గాయిత్రికి చూపలేదు పతంజలి.

శ్రావణి డిగ్రీ పాసయింది, ఎనభై శాతం మార్కులతో...

శ్రావణికి ఆ పైన సి.ఎ. చేయాలని ఉంది.కానీ ఆ అమ్మయికి తెలుసు అది ఏనాటికీ నిజం కాని ఒక రంగుల స్వప్నం అని!

పతంజలి సంబంధాలు చూడటం మొదలు పెట్టాక అసలు ఆ ఆలోచనే మానుకుంది శ్రావణి.

అయితే సంబంధం కుదిరితే పెళ్ళి చేయటం ఎలా అన్న ప్రశ్నకు సమాధానం లేదు పతంజలి దగ్గర.

అసలు ఆ ఆలోచన వస్తేనే ఆయనకు నిద్ర పట్టదు. ఆకలి వేయదు. ఎవరితోనూ మాట్లాడబుద్ధెయ్యదు.

ఒకటి రెండు సంబంధాలు వచ్చాయి శ్రావణికి. కానీ లక్షకు పైగా కట్నం అడుగుతున్నారు.

ఈ సమస్యకు పరిష్కారం...ఇక ఇల్లు అమ్మటమేనా....అనుకుంటేనే గుండెల్లోనించి వేదన తన్నుకొస్తోంది పతంజలికి.

ఒకరోజు మద్యాహ్నం భార్యతో ఈ విషయమే మాట్లాడుతున్నాడు.ఇంతలో బయట కారు హార్న్ మ్రోగింది.

మంచి ఖరీదైన దుస్తుల్లోవున్న ఇద్దరు పెద్ద మనుషులు కారులోంచి దిగి లోపలికి వచ్చారు. వాళ్ళు వస్తూనే ఇంటి పొడవును, వెడల్పును అంచనా వేసుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నారు.

పతంజలి మర్యాద కోసం బయటకు వచ్చాడు.

అందులో ఒకాయన పతంజలి వైపు చూసి, "మీరు ఈఇంట్లో అద్దెకు ఉంటున్నారా?" అన్నాడు. పతంజలి ఆశ్చర్యంగా ఆయన వైపు చూసి, "అలా అడుగుతారేమిటి? ఇది మా స్వంత ఇల్లే" అన్నాడు

అప్పుడు రెండో ఆయన అర్థమయినట్లు తలవూపి, "ఓహో! భరద్వాజగారి నాన్నగారా మీరు?" అన్నాడు. పతంజలి తల వూపాడు.

మళ్ళీ మొదటాయన, "మీ అబ్బాయి ఈ ఇంటిని మాకు అమ్ముతున్నారు.ఆయన చెప్పిన వివరాలు సరిచూసుకునేందుకు వచ్చాం!" అన్నాడు. పతంజలికి నోట మాట రాలేదు.

గాయత్రికి ఆ మాటలు వినబడ్డాయి కాబోలు, బయటికి వచ్చింది.

"ఏమన్నారూ?" అన్నది వాళ్ళవైపు చూస్తూ.

"మీ అబ్బాయి ఈ ఇల్లు మాకు అమ్ముతున్నారు. యాభైవేలు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు." అన్నాడు రెండో ఆయన.

గాయత్రి భర్త భుజంమీద చెయ్యివేసి లోపలికి తీసుకువెళ్ళింది.

వాళ్ళు కాసేపు అటూ ఇటూ తిరిగి ఇంట్లోంచి దొడ్డి గుమ్మంలోకి వెళ్ళి అక్కడ కొలతలు వేసుకొని బయటకు వచ్చారు.

అందులో రెండో మనిషి పతంజలి వైపు చూస్తూ "ఇక్కడ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ రాబోతుంది.మీ ఇంటికి ఏ దశ పట్టనుందో మీరే చూస్తారు." అన్నాడు.

పతంజలి మర్యాదకోసం నవ్వాడు.

