కవిత్వంలో వ్యకిత్వ వికాసం - 5

నీతిచంద్రిక - వ్యక్తిత్వవికాసం

-- ద్వా. నా. శాస్త్రి

"నీతిలేని వాని నిందింత్రు లోకులు" అనే ఉద్దేశంతోనే చిన్నయసూరి నీతిచంద్రికను రచించాడు. నీతిచంద్రికలో మిత్రలాభం, మిత్రభేదం అనే రెండు భాగాలున్నాయి. నీతిచంద్రికను చిన్నయసూరి 1853లో రాసి, అప్పటి మద్రాసు విశ్వవిద్యాలాయానికి కార్యదర్శిగా ఉన్న ఏ.జె. అర్బత్ నాట్ దొరకి అంకితమిచ్చాడు.

"ఒనరగా పంచతంత్ర హితోపదేశ

ములను బరికించి వానిలో వలయు నంశ

ములను గొని కొంత యఖనవంబుగను గూర్చి"

నీతిచంద్రిక రాశాడు.

నీతిచంద్రికలో ప్రసన్న కథలున్నాయి. ఆ కథలలో అర్థయుక్తి ఉంది. నానారుచిరార్థ సూక్తులున్నాయి. నీతిచంద్రికలో కావలిసినంత సూక్తి వైచిత్రి ఉంది. ఇవాళ "Personality Development" అనీ "Nuero Linguistic Programmin" అనీ క్లాసులు నడుస్తున్నాయి. శిక్షణాలయాలు నిర్వహించబడుతున్నాయి. నిజానికి మన సాహిత్యం ద్వారా వ్యక్తిత్వ వికాస పద్ధతులు మన కవులు, రచయితలు ఎప్పుడో వెల్లడించారు. చిన్నయసూరి నీతిచంద్రికలోని కథల ద్వారా మానవ జీవిత విధానాన్ని బోధించాడు. ప్రతివ్యక్తి ఏవిధంగా వికాసం చెందగలడో నీతిచంద్రిక గుణపాఠం చెప్తుంది. జంతువుల పేర్లతో అన్యాపదేశంగా మానవుల ప్రవర్తననే ఈ కథలు తెలుపుతాయి. నీతిచంద్రిక కథల్ని, అందులోని సూక్తుల్ని, నీతుల్ని పరిశీలిస్తే వ్యక్తిత్వ వికాసానికి నీతిచంద్రిక ఒక పాఠ్యగ్రంథం అనిపిస్తుంది.

గంగాతీరంలో పాటలీపుత్రం పట్టణాన్ని సుదర్శనుడు అనే రాజు పాలిస్తున్నాడు. చదువులేక క్రీడాపరాయణులై తిరుగుతున్న తన కొడుకులకి చదువు చెప్పాలని విష్ణుశర్మని నియోగించాడు.

"ఎట్టి రత్నమైనను సానపెట్టక ప్రకాశింపనట్టు

బాలుడెట్టి వాడయిన గురుజన శిక్షలేక ప్రకాశింపడు"-ఇది ఎంత సత్యం? ఎంత ప్రతిభ ఉన్నా అభ్యాసం లేకపోతే, సాధన లేకపోతే ఆ ప్రతిభ కప్పబడే ఉంటుంది. రత్నానికైనా సాన పట్టాలనడం వాస్తవమే గదా! అభ్యాసం, సాధన మనిషికి తప్పనిసరి. విద్య పుస్తకాల ద్వారా నేర్చుకుంటే కేవలం పుస్తక జ్ఞానమే వస్తుంది. గురుజన శిక్షవల్ల దానితో పాటు లోకజ్ఞానం అలవడుతుంది. ఈ లోకజ్ఞానమే వ్యక్తిత్వానికి వన్నె చేకూరుస్తుంది.

"ధనసాధన సంపత్తిలేని వారయ్యు బుద్ధిమంతులు పరస్పర మైత్రి" వల్ల స్వకార్యములు సాధించుకొంటారని చెప్పే కథ - కాకకూర్మమృగమూషికముల కథ! మిత్రలాభంలో "ముసలిపులి - బాటసారి" కథ చిన్నప్పటినుండి చదువుతున్నాం. ఈ కథ "ఆశ అనర్థహేతువు" అని చెప్తుంది. ఆశ ఉండాలి కాని అది అత్యాశ, దురాశ కాకూడదు. అయితే అనర్థమే మరి. అయితే చిన్నయసూరి ఈ కథకి "ఎవ్వరికైనా విధి తప్పించుకో వశము గాదు" అనే నీతి చెప్పారు. హేతువాదులు, భౌతికవాదులు "విధి"ని నమ్మరు. అయితే చాలామంది "టైం"ను నమ్ముతారు. "ఇది మనరోజు కాదు" అంటారు. ఈ భావాలు చాలామందిలో ఉన్నాయి. ఈ భావంకంటే 'అత్యాశ కూడదు ' అనే భావమే ఈ కథనుంచి తెలుసుకోవాలి! చిత్రగ్రీవునికథ "మిత్రలాభము కంటే మించిన లాభను లోకమందేదియు గానము" అనే నీతి చెప్తుంది. ఎవరైనా గుండె విప్పి చెప్పుకునేది మిత్రుడికే! మనకి బంధువులకన్నా మిత్రులే - సన్మిత్రులే మార్గదర్శకులు!!

మనం ఏ పని చేయటానికి తలపెట్టినా పూర్వాపరాలు ఆలోచించాలి. 'కీడెంచి మేలెంచాలి ' అన్న సామెత ఉండనే ఉంది. అన్ని కోనాలనుంచి ఔచిత్యానౌచిత్యాలను ఆలోచించినప్పుడు ఆ పని సఫలమవుతుంది. 'మృగకాకజంబుకముల కథ ' చెప్పే నీతి "సర్వవిధముల విచారింపక ఏ పని చేయరాదు" అనేది ఇవాళ్టి యువతకి గొప్పసూక్తి కదా! ఇదే కథలో మరొక నీతికూడా ఉంది - "పరులకు హాని చేయువారు తామే చెడిపోవుదురు"! ఎందుకంటే ఇతరులకి హాని చెయ్యాలన్న తలంపు తప్ప మరొక తలలంపు ఉండదు కదా - స్వీయ అభివృద్ధి కంటే పరుల కీడు పైనే శక్తిసామర్థ్యాలు ఖర్చు చేస్తారు కాబట్టి! "జరద్గవం (ముసలి గ్రద్ద) - మార్జాలం కథ" చెప్పే గుణపాఠం - "కొఱగాని వారితో మైత్రి విపత్తునకు కారణము". మంచి స్నేహితుడే హితుడు! దొంగ స్నేహితులతో, కుహనా స్నేహితులతో, స్వార్థపర స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలన్నదే ఈ సూక్తి ప్రబోధిస్తుంది.

వృద్ధకపోతం చిత్రగ్రీవుడితో "దుఃఖభాగులు" ఏవరో చెప్పిన వారిని మనం ఎప్పటీకి మర్చిపోకూడదు. మనం మన జీవితానీ దుఃఖమయం చేసుకొంటున్నాం. బంధువుల మధ్య కలహాలు, కుటుంబకలహాలు, సామాజిక కలహాలు, మనస్సులో అశాంతి, నిరాశలకి కారణాలు చెప్తూ చిన్నయసూరి చెప్పినది అందరికీ శిరోధార్యమే -ఈర్యాళువు

జుగుప్సావంతుడు

నిస్సంతోషి

క్రోధనుడు

నిత్యశంకిటుడు

పరభాగ్యోపజీవిమనలో అధిక సంఖ్యాకులు వీరే. మనం దుఃఖాన్ని ఆహ్వానించుకొంటున్నాం. మన వివేకం ఏమైంది అనేది ప్రశ్న??

"తన్ను మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము కదా" అనే సూక్తి ప్రసిద్ధమైనదే. ఇది మిత్రలాభంలో హిరణ్యకుడు చిత్రగ్రీవునితో అన్న మాట! ప్రతిమనిషి తన గురించి ఆలోచించుకోవటం అవసరం. తనూ, తన కుటుంబం బాగుంటేనే ఇతరులకి లేదా సమాజానికి ఏ కాస్తా మేలైనా చేయగలడు. కాబట్టి ముందుగా తన బాగు ముఖ్యమనుకోవాలి. ఇది 'స్వార్థం' కాదు - జీవితానికి అవసరం!

"మ్రాను లేని దేశమ్మునందాముదపుచెట్టు మహావృక్షము గదా" - అనే సూక్తి సార్వకాలికం, సార్వజనీనం కూడా! కొన్ని తరాలపాటు ఈ చిన్నయసూరి సూక్తి సామెతగా వ్యాప్తిచెందింది. ఆముదపుచెట్టును గొప్పచెట్టుగా ఎవరు భావించరు. ఏ చెట్టు లేనపుడూ అదే గొప్పదవుతుంది. అలాగే విద్వాంసులు, గొప్పవారు లేనిచోట మిడి మిడి విజ్ఞానం కలవారే గొప్పగా రాణిస్తారు. ఎంతటి సత్యం ఇది! "జరద్గవ - మార్జాల కథ" మనకి 'కొత్తగా వచ్చిన వానిని నమ్మరాదు ' అనే నీతిని బోధిస్తుంది. ఇవాళ చాలా నగరాలలో కొత్తగా పరిచయమైనవారే చాలామందిని ముంచుతున్నారు - అన్యాయాలకు పాల్పడుతున్నారు. పాతవాళ్ళనే పూర్తిగా నమ్మలేని పరిస్థితుల్లో - కొత్తవారిని నమ్మి వాళ్ళకి అనుగుణంగా ప్రవర్తించి, ఉచ్చులో పడి - చేతులు కాలాక ఆకులు పట్టుకునే స్థితికి రావటం మనం చూస్తూనే ఉన్నాం!!

