చిత్ర కవిత్వం

సిలికానాంధ్ర మార్చ్ నెలలో ఉగాది సందర్భంగా నిర్వహించిన "చిత్ర కవిత్వం" కార్యక్రమంలో ప్రేక్షకులకు మూడు చిత్రాలను చూపించి వాటికి తమ కవితా స్పందనను అందించవలసినదిగా కోరింది. అనేకమంది ఆశువుగా వెల్లువెత్తిన తమ కవితాస్ఫూర్తికి ఇచ్చిన అక్షరరూపాలే ఈ శీర్షికలో పొందుపరుస్తున్నాం...

ప్రసాద్ మావుడూరి: అయ్యారే ఈ చిత్రం విచిత్రం

కలలెన్నో ఎదవెలసి ఉసిగొలిపి

హోరు చేసిన పిదప ముసురు

వెలసిన నాటి నా హృదయచిత్రంలా

మాలిన్యమెరగని నిర్వికార నిబిడారంభ

నిరీక్షణంలో ప్రకృతి పలుకరించిన తొలిపలుకు చినుకుల్లా

అయ్యారే ఈ చిత్రం విచిత్రం

సర్వజిత్ శుభారంభానికి వేకువ వేసిన కళ్ళాపిలా

కల్యాణాక్షితుల్లా అయ్యారే ఈ చిత్రం విచిత్రం

తల్లాప్రగడ జ్యోత్స్న : తామరాకు మీది నీటి బిందువులుగా

చిన్నపిల్ల చేజారిన గోళీలుగా

పెనం మీద నూనెలా, పోపులోని ఆవాలుగా

ఎండాకాలంలో ఎదురు చూచె వర్షం బిందువులుగా

ఇంటిముందు కళ్ళాపిలా పగిలిన నీళ్ళు

పిల్లలమర్రి కృష్ణకుమార్: కోటిరవ్వలు మెరియు బాల భాసురమున

దోటి నిండుగ నింపి నేల విడువ

ఓటి మాటలు కావివి నిజము నిక్కమ్ము

నీటి బిందువులు కావివి ముత్యాలజల్లు

జొన్నలగడ్డ సుధాకర్: సాగరము యిదె, మేఘము యిదె

పరవళ్ళు త్రొక్కు గోదావరి యిదె

కనీరు యిదె, పన్నీరు యిదె

ముత్యమల్లె మెరయు ఈ నీటి బిందువే!!!

నందుల వెంకటేశ్వర రావు: సరం తెగిన మౌన స్వరాలు

జారిన ముత్యాల సరాలు

క్షణం మెరిసినా చాలు

జీవితం పరిపూర్ణం సరి చాలు

కడియాల ఉమ: యవ్వనంలోకి అడుగుపెట్టే యువత మది

ఇలానే ఉంటుందేమో వ్రేలకోటి క్రొత్త

ఆశల ఆలోచనలతో

మంచి సంస్కృతి సంస్కారాల తోడు అందించగలిగితే అవుతాయి అన్ని

మేలి ముత్యాలు

మంచి భవితకు దారి చూపే సోపానాలు

కోలవెన్ను శ్రీలక్ష్మి : చినుకు చినుకు కలసి కలసి

నదులై ప్రవహించెను

తెలుగువారు కలసి కలసి

సిలికానాంధ్ర మెరిపెను

శ్రీనివాసరావు గుండుమళ్ళ: నీటిబొట్టు అని చిన్న చూపు చూడవద్దు

నీటిబొట్లు కలిస్తేనే కడలని మరువద్దు

శ్రీలు: పగిలిన నీటి బిందువులు పడగానే దొర్లాయి

దొర్లిన బిందువులన్నీ ముత్యాలై నిలిచాయి

తురగా శ్రీలక్ష్మి: పరవశించిన ప్రకృతి మాత

ముత్యాలు ఆశీస్సులుగా

కురిపిస్తున్నట్లుంది....నాకైతే