"వీళ్ళు వెళ్ళి భరద్వాజకి ఫోన్ చేస్తారు.అప్పుడు వాడు ఇక్కడికి ఫోన్ చేస్తాడు" అన్నాడు భార్యతో పతంజలి వాళ్ళు వెళ్ళాక.

గాయత్రి మాట్లాడలేదు.

ఆ రోజు రాత్రి చెన్నై నుండి ఫోన్ వచ్చింది."నాకు తెలుసు మీకు నా మీద కోపంగా వుందని. ఆ స్థలానికి ఇరవై లక్షలు వస్తాయి.ఇల్లెందుకూ పనికి రాదు కదా. అందుకని స్థలం విలువ చెప్పాను. పిత్రార్జితమైన ఆస్థి అది.నాకు మీతో పాటు సమాన హక్కు ఉంది.అందువల్ల పది లక్షలు నా వాటాకి వస్తాయి.మిగిలిన పది లక్షలు మీవి.శ్రావణి పెళ్ళిచేశాక కూడా కనీసం ఏడెనిమిది లక్షలు మిగులుతాయి మీకు.మీరు హాయిగా బ్రతకటానికి ఒక కొడుకుగా ఇదంతా చేశాను.మీరు మెచ్చినా మెచ్చకపోయినా, నచ్చినా నచ్చకపోయినా ఇలాగే జరగాలి..జరుగుతుంది."

పతంజలికి ఆ ఫోన్ విన్నాక కొద్దిసేపటికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. గాయత్రి, శ్రావణి వెంటనే ఆటోలో హాస్పిటల్‌కి తీసుకువెళ్ళారు.

"చాలా మైల్డ్ స్ట్రోక్! రికవర్ కావటానికి నెలో, రెండునెలలో పట్టవచ్చు. నథింగ్ టు వర్రీ" అన్నాడు డాక్టరు.

"నేను సంతకం పెట్టకుండా వాడు ఇల్లు ఎలా అమ్ముతాడో చూస్తాను" అన్నాడు పతంజలి మాటల్ని కూడ తీసుకుంటూ. గాయత్రి భర్త వైపు జాలిగా చూసింది.

"మీరి సంతకం ఖచ్చితంగా పెడతారని భరద్వాజకి తెలుసు.పేగుబంధం తల్లికుంటే రక్త సంబంధం తండ్రికుంటుంది.నలుగురిలో వాడిని అవమానపరిచే శక్తి మీకు లేదని వాడికి తెలుసు."

పతంజలి మౌనంగా గాయత్రి వైపు చూశాడు.

"మీరు వినవలసిన మరొక షాకింగ్ న్యూస్ ఉంది. మీ ఆరోగ్య పరిస్థితిని చూశాక ఆ విషయాన్ని మీకు చెప్పకూడదనుకున్నాను, కానీ ...పరిస్థితి చెయ్యి దాటిపోతే ఎవ్వరం ఏమీ చెయాలేం కదా!"

తన పెళ్ళి విషయంలో మనం పడుతున్న మానసిక సంఘర్షణను చూసి, తట్టుకోలేక ...శ్రావణి ఓ నిర్ణయం రీసుకుంది.ఒక డైవర్సీని పెళ్ళి చేసుకోబోతుంది. అతడికి ఒక ఐదేళ్ళ పాప కూడా ఉంది."

పతంజలి అయోమయంగా భార్య వైపు చూశాడు.

"ఇంటి మీద మీకున్న ప్రేమనూ, మమకారాన్ని నేను అర్థం చేసుకోగలను. మీ రక్తం పంచుకు పుట్టిన మీ బిడ్డే మీ సెంటిమెంటును గౌరవించనప్పుడు ప్రాణంలేని ఆ ఇటుకల మీద మీకెందుకండీ అంత మమకారం? మీకు ఆ ఇంటికీ తేడా ఏమిటి? మీరిద్దరూ గతమే తప్ప, వర్తమానం కాదు. ఆ ఇంటికి ఈనాడు విలువ లేదు. అది నిలబడి ఉన్న చోటుకు మాత్రమే ఇరవై లక్షల విలువ ఉంది.అలాగే మీకు మీకు వర్తమానంలో పైసల్లో కొలిస్తే విలువ శూన్యం.కానీ మీ ఉనికిని...అంటే వ్యక్తిగత విలువలను వదిలేస్తే మీకు విలువ వస్తుంది...ఇల్లు అమ్మటానికి మీరూ ఒప్పుకుంటే పది లక్షలు మీ చేతికి వస్తాయి.కనీసం శ్రావణికయినా మీ చేతుల మీదుగా..మంచి సంబంధం చూసి పెళ్ళిచేద్దాం! శ్రావణి త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నా దాన్ని భరించే మనోధైర్యం, శక్తీ నాకు లేవండీ" ఒక్కసారి బావురుమంది గాయత్రి.

పతంజలి ఆ మాటలకు కదిలిపోయాడు.గాయత్రి వైపు నిస్సహాయంగా చూశాడు.

మొదటిసారిగా పతంజలి వర్తమానంతో రాజీ పడ్డాడు.

"మనసున్న మనిషికీ" కథకు విశ్లేషణ

డా.మాదిరాజు రామలింగేశ్వర రావు గారి కథ "మనసున్న మనిషికీ" చదివితే తరాల అంతరాలవల్ల వ్యక్తుల్లో కలిగే మానసిక సంఘర్షణ అవగతమవుతుంది. ముందు తరం వారి భావాలు, స్పందనలు ఈతరం వారికి అంతుపట్టవు. అలాగే ఈతరం వారి మనస్తత్వాలు ముందుతరం వారికి మింగుడుపడవు.పరిగెత్తే కాలం చేసే గమ్మత్తే ఇది. తమ చట్రంలో తాము బిగుసుకుపోయి అందులోంచి బయటకు రావటానికి ఇష్టపడని పెద్దలకి మనశ్శాంతి కరువవుతోంది ఈ రోజుల్లో.వారి మనసులు కష్ట పెట్టకూడదన్న ఆలోచన పిన్నల్లో కలగట్లేదు.దీనికి పరిష్కారం ఏమిటి?తప్పనిసరిగా కొన్ని విషయాల్లో పెద్దల అభిప్రాయాన్ని పిన్నలు గౌరవించాలి. మరికొన్ని విషయాల్లో పిన్నల ఉద్దేశ్యాలతో పెద్దలు ఏకీభవించాలి.అప్పుడే ఇద్దరి మధ్యా కలతలు లేకుండా సంఘీభావం ఏర్పడుతుంది. కానీ ఇక్కడ ఈ కథలో "పతంజలి పరిస్థితి ఆ విధంగా లేదు. తాను పెళ్ళి పెళ్ళి చేసేసుకున్నాక ఆ విషయం మెల్లిగా తెలియజేసినందుకు కొడుకు పట్ల బాధతో కూడిన కోపం కలిగినా సర్దుకున్నాడు.కోడల్ని ఇంటికి తీసుకురమ్మని మనసారా పిలిస్తే ఆ పాత పెంకుటింటికి తీసుకురానని కొడుకిచ్చిన జవాబుకి తల్లడిల్లిపోయాడు. చెల్లెలు పెళ్ళికి డబ్బు సద్దుబాటు చెయ్యమంటే పాత పెంకుటిల్లు అమ్మేసి ఆ డబ్బు ఉపయోగించుకోమని కొడుకిచ్చిన సలహాకి తప్పనిసరి పరిస్థితుల్లో గుండె రాయి చేసుకొని వర్తమానంతో రాజీపడక తప్పదని తెలుసుకున్నాడు. రాజీపడటమన్నది ఒక శిక్షగా భావించనప్పుడే మనిషికి మనశ్శాంతి దొరుకుతుంది.

- తమిరిశ జానకి