సుజనరంజని /  శీర్షికలు   /  తెలుగు తేజోమూర్తులు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిస్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందు పరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం.


 

మహా నాట్యాచార్యుడు, కళా దిగ్గజం స్వర్గీయ డాక్టర్ `నటరాజ' రామకృష్ణ
 

ఆంధ్ర నాట్యాన్ని పునరుద్ధరించారు. (ఏడు వందల ఏళ్ళ క్రితం, ఓ వెలుగు వెలిగి) కనుమరుగై పోయిన "పేరిణి శివతాండవం " నృత్య సాంప్రధాయానికి జీవం పోశారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టారు. ఆరు దశాబ్దాలపాటు అవిర కృషి చేసి శోధించి సాధించిన ఓ కళాకారుడు, కళావేత్త, గురువు, సంగీతజ్ఞుడు, మేధావి, కళా దిగ్గజం పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ. ఆంధ్ర నృత్యానికి జీవితాన్ని అర్పించిన అభినవ యోగి. నాట్యానికి ఓ కొత్త కళాపరిభాషనిచ్చిన కళా తపస్వి.

ఈ స్వయం చోదక కళా పరిశోధకుడు అనేక కళా విశేషాలను తన రచనల ద్వారా జనాలకి అందించారు. ఆంధ్ర దేశంలో శాస్త్రీయ నృత్యం లేదని కొందరు పెద్దలు సెలవిచ్చారు. ఈ కారణంగా ఆయన ఆంధ్ర దేశమంతా పర్యటించి అనేక కళాకారులని కలసుకుని, ఎన్నో దేవాలయాలను సందర్శించి, శిల్ప కళా సౌందర్యాన్ని, దాని భాషని ఆకళించుకుని, అనేక ప్రాచీన గ్రంధాలను పరిశోధించి విశిష్ట మైన ఆంధ్ర నాట్య కళలను వెలికి తీసి వాటికి " ఆంధ్ర నాట్యం " నామం ఇచ్చారు.

కళాకారుడిగా, కళారాధకుడిగా, కళాసాధకుడిగా, కళాబోధకుడిగా, కళా పరిశోధకుడిగా, కళా విమర్శకుడిగా, కళా ప్రచారకుడిగా, మేధావిగా, నాట్యాచార్యుడిగా నాట్య కళకే జీవితాన్ని అంకితమిచ్చిన మహానీయుడు, ఆజన్మ బ్రహ్మచారి. కూచిపూడి సాంప్రదాయ రీతులని ప్రాచుర్యంలోకి తెచ్చిన మేటి నాట్యాచారుడు.

బాల్యం, నృత్యం వైపు ఆకర్షణ:
రామకృష్ణ గారు ఇండోనేషియా లోని బాలి లో మార్చ్ 31, 1923 లో రాం మోహన రావు, దమయంతి దంపతులకు జన్మించారు. వీరి పూర్వికులది ఆంధ్ర దేశం లోని " కోనసీమ ". తల్లి అకాల మరణం తరువాత ఇండోనేషియా నుండి చెన్నై తిరిగి వచ్చారు. కొంత కాలం నాగ్పూర్ లో ఉన్నారు. తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో స్థిర పడ్డారు.

పదవ ఏటనే కాళ్ళకు గజ్జలు కట్టారు. గజ్జెలు కూడా కొనుక్కోలేని పరిస్తుతుల్లో ఎండిన తుమ్మకాయలను కాళ్ళకు కట్టుకుని నాట్యం అభ్యసించారు. వారికి నృత్యం పట్ల ఎంత మక్కువో చెప్పడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు. సోదరుడు స్యామసుందర్ వీరికి స్పూర్తి. అనేక సందర్భాలలో అండగా నిలిచారు.

మీనక్షి సుందరం పిళ్ళై, నాయుడిపేట రాజమ్మ, పెండ్యాల సత్యభామ, వేదాంతం లక్ష్మినారాయణ శాస్త్రి గార్లు వీరి గురువులు.

వెలుగు చూసిన, పేరిణి శివతాండవం
దాదాపు ఏడు వందల వేళ్ళ క్రితం కాకతీయుల నాటి కాలంలో రాజ ప్రజాదరణ పొంది మనుగడలో ఉన్న " పేరిణి శివతాండం " నృత్య సాంప్రదాయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఏ ప్రభుత్వాలు, అకాడమీలు, విశ్వవిద్యాలయాలు చేయలేని మహత్తర కార్యాన్ని ఆయన సాధించారు. ఈ నృత్య సాంప్రదాయం విశిష్టత ఏమిటంటే ఇది పురుషులు మాత్రమే చేసే నృత్యం.

ఈ నృత్య రీతి పునరుద్ధరణతో అనేక వందల మంది మగవాళ్ళు గజ్జె కట్టారు. ఇలా జరిగిందీ అంటే దానికి నాంది, స్ఫూర్తి " నటరాజ " రామకృష్ణ కారణమే అని నిస్సంకోచముగా చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన శిష్య, ప్రశిష్య సంపద ఈ నృత్య రీతి పరివ్యాప్తికి తమ వంతు కృషి చేస్తున్నారు. వీరిలో శ్రీ కళా కృష్ణ తదితరులు ఉన్నారు.

నాట్య రీతులపై అనేక వ్యాసాలు వ్రాశారు. నలబై కి పైగా పుస్తకాలు రచించారు. అన్నీ కళా సర్వస్వాలే. వీరు పరిశోధించి రాసిన " రుద్ర గణిక " ఓ ఉద్గ్రంధం. ఇందులో ఎన్నో సరికొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఉదాహరణకు " దేవ దాసి " పద ప్రయోగం మునుపెన్నడూ ఏ గ్రంధంలోనూ పేర్కొన్న ఉదంతాలు లేవని చెప్పారు. ప్రముఖ పత్రికా రచయిత స్వయం చోదక పరిశోధకుడైన శ్రీ బి ఎన్ శాస్త్రి ని, ఏ గ్రంధాలలో నైనా కాన వస్తుందేమో చూడవలసిందదిగా కోరారు. శాస్త్రి గారు తాను ఇటువంటి పద ప్రయోగాలు ఎక్కడా చూడలేదని సెలవిచ్చారు. నిష్కారణముగా ఈ పదాన్ని సంబోదనకు వాడరాదని రామకృష్ణ వారి వాదం.

" నటరాజ "రామకృష్ణ గారి పద్దెనిమిదవ ఏట మహారాష్ట్ర బందార సంస్థానం రాజా గణపతి పాండ్య " నటరాజ " బిరుదుతో గౌరవించారు. అప్పటినుంచి అది వారి సార్ధక నామం అయిపోయింది.

నీలం సంజీవ రెడ్డి గారి నిమంత్రణ మేరకు నృత్య నికేతన్ (నృత్య పాఠశాల) ఏర్పాటు చేశారు.

చిందు యక్షగానం తెలంగాణా ప్రాంత జానపద రీతి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోని తప్పెటగుళ్ళు, ఉభయ గోదావరి జిల్లాలలోని వీర నాట్యం, గరగలు ఇలా అనేక జానపద, ప్రాంతీయ సాంప్రదాయ నృత్యాలను ఆదరణలోకి తెచ్చారు. వీరు జరిపిన నాట్య ప్రక్త్రియలలో " నవ జనార్ధన పారిజాతం " విశేహ జనాదరణ పొందింది.

ఆంధ్ర నాట్యం రచనలో అనేక అంశాలను ప్రస్తావించారు; కొత్త విషయాలను వెలుగు లోకి తీసుకు వచ్చారు గిరిజన, జానపద నృత్యాలు లో పగటి వేషాలు, పగటి వేషగాళ్ళు (బహురూపులు), జంగమ దేవర వేషం, మాయల ఫకీరు, భట్టి విక్రమార్క, ఇత్యాధి వేషాల గురించి వర్ణించారు. విప్రవినోధులు, సాధన శూరులు, సయ్యం వారు - ఇంద్రజాల మహేంద్ర జాలాలతో అలరించే వారని విసిధ పరిచారు. దొమ్మరిసాని గెడ ఎక్కి గిర గిరా తిరుగుతూ చేతినున్న వేప కొమ్మ విసిరితే, అది పడిన దిక్కున పంటలు బాగా పండుతాయి " అన్న అంశాన్ని వెలికి తీసారు. అందు వల్ల పల్లెలలో వీరిని ఆదరిస్తారు అని వ్రాశారు. " గారిడీ విద్య తూర్పు గోదావరి జిల్లా జానపద కళారూపం. మైదానం లో భేరి మోగిస్తూ, లయ ప్రకారం చేస్తున్న అందెల మోత మైలు దూరం వరకూ వినిపిస్తాయి " అని విశ్లేషించారు.

ఉరుములు (అనంతపురం ప్రాంత నృత్యం), గురువయ్యలు, జముకులవారు, కడ్డీ వాయిద్యం, పులి వేషం, బుర్ర కధ దళాలు, గొబ్బి, సప్తతాళ భజన, బతకమ్మ, గుసాడీ నర్తనం, కోలాటం, చిరుతల రామాయణం, జోగు ఆట, ఉగ్గు గొల్లలు, కీలు గుర్రాలు, తప్పెట గుళ్ళు, డప్పుల నాట్యం, తోలు బొమ్మలాట, కీలు బొమ్మలు, గరగలు, సవరలు, గొండు, కోయ వివరాలను ఆంధ్ర నాట్యం రచనలో పొందుపరిచారు.

వీరు చేసిన విశిష్ట కృషికి సంగీత నాటక అకాడమి " ఫెల్లో షిప్ " ఇచ్చి గౌరవించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంగీత నాటక అకాడమి అధ్యక్షుడిగా ఉన్నారు.

ఆంధ్ర నాట్యం

వేంకటేశ్వర స్వామి మీద నృత్య రూపకం రచించారు. శ్రీనివాస కల్యాణం, " కుమార సంభవం ", " మేఘ సందేసం " నృత్య రూపకాలను రచించారు, ప్రదర్శించారు.

పరిశోధకుడిగా, భారత ప్రభుత్వ సహాయంతో రష్యా (నాటి యు ఎస్ ఎస్ ఆర్), ఫ్రాన్స్ దేశాలు వెళ్ళి భారతీయ నృత్య సాంప్రదాయలను పరిచయం చేసారు.
గతంలో ఆదరణ పొంది కనుమరుగైపోయిన, తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం కుంతీ మాధవ ఆలయంలోని ప్రభంద నృత్య రూపకం " నవ జనార్ధనం " వెలుగు చూసింది.

ఆంధ్ర నాట్యం రీతులు:

ఆరాధన నృత్యం - ఆలయ నృత్యం
ఆస్థాన నృత్యం - రాజ సభలో రాజ నర్తకిలు, ఆస్థాన నర్తకిలు చేసే నృత్యం ప్రబంధ నృత్యం. పిన్నా పెద్దా, రాజు పేదా అందరికి సానుకూలం. పురాణ, ఇతిహాస, సాంస్కృతిక, సాంప్రదాయ స్పూర్తిని చాటే నృత్యం. వీటిలో " భామా కలాపం " (నవ జనార్ధన పారిజాతం), " గొల్ల కలాపం " ఉన్నాయి.

నటరాజ గారు శిలాభాష నేర్చుకున్నారు. కళా వికాసం పొందారు. శిల్పాలు కూడా వీరితో మాట్లడుతాయి అంటే అతిశయోక్తి కాదు. వాటిలో ఉన్న అంతర్గత శక్తిని అర్ధంచేసుకున్న గొప్ప వ్యక్తి. అంతే కాదు దాన్ని ఆకళించుకుని నృత్య సంప్రదాయాలలోకి విలీనం చేశి భవితవ్యానికి అందించారు.

రచనలు:

వీరి రచనలలో అనేక విషయాలు బయటి వచ్చాయి. మరి కొన్ని ఉదాహరణలు తిమ్మరసు తో సహా శ్రీ కృష్ణ దేవరాయలు పగటి వేషం వేసుకుని వెళ్ళి అన్నపూర్ణా దేవిని పరిణయమాడాడు అని వివరించారు.

రామకృష్ణ గారు రచనలలో కొన్ని ముఖ్యమైనవి:

ఆంధ్ర నాట్యం - ఆలయాలు
ఆంధ్ర నాట్యం - నాట్య శాస్త్రాలు
ఆంధ్ర నాట్యం - ఆలయ నృత్యాలు
ఆంధ్ర నాట్యం - ఆస్థాన నర్తనాలు
ఆంధ్ర నాట్యం - అమర నర్తకులు
ఆంధ్ర నాట్యం - అభినయం
ఆంధ్ర నాట్యం - కూచిపూడి నాట్యం
ఆంధ్ర నాట్యం - పేరిణి నవజనార్ధనం
ఆంధ్ర నాట్యం - ప్రజా నర్తనాలు
ఆంధ్ర నాట్యం - భరత నాట్యం

వెంకట బుర్రయ్య తెలుగుకు చేసిన మేలుని కూడా వెలుగు లోకి తీసుకొచ్చారు. రామకృష్ణ గారు తమ రచనలలో, తెలుగు భాషకు ఎనలేని మేలు చేసిన ముగ్గురు ఆంగ్లేయులను ఆర్థర్ కాటన్, మెకంజీ, చాల్స్ బ్రౌన్ ఊటంకిస్తూ ఉంటారు.

"శ్రీమాన్, ధీమాన్, వివేకి, వితరణ, నిపుణోగాన విద్యానిపుణ, కలావాన్, అభినయ చతురహ " అని పెద్దలు చెప్పిన సుగుణాలన్ని రాసి పోసిన కళామూర్తి ఆయన " అని తెలుగు విశ్వవిద్యాలయ కులపతి ఆచర్య ద్రోణప్ప వ్రాశారు.

" నటరాజ రామకృష్ణ కి అతని రచనకి తెడా ఏమీ లేదు. రెండూ " కళా స్వరూపాలు " కళావేత్తలు, కళాసక్తులు, కళా వైవిద్యాలు, కళాలయాలు, కళా పరిభాషలు నటరాజ సమాచార సర్వస్వాలు గానూ, రచనలు ప్రభోదాత్మకంగాను ఉంటాయి " అని ప్రముఖ పాత్రికేయుడు జి కృష్ణ " అప్పుడు ఇప్పుడు " లో వ్రాశారు.

గౌరవాలు:
కళాప్రపూర్ణ బిరుదు అందుకున్నారు
శ్రీశైల దేవస్థానం రామకృష్ణ గారిని ఆస్థాన నాట్యాచార్యుడిగా నియమించింది (1980).
కళా సరస్వతి, రాజ్యలక్ష్మి అవార్డులు అందుకున్నారు
కేంద్ర సంగీత నాట్య అకాడమి వీరికి " దక్షిణ భారత ఉత్తమ నాట్యాచార్యుడు " గౌరవం ఇచ్చింది.
పలు విశ్వవిద్యాలయాలు రామకృష్ణ గారికి గౌరవ డాక్టరేట్లు అందించాయి.
1992 భారత ప్రభుత్వం " పద్మశ్రీ" గౌరవం ఇచ్చి సత్కరించింది.

సోదరీ, సోదరులు పోయిన తరువాత తన శిష్యుల వద్దే కాలం గడుపుతూ వచ్చారు ఈ ఆజన్మ బ్రహ్మచారి.

వృదాప్యంలో కొంత కాలం అనారోగ్యానికి గురై జూన్ 6, 2011 లో కన్నుమూసారు. ఆయన శిష్యుడైన కళా కృష్ణ ఇంటిలో భౌతిక కాయాన్ని ఉంచారు. గురు భక్తి అలా చాటుకున్నారు కళాకృష్ణ. తన శిష్య సంపదను వారసులుగా, వారధిగా మిగిల్చి వెళ్ళి పోయారు. ఆంధ్ర జన కళా హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. నటరాజ గారు నాట్య కళకు చేసిన మేలును ప్రతీ ఆంద్రుడు గర్వించవచ్చు.

" నేను నా సర్వసం నృత్యం (పేరిణి) లో పెట్టాను. నాకు ఏ సహాయం అక్కరలేదు. తెలుగు జాతి భావితరాలకు ఇది పరివ్యాప్తిస్తే చాలు " అని ఓ సందర్భములో చెప్పారు. సంక్రమించిన, వెలికి తీసిన ఈ నృత్య సంప్రదాయాలను భావి తరాలకు అందజేస్తే " నటరాజ " జీవితాంత కృషికి ఫలితం దక్కినట్టే.

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech