కొత్త కెరటం : అమెరికాలో నేను చూసిన మంచి

-- చెఱువు అమల

సుజనరంజని ఆశయాల్లో యువతలో పఠన, రచన ఆసక్తులను పెంపొందించడం; తెలుగు భాషను వారి భావధారలోకి తీసుకువెళ్ళటము ముఖ్యమైనవి. సిలికానాంధ్ర చేపట్టే అనేక భాష - సంస్కృతి సంబంధించిన కార్యక్రమాలతో పిల్లలు, యువకులు విశేషంగా ఆకర్షింపబడటం ఎంతో ఉత్సాహం కలిగిస్తోంది. ఆ ప్రేరణతో యువకులలో తెలుగులో వ్రాసే నేర్పు పెంపొందించే ఉద్దేశ్యంతో ఈ శీర్షిక ద్వారా అవకాశాన్ని కల్పిస్తున్నాము. మనకు తెలిసిన వివిధ అంశాలను సరికొత్త కోణంలో చూపించగల నేర్పు యువత సొంతం. అందుకు పట్టం కట్టే ప్రయత్నమిది. పిల్లలను యువయను, వారి భావాలను ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

ప్రతియేడాదీ వేసవి సెలవుల్లో మా అమ్మానాన్నలతో కలిసి వివిధ ప్రదేశాలు చూడటానికి వెళుతూ ఉంటాం. అలా దక్షిణ భారతదేశంలో చాలా ప్రదేశాలు చూడటం జరిగింది. అలా అన్ని చోట్లకూ వెళ్ళడం ద్వారా రకరకాల మనుషులను చూడటం జరుగుతుంది. వివిధ ప్రదేశాల్లో ఎలా ఉండాలో తెలుస్తుంది. ఈ సంవత్సరం నేను ఇంటరు చదువు అయ్యాక ఎంసెట్ వ్రాసి వేసవి సెలవులు ఏంచేయాలా అని ఆలోచిస్తూంటే మా అన్న-వదినలు ఒకసారి అమెరికా రమ్మని పిలిచారు. అప్పటిదాకా అమెరికా గురించి మా అన్నలెంతోమంది చాలా చెపుతూండేవాళ్ళు. అమెరికా అంటే ఎలా ఉంటుందో చూడాలన్న చిన్న ఆశ ఉండేది.

చెన్నయ్ కాన్సులేట్‌లో ఇంటర్వ్యూ చేస్తూ చాలా ప్రశ్నలడిగి, ఇక నేను అమెరికా వెళుతున్నానని చెప్పగానే ఎంతో సంతోషించాను. మొదటి సారి ఫ్లైట్ ఎక్కగానే చాలా ఉత్సాహంగా, కొంచెం భయంగా అనిపించింది. అమెరికా ఎలా ఉంటుందో అని, అక్కడా రోడ్డుమీద మనుషులు కనిపిస్తారో లేదో అని అనిపించింది. అమెరికాలో ఎయిర్‌పోర్ట్ లో దిగగానే మనుషులు చాలామందే కనపడాగానే కొంచెం ఇండియాలానే ఉన్నట్టనిపించింది.

మొట్టమొదటిగా అన్న ఇంటికి వెళుతున్నపుడు దారిలో రోడ్ల మీద కార్లు తప్ప యేచెత్తా కనిపించలేదు. దారిలో సముద్రం మీద కట్టిన బ్రిడ్జ్ చూశాక ఇది కూడా సాధ్యమేనా అనిపించింది. ఇలాంటిది ఇండియాలో కూడా కడితే ఎంత బావుంటుందో కదా అనిపించింది. అందరూ ట్రాఫిక్ నియమాలు సరిగా పాటించడం చూశాక చాలా ఆశ్చర్యము, ఆనందం వేశాయి. అమెరికాలో ఇళ్ళూ చాల మంచిగా అనిపించాయి.

అమెరికాలో అమ్మాయిలు, అబ్బాయిలు అన్నిరకాల పనులు చేయటం చూశాను. ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లో అయినా, బస్సులు నడపడంలో అయినా ఆడ మగ తేడా లేకుండా అందరూ అన్ని పనులూ కలిసి చేస్తూ మంచిగా ఉండటం చూశాక మన దేశంలోనూ ఇలా ఉంటే బాగుండు కదా అనిపించింది.

ఇండియాలో ఫ్రెండ్స్ కబుర్లల్లో అమెరికాలో ఎవరూ పక్కవాళ్ళను పలకరించరు అని, మన పక్కింటి వాళ్ళు మనతో మాట్లాడరనీ విన్నాను. అమెరికాలో పక్కింటివాళ్ళు నిజంగానే మన విషయాల్లో జోక్యం చేసుకోరు కానీ, కనపడగానే ఎంతో మంచి ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా నవ్వుతూ పలకరిస్తారు, ఏమాత్రం పరిచయం లేకపోయినా. మన విషయాల్లో అనవసరంగా తలదూర్చకుండా మనతో చక్కగా నవ్వుతూ ఉండటం కన్నా కావల్సింది ఏముంది? ఐతే, మనం కూడా అలానే ఉండాలి. అమెరికా వచ్చాక నాకు బాగ నచ్చి, నేర్చుకున్న ఒక మంచి విషయం ఇది. పరిచయం లేనివాళ్ళతో కూడా మంచిగా నవ్వుతూ మాట్లాడటం మనం ఇండియాలో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన విషయం.

******************

ఒక రోజు రాత్రి మా వదిన ఇంట్లో చెత్త అంతా కవర్లలో మూటకట్టి మూడు రకాల డబ్బాల్లో పెట్టటం చూశాను. మొదట చెత్త మూట కడుతోందేమిటా అనుకున్నాను. ఆపైన చెత్త కూడా మూడు రకాలుంటుందా అని తెగ ఆశ్చర్యపడిపోయాను. ఇదేం వింత దేశమో అనుకున్నా. అప్పుడు వదిన చెప్పింది, వాటిలో ఒకటి Recycling అని, ఇంకొకటి తోటకు సంబంధించిన ఆకులు అలములు వేసేది, ఇక మరోటి, ఇంట్లో నుంచి వచ్చే మామూలు చెత్త అని. Recycle చెత్త, తోటలో చెత్తని అందరూ విడిగా దీసి వేస్తారట అమెరికాలో! అలా చేయడం వల్ల plastic వాడకం తగ్గించి, మన పర్యావరణాన్ని కాపాడతారట. ఆమాట విన్నక మళ్ళీ ఆశ్చర్యమూ ఆనందమూ వేశాయి. ఎందుకంటే ప్రతీ ఇంట్లో చెత్తకి కూడా ఇంత సమయాన్ని కేటాయిస్తారా అని, దానివల్ల పర్యావరణన్ని అందరూ కలిసి కాపాడుకుంటున్నారు కదా అని.

అందుకే గ్రోసరీ దుకాణాల్లో మన సామాన్లను plastic బదులు recycled paper సంచుల్లో కావాలా అని కూడా అడుగుతారు. ఇది మాత్రం ఇండియాలో అందరూ వెంటనే అమలుచేయాల్సిన విషయంగా నేను భావిస్తాను. ఇలా చేయడం వల్ల ఇండియాలో కూడా చాలా అడవులు రక్షింపబడతాయేమో.

******************

ఇక రోడ్డు మీద వెళుతున్నపుడు చాల చెట్లు కనిపించడం నాకు బాగా నచ్చిన విషయం. అవి ఏదో పెంచడమే కాక చక్కగా రకరకాల పూలమొక్కలతో పాటుగా పెంచి చక్కగా కత్తిరించి అందంగా ఉంచడం నాకు ఇంకా ఇంకా నచ్చేసింది. ప్రతి ఇంటిలోనూ ఒక చిన్న దొడ్డి అందులో చెట్లు ఉండటం నాకు బాగా నచ్చింది. హైదరాబాద్‌లో వస్తున్న అపార్ట్‌మెంట్లతో అసలు పచ్చదనం లేకుండా పోతోంది. దానివల్ల మనకే ఎంత కష్టం, నష్టమో ఎవరూ గుర్తించడంలేదు.

నాకు అనిపిస్తుంది, ఇండియాలో ఒక రూల్ తీసుకురవాలి అని. అదేమంటే ప్రతి ఇంట్లో తోట పెంచుకోవాలి అని. దానికోసం ప్రతి వాళ్ళూ కష్టపడి అందంగా తీర్చిదిద్దాలి.

******************

ఒక రోజు నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళినపుడు అక్కడ ఒక అబ్బాయి శుభ్రం చేస్తూ కనిపించాడు. మా కుటుంబం అందరమూ కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్నాము. ఇంతలో శుభ్రం చేసినతను పని అయిపోయి మామూలు బట్టల్లోకి వచ్చేశాడు. ఇంతలో అతని ఫ్రెండ్ రావటం, ఇద్దరూ కలిసి మా పక్క టేబిల్ మీదే కూర్చుని తినటం చూశా. అందరిలాగే అతని దగ్గరా ఆర్డరు తీసుకుని సర్వు చేశాడు వెయిటరు. నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఓనరు కసురుకోలేదు, బయటకు పంపలేదు. వెయిటరు కూడా చాలా మర్యాద ఇవ్వడం చూసి నాకు చాలా మంచిగా అనిపించింది.

ఇండియాలో అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో మరి!

******************

నా చిన్న అనుభవంలో నాకు తెలిసినదేమిటంటే ఇండియాకు, అమెరికాకు తేడాలు చిన్న చిన్న వాటిలోనే అని. శుభ్రంగా ఉండటం, చక్కగా పలకరించడం, ఒకళ్ళకొకళ్ళు గౌరవం ఇవ్వడం, అన్నీ కష్టపడి అందంగా అమర్చుకోవడం ఈ నాలుగూ చేస్తే ఇండియా అమెరికాలానే ఉండచ్చు.

అందుకని ఇక నేను గట్టిగా అనుకున్నాను. ఇంట్లో చెత్తని మూడూ భాగాలుగా సర్దాలి అని, ఎవరెంత నవ్వుకున్నా! మీరు కూడా చెత్తని మూడు భాగాలు చేయడం మర్చిపోకండే!

భారతదేశంలో పుట్టి పెరుగుతూ అమెరికా ఖండానికి విహారయాత్రకై వచ్చింది అమల. అమ్మతో కలిసి కాలిఫోర్నియాలో తన అన్నా వదినలతో కలిసి సరదాగా గడపడానికి వేసవి శెలవులకై వచ్చింది. తన అనుభవాలను, అభిప్రాయాలను కొత్త దృక్కోణంలో మనకు అందించిన ఈ చిన్నారి ఇంటరు చదువు పూర్తి చేసి ఇంజనీరింగ్ చేయబోతోంది. తన ఆశలు, ఆశయాలు సంపూర్ణంగా సాకారమవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాం.