స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో....

- వనం జ్వాలా నరసింహారావు

    

హిందు-ముస్లింలనే తేడా చూపకుండా భారతీయులందరినీ దోపిడీకి గురిచేసిన వైస్రాయ్ డల్హౌసీ విధానాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉవ్వెత్తున లేచిన ప్రజా ఉద్యమం దరిమిలా, బ్రిటీష్ వలస పాలన నుండి భారత దేశానికి విముక్తి కలగ చేసేందుకు జరిపిన "ప్రప్రధమ స్వతంత్ర సంగ్రామమే" 1857 నాటి సిపాయిల తిరుగుబాటు. నానా సాహిబ్, తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి, ఖాసిమువల్లా ఖాన్ లాంటి సాటిలేని మేటి వీరులను అందించిన సిపాయిల తిరుగుబాటు పర్యవసానంగా, ఆంగ్లేయుల దోపిడీ విధాన పాలనా శైలిలో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. ఫ్యూడల్, జమీందారీ వర్గాలను పురికొల్పడం, బ్రిటీష్ పాలనను-అధికారాన్ని పటిష్టంగా వుంచే వ్యవస్థలను ప్రోత్సహించడం మొదలైంది. ఇంగ్లీష్ విద్యను ప్రవేశ పెట్టి, నిరాశకు లోనవుతున్న మధ్యతరగతి వర్గాల వారికి ఉద్యోగావకాశాలు ఎర చూపింది బ్రిటీష్ ప్రభుత్వం. అప్రయత్నంగానే, బ్రిటీష్ ప్రభుత్వం పట్ల వినయ-విధేయతలు పెంచుకునేవారి సంఖ్య పెరగడం, జాతీయ భావాలకు కట్టుబడేవారి సంఖ్య కనుమరుగవడం మొదలైంది. బ్రిటీష్ వారి "విభజించి-పాలించే" విధానం అలా ఆరంభమైంది.


సామాన్య ప్రజానీకంలో మాత్రం తిరుగుబాటు ధోరణి సమసిపోలేదు. తమను అన్ని విధాలుగా అణచి వేయడం హిందువులు, ముస్లింలు సహించలేకపోయారు. పాశ్చాత్య ధోరణులు విపరీత పుంతలు తొక్కుతూ, జాతీయ వ్యతిరేక భావాలకు దారితీయడంతో, సహించలేని పలువురు సంస్కరణలకు నడుం బిగించారు. సిపాయిల తిరుగుబాటు దరిమిలా భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావానికి పూర్వ రంగంలో, పాతికేళ్ల మధ్య కాలంలో, బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం, ఆర్య సమాజం, థియోసాఫికల్ (బ్రహ్మ విద్య) ఉద్యమం, రామ కృష్ణా మిషన్ లాంటి పునరుజ్జీవన-పునర్వికాస ఉద్యమాలకు శ్రీకారం చుట్టబడింది.

భారత జాతీయ కాంగ్రెస్ పుట్టుక అలనాటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ డఫరిన్ ఆశీస్సులతోనే జరిగిందనాలి. ఆ మాటకొస్తే, భారతీయ జాతీయ వాదానికి పెంపకపు తల్లి-తండ్రులు, బ్రిటీష్ వారే అనాలి. అది మరో రకమైన బ్రిటీష్ వారి "విభజించి-పాలించే" విధానం. తమ పాలనలో సంభవిస్తున్న పరిణామాలను-సంక్షోభాన్ని సరిగ్గా పసిగట్టడంలో కొంత విఫలమయ్యారు బ్రిటీష్ పాలకులు. స్వతంత్రం సంపాదించుకునేందుకు, ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందేందుకు, తమ ఆశీస్సులతోనే ఆవిర్భవించిన కాంగ్రెస్ పార్టీ ముసుగులో, భారత జాతీయ ఉద్యమం వేళ్లూనుకుంటున్న సంగతి అర్థం చేసుకోవడంలో ఆలస్యం చేశారు. కాంగ్రెస్ ఆవిర్భావపు తొలినాళ్లలో, ఏటేటా సమావేశాలు నిర్వహించి, కీలక సమస్యలను చర్చించి, ప్రభుత్వానికి అసలు-సిసలైన డిమాండులను సమర్పించడానికి మాత్రమే ఉద్యమం పరిమితమైంది. సుమారు ఇరవై సంవత్సరాల వరకు, "మాడరేట్లు" గా పిలువబడే మితవాద భావాల నాయకులు పార్టీని-పార్టీ కార్య కలాపాలను ప్రభావితం చేశారు. భారతీయ రక్తం తమలో అణువణువునా ప్రవహించినప్పటికి, భావాల పరంగా-తెలివితేటల పరంగా-ఉద్దేశ్యాల పరంగా బ్రిటీష్ వారి పద్ధతులను పూర్తిగా వ్యతిరేకించే దశకు అలనాటి మాడరేట్లు చేరుకోలేదప్పటికి. బ్రిటీష్ పాలకులు న్యాయంగా, ధర్మంగా వ్యవహరిస్తున్నారని కూడా అప్పట్లో వారి నమ్మకం. భారతీయులందరినీ ఒక తాటిపైకి తెచ్చి, ఉమ్మడి రాజకీయ కార్యాచరణ పథకాన్ని రూపొందించి, తద్వారా తమ డిమాండులను నెరవేర్చుకోగల మన్న నమ్మకం వుండేది వారికి. బ్రిటీష్ ప్రభుత్వ పోకడలను ఆ ధోరణిలోనే విమర్శించే వారు. అవసరమనుకున్నప్పుడు మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించే వారు. భావ స్వాతంత్ర్యానికి, పత్రికా స్వాతంత్ర్యానికి భంగం కలిగినప్పుడు జరిపిన పోరాటంలో తిలక్ లాంటి నాయకులను నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. మాడరేట్ల ప్రభావం క్రమేపీ క్షీణించి, మిలిటెంట్ భావాల వారి పలుకుబడి పెరగడంతో, పార్టీలో తీవ్రవాదుల ప్రాబల్యం మొదలయింది. అదికూడా ఒక విధంగా బ్రిటీష్ వారి "విభజించి-పాలించే" విధానానికి అనుకూలంగానే కనిపించింది పాలకులకు.


లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ భారతీయ యువత, కాంగ్రెస్ మిలిటెంట్ రాజకీయాల పట్ల ఆకర్షితులై, బ్రిటీష్ వస్తువుల బహిష్కరణ నినాదంతో, స్వదేశీ ఉద్యమం చేపట్టింది. అరబిందో, తిలక్, బిపిన్ పాల్ సహాయ నిరాకరణకు ఇచ్చిన పిలుపే, భవిష్యత్ లో మహాత్మా గాంధి, పెద్ద ఎత్తున చేపట్టారు. మిలిటెంట్లకు, మాడరేట్లకు ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. అర-కొర సంస్కరణలకు బదులు, పూర్ణ స్వరాజ్యం-స్వపరిపాలనాధికారం కావాలంటూ, బాలగంగాధర తిలక్-ఇతర అతివాద నాయకులు నినాదం లేవనెత్తటాలు. 1907 లో, కాంగ్రెస్ పార్టీలో చీలి కొచ్చి, మాడరేట్లు అతివాదులనుంచి విడిపోయారు. మాడరేట్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా, అతివాదులపై మరిన్ని ఆంక్షలు విధించ సాగారు బ్రిటీష్ పాలకులు. "విభజించి పాలించే" దిశగా మరో అడుగు వేసింది ప్రభుత్వం. ఒక దశలో, భారత జాతీయ కాంగ్రెస్ అన్న పేరును ఉపయోగించుకోలేని పరిస్థితులు తలెత్తాయి. మాడరేట్ల "కన్వెన్షన్" తిలక్ ప్రభృతులను పార్టీ నుంచి బహిష్కరించింది. వారంతా "నేషనలిస్ట్ పార్టీ" పేరుతో సమావేశమయ్యారు. ఇంత జరిగినా, ఇరు పక్షాలు "భారత జాతీయ కాంగ్రెస్" సిద్ధాంతాలకు కట్టుబడి వుండాలనే నిర్ణయంలో ఒకే విధంగా మాట్లాడారు. ఏ నాటికైనా ఐక్య కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయన్న ఆశాభావం ఇరు పక్షాల వారూ వెలిబుచ్చారు. అదీ అప్పటి వారి కమిట్మెం ట్. తిలక్ కారాగార శిక్ష పూర్తి చేసుకుని విడుదలై వచ్చేటప్పటికి, మాడరేట్లకు అనుచరులు లేకుండా పోయారు.
భారత రాజకీయాలలో మహాత్మా గాంధి ప్రవేశించిన తర్వాత స్వాతంత్ర్యోద్యమం రూపురేఖల్లో, భారత జాతీయ కాంగ్రెస్ నడవడిలో, ఆయన ప్రభావం పడింది. ప్రధమ ప్రపంచ సంగ్రామం ముగిసిన పిదప, బ్రిటీష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రౌలట్‌చట్టానికి వ్యతిరేకంగా మొట్టమొదటి సారి జాతీయ స్థాయిలో "సత్యాగ్రహం" ఉద్యమానికి పిలుపునిచ్చారు గాంధి. ఏప్రిల్ 12, 1919 నాటి జలియన్ వాలా బాగ్ మారణహోమం దరిమిలా పంజాబ్ లో విధించిన మార్షల్ లా గాంధీని కలచివేసింది. తిలక్ లాంటి నాయకులను కాదని, ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు, బ్రిటీష్ ప్రభుత్వానికి తాను అందించిన సహకారానికి చింతించారు. తన నమ్మకాన్ని వమ్ము చేసిన బ్రిటీష్ వారిపై సమర భేరి మోగించారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపిచ్చారు. సెప్టెంబర్ 1920 లో కలకత్తాలో నిర్వహించిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశాల్లో, లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్ లాంటి నాయకులు వ్యతిరేకించినప్పటికీ, ఉద్యమం జరపాలన్న తీర్మానానికి పెద్ద సంఖ్యలో మద్దతు లభించింది. మోతీలాల్ నెహ్రూ, గాంధి పక్షం వహించారు. దరిమిలా జరిగిన నాగపూర్ కాంగ్రెస్ సమావేశాల నుంచి గాంధి తిరుగులేని నాయకు డయ్యారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం, విద్యార్థులు చదువు మానడం, సుమారు నలబై లక్షలకు పైగా స్వచ్చంద సేవకులను కాంగ్రెస్ పార్టీ నమోదు చేయడం, ఇరవై వేలకు పైగా చరకాలను తయారుచేయడం జరిగాయి. కనీ-వినీ రీతిలో ప్రభుత్వ దమన కాండ ఆరంభమై ఎంతోమందిని నిర్బంధంలోకి తీసుకుంది. డిసెంబర్ 1921లో భారత దేశాన్ని సందర్శించిన వేల్స్ యువరాజు పర్యటన నిరసనల మధ్య సాగింది.
ఆంగ్లేయులకు వాస్తవాలు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి "శాసనోల్లంఘనం" ఒక్కటే సరైన మార్గమని గాంధి నిర్ణయించుకున్నారు. ఉద్యమానికి నాంది పలికారాయన. చౌరీ చౌరా సంఘటన పాతిక మంది పోలీసుల మరణానికి దారితీయడంతో, సహాయ నిరాకరణకు ఏక పక్షంగా స్వస్థి చెప్పారు గాంధి. అయినా అరెస్ట్ కాక తప్పలేదు. జరిగిన దుర్ఘటనకు తానే బాధ్యుడని, తనను వదిలేస్తే, అలాంటి సంఘటనలే పునరావృత్తమవుతాయని చెప్పిన గాంధికి ఆరేళ్ల జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి. ఒక విధంగా చెప్పాలంటే, భారత జాతీయ కాంగ్రెస్ "విప్లవ సంస్థ" గా మారిందనవచ్చు అప్పట్లో. నవంబర్-డిసెంబర్, 1922 లో జరిగిన కలకత్తా, గయ కాంగ్రెస్ సమావేశాలలో చట్ట సభల్లో ప్రవేశించే విషయంలో తీవ్ర అభిప్రాయ బేధాలొచ్చాయి. చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ ప్రభృతులు ఒక వైపు, రాజాజీ, అన్సారి ప్రభృతులు మరో వైపు వాదించారు. మాట నెగ్గించుకోలేని చిత్తరంజన్ దాస్ పార్టీకి రాజీనామా చేసి "స్వరాజిస్ట్ పార్టీ" ని స్థాపించారు. మోతీలాల్ నెహ్రూ ఆయన పక్షానే నిలిచారు. అయినప్పటికీ, చట్ట సభల వెలుపల జరిగే ఉద్యమాలన్నింటిలో ను, మహాత్మా గాంధి నాయకత్వాన్నే అంగీకరించింది "స్వరాజిస్ట్ పార్టీ". అవసరమైతే శాసనోల్లంఘన ఉద్యమంలోనూ పాల్గొంటామని ప్రకటించింది. "విభజించి పాలించే" బ్రిటీష్ విధానానికి ఆ సంఘటనలతో కొంత ఊతం దొరికినా, పెద్దగా ఫలితం కానరాలేదు. తండ్రి మోతీలాల్ స్థానంలో లాహోర్ లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైన జవహర్ లాల్ నాయకత్వంలో, డిసెంబర్ 31, 1929 అర్థ రాత్రి, నూతన సంవత్సరం ఆరంభమవుతుండగా, "పూర్ణ స్వరాజ్" నినాదంతో, త్రి వర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక అప్పటినుంచి "సత్యాగ్రహ శకం" ఆరంభమయిందనాలి.
ఈ నేపధ్యంలో, ఫిబ్రవరి 1930 లో సబర్మతి ఆశ్రమంలో అఖిల భారత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై, ఎప్పుడు-ఎక్కడ శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించాల్నోనన్న నిర్ణయాధికారం గాంధీజీకి వదిలింది. వైస్రాయ్ కి రాసిన లేఖలో ఉద్యమ ప్రణాళికను వివరించారు గాంధీజీ. ఆయన ఆలోచనలు శాంతి-బధ్రతల సమస్యకు దారితీసే అవకాశమున్నందున ఉద్యమానికి తమ అనుమతిని నిరాకరించాడు వైస్రాయ్. "రొట్టె ముక్క కావాలని మొక్కిన నాపై రాళ్లు రువ్వుతూ సమాధానం లభించింది" అని వ్యాఖ్యానించారు గాంధీజీ. మార్చ్ 12, 1930 న చారిత్రాత్మక దండి సత్యాగ్రహానికి నాంది పలికారు. అప్పటికింకా గాంధీని అరెస్ట్ చేయలేదుగాని, వల్లభాయ్ పటేల్ లాంటి నాయకులను నిర్బంధంలోకి తీసుకుంది. ఏప్రిల్ 5, 1930 నాటికి దండి చేరుకుంది గాంధీజీ బృందం. సముద్రపు ఒడ్డున పిడికెడు ఉప్పును చేతబట్టి, "ఉప్పు చట్టాన్ని" ఉల్లంఘించామని, ఇక ముందు చట్టాన్ని ఉల్లంఘించి ప్రతి పౌరుడు తాము అనుకున్న స్థలంలో ఉప్పు తయారు చేసుకోవచ్చని పిలుపిచ్చారు. ఉప్పు కర్మాగారాలపై దాడి చేస్తామని మరో లేఖను వైస్రాయ్ కు రాయడంతో, గాంధీజీని అరెస్ట్ చేసి ఎర వాడ జైలుకు తరలించింది బ్రిటీష్ ప్రభుత్వం. ఆయన స్థానాన్ని-నాయకత్వ బాధ్యతను, అరెస్టయ్యేంతవరకు, ఒకరి వెంట మరొకరు, అబ్బాస్ త్యాబ్జీ, సరోజిని నాయుడు, ఇమామ్ సాహిబ్ లాంటి వారు చేపట్టారు. వందల సంఖ్యలో అరెస్టులు జరిగాయి. దేశ వ్యాప్తంగా ఉప్పు సత్యాగ్రహం కొనసాగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని చట్టవిరుద్ధ సంస్థగా పేర్కొంటూ, మోతీలాల్ నెహ్రూను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. "విభజించి పాలించే" విధానం పాటించే బ్రిటీష్ ప్రభుత్వం, గాంధీజీని ఒంటరి వాడిని చేసి, ఇతరులను నిర్బంధించి, ఉద్యమానికి గండి కొట్టాలని తలచింది. విఫలమయింది చివరకు.
వైస్రాయ్-గాంధీజీల మధ్య జరిగిన దీర్ఘకాల చర్యల పర్యవసానంగా గాంధి-ఇర్విన్ ఒప్పందం కుదిరింది. అమలులో ఒప్పందం పూర్తిగా విఫలమైంది. ఇంగ్లాండ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన గాంధీజీ, రిక్త హస్తాలతో స్వదేశానికి తిరిగొచ్చారు. జవహర్లాల్ నెహ్రూ, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటి నాయకులను మరోసారి అరెస్ట్ చేసింది ప్రభుత్వం. జనవరి 4, 1932 న గాంధీజీతో పాటు పలువురు అగ్రశ్రేణి నాయకులను అరెస్ట్ చేయడంతో సహా, కాంగ్రెస్ పార్టీని చట్ట వ్యతిరేక సంస్థగా నిర్ణయించింది ప్రభుత్వం. బ్రిటీష్ కమ్యూనల్ అవార్డుకు నిరసనగా, సెప్టెంబర్ 1932 లో, గాంధీజీ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ప్రధాన మంత్రి ఇచ్చిన అభయం ఆధారంగా పదిహేను రోజుల తర్వాత దీక్ష విరమించిన గాంధీజీ, మే 1933 లో, ఆత్మ ప్రక్షాళణకొరకు, హరిజనుల హక్కులకొరకు మరో మారు నిరాహార దీక్షకు దిగారు. ఏప్రిల్ 1934 లో శాసనోల్లంఘన ఉద్యమం ఆగిపోయింది.
ఇంతలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. భారత దేశంలోని నాయకులెవరినీ సంప్రదించకుండానే బ్రిటీష్ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు, భారత సైన్యాన్ని కదన రంగంలోకి దింపింది ప్రభుత్వం. సెప్టెంబర్ 1940 లో, భావ స్వాతంత్ర్యాన్ని కాపాడాలంటూ, కాంగ్రెస్ నాయకత్వం సత్యాగ్రహానికి దిగింది మరో సారి. మొదటి సత్యాగ్రహి వినోభా భావే కాగా, జవహర్లాల్ నెహ్రూ ఆయన తర్వాత సత్యాగ్రహి అయ్యారు. అరెస్టయిన నెహ్రూకు నాలుగేళ్ల కారాగార శిక్ష పడింది. జులై 14, 1942 న, వార్దాలో సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, "క్విట్ ఇండియా" డిమాండ్ చేయాలని తీర్మానించింది. ఆగస్ట్ 7, 1942 న బాంబేలో సమావేశమైన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, మర్నాడు ఆగస్ట్ 8, 1942 న, జవహర్లాల్ నెహ్రూ ప్రవేశ పెట్టిన, ప్రఖ్యాతి గాంచిన "క్విట్ ఇండియా" తీర్మానాన్ని ఆమోదించింది. సర్దార్. వల్లభాయ్ పటేల్ తీర్మానాన్ని బలపర్చారు. తీర్మానంలో చివరగా "స్వతంత్ర భారతదేశం కావాలన్న వాంఛ వున్నప్పటికీ, దానికి సామూహిక ప్రజా ఉద్యమం చేపట్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి అధికారం చేపట్టాలన్న ఉద్దేశం లేదు. అధికారం ఎప్పుడొచ్చినా, అది ప్రజలకే చెందుద్తుంది" అని పేర్కొనడం జరిగింది. కాకపోతే స్వతంత్రం వచ్చిన నలభై సంవత్సరాల వరకు అధికారం కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే వుంది. తీర్మానం ఆమోదించిన మరుక్షణమే మాట్లాడిన గాంధీజీ, తాను "తక్షణమే, వీలుంటే ఆ రాత్రే-తెల్లవారే లోపునే" స్వరాజ్యం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. స్వతంత్రం కంటే తక్కువైనదేదీ తనకు అంగీకారం కాదని కూడా స్పష్టం చేశారాయన.
ఆగస్ట్ 8, 1942 న తెల్లవారక ముందే, ప్రభుత్వం వేసుకున్న పటిష్ఠమైన ప్రణాళిక ప్రకారం, గాంధీజీ తో సహా కాంగ్రెస్ నాయకులందరినీ నిర్బంధంలోకి తీసుకుని, రహస్య ప్రదేశాలకు తరలించింది ప్రభుత్వం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులను ఎక్కడ దొరికితే అక్కడే అరెస్ట్ చేసింది ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా వున్న అన్ని సంస్థలను, వ్యవస్థలను నిషేధించింది. ఖాదీ-హరిజన సంస్థల లాంటి సాంఘిక కార్య కలాపాలను కూడా నిషేధించింది. ప్రజలనుంచి కూడా అదే మోతాదులో ప్రతిఘటన ఎదురైంది. బొంబాయిలో పోలీసు హెచ్చరికలను లక్ష్య పెట్టకుండా అరుణా ఆసఫ్ అలీ ఝండా ఎగుర వేసింది. ఒక వైపు "క్విట్ ఇండియా" ఉద్యమం, మరో పక్క "ఆజాద్ హింద్ ఫౌజ్" ప్రభావం, ఇంకో దిశగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, బ్రిటన్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఓటమి, ప్రభుత్వాన్ని కలవర పరిచాయి. చర్చిల్ వారసుడు క్లెమెంట్ అట్లీ, త్రి సభ్య కాబినెట్ కమిటీని నియమించి, ఆ కమిటీ భారత దేశాన్ని సందర్శించనున్నదని ఫిబ్రవరి 19, 1946 న ప్రకటించారు. కమిటీతో చర్చలకు పాకిస్తాన్ ఏర్పాటు ప్రాతిపదిక కావాలని జిన్నా అభిప్రాయ పడ్డారు. త్రి సభ్య కాబినెట్ మిషన్ తో రాజకీయ నాయకుల చర్చలు సఫలం కాలేదు. ఇంతలో, కాంగ్రెస్ పార్టీకి చెందిన బడుగు-దళిత వర్గాల వ్యక్తితో కలిపి ఆరుగురు హిందువులు, ముస్లింలీగుకు చెందిన ఐదుగురు ముస్లింలు, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక పార్సీ-మొత్తం పద్నాలుగురుండే మధ్యంతర ప్రభుత్వాన్ని ప్రకటించాడు వైస్రాయ్. ఆ ప్రతిపాదనను కాంగ్రెస్ వ్యతిరేకించడంతో, తాత్కాలికంగా, అధికారులతో కూడిన ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ప్రకటించారు వైస్రాయ్. తదనంతరం, వైస్రాయ్ ఆహ్వానం మేరకు, ఆరుగురు హిందువులతో, ముగ్గురు ముస్లింలతో, ఒక సిక్కు, ఒక క్రిస్టియన్, ఒక పార్సీలతో జవహర్లాల్ నాయకత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం సెప్టెంబర్ 2, 1946 న అధికారాన్ని చేపట్టింది. అక్టోబర్ చివరి వారంలో ముస్లిం లీగ్ కూడా ప్రభుత్వంలో చేరింది. కాకపోతే షరతులతో చేరింది. అధికారం నడుపుతున్నది మంత్రివర్గం తరహా ప్రభుత్వంగా పరిగణించ రాదనీ, అది కేవలం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాత్రమేనని ముస్లిం లీగ్ వాదన.
1946-1947 మధ్య కాలంలో రాజకీయ అనిశ్చిత స్థితికి తోడు, మత ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా ఆగస్ట్ 16, 1946 ను "ప్రత్యక్ష చర్య దినం" గా పాటించాలని ముస్లింలకు పిలుపిచ్చింది లీగ్. కలకత్తాతో సహా పలుచోట్ల మత ఘర్షణలు తలెత్తాయి. భారీ సంఖ్యలో హిందువులకు ప్రాణ-ఆస్తి నష్టం కలిగింది. నవంబర్ లో గాంధీజీ నవొకాళీకి వెళ్లి, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. మధ్యంతర ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలు పరిస్థితిని కుదుట బర్చాయి. దేశ విభజన జరగాలన్న మౌంట్ బేటన్ ప్రణాళికకు కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది. గాంధీజీకి విభజన ఇష్టం లేదు. వ్యతిరేకిస్తే విప్లవం మినహా మార్గాంతరం లేదని కూడా ఆయనకు తెలుసు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో పురుషోత్తమ దాస్ టాండన్ మినహా ఎవరూ విభజన తీర్మానాన్ని వ్యతిరేకించలేదు. రెండు దేశాల జిన్నా వాంఛ నెరవేరనున్న తరుణంలో, స్వతంత్రం సిద్ధించనున్న తరుణంలో, లక్షలాది హిందువులు, ముస్లింలు తరతరాలుగా నివసిస్తున్న ప్రాంతాలను-అనుభవిస్తున్న తాత-ముత్తాతల ఆస్తులను వదిలి "శరణార్థుల కాంపుల" లో ఇతరుల దయాదాక్షిణ్యాలతో జీవించాల్సిన పరిస్థితులు కలిగాయి. అలనాటి సంఘటనలను "భారత మాత ఆత్మ సంక్షోభం" గా అభివర్ణించారు జవహర్లాల్ నెహ్రూ.
లక్షలాది భారతీయుల ఇక్కట్ల-త్యాగాల ఫలితంగా, ఆగస్ట్ 14-15 అర్థ రాత్రి సమయంలో, పాకిస్తాన్ భూభాగం భారత దేశం నుంచి విడిపోయిందన్న అశేష జన వాహిని మనస్థాపం మధ్య సంపూర్ణ స్వతంత్రం సిద్ధించింది భారతావనికి. అధికారం కాంగ్రెస్ పార్టీకే దక్కింది. నలభై సంవత్సరాలు అటు కేంద్రంలోను, ఇటు పలు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు దాదాపు కాంగ్రెస్ పార్టీవే. మోతీలాల్ నెహ్రూ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా మూడు సార్లు ఎంపికయ్యారు. ఆయన తర్వాత అధ్యక్షుడైన జవహర్లాల్ స్వతంత్రం రాక పూర్వం మూడు పర్యాయాలు, వచ్చిన తర్వాత రెండు సార్లు అధ్యక్షుడయ్యారు. స్వతంత్రం వచ్చిన సమయంలో ఆచార్య కృపలానీ అధ్యక్షుడిగా వున్నారు. 1961-69 మధ్య కాలంలో నీలం సంజీవరెడ్డి, కామరాజ్ నాడార్, నిజలింగప్పల పర్వం కొనసాగింది. 1969 లో ఇందిరా గాంధీ శకం మొదలై, పార్టీ చీలిపోయి, జగ్జీవన్ రాం అధ్యక్షుడయ్యారు. కొన్నాళ్లు ఇతరులకు అవకాశమిచ్చిన ఇందిరా గాంధీ 1983 నుంచి 1985 వరకు స్వయంగా తానే అధ్యక్ష పీఠాన్ని అధిష్టించింది. 1985 లో కొడుకు రాజీవ్ గాంధీకి అధ్యక్ష వారసత్వం లభించింది. ఇక అప్పటినుంచి హత్యకు గురయ్యేవరకు ఆయనే అధ్యక్షుడు. పీవీ, కేసరిల తర్వాత ఆ పీఠాన్ని 1998 లో అధిష్టించిన సోనియా గాంధీ, గత 12 సంవత్సరాలుగా మకుటం లేని మహారాణిలా, ఒంటి "చేతితో" అధిష్ఠానం అంటే తానే అన్న రీతిలో వ్యవహరిస్తోంది. పార్టీలో "ఏకాభిప్రాయం" అంటే, సోనియా గాంధి అనే "ఏక వ్యక్తి అభిప్రాయం" గా కాంగ్రెస్ పరిస్థితి మారిపోయింది. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం "విభజించి పెత్తనం సాగించడం" అనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే.

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు

ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
                                                                        సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.     Site Design: Krishna, Hyd, Agnatech