చాలామందికి ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకొనే అలవాటు ఉంటుంది. అది తగదని చెప్పే కథ మిత్రభేదంలో 'గాడిద కథ '! కుక్క చెయ్యాల్సిన పని గాడిద చేస్తుంది. ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళే చెయ్యాలి. అత్యుత్సాహం, అతిభక్తి... అతి ఎప్పుడూ పనికిరాదు. అందుకే ఓండ్రపెట్టి మోదబడిన గాడిద కథ "పరాధికారము పైన వేసికొనుట హానికరము" అనే హితవు చెప్తుంది.

మిత్రభేదం పింగళకసంజీవకములనే సింహవృషభాల కథతో ప్రారంభమవుతుంది. ఇందులో కథాసూత్రం నడిపించేవారు కరటకదమనకులు అనే జంబుకాలు. అసలు 'నక్కబుద్ధి ' అనే జాతీయం ఉండనే ఉంది. 'కరటకదమనకులు ' అనేది కూడా మోసానికి పర్యాయపదం అయింది. మిత్రభేదంలో గల "కోతి - ఱంపపు దూలం కథ" వల్ల మనం తెల్సుకోవల్సింది - "జోలిమాలిన పనికి పోరాదు" అని. మనం నిత్యజీవితంలో అనవసర విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉంటాం. ఒక్కోక్కసారి దానివల్ల చిక్కుల్లోపడటం, హత్యకు గురికావటం కూడా చూస్తున్నాం.

"కుందేలు - సింహం" కథ చిన్నప్పటినుంచి తెలిసిందే. ఈ కథ బుద్ధిబలం ఉంటే ఎంతటి బలవంతుడినైనా, శత్రువునైనా ఎదిరించవచ్చు. అపాయమునుండి కాపాడేది యుక్తి కాని బలం కాదని హితవుచెప్పే కథ ఇది. అంటే పరాక్రమం చేతకానిది ఉపాయంచేత సాధ్యం అవుతుందన్న తెలివిడి ఇందులో ఉంది. మరికొన్ని కథలు, నీతులు చూడండి:

*వ్యాఘ్రజంబుకములు లొట్టియను చంపిన కథ

నీతి: సేవకులు మాయోపాయంచే ఏ పనినైనా సాధించగలరు

*వానరములు - సూచీముఖము కథ

నీతి: మూర్ఖులకు బుద్ధి చెప్పుట హానికరము

*మూడుచేపల కథ

నీతి: అనర్థం కలిగించే బృందాన్ని పరిహరించాలి. ఈ నీతి అన్ని కాలాలకు వర్తిస్తుంది.

మిత్రభేదంలో గల కథలు, ప్రభోదించే నీతులు మానవ సంబంధాలకి, వ్యక్తిత్వవికాసానికి సంబంధించినవే. స్వతంత్రప్రవృత్తి, స్వేచ్చాప్రవృత్తి ఉన్నతమానవునికి నిదర్శనం. అన్నమయ్య, ధూర్జటి, త్యాగయ్య, వేమన మొదలైన కవులంతా ఇటువంటివారే. అందుకనే చిన్నయసూరి పలికిన మేల్పలుకు ఇది -

"సేవావృత్తిచే వచ్చు పాయసముకంటే స్వచ్చంద వృత్తిచే లభించు గంజి మేలు" - ఇంతకంటె వ్యక్తిత్వవికాసలక్షణం ఏముంటుంది?

మనం జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం. బుద్ధిమంతులమనీ, యుక్తిపరులమనీ అనుకొంటున్నా చిక్కులు తప్పవు. చేతులుకాలాక ఆకులు పట్టుకొంటాం. అందుకే చిన్నయసూరి మిత్రలాభంలో కరటకుడు దమనకునితో ఇలా అనిపిస్తాడు - "ఎట్టి ధీమంతున కేనొక్కక్క కాలంబున ప్రమాదము వాటిల్లుట స్వాభావికంబు". అంటే జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలన్న సందేశం తప్ప వైరాగ్యం ఉందని భావించకూడదు.

"అర్థవంతునకసాధ్యము లోకమందేదియుగానము" అనే సూక్తితో కొందరు ఏకీభవించకపోవచ్చు. గానీ ఇది వాస్తవం. డబ్బునవాడు ఏమిచెప్పినా పతాకశీర్షికలో ప్రచురింపబడుతున్న రోజులివి! బాలగంగాధరతిలక్ చెప్పినట్టు "భూమి ధనవంతుని చుట్టూ తిరుగుతోంది"!

"ఉపాయము చింతించుచూ రాగల అపాయము సహితము చింతింపవలయు" అనే నీతి మనకి శిరోధార్యం. ఇది "కీడెంచి మేలెంచు" అనే సామెతకి నిదర్శనం. ఇంకా -

"శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం"

"వినాశకాలే విపరీత బుద్ధి"

"ఎవడు బుద్ధిమంతుడో వాడు వృద్ధుడుగాని యేండ్లు మీరిన వాడా వృద్ధుడు" ... వంటి సూక్తులు మనం ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో నేర్పుతాయి. "నీతిచంద్రిక" మానవజీవితాలకు, మానవసంబంధాలకు సంబంధించినదే. సరిగ్గా అంచనావేస్తే మానవవ్యక్తిత్వవికాసానికి నీతిచంద్రిక ఒక "పెద్ద బాలశిక్ష"